పునరుద్ధరణ ప్రణాళిక ‘యస్‌’! | RBI announces draft revival plan for Yes Bank | Sakshi
Sakshi News home page

పునరుద్ధరణ ప్రణాళిక ‘యస్‌’!

Published Thu, Mar 12 2020 3:53 AM | Last Updated on Thu, Mar 12 2020 4:54 AM

RBI announces draft revival plan for Yes Bank - Sakshi

ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ను పునరుద్ధరించే ప్రణాళికను రిజర్వ్‌ బ్యాంక్‌ ఖరారు చేసింది. మారటోరియం ఎత్తివేసినా నిధుల లభ్యతపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు పరిష్కారమార్గాలు ఇందులో పొందుపర్చింది. ప్రణాళిక ప్రకారం.. ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్న ప్రభుత్వ రంగ ఎస్‌బీఐతో పాటు ఇతరత్రా బ్యాంకుల నుంచి తుది మాట తీసుకున్నాక..  ఆర్‌బీఐ ముందుగా ఒక ప్రకటన చేయనుంది. ప్రకటన వచ్చిన రెండో రోజున బ్యాంకులు దాదాపు రూ. 20,000 కోట్ల నిధులను ఈక్విటీ కింద సమకూరుస్తాయి. మూడో రోజున ప్రభుత్వ రంగ బ్యాంకులు... సుమారు రూ. 30,000 కోట్ల మొత్తాన్ని యస్‌ బ్యాంక్‌ సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌ (సీడీ)లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. నాలుగో రోజున మారటోరియం తొలగిస్తారు. ఇన్వెస్ట్‌ చేస్తున్న బ్యాంకుల నుంచి హామీ వచ్చాక ఆర్‌బీఐ సత్వరమే ప్రణాళికను ప్రకటించనుంది.

ప్రైవేట్‌ బ్యాంకులు కూడా రంగంలోకి..
ఎస్‌బీఐతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి ప్రైవేట్‌ దిగ్గజాలు కూడా యస్‌ బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌ చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. తద్వారా యస్‌ బ్యాంకు సామర్థ్యంపై నమ్మకం పెరిగి, ఇతర బ్యాంకులు కూడా ఇన్వెస్ట్‌ చేయడానికి ముందుకు రావచ్చని భావిస్తున్నారు. యస్‌ బ్యాంక్‌ సీడీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు చేసే పెట్టుబడులు.. వాటి ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియోల్లో భాగంగా మారతాయి. కొత్తగా జారీ చేసే ఈక్విటీలో రూ. 20,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసే బ్యాంకులకు యస్‌ బ్యాంకులో 75 శాతం వాటాలు దక్కుతాయి. షేర్ల పరిమాణం భారీగా పెరగడంతో ప్రస్తుతమున్న షేర్‌హోల్డర్ల వాటా నాలుగో వంతుకు తగ్గుతుంది. మొండిబాకీలు, నిధుల కొరత, గవర్నెన్స్‌ లోపాలతో సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ను పునరుద్ధరించే క్రమంలో ఆర్‌బీఐ మారటోరియం విధించడం, బ్యాంక్‌ బోర్డును రద్దు చేయడం తెలిసిందే.  

ఇన్‌వార్డ్‌ ఆర్‌టీజీఎస్‌ సేవల పునరుద్ధరణ..
ఇన్‌వార్డ్‌ ఆర్‌టీజీఎస్‌ సేవలను కూడా యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరించింది. దీంతో యస్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న రుణాలు, క్రెడిట్‌ కార్డులకు సంబంధించి రూ. 2 లక్షలకు పైగా జరపాల్సిన చెల్లింపులను ఇతర బ్యాంకు ఖాతాల నుంచి చెల్లించవచ్చని బ్యాంక్‌ తెలిపింది. తమ బ్యాంకులో కరెంటు ఖాతాలున్న సంస్థలు.. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడంలో ఎలాంటి సమస్యలు ఉండబోవని వివరించింది. అయితే మారటోరియం ఎత్తివేసే దాకా యస్‌ బ్యాంక్‌ ఖాతాల నుంచి ఇతరత్రా ఆన్‌లైన్‌లో జరపాల్సిన చెల్లింపులపై ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. మరోవైపు, మార్చి 14న (శనివారం) ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు యస్‌ బ్యాంక్‌ తెలియజేసింది.  

యస్‌ బ్యాంక్‌ ఖాతాలపై ఐసీఏఐ సమీక్ష..
2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి యస్‌ బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలను తమ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ రివ్యూ బోర్డు (ఎఫ్‌ఆర్‌ఆర్‌బీ) సమీక్షించనున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. ఒకవేళ ఏవైనా అవకతవకలు ఉన్నాయని తేలిన పక్షంలో ఆడిటర్లపై చర్యలు తీసుకునేలా డైరెక్టరుకు సిఫార్సు చేయనున్నట్లు పేర్కొంది. ఇక, అన్‌సెక్యూర్డ్‌ పెట్టుబడుల రద్దు విషయానికొస్తే.. ముందుగా ఈక్విటీ ఇన్వెస్టర్లు, ప్రిఫరెన్స్‌ షేర్‌హోల్డర్ల తర్వాతే అదనపు టియర్‌ 1 బాండ్ల విషయం పరిశీలించాలని సెబీ, ఆర్‌బీఐలను కోరినట్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ సమాఖ్య యాంఫీ సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేష్‌ తెలిపారు.

రుణాలు పూర్తిగా చెల్లిస్తాం: అడాగ్‌
వ్యాపార అవసరాల కోసం యస్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న రుణాలన్నింటికీ పూర్తి పూచీకత్తు ఉందని, మొత్తం చెల్లించేస్తామని అనిల్‌ అంబానీ  రిలయన్స్‌ గ్రూప్‌(అడాగ్‌) వెల్లడించింది. రాణా కపూర్, ఆయన కుటుంబసభ్యులతో ఎలాంటి లావాదేవీలు లేవని తెలిపింది. అడాగ్‌లో భాగమైన తొమ్మిది సంస్థలు యస్‌ బ్యాంక్‌కు రూ. 12,800 కోట్ల దాకా రుణాలు చెల్లించాల్సి ఉంది.

షేరు జూమ్‌..
పునరుద్ధరణ ప్రణాళిక వార్తలతో బుధవారం యస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో ఏకంగా 35 శాతం పెరిగి రూ. 28.80 వద్ద క్లోజయ్యింది.

రుణాలివ్వాలంటూ కపూర్‌ ఒత్తిళ్లు: రవ్‌నీత్‌ గిల్‌
యస్‌ బ్యాంక్‌లో కీలక హోదా నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ తప్పించినా వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ పలు మార్లు తన మాట నెగ్గించుకునే ప్రయత్నాలు చేశారు. నిష్క్రమణ తర్వాత కూడా అనేక కార్పొరేట్‌ సంస్థలకు భారీగా రుణాలిచ్చేలా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణలో యస్‌ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈవో రవ్‌నీత్‌ గిల్‌ ఈ విషయాలు వెల్లడించినట్లు సమాచారం. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) మాత్రమే కాకుండా ఇతరత్రా కంపెనీలకు కూడా యస్‌ బ్యాంక్‌ ఇచ్చిన రుణాల గురించి ప్రశ్నించేందుకు ఈడీ ఆయన్ను పిలిపించింది. ఈ సందర్భంగా కపూర్‌ ఒత్తిళ్ల గురించి గిల్‌ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వివిధ సంస్థలకు యస్‌ బ్యాంక్‌ జారీ చేసిన రుణాలకు ప్రతిగా కపూర్, ఆయన కుటుంబానికి దాదాపు రూ. 4,500 కోట్ల ముడుపులు లభించాయని ఆరోపణలు ఉన్నాయి.

మిషన్‌ కపూర్‌..
రాణా కపూర్‌ అరెస్టు, యస్‌ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎస్‌బీఐని రంగంలోకి దింపడం తదితర పరిణామాల వెనుక చాలా వ్యవహారమే నడిచింది. ఓవైపు యస్‌ బ్యాంక్‌ సంక్షోభం నుంచి బైటపడటం కోసం నిధులు సమీకరించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. మరోవైపు స్వయంగా వ్యవస్థాపకుడు రాణా కపూరే వాటికి గండి కొడుతూ వచ్చారు. ప్రయత్నాలన్నీ విఫలమైతే ఆర్‌బీఐ చివరికి మళ్లీ తననే పిలిచి బాధ్యతలు అప్పగిస్తుందనే ఆశతో ఆయన ఇదంతా చేశారు.

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఇన్వెస్టర్లంతా ఆఖరు దశలో తప్పుకుంటూ ఉండటంపై సందేహం వచ్చిన ఆర్‌బీఐ కూపీ లాగితే ఈ విషయాలు వెల్లడయ్యాయి. సంబంధిత వర్గాల కథనం ప్రకారం .. డీల్‌ కుదుర్చుకునేందుకు వచ్చిన ఇన్వెస్టర్ల దగ్గరకు కపూర్‌ అనుయాయులు వెళ్లి, ఏదో రకంగా దాన్ని చెడగొట్టేవారు. ఇదంతా గ్రహించిన ఆర్‌బీఐ .. యస్‌ బ్యాంక్‌ను మళ్లీ ఆయనకే అప్పగించేందుకు తాము సానుకూలంగా ఉన్నట్లుగా సంకేతాలు పంపి లండన్‌ నుంచి భారత్‌ రప్పించింది. ఆయన రాగానే వివిధ దర్యాప్తు ఏజెన్సీలు కపూర్‌పై అనుక్షణం నిఘా పెట్టాయి.

కానీ ఆర్‌బీఐ, ప్రభుత్వం ఉద్దేశాలు కనిపెట్టిన కపూర్‌ మళ్లీ లండన్‌ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు అధికారులకు తెలిసింది. దీంతో ముందు కపూర్‌ను అరెస్ట్‌ చేయాలా లేక బ్యాంకు పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాలా? అన్న మీమాంస తలెత్తింది. కపూర్‌ను అరెస్ట్‌ చేసిన పక్షంలో బ్యాంక్‌పై కస్టమర్ల నమ్మకం సడలి.. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి తలెత్తే ముప్పుందని ప్రభుత్వం ఆలోచనలో పడిం ది. చివరికి సమయం మించిపోతుండటంతో.. ధైర్యం చేసి అన్ని చర్యలు ఒకేసారి తీసుకుంది. బ్యాంకుపై మారటోరియం, పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల ప్రకటనతో పాటు కపూర్‌ను అరెస్ట్‌ కూడా చేశారు.  

ఈనెల 16 దాకా ఈడీ కస్టడీలో కపూర్‌..
యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ .. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీని మరో అయిదు రోజులు పొడిగిస్తూ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. మూడు రోజుల కస్టడీ అనంతరం బుధవారం ఈడీ ఆయన్ను కోర్టులో హాజరుపర్చింది. విచారణ సందర్భంగా మార్చి 16 దాకా కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement