banking services
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అలర్ట్.. 4 రోజులు అంతరాయం
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు (HDFC Bank) సంబంధించిన పలు సేవలు నాలుగు రోజులు అందుబాటులో ఉండవు. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. నిర్వహణ పనుల నిమిత్తం జనవరి 17, 18, 24, 25 తేదీల్లో పలు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది.కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వివరించింది. ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవనేది కస్టమర్లకు సమాచారం అందించింది.జనవరి 17న తెల్లవారుజామున 2:00 నుండి ఉదయం 5:00 గంటల వరకు 3 గంటల పాటు ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్ సర్వీస్ అందుబాటులో ఉండదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో ప్రీపెయిడ్ కార్డ్ నెట్‌బ్యాంకింగ్, ఇన్స్టంట్ రీలోడ్ పోర్టల్ ద్వారా ఫారెక్స్ కార్డ్ రీలోడ్ చేయడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫారెక్స్ కార్డ్‌లను రీలోడ్ చేయవచ్చు.జనవరి 18, 25 తేదీలలో అర్ధరాత్రి 12:00 నుండి ఉదయం 3:00 వరకు యూపీఐ (UPI) సర్వీస్ అందుబాటులో ఉండదు. ఈ సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలపై యూపీఐ లావాదేవీలు, రూపే క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, థర్డ్ పార్టీ యాప్‌లలో యూపీఐ సర్వీస్ నిలిపేస్తారు. మర్చెంట్ యూపీఐ లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయి.ఇక జనవరి 24, 25 తేదీల్లో చాట్‌బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ (SMS) బ్యాంకింగ్, ఫోన్‌బ్యాంకింగ్ ఐవీఆర్ (IVR) సేవల్లో అంతరాయం ఉంటుంది. జనవరి 24 రాత్రి 10:00 గంటల నుండి జనవరి 25 మధ్యాహ్నం 2:00 గంటల వరకు (మొత్తం 16 గంటలు) చాట్‌బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, ఫోన్‌బ్యాంకింగ్ ఐవీఆర్ సేవలపై పని చేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. ఈ సమయంలో ఈ సేవలన్నీ వినియోగదారులకు అందుబాటులో ఉండవు.కస్టమర్లకు అలర్ట్హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ అప్డేట్ను రిజిస్టర్డ్ ఈ-మెయిల్ చిరునామా ద్వారా కస్టమర్లకు పంపింది. ఈ తేదీలు, సమయాల్లో ఇతర ఎంపికలను ఉపయోగించాలని సూచించించింది. తమ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ అవసరమైన నిర్వహణను పూర్తి చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని కస్టమర్లకు సూచించింది. -
గ్రామాల్లో బ్యాంక్ సేవలు విస్తరించాలి
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని, చిన్న రుణ గ్రహీతల అవసరాలపై దృష్టి సారించాలని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) కోరింది. దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యల వార్తలను ప్రస్తావిస్తూ.. ఎన్బీఎఫ్సీలు, స్థానిక రుణదాతలు పెద్ద మొత్తంలో వడ్డీలు వసూ లు చేస్తుండడం, దీనికితోడు ప్రతిఫలం ఇవ్వని పంట మద్దతు ధరలు ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. బ్యాంకుల జాతీయీకరణ దినం సందర్భంగా ఏఐబీవోసీ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకుల కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించాలంటూ.. దీనివల్ల ఎన్బీఎఫ్సీలు, స్థానిక రుణదాతల ఉచ్చులో పడకుండా రైతులను కాపాడొచ్చని అభిప్రాయపడింది. కేవలం 74 వేల గ్రామాలకే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్న ఇటీవలి ఒక నివేదికను ఉటంకించింది. గ్రామీణ పేదలకు రుణ లభ్యత అన్నది ఇప్పటికీ పెద్ద సవాలుగా మిగిలినట్టు ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ రూపమ్ రాయ్ తెలిపారు. విలీనాల తర్వాత బ్యాంక్‌లు పెద్ద కస్టమర్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో, చిన్న వ్యాపారులకు బ్యాంకు రుణాల అందుబాటు తగ్గిందని.. దీంతో వారు ఎన్బీఎఫ్సీలను ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, ఎన్బీఎఫ్సీ రంగం దోపిడీ పద్ధతులు ఎస్ఎంఈలపై పెద్ద భారాన్ని మోపుతోందంటూ.. అది వాటి వృద్ధిని అడ్డుకుంటున్నట్టు తెలిపారు. ప్రైవేటీకరణ పరిష్కారం కాదు.. బ్యాంక్‌ల ప్రైవేటీకరణ, పెద్ద బ్యాంక్‌ల మధ్య స్థిరీకరణ అన్నవి ఆర్థిక సేవల మార్కెట్లో సమస్యలకు పరిష్కారాలు ఎంత మాత్రం కోబోవని ఏఐబీవోసీ ప్రకటన పేర్కొంది. ప్రైవేటీకరణ అన్నది సామాజిక అవసరాల కంటే సాధ్యమైనంత లాభాలు పొందడానికి దారితీస్తుందని, అది ఆర్థిక అసమానతలను మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు 26 వరకు ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఉండగా, విలీనాలతో 12 బ్యాంక్‌లు మిగలడం తెలిసిందే. దీన్ని ప్రైవేటీకరణకు దొడ్డిదారిగా ఏఐబీవోసీ అభివరి్ణంచింది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2020 కరోనా విపత్తు సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన ప్రభుత్వరంగ బ్యాంక్‌ల కృషిని ఈ చర్యలు పట్టించుకోకపోవడమేనని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ల విలీనంతో అవి మార్కెట్ వాటా ను కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18 నాటికి మొత్తం డిపాజిట్లలో 66 శాతంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంక్‌ల వాటా 2023 డిసెంబర్ నాటికి 59 శాతానికి క్షీణించినట్టు ప్రకటనలో వివరించింది. -
విదేశాల్లో పెరిగిన భారత బ్యాంకు శాఖలు
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యాంకుల విదేశీ అనుబంధ సంస్థలు, శాఖల సంఖ్య 417కి చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 399గా ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య విదేశీ శాఖల్లో 0.5 శాతం, అనుబంధ సంస్థల్లో 6.2 శాతం పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన 2022–23 ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విదేశాల్లో శాఖలు, అనుబంధ సంస్థలున్న 14 భారతీయ బ్యాంకులు, అలాగే భారత్‌లో శాఖలు, అనుబంధ సంస్థలున్న 44 విదేశీ బ్యాంకులపై ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం భారత్‌లో విదేశీ బ్యాంకుల శాఖలు, ఉద్యోగుల సంఖ్య తగ్గింది. -
ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇంటి వద్దకే ప్రభుత్వ బ్యాంక్ సేవలు
ప్రముఖ పబ్లిక్ సెక్టార్ ఇండియన్ బ్యాంక్ (Indian Bank) కస్టమర్ల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ‘ఐబీ సాథీ’ (IB SAATHI - సస్టైనబుల్ యాక్సెస్ అండ్ అలైనింగ్ టెక్నాలజీ ఫర్ హోలిస్టిక్ ఇన్‌క్లూజన్)ను రూపొందించింది. ‘ఐబీ సాథీ’ కస్టమర్లకు అవసరమైన ప్రాథమిక బ్యాంకింగ్ సేవలతో పాటు అదనపు సర్వీసులు అందించడాన్ని సులభతరం చేస్తుంది. ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ఎల్ జైన్ చెన్నైలోని తమ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యం ‘ఐబీ సాథీ’ కార్యక్రమం ద్వారా ఇండియన్ బ్యాంక్ తన అన్ని శాఖలలో రోజుకు కనీసం నాలుగు గంటల పాటు కస్టమర్లకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ కరస్పాండెంట్లు నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తారు. (కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..) ఇందు కోసం 2024 మార్చి నాటికి సుమారు 5,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవాలని ఇండియన్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల కస్టమర్లకు మరింత చేరువ కావచ్చని భావిస్తోంది. 36 రకాల సేవలు ఇండియన్ బ్యాంక్‌కు ప్రస్తుతం 10,750 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, 10 మంది కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సంఖ్యను 15,000లకు, కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్ల సంఖ్య 15కు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ తన బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఛానెల్ ద్వారా కస్టమర్లకు 36 రకాల సేవలు అందిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా సేవలు పెరగనున్నాయి. -
వాట్సాప్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలను ప్రారంభించింది. ఇందుకోసం భారతీ ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపింది. పలు బ్యాంకు సర్వీసులతోపాటు ఇంటి వద్ద సేవల కోసం వినతి, సమీపంలోని పోస్ట్ ఆఫీస్ శాఖ ఎక్కడ ఉంది వంటివి వాట్సాప్ ద్వారా ఖాతాదారులు తెలుసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌నకు 4.51 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. లైవ్ ఇంటెరాక్టివ్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్‌ను సైతం వాట్సాప్‌లో పరిచయం చేయనున్నారు. -
కస్టమర్‌ను దేవునిగా చూడండి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరచాలని ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా బ్యాంకులు తమ ఖాతాదారులను దేవుడిలా చూడాలని కోరారు. బ్యాంకులు కస్టమర్లకు వచ్చే ఇబ్బందులు తగ్గించడంపై పూర్తి దృష్టి పెట్టాలని అన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిర్వహించిన కస్టమర్ మీట్ కార్యక్రమంలో కరాద్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా బ్యాంకులు పటిష్టంగా ఉండడానికి కస్టమర్లూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందులో భాగంగా రుణాల చెల్లింపులో వారు పూర్తి క్రమశిక్షణను పాటించాలని విజ్ఞప్తి చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) స్కీమ్‌ను మరింత మంది రైతులకు విస్తరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. డిజిటలైజేషన్‌పై తమ బ్యాంక్ అత్యధిక దృష్టి సారిస్తున్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న బీఓఎం మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ రాజీవ్ తెలిపారు. -
శక్తికాంత్‌కు 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023' అవార్డు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్‌కు ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు’ లభించింది. మహమ్మారి కరోనా సంక్షోభం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, భౌగోళిక ఉద్రిక్తతల వంటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఫైనాన్షియల్ మార్కెట్లను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకుగాను ఇంటర్నేషనల్ పబ్లికేషన్ సెంట్రల్ బ్యాంకింగ్ శక్తికాంతదాస్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికచేసింది. భారత దేశం నుంచి 2015లో మొట్టమొదటిసారి అప్పటి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ఈ అవార్డు దక్కింది. కీలక సమయాల్లో గవర్నర్ శక్తికాంతదాస్ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ఇంటర్నేషనల్ పబ్లికేషన్ తాజాగా పేర్కొంది. పేమెంట్ వ్యవస్థసహా పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారని తెలిపింది. కరోనా మహమ్మారిని ప్రస్తావిస్తూ, కీలక సవాలును భారత్ ఎదుర్కొనగలిగినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు అందరూ భిన్నమైన ప్రాధాన్యతలను కలిగి ఉన్న ప్రభుత్వాలతో కలిసి పనిచేయడంలో సాధారణంగా కష్టాలు ఎదుర్కొంటుంటారని పేర్కొన్న పబ్లికేషన్, ఆయా సమన్వయ చర్యల్లో దాస్ చక్కటి ప్రగతి సాధించగలిగారని వివరించింది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో దాస్ మాట్లాడుతూ, వైరస్‌ను ఎదుర్కొనడానికి నిరంతర పోరాటం అవసరం అన్నారు. ఇటు సాంప్రదాయ పద్ధతుల్లో అటు అసాధరణమైన రీతిలో ఈ పోరాట చర్యలు ఉండాలన్నారు. -
మినీ బ్యాంక్‌లు ఆర్బీకేలు.. రైతుల చెంతకే బ్యాంకింగ్ సేవలు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఇప్పటికే ఎన్నో సేవలు అందిస్తున్న ఆర్బీకేలు.. మరో సేవకు సిద్ధమయ్యాయి. ఇకపై పల్లెల్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాలనూ తీర్చనున్నాయి. అందులో భాగంగా బ్యాంక్‌లు, ఏటీఎంల పాత్రలను పోషించనున్నాయి. తక్షణ అవసరం నిమిత్తం రూ.20 వేల వరకు సమకూర్చేందుకు జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏర్పాటు ప్రధానంగా రైతుల కోసం చేసినా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకునే వెసులు బాటూ కల్పించడంతో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి,నంద్యాల: అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకేసి ఆర్థిక సేవలనూ వారి ముంగిట్లోకే తెచ్చింది. రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటి వరకు అందుతున్న సేవలతో పాటు బ్యాంకు సేవలనూ ప్రవేశపెట్టింది. పల్లె రైతులు, ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా అవసరమైనప్పుడు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. అందుకు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 874 రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంక్‌ల సాయంతో 587 మంది బిజినెస్ కరస్పాండెంట్లను నియమించింది. వీరి ద్వారా రైతులకు అవసరమైన చిన్నచిన్న లావాదేవీలను బ్యాంకుల వద్దకు వెళ్లకుండా పూర్తి చేస్తోంది. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనల ప్రకారం 5 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటు చేయాలి. కానీ బ్యాంకుల విలీనంతో కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోయినా బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా రైతులు, పల్లె ప్రజల అవసరాలను తీర్చనుంది. 587 మంది బిజినెస్ కరస్పాండెంట్లు నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 874 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో రైతులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునేందుకు వివిధ బ్యాంకులకు చెందిన 587 మంది బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేశారు. వీరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 2.47 లక్షల మంది రైతులతోపాటు ప్రజలకు కూడా ఈ సేవలు అందిస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఇప్పటికే ఎన్నో సేవలు అందిస్తున్న ఆర్బీకేలు.. మరో సేవకు సిద్ధమయ్యాయి. ఇకపై పల్లెల్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాలనూ తీర్చనున్నాయి. అందులో భాగంగా బ్యాంక్‌లు, ఏటీఎంల పాత్రలను పోషించనున్నాయి. తక్షణ అవసరం నిమిత్తం రూ.20 వేల వరకు సమకూర్చేందుకు జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏర్పాటు ప్రధానంగా రైతుల కోసం చేసినా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకునే వెసులు బాటూ కల్పించడంతో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సమయం వృథా అయ్యేది ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం సంతోషకరం. మా గ్రామంలో బ్యాంకు కానీ, ఏటీఎం కానీ లేకపోవడంతో నగదు తీసుకోవాలన్నా, ఖాతాలోకి వేయాలన్నా నంద్యాలకు వెళ్లాల్సి ఉండేది. దీని వల్ల సమయం వృథా అయ్యేది. జగనన్న ప్రభుత్వం ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్ సేవలు పెట్టడంతో ఆ బాధలు తప్పాయి. బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. 4 కి.మీ వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే డబ్బులు తీసుకుంటున్నాం. జమ చేస్తున్నాం. – బంగారురెడ్డి, రైతు, చాబోలు సేవలకు రుసుమేమీ లేదు ప్రతిరోజూ బిజినెస్ కరస్పాండెంట్లు గంట నుంచి 2 గంటల పాటు ఆర్బీకేల్లో వేచి ఉంటారు. ఆయా గ్రామాల్లో రైతుల వెసులుబాటును బట్టి సమయాన్ని సర్దుబాటు చేసుకునే విధంగా బిజినెస్ కరస్పాండెంట్లకు ఆదేశాలు జారీ చేశాం. 2 వేల జనాభా కలిగిన గ్రామాల్లో ఈ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ ఆర్బీకే ఉన్న ప్రతి గ్రామంలో రైతులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా బిజినెస్ కరస్పాండెంట్లకు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. -వెంకటనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్, కర్నూలు -
గడప గడపకీ విస్తరిస్తున్న బ్యాంకింగ్ సేవలు
సాక్షి, అమరావతి: కోవిడ్ భయాలు వెంటాడుతున్నప్పటికీ గత మూడేళ్లుగా రాష్ట్రంలో గడప వద్దకే బ్యాంకింగ్ సేవలు గణనీయంగా విస్తరించాయి. డిపాజిట్లు, రుణాలు, ప్రాధాన్యతా రంగ రుణాలు, బ్యాంకు శాఖల విస్తరణ, ఏటీఎంలు ఇలా అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) తాజా నివేదికలో పేర్కొంది. ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో చేపట్టిన ‘ఆర్థిక సేవల సమ్మిళిత వృద్ధి (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్)’ కార్యక్రమంలో భాగంగా రాష్రంలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ (బీసీ)ల సేవలు గణనీయంగా పెరిగాయి. 2020 మార్చి నాటికి 6,264 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండగా 2022 మార్చి నాటికి 38,295 మందికి చేరింది. ఇండియన్ పోస్టల్ బ్యాంక్, ఫినోపేమెంట్ బ్యాంక్ కరస్పాండెంట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల నగదు బదిలీ నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతున్నట్లు రాష్ట్ర ఎస్ఎల్బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 5,000 జనాభా ఉన్న గ్రామాలన్నింటికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవాలన్న ఆర్బీఐ నిబంధనల ప్రకారం మన రాష్ట్రంలో 567 గ్రామాల్లో కోర్ బ్యాంకింగ్ సేవలను (సీబీఎస్) అందుబాటులోకి తెచ్చారు. ప్రతి 5 కిలోమీటర్లకు బ్యాంకింగ్ సేవలు ఉండాలన్న నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 243 గ్రామాలను గుర్తించారు. ఇందులో 229 గ్రామాలకు బీసీలు, పోస్టాఫీసుల ద్వారా సేవలు అందిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో 334 గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి రైతు భరోసా కేంద్రం, సచివాలయాల వద్ద బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. లక్ష్యానికి మించి రుణాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గత మూడేళ్లుగా రాష్ట్రంలో మొత్తం రుణాలు లక్ష్యానికి మించి మంజూరవుతున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పారిశ్రామిక రంగం కాకుండా ఇతర రంగాలకు మొత్తం రూ.2,83,380 కోట్లు రుణాలుగా ఇవ్వాలని ఎస్ఎల్బీసీ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఏకంగా 33 శాతం అధికంగా రూ.3,77,436 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మొత్తం రుణాల్లో 40 శాతం ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. ఇది మన రాష్ట్రంలో 64.97 శాతంగా ఉంది. 2021–22 సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు రూ.3,26,871 కోట్లు మంజూరయ్యాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వ్యవసాయ రంగానికి బ్యాంకులు కనీసం 18 శాతం రుణాలు ఇవ్వాల్సి ఉండగా 42.17% రుణాలను మంజూరు చేశాయి. వ్యవసాయ రంగానికి రూ.1,48,500 కోట్లు రుణాలు లక్ష్యంగా నిర్దేశించుకుంటే బ్యాంకులు ఏకంగా రూ.2,12,170 కోట్లు మంజూరు చేశారు. అలాగే ఎంఎస్ఎంఈ రంగానికి రూ.44,500 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.44,815 కోట్లు మంజూరు చేశాయి. -
గ్రామాల్లో ‘ఎనీ టైం మనీ’
సాక్షి, అమరావతి: చాలా గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఉన్నా అరకొరగానే ఉంటాయి. ఏటీఎంల సంగతి సరేసరి. డబ్బులు తీసుకోవాలంటే మైళ్లకొద్దీ దూరం వెళ్లాలి. తీరా అక్కడికి వెళ్లాక ఏటీఎంలో డబ్బులు లేకపోతే మరో ఏటీఎంకి ప్రయాణం కట్టాలి. ఇది గ్రామీణ ప్రజలు నిత్యం అనుభవిస్తున్న కష్టం. ఈ కష్టాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామీణులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు అందుబాటులో ఉండేలా ఆర్బీకేలలోనే ఏటీఎంలను ఏర్పాటు చేయిసున్నారు. వాటిలో ఎప్పుడూ నగదు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గ్రామీణులకు వ్యవసాయ ఉత్పాదకాలు, ఉపకరణాలతోపాటు నగదు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకు ఉదాహరణే ఈ రైతు.. పేరు ఆచంట శ్రీనివాసరావు. తూర్పు గోదావరి జిల్లా కురుకూరు. గతంలో ఏది కావాలన్నా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన దేవరాపల్లికి వెళ్లేవారు. గ్రామంలో ఆర్బీకే ఏర్పాటు చేశాక ఇప్పుడు అన్నీ అక్కడే దొరుకుతున్నాయి. గ్రామం దాటి వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలు కూడా పొందుతున్నారు. 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లంట్ల ఆర్బీకే వద్ద ఏర్పాటు చేసిన ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకే, ఏటీఎంల వల్ల వ్యయప్రయాసలు తగ్గాయని శ్రీనివాసరావు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. గ్రామీణుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఆర్బీకేలకు అనుసంధానం చేసింది. ప్రతి ఆర్బీకే వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేస్తోంది. రైతుల్లో ఆర్ధిక అక్షరాస్యతను పెంపొందించడం, మొబైల్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడం, పేపర్లు లేని (పేపర్‌లెస్) ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే 9,160 ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులోకి వచ్చారు. మిగిలిన ఆర్బీకేల్లోనూ వీరి నియామకానికి బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నాయి. పైలట్ ఏటీఎంలకు అనూహ్య స్పందన ప్రభుత్వ పిలుపు మేరకు ఆర్బీకేల వద్ద యూనియన్ బ్యాంక్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకో ఆర్బీకే వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేసింది. వీటి పనితీరుపై బ్యాంక్ అధ్యయనం చేసింది. ఈ ఏటీఎంలను ఆర్బీకేల పరిధిలోని ఏడు నుంచి పది గ్రామాలకు చెందిన పదివేల మందికి పైగా రైతులు, ప్రజలు వినియోగించుకుంటున్నట్టు గుర్తించారు. ప్రతి రోజూ 50 నుంచి 100 హిట్స్ వస్తున్నాయని, ప్రతి ఏటీఎం నుంచి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు నగదు తీసుకుంటున్నట్లు గుర్తించారు. పల్లంట్ల ఆర్బీకే ఏటీఎం ది బెస్ట్ తూర్పు గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం పల్లంట్ల ఆర్బీకేలో తొలి ఏటీఎం ఏర్పాటు చేశారు. ఇది బెస్ట్ ఏటీఎంగా నిలిచినట్టు యూనియన్ బ్యాంక్ ప్రకటించింది. పల్లంట్లతో పాటు కురుకూరు, లక్ష్మీపురం, త్యాజంపూడి, చిక్కాల, దూమంతుని గూడేనికి చెందిన 10 వేల మందికిపైగా ఈ ఏటీఎంను ఉపయోగించుకుంటున్నారు. గతంలో వీరంతా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరాపల్లి (మండల కేంద్రం)కి వెళ్లేవారు. గత సంవత్సరం నవంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం రైతులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ ఏటీఎంను రోజుకు 75 నుంచి 100 మంది వరకు ఉపయోగించుకుంటున్నట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. రోజుకు సుమారు రూ.4 లక్షలు విత్‌డ్రా అవుతున్నట్లు వెల్లడైంది. ఏ సమయానికి వెళ్లినా నగదు అందుబాటులో ఉండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నో క్యాష్ బోర్డు చూడలేదు నేను 16 ఎకరాల్లో మిరప, మొక్కజొన్న, కర్రపెండలం సాగు చేస్తున్నా. గతంలో ఏది కావాలన్నా దేవరాపల్లి వెళ్లే వాళ్లం. ఇప్పుడు పల్లంట్లలో ఏర్పాటు చేసిన ఆర్బీకే మా అవసరాలన్నీ తీరుస్తోంది. ఇక్కడి ఏటీఎంలో ఎప్పుడు వెళ్లినా డబ్బు ఉంటుంది. నో క్యాష్ బోర్డు ఎప్పుడూ చూడలేదు. –వి.కిషోర్, లక్ష్మీపురం, తూర్పు గోదావరి చాలా సౌకర్యంగా ఉంది నేను 18 ఎకరాల్లో ఆయిల్ పామ్, వరి, మినుము, జీడిమామిడి సాగుచేస్తా. ఇంతకు ముందు డబ్బుల కోసం చాలా అవస్థలు పడే వాడిని. ఏటీఎం, బ్యాంకు శాఖలకు వెళ్లాలంటే చాలా సమయం, ఖర్చు ఎక్కువగా ఉండేది. ఇప్పుడా అవస్థలు లేవు. మా గ్రామం ఆర్బీకేలోనే ఏటీఎం ఏర్పాటు చేయడంతో చాలా సౌకర్యంగా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి డబ్బులు తెచ్చుకోగలుగుతున్నాం. – గాంధీప్రసాద్, పల్లంట్ల, తూర్పు గోదావరి ఆర్బీకే ఏటీఎంలకు స్పందన బాగుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు ఆర్బీకేల వద్ద పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ఏటీఎంలకు మంచి స్పందన లభిస్తోంది. మండల కేంద్రాలు, నగరాల్లో చాలా ఏటీఎంలకు లభించని ఆదరణ ఇక్కడ లభిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మరిన్ని ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్బీకేల వద్ద ఏటీఎంల ఏర్పాటుకు మిగిలిన బ్యాంకులు కూడా ముందుకొస్తున్నాయి. మలి దశలో కనీసం 100 ఏటీఎంలు ఏర్పాటు చేయాలని సంకల్పించాం. – వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ -
అలా చేస్తే వినియోగదారుల పరిధిలోకి రారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బ్యాంకు సర్వీసులను ’వ్యాపార అవసరాల’కు ఉపయోగించుకునే వ్యక్తులను ‘వినియోగదారు’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వినియోగదారు పరిధిలోకి రావాలంటే.. తాను స్వయం ఉపాధి ద్వారా జీవిక పొందేందుకు మాత్రమే బ్యాంకు సేవలను ఉపయోగించుకున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వ్యాపార లావాదేవీలను వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం పరిధిలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఓ సవరణ చేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు–శ్రీకాంత్ జి మంత్రి ఘర్ మధ్య ఓవర్‌డ్రాఫ్ట్ వివాదానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శ్రీకాంత్.. సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. -
బ్యాంకింగ్ కరస్పాండెంట్లు వచ్చేశారు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవలు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయం కార్యరూపం దాలుస్తోంది. ప్రభుత్వ కృషి ఫలితంగా ప్రతీ ఆర్బీకే పరిధిలో ఓ బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను ఆయా బ్యాంకులు కేటాయించాయి. నగదు జమ, ఉపసంహరణలతో పాటు సాగు ఉత్పాదకాల కొనుగోళ్లు.. కూలీలు, యాంత్రీకరణకు నగదు బదిలీతో సహా కొత్త రుణాల మంజూరు, పాత రుణాల నవీకరణ వంటి సేవలను కూడా ఈ కరస్పాండెంట్ల ద్వారా అందిస్తున్నారు. రైతుల విలువైన సమయం ఆదాకు.. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలున్నాయి. వీటిలో 234 అర్బన్ ప్రాంతంలోనూ, 10,544 గ్రామీణ ప్రాంతంలో రైతులకు సేవలందిస్తున్నాయి. సీజన్లో రుణాల మంజూరు, రీషెడ్యూళ్లతో పాటు వివిధ రకాల బ్యాంకింగ్ సేవల కోసం రైతులు పడరాని పాట్లు పడేవారు. పంటకాలంలో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఆర్బీకేల ద్వారా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచన మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దిశగా బ్యాంకులు కూడా అడుగులు వేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో 24 ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు సేవలందిస్తున్నాయి. నిజానికి శాఖలులేని ప్రాంతాల్లో వాటి కార్యకలాపాల కోసం ఆయా బ్యాంకులు గతంలోనే 10,916 మంది కరస్పాండెంట్లను నియమించుకున్నాయి. వీరిలో 503 మంది చురుగ్గాలేరు. ప్రస్తుతం 10,413 మంది సేవలందిస్తున్నారు. ప్రధానంగా.. ఎస్బీఐ పరిధిలో 3,289 మంది, యూనియన్ బ్యాంక్ పరిధిలో 1,320 మంది, ఏపీజీవీబీ పరిధిలో 1,091, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌కు 990, కెనరా బ్యాంకుకు 831, ఇండియా ఫస్ట్ బ్యాంకుకు 686 మంది ఉన్నారు. మరికొన్నింటిలో మిగిలిన వారు కొనసాగుతున్నారు. వీరిలో 9,160 మంది గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నట్లుగా గుర్తించారు. వీరందరినీ సమీప ఆర్బీకేలతో మ్యాపింగ్ చేశారు. అలాగే, వైఎస్సార్ కడప, విశాఖపట్నం జిల్లాల్లోని ఆర్బీకేలకు నూరు శాతం కరస్పాండెంట్లు అందుబాటులో ఉన్నట్లు గుర్తించగా.. 1,618 ఆర్బీకేలకు కరస్పాండెంట్లు లేరు. ఈ ప్రాంతాల్లోని ఆర్బీకేలను సమీప కరస్పాండెంట్లతో మ్యాపింగ్ చేశారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ ఆర్బీకేల బాధ్యతలు చూసేవారు రోజు విడిచి రోజు ఆయా ఆర్బీకేల్లో విధులు నిర్వర్తించేలా ఆదేశాలిచ్చారు. ఇక పూర్తిస్థాయిలో కరస్పాండెంట్లు అందుబాటులో ఉన్న ఆర్బీకేల్లో వారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్బీకేల్లో సేవలందిస్తున్నారు. ఆర్బీకేల్లో అందుతున్న బ్యాంకింగ్ సేవలివే.. ► మొబైల్ స్వైపింగ్ మిషన్ ద్వారా విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా ప్రతీ బ్యాంకింగ్ కరస్పాండెంట్ పరిధిలో గరిష్టంగా రూ.25వేల వరకు ఉంచుతున్నారు. ► ఖాతాల్లేని రైతులతో బ్యాంకు ఖాతాలు తెరిపించడం, నగదు జమ చేయించడం, పంట రుణాల మంజూరు కోసం దగ్గరుండి డాక్యుమెంటేషన్ చేయించడం చేస్తున్నారు. ► బ్యాంకింగ్ లావాదేవీలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ► ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్ (డిజిటల్ పేమెంట్లు) కార్యకలాపాలపై శిక్షణనిస్తున్నారు. ► ప్లాస్టిక్ మనీ వినియోగాన్ని పెంచే దిశగా రైతుల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు ఓ కరస్పాండెంట్ ఆర్బీకేల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల మేరకు బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవాలని బ్యాంకులన్నింటికీ ఆదేశాలిచ్చాం. ఆర్బీకేలున్న ప్రతీచోట సమీప బ్యాంకులకు చెందిన కరస్పాండెంట్లు సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ కార్యకలాపాలను ఆర్బీకేల ద్వారానే అందించేందుకు కార్యాచరణ సిద్ధంచేస్తున్నాం. – వి. బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ -
రైతుభరోసా కేంద్రాల్లో ఇక బ్యాంకింగ్ సేవలు..
సాక్షి,కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన రైతుభరోసా కేంద్రాలు మినీ బ్యాంకులుగా మారబోతున్నాయి. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రైతులకు వ్యవసాయ, అనుబంధశాఖలకు చెందిన అన్ని రకాల సేవలు అందుతున్నాయి. ఇక నుంచి బ్యాంకింగ్ సేవలు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల ముంగిటకు చేరనున్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 5000 జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకులు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల విలీనంతో కొత్త బ్యాంకులు ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. బ్యాంక్ బ్రాంచ్ స్థానంలో వివిధ బ్యాంకులు బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసుకొని కొన్ని గ్రామాల్లో సేవలు అందిస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఆర్బీకేల్లోని ఈ సేవలు అందేలా ఏర్పాటు చేశారు. జిల్లాలో 877 రైతుభరోసా కేంద్రాలు ఉన్నాయి. వివిధ బ్యాంకులకు సంబంధించి 804 మంది బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు. వీరి ద్వారా ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్ సేవలు అందించడానికి లీడ్ డి్రస్టిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం) ఏర్పాట్లు పూర్తి చేశారు. బిజినెస్ కరస్పాండెంట్లను ఆర్బీకేలతో మ్యాపింగ్ చేయడాన్ని పూర్తి చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఆర్బీకేల్లో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఎల్డీఎం దగ్గరి నుంచి మార్గదర్శకాలుపంపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంలు ఏర్పాటు చేయకపోవడంతో నగదు తీసుకోవాలన్నా.. నగదు జమ చేయాలన్నా.. నగదు బదిలీ చేయాలన్నా దూరప్రాంతంలోని బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో తీవ్ర వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ఇక నుంచి ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రూ.20 వేల వరకు అవకాశం ఆర్బీకేల ద్వారా నగదు ఉపసంహరణ (విత్‌డ్రా), నగదు జమ (డిపాజిట్)తో పాటు నగదు బదిలీ కూడా చేసుకునే అవకాశం సోమవారం నుంచే అందుబాటులోకి రానుంది. బ్యాంకు ఖాతాల్లో నగదు ఉంటే ఆర్బీకేల నుంచి బిజినెస్ కరస్పాండెంటు ద్వారా రూ.20 వేల వరకు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. రూ.20 వేల వరకు నగదు జమ చేయవచ్చు. నగదు ట్రాన్స్ఫర్ మాత్రం రూ.10 వేల వరకు చేసుకోవచ్చు. బిజినెస్ కరస్పాండెంట్ల పని వేళలు త్వరలో నిర్ణయించనున్నారు. వారికి బ్యాంకులు ఇచ్చిన స్వైపింగ్ మిషన్లు, ట్యాబ్‌ల ద్వారా వారు ఆన్లైన్లోనే బ్యాంకింగ్ సేవలు అందించనున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో మోడరన్ బ్యాం‘కింగ్
సాక్షి, అమరావతి: ఒకప్పుడు నగదు విత్ డ్రా చేయాలన్నా.. నగదు జమ చేయాలన్నా గంటల కొద్దీ బ్యాంకుల్లో పడిగాపులు కాయాల్సి వచ్చేది. పనులన్నీ మానుకొని.. టోకెన్ నంబర్ ఎప్పుడు పిలుస్తారో అని కాచుకొని కూర్చోవాల్సి వచ్చేది. అదే ఏ అర్ధరాత్రో, అపరాత్రో డబ్బులకు అత్యవసర పరిస్థితి ఎదురైతే.. పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సంప్రదాయ బ్యాంకింగ్ సేవల స్థానాన్ని వెనక్కి నెడుతూ.. పనులు వేగంగా, సులువుగా, సజావుగా జరిగేలా మోడరన్ బ్యాంకింగ్ దూసుకువచ్చింది. వీధివీధికి ఏటీఎంలు వెలిశాయి. యాప్‌ల రూపంలో చేతుల్లోకే బ్యాంకు సేవలు వచ్చేశాయి. చిటికెలో పనులు పూర్తయిపోతున్నాయి. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు ఈ సేవలను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఏటీఎం, క్యూఆర్ కోడ్ తదితరాల ద్వారా పొందే ఆధునిక బ్యాంకింగ్ సేవలను రాష్ట్ర గ్రామీణ ప్రజలు అధికంగా వినియోగిస్తున్నారు. ఈ విషయం నాబార్డ్ ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే(ఎన్ఏఎఫ్ఐఎస్)లో వెల్లడైంది. మోడరన్ బ్యాంకింగ్, సంప్రదాయ బ్యాంకింగ్ సేవల వినియోగంతో పాటు ఎన్‌ఏఎఫ్ ఇండెక్స్‌లో దేశీయ సగటు కంటే మెరుగైన పనితీరును ఆంధ్రప్రదేశ్ కనబరిచింది. రూపే కార్డులు, నెట్ బ్యాంకింగ్‌తో ముందుకు.. ఎన్‌ఏఎఫ్ ఇండెక్స్‌లో దేశవ్యాప్త సగటు 0.337 పాయింట్లుగా ఉంటే ఏపీ మాత్రం 0.473 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. మోడరన్ బ్యాంకింగ్ సేవల వినియోగంలో 0.703 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఈ విభాగాల్లో 1, 2, 3 స్థానాల్లో ఉన్నది గోవా, మణిపూర్, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాలే. పెద్ద రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్టేనని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ లేదా, పోస్టాఫీసుల్లో ఖాతాలు ప్రారంభించడంతో పాటు రూపే కార్డులు, ఆధార్‌తో అనుసంధానం, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు కల్పించారు. వారంతా ఇంటి వద్ద నుంచే బ్యాంకింగ్ సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56,92,293 జన్‌ధన్ ఖాతాలుండగా.. అందులో 79 శాతం ఖాతాలకు రూపే కార్డులిచ్చారు. 89.15 శాతం ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఇక సంప్రదాయ బ్యాంకింగ్ సేవల వినియోగంలో ఏపీ 0.424 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, కర్నాటక, తెలంగాణ, గోవా, హిమాచల్ప్రదేశ్లున్నాయి. పూర్తి డిజిటల్ జిల్లాగా వైఎస్సార్ రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్ రూపంలో మార్చాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలుత వైఎస్సార్ జిల్లాను 100 శాతం డిజిటల్ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంది. వైఎస్సార్ జిల్లాలో మొత్తం 31,83,960 సేవింగ్ ఖాతాలుండగా.. అందులో ఇప్పటి వరకు 88 శాతం ఖాతాలకు రూపే కార్డులు మంజూరు చేశారు. 24 శాతం మందికి నెట్ బ్యాంకింగ్ సదుపాయం అందించగా.. 38 శాతం మంది మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. -
ICICI Bank: డాక్టర్లకు రూ. పది కోట్ల దాకా లోన్
సాక్షి, ముంబై: వైద్యుల బ్యాం కింగ్ అవసరాలను తీర్చే దిశగా ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ కొత్తగా ’సెల్యూట్ డాక్టర్స్’ పేరిట ప్రత్యేక సొల్యూషన్స్‌ను ప్రవేశపెట్టింది. వైద్య విద్యార్థి స్థాయి నుంచి సీనియర్ మెడికల్ కన్సల్టెంట్, ఆస్పత్రి లేదా క్లినిక్ యజమానిగా మారే దాకా ప్రతీ దశలోనూ వారికి అవసరమయ్యే ఆర్థిక సేవలను అందించనున్నట్లు బ్యాంక్ హెడ్ (లయబిలిటీస్) ప్రణవ్ మిశ్రా తెలిపారు. డాక్టర్స్ కోసమే ప్రత్యేకమైన ఫీచర్లతో రూపొందించిన సేవింగ్స్, కరెంటు ఖాతాలు మొదలుకుని గృహ, వ్యాపార, వ్యక్తిగత, వ్యాపార రుణాల దాకా పొందవచ్చని పేర్కొన్నారు. రూ. 1 కోటి దాకా విద్యా రుణం పొందవచ్చని వివరించారు. ఆఫర్ల వివరాలు: మెడికల్ ఎక్విప్మెంట్ లోన్ : 10 కోట్ల రూపాయల దాకా రుణ సదుపాయం. వారు బ్యాంక్ కస్టమర్లు అయినా కాకపోయినా వైద్యులందరికీ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వివరాలకు హెచ్సిఎఫ్ను 567677 కు SMS చేయవచ్చు. బిజినెస్ లోన్: మూలధన అవసరాలకు లేదా క్లినిక్ / ఆసుపత్రిని పునరుద్ధరించడం, వైద్య పరికరాల కొనుగోలు వంటి ఇతర వ్యాపార సంబంధిత ఖర్చులకు రూ. 40 లక్షల దాకా వ్యాపార రుణం ప్రీ అప్రూవ్డ్ కస్టమర్లకు తక్షణమే రుణ సదుపాయం. వ్యక్తిగత రుణం: సాధారణ ఆన్లైన్ డాక్యుమెంటేషన్ , ప్రాసెసింగ్‌తో రూ. 25 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు ఎడ్యుకేషన్ లోన్: ‘డాక్టర్ సెలెక్ట్ ఐస్మార్ట్ ఎడ్యుకేషన్ లోన్’ అని పిలిచే ఈ సదుపాయం ద్వారా కోటి రూపాయల వరకు రుణం. ఇంకా 50 లక్షల వరకు ఆటో లోన్సదుపాయం ‘ఫ్లెక్సీ ఈఎంఐ’ సౌలభ్యాన్ని కూడా వైద్యులకు అందుబాటులోఉంచినట్టు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆర్బీకేల స్థాయికి బ్యాంకింగ్ సేవలు
సాక్షి, అమరావతి: బ్యాంకింగ్ సేవలను ఆర్బీకేల స్థాయికి తీసుకు వచ్చేందుకు కలెక్టర్లు బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కౌలు రైతులకు నష్టం జరగకుండా కొత్త చట్టం తీసుకొచ్చామని, తద్వారా వారికి మేలు చేసే ప్రక్రియపై అవగాహన కలిగించాలని, వారికి రుణాలు వచ్చేలా చేయడం కలెక్టర్ల బాధ్యత అని స్పష్టం చేశారు. ఇ–క్రాపింగ్ అనేది చాలా ముఖ్యమని, ఇ–క్రాపింగ్ చేయకపోతే కలెక్టర్లు విఫలం ఆయ్యారని భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కనీసం 10 శాతం ఇ–క్రాపింగ్‌ను కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని, లేదంటే రైతులు నష్టపోతారన్నారు. స్పందనలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్ సన్నద్ధత, ఇ–క్రాపింగ్, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాపై జిల్లా అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇ– క్రాపింగ్ చాలా ముఖ్యం. వివాదంలో ఉన్న భూముల్లో పంట సాగు చేసినా.. ఇ–క్రాపింగ్ చేయాలి. లేదంటే రైతు నష్టపోతాడు. ఇ– క్రాపింగ్ పూర్తి స్థాయిలో చేయకపోతే.. కలెక్టర్ విఫలం అయ్యారని భావించవచ్చు. దిగువనున్న సిబ్బంది కూడా ఇ–క్రాపింగ్‌ను పర్యవేక్షించాలి. లేకపోతే సేవల్లో నాణ్యత ఉండదు. ఇ– క్రాపింగ్‌పై శిక్షణ కార్యక్రమం ఆర్బీకే లెవల్లో జూన్ 3 నుంచి 8 వరకు ఏర్పాటు చేశాం. ఎవరైనా మిస్ అయి ఉంటే తిరిగి శిక్షణ ఇప్పిస్తాం’ అని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. వ్యవసాయ సలహా మండలి ► ఆర్బీకేలు మొదలు మండల, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు కావాలి. వాటి సమావేశాలు కచ్చితంగా జరగాలి. ధర వచ్చే పంటలు, డిమాండ్ ఉన్న పంటలు వేయడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషించాలి. ► ఏ పంట వేయవచ్చు, ఏ వెరైటీ వేయకూడదన్న దానిపై కమిటీల సహాయంతో పంటల ప్రణాళిక వేసుకోవాలి. బోరుబావుల కింద, మెట్ట ప్రాంతాల్లో వరి వేయడం అన్నది చాలా రిస్క్. అలాంటి సందర్భాల్లో మంచి ఆదాయాలు వచ్చే పంటలను వారికి చూపించాలి. ► కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటలను, మెరుగైన ఆదాయాన్నిచ్చే పంటలను చూపించాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న వంగడాలపై రైతులకు చైతన్యం కలిగించాలి. అది రైతుకు, ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. కస్టమ్ హైరింగ్ సెంటర్లు.. హబ్స్ ► కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హబ్స్ అనేవి వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు దారి తీస్తాయి. స్థానిక రైతులకు అందుబాటు ధరల్లో యంత్రాలు సేవలు అందిస్తాయి. జిల్లా స్థాయిలో రైతులతో కమిటీలను ఏర్పాటు చేసి వారి సహకారంతో ఏ యంత్రాన్ని ఎంత ధరకు అద్దెకు ఇవ్వొచ్చన్నదానిపై నిర్ణయించాలి. ► జూలై 8న మొదటి విడతగా 3 వేల ఆర్బీకేల పరిధిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. అక్టోబర్‌లో 2వ విడత, జనవరిలో మూడో విడత కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందాలి ► రైతులకు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలే అందాలి. నకిలీలకు ఆస్కారం ఉండకూడదు. ఈ విషయంలో కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మిర్చి, పత్తి, తదితర పంటలకు సంబంధించి ప్రీమియం విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందించాలి. అప్పుడు రైతులకు మరింత భరోసా ఉంటుంది. బ్లాక్ మార్కెటింగ్ కూడా ఉండదు. ► విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు జరగాలి. డీలర్లు అమ్మే వాటిలో నాణ్యత ఉన్నాయా? లేదా? కచ్చితంగా పరిశీలించాలి. పోలీసుల సహకారంతో ఈ రెయిడ్స్ జరగాలి. అప్పుడే బ్లాక్ మార్కెటింగ్, కల్తీలకు మనం అడ్డుకట్ట వేయగలుగుతాం. ► కర్ఫ్యూ సమయంలో కూడా వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలు కొనసాగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ► నాణ్యత పరీక్షించిన ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు అందించాలి. ఎక్కడా కొరత రానీయొద్దు. కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో ఉంచాలి. పురుగు మందుల విషయంలో కచ్చితంగా నాణ్యత పరీక్షలు జరగాలి. రైతులకు భౌతిక రశీదు ► ఇ–క్రాపింగ్ వివరాల నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలి. మన అలసత్వం వల్ల రైతులకు నష్టం రాకూడదు. మనల్ని ప్రశ్నించే అవకాశం రైతులకు ఉండాలి. అందుకే ఇ–క్రాపింగ్‌పై ప్రతి రైతుకు డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్తోపాటు భౌతికంగా కూడా రశీదు ఇవ్వాలి. ఈ వివరాల ఆ«ధారంగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా వస్తుంది. ఈ విషయంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ► ఇ– క్రాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఎకరం, ప్రతి పంట వివరాలు నమోదు చేయాలి. హార్టికల్చర్ విషయంలో సీజన్‌తో సంబంధం లేకుండా ఇ–క్రాపింగ్ చేయాలి. -
అత్యవసరమైతేనే బ్యాంకులకు రండి
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్, కర్ఫ్యూ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను మంగళవారం నుంచి సవరిస్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రంలోని బ్యాంకింగ్ వేళలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరిమితం చేసింది. బ్యాంకుల కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేసినా.. లావాదేవీలకు మాత్రం 12 గంటల వరకే అనుమతించాలని ఎస్ఎల్బీసీ ఆదేశాలిచ్చింది. కర్ఫ్యూ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ఎల్బీసీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. ఆర్బీఐ, నాబార్డు ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్–19 కట్టడిలో భాగంగా ఖాతాదారులు సాధ్యమైనంత వరకు బ్యాంకులకు రాకుండా ఇతర ప్రత్యామ్నాయ విధానాలను వినియోగించుకోవాలని ఎస్ఎల్బీసీ విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని సూచించింది. ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్, యూపీఐ, బ్యాంక్ మిత్ర వంటి సేవలను వినియోగించుకోవడం ద్వారా కరోనా కట్టడికి కృషి చేయాలని కోరింది. బ్యాంకులు కూడా ఈ దిశగా ఖాతాదారులను ప్రోత్సహించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, వ్యాక్సినేషన్‌కు అర్హులైన ఉద్యోగుల జాబితాను పంపించాలని ఎస్ఎల్బీసీని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ కోరారు. -
ఇంటి ముంగిటే బ్యాంకింగ్ సేవలు
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలు (పీఎస్‌బీలు) కొత్త పుంతలు తొక్కనున్నాయి. కస్టమర్ తన పనుల కోసం బ్యాంకు శాఖ వరకు రావాల్సిన అవసరం ఉండదు. కాల్ చేస్తే చాలు.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ కస్టమర్ ఇంటికే వచ్చి కావాల్సిన పనులను చక్కబెట్టి వెళతారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కరోనా కాలంలో ఈ వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెడుతున్నాయి. ఇలా కస్టమర్ల ఇంటి వద్దే సేవలు అందించేందుకు గాను 12 ప్రభుత్వరంగ బ్యాంకులు కలసి ‘పీఎస్బీ అలయన్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోనుంది. వారి ద్వారానే బ్యాంకింగ్ సేవలను చేపట్టనున్నాయి. కరోనా వైరస్ కల్పిస్తున్న ఆటంకాల నేపథ్యంలో పీఎస్‌బీలు ఈ విధమైన ఆవిష్కరణతో ముందుకు రావడాన్ని అభినందించాల్సిందే. 12 పీఎస్‌బీల తరఫున ఒకే ప్రామాణిక నిర్వహణ విధానాన్ని పీఎస్బీ అలియన్స్ అనుసరించనుంది. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సేవలను సైతం కరస్పాండెంట్ల ద్వారా అందించనుంది. ఎస్బీఐ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంకు డిప్యూటీ సీఈవో రాజిందర్ మిరాఖుర్ను పీఎస్బీ అలియన్స్ సీఈవోగా నియమించడం కూడా పూర్తయింది. నమూనాపై కసరత్తు.. ‘‘నమూనాను ఖరారు చేసే పనిలో ఉన్నాము. వివిధ రకాల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవడం ద్వారా వారి టెక్నాలజీ, మానవవనరులను వినియోగించుకునే ఆలోచన ఉంది. లేదా సొంతంగా ఒక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా అన్ని పీఎస్‌బీల పరిధిలోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు దీన్ని వినియోగించుకునేలా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. దీనివల్ల అందరూ ఒకే వేదికపైకి వస్తారు’’ అని మిరాఖుర్ వివరించారు. అత్యతి టెక్నాలజీస్, ఇంటెగ్రా మైక్రోసిస్టమ్స్‌ను పీఎస్బీ అలయన్స్ నియమించుకుంది. రూ.14 కోట్ల మూలధనాన్ని బ్యాంకులు సమకూర్చాయి. 2010లో నిర్వహణ రిస్క్‌లను అధ్యయనం చేసేందుకు పీఎస్‌బీలు ‘కార్డెక్స్ ఇండియా’ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు దీన్నే పీఎస్బీ అలయన్స్గా పేరు మార్చడంతోపాటు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌ను మార్చి, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందులో చేర్చాయి. కార్డెక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులకు సైతం వాటా ఉండగా, వాటి వాటాలను వెనక్కిచ్చేశాయి. ‘‘పీఎస్‌బీలు అన్నీ కలసి ప్రమోట్ చేస్తున్న సంస్థ ఇది. విడిగా ఒక్కో బ్యాంకు 10 శాతానికి మించి వాటా కలిగి ఉండదు. ప్రస్తుతానికి ప్రతీ బ్యాంకు ఒక ప్రతినిధిని నియమించుకున్నాయి. రానున్న రోజుల్లో ఎంత మంది అవసరం అన్నది చూడాలి’’ అని మిరాఖుర్ చెప్పారు. ఖర్చులు ఆదా చేసుకోవడంతోపాటు ఎన్నో ప్రయోజనాలు పీఎస్బీ అలయన్స్ రూపంలో పొందొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘వనరులను చక్కగా వినియోగించుకోవచ్చు. ఉమ్మడిగా ఒకే విధమైన అవగాహన కలిగిన సిబ్బంది ఉండడం అనుకూలత. దీనివల్ల ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందొచ్చు’’ అని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ పేర్కొన్నారు. కస్టమర్ల ఇంటి వద్దే సేవలను అందించడం వల్ల బ్యాంకు శాఖలకు వచ్చే రద్దీని తగ్గించొచ్చని.. దీనివల్ల వైరస్ విస్తరణను నియంత్రించడంతోపాటు బ్యాంకు సిబ్బందికి ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టే వీలు ఏర్పడుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. కొన్ని బ్యాంకుల పరిధిలో.. ‘ప్రస్తుతం అయితే కొన్ని పీఎస్‌బీలు తమ పరిధిలోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకుని.. వారి ద్వారా కస్టమర్లకు ఇంటి వద్దే సేవలను అందిస్తున్నాయి. పీఎస్బీ అలయన్స్ ఏర్పాటుతో కరస్పాండెంట్లను అన్ని పీఎస్‌బీలు తక్కువ వ్యయాలకే వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది’ అని రాజిందర్ మిరాఖుర్ తెలిపారు. నాన్ ఫైనాన్షియల్ సేవలైన చెక్కులను తీసుకోవడం, అకౌంట్ నివేదిక ఇవ్వడం, టీడీఎస్ సర్టిఫికెట్, పే ఆర్డర్లను ప్రస్తుతానికి కస్టమర్లు ఇంటి వద్దే పొందే అవకాశం ఉంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను కూడా ఆర్డర్ చేసి ఇంటివద్దకే తెప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్ సేవల్లో నగదు ఉపసంహరణ సేవ ఒక్కటే అందుబాటులో ఉంది. నెట్ బ్యాంకింగ్ పోర్టల్, మొబైల్ యాప్, ఫోన్‌కాల్ రూపంలో ఇంటి వద్దకే సేవలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కో సేవకు రూ.88 చార్జీతోపాటు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసే చార్జీల్లో కొంత మేర కరస్పాండెంట్‌కు బ్యాంకులు చెల్లిస్తాయి. -
డిజిటల్‌కు సానుకూలం.. రికవరీకి ప్రతికూలం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్డౌన్ సమయం బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా దేశంలో వ్యవసాయ రంగానికి రుణాల మంజూరుపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. రుణాల రికవరీ దారుణంగా పడిపోయింది. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యం లేకపోవడం, భౌతికదూరం పాటించడం వంటి కారణాలతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై సానుకూల ప్రభావం పడింది. ఈ విషయాలు దేశ వ్యాప్తంగా జిల్లాల వారీగా నాబార్డు నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. కోవిడ్ లాక్డౌన్ సమయంలో వ్యవసాయ రంగానికి కిసాన్ క్రెడిడ్ కార్డులు, టర్మ్ రుణాల మంజూరు, రుణాల రికవరీ, డిజిటల్ బ్యాంకింగ్‌తో పాటు కనీస బ్యాంకింగ్ సేవలపై పడిన ప్రభావంపై జిల్లాల వారీగా నాబార్డు సర్వే నిర్వహించింది. బ్యాంకింగ్ సేవలపై ప్రభావం కొన్ని జిల్లాల్లో తీవ్రంగా ఉండగా కొన్ని జిల్లాల్లో మోస్తరుగా ఉంది. కొన్ని జిల్లాల్లో ఎటువంటి ప్రభావం చూపలేదు. లాక్డౌన్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో వ్యవసాయం, డెయిరీ, మత్స్యరంగం, ఉద్యానరంగంపై ప్రభావం పడింది. జీవనోపాధిపైన ప్రభావం చూపింది. దీంతో రైతులు రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంది. బ్యాంకుల రుణాల రికవరీపై దేశంలో 94 శాతం జిల్లాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపించింది. ► కిసాన్ క్రెడిడ్ కార్డులపై రైతులకు రుణాల మంజూరుపై దేశ వ్యాప్తంగా 59 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. మణిపూర్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభావం చూపింది. కేరళలో నూరు శాతం జిల్లాల్లో, అసోంలో 75, పశ్చిమ బెంగాల్లో 76, ఉత్తరప్రదేశ్‌లో 75, బిహార్‌లో 73, మహారాష్ట్రలో 71 శాతం జిల్లాల్లో రైతులకు రుణాల లభ్యతపై తీవ్ర ప్రభావం పడింది. ► కనీస బ్యాంకింగ్ సేవలైన డిపాజిట్లు, విత్‌డ్రాలపైన 50 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. ఛత్తీస్‌గడ్‌లో 78 శాతం, జార్ఖండ్‌లో 75 శాతం, మహారాష్ట్రలో 68 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం కనిపించింది. ► టర్మ్ రుణాల మంజూరుపై 89 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. లాక్డౌన్లో రాకపోకలపై ఆంక్షలు కారణంగా ప్రాజెక్టును సందర్శించేందుకు బ్యాంకు సిబ్బంది ఆసక్తి చూపకపోవడంతో పాటు ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొత్త పెట్టుబడులు, ప్రాజెక్టులు చేపట్టడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. చిన్న రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లలో వందశాతం, బిహార్, పంజాబ్, రాజస్థాన్‌లలో 95 శాతం, మహారాష్ట్రలో 94 శాతం, మధ్యప్రదేశ్‌లో 91 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. ► బ్యాంకింగ్ డిజిటల్ లావాదేవీలపై 63 శాతం జిల్లాల్లో సానుకూల ప్రభావం చూపింది. గతంలో డిజిటల్ లావాదేవీలు చేసేందుకు ఇష్టపడని వారు కూడా లాక్డౌన్ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు. దీనిపై అవగాహనలేనివారు కూడా ఇతరుల సహాయంతో చేశారు. కేరళలో 95 శాతం, పంజాబ్‌లో 91, రాజస్థాన్‌లో 90, హరియాణాలో 87, బిహార్‌లో 81 శాతం డిజిటల్ లావాదేవీలపై సానుకూల ప్రభావం నెలకొంది. -
కార్పొరేట్ బ్యాంకులతో చిక్కులు
దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై మూడు దశాబ్దాలు కావస్తుండగా ఇన్నాళ్లకు అసలు సిసలైన బ్యాంకింగ్ సంస్కరణలకు తెరలేచింది. ఈమధ్యే భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంతర్గత కార్యాచరణ బృందం కార్పొరేట్ సంస్థలు ప్రైవేటు బ్యాంకుల్ని తెరిచేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ సిఫార్సు చేసింది. వారు సమర్పించిన నివేదికపై వచ్చే ఏడాది జనవరి 15లోపు అన్ని వర్గాల అభిప్రాయాలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ అంటోంది. ఎన్డీఏ ప్రభుత్వం తొలి అయిదేళ్లలోనూ, ఈమధ్యకాలంలోనూ ఆర్థిక రంగ సంస్కరణలపై చూపిస్తున్న శ్రద్ధను గమ నించినవారికి తుది నిర్ణయం ఎలా వుండగలదో ఇప్పటికే అర్థమైంది. ఇది చివరకు బ్యాంకింగ్ రంగ ప్రైవేటీకరణకు కూడా దారితీయొచ్చన్నది కొందరు నిపుణుల విశ్లేషణ. ఈ నేపథ్యంలో అయిదు దశాబ్దాలక్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒకేసారి 14 బ్యాంకుల్ని జాతీయం చేయడానికి దారితీసినప్పటి పరిస్థితులను మాత్రమే కాదు... రెండేళ్లక్రితం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్)కు, పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కి, నిరుడు యస్ బ్యాంకుకు, ఈమధ్య లక్ష్మీ విలాస్ బ్యాంకుకు ఏమైందో కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ తీసుకున్న రూ. 91,000 కోట్ల రుణాలకు అది కనీసం వడ్డీ కూడా కట్టలేని స్థితికి చేరుకుని చతికిలబడినప్పుడు ఆ పరిణామాన్ని ‘మినీ లేమాన్ బ్రదర్స్ సంక్షోభం’గా నిపుణులు అభివర్ణించారు. ఇక యస్ బ్యాంకు కథ కూడా ఇలాంటిదే. 2004లో ప్రారం భమైన ఆ బ్యాంకు చకచకా ఎదిగింది. రేటింగ్ సంస్థల నుంచి ఎప్పటికప్పుడు మంచి మార్కులు కొట్టేసింది. çపదిహేనేళ్లు గడిచేసరికి అంతా తారుమారయింది. దాని పారుబాకీలు రూ. 17,134 కోట్లకు చేరుకున్నాయి. అది మునుగుతూ పలు సంస్థలనూ, బాండ్లు కొన్నవారిని, డిపాజిట్‌దార్లను ముంచేసింది. ఇక నీరవ్ పుణ్యమా అని పీఎన్బీ భారీ స్కాంలో కూరుకుపోయింది. తగిన హామీలేమీ లేకుండానే అతగాడికి రూ. 11,357 కోట్లు సమర్పించుకుంది. కనుక ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటు విషయంలో అతి జాగ్రత్తగా అడుగులేయాలన్నది నిపుణుల హెచ్చరిక. ఆర్బీఐ ఇంతక్రితం 2001లోనూ, 2013లోనూ ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పర్యవసానంగా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీవంటి ప్రైవేటు బ్యాంకులొచ్చాయి. అయితే కార్పొరేట్ దిగ్గజాలు ఈ రంగంలోకి రాకుండా కట్టుదిట్టమైన నిబంధనలు విధించారు. ఇందుకు కారణం కూడా చెప్పారు. పారిశ్రామిక సంస్థలు బ్యాంకులు ప్రారంభిస్తే అవి సులభంగా ఆ బ్యాంకులనుంచి రుణాలు తీసుకోగలవు. ఎందుకు తీసుకుంటున్నారని వాళ్లను ప్రశ్నించేవారుండరు. పారిశ్రామికవేత్తే తమ యజమాని అయినప్పుడు బ్యాంకు నిర్వాహకులు వారిని ప్రశ్నించే సాహసం ఎలా చేస్తారు? ఈ ప్రశ్నలు గాల్లోంచి పుట్టుకురాలేదు. స్వాతంత్య్రానంతరం కొన్ని భారీ పారిశ్రామిక సంస్థలు ఇలాగే కావలసినప్పుడల్లా తమ సొంత బ్యాంకుల నుంచి తరచుగా రుణాలు తీసుకుని ఆ బ్యాంకుల్ని దివాళా తీయించాయి. ఇప్పుడు తాజాగా ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందం ఆ చరిత్రను దృష్టిలో పెట్టుకున్న దాఖలా కనిపించడం లేదు. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్యలు దీనిపైనే ప్రశ్నలు సంధించారు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరే అన్నదాంతో వారు ఏకీభవించలేదు. ఇప్పుడు అంతకన్నా ప్రమా దకర పరిస్థితులున్నాయన్నది వారి అంచనా. వారి దృష్టిలో కేవలం ఆ సంస్థలు జనం దగ్గరనుంచి సేకరించే డిపాజిట్ల మొత్తంనుంచి సొంతానికి రుణాలు తీసుకోవడం ఒక్కటే సమస్య కాదు. వాటి రాకడ పెత్తందారీ ఆశ్రిత పెట్టుబడిదారీ పోకడలకు దారితీస్తుందన్నది వారి ఆందోళన. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే సకాలంలో గుర్తించి సరిచేయడానికి నియంత్రణ వ్యవస్థ అమల్లో వుంటుందన్న వాదనతో వారు ఏకీభవించలేదు. రాజన్, ఆచార్యల వాదనలు కొట్టివేయదగ్గవి కాదు. అందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిలే ఉదాహరణ. ప్రతి బ్యాంకు బోర్డు లోనూ రిజర్వ్‌బ్యాంకు ప్రతినిధి వుంటారు. ఏ బ్యాంకు కార్యకలాపాలు ఏవిధంగా వున్నాయన్నది వారు గమనిస్తూ వుండాలి. కానీ బ్యాంకుల రుణ వితరణలో రాజకీయ జోక్యం పెరుగుతున్నా, పర్యవసానంగా బ్యాంకు నిండా మునిగే పరిస్థితి ఏర్పడినా ఆర్బీఐ రంగంలోకి దిగి అడ్డుకున్న దాఖలా లేదు. పారు బాకీలు పెరిగిపోయి, మూలధన కొరత, విస్తరణ సాధ్యపడక అవి నీరసిం చాయి. ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరాగా ఆదుకోవడమే తప్ప, వాటంతటవి నిలబడిన ఆచూకీ లేదు. గత కొన్నేళ్లుగా పారు బాకీల లెక్కలు పక్కనపడేసి, ఆ ఏడాది ఆర్థిక కార్యకలాపాలను మాత్రమే చూపి బ్యాంకులకు లాభాలొచ్చినట్టు అంకెలు చూపుతున్నారు. వాస్తవానికి ఆ పారు బాకీలన్నీ బహిరంగపరిస్తే దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో వున్న వైనం కళ్లకు కడుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే బ్యాంకులను పర్యవేక్షించే నియంత్రణ వ్యవస్థ అందుకు భిన్నంగా ఏం చేయగలుగుతుంది? ఎన్ని లోటుపాట్లున్నా మన బ్యాంకింగ్ వ్యవస్థకు మంచి పేరే వుండేది. కానీ అదంతా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, మరో నాలుగు బ్యాంకులు చతికిలబడటానికి ముందు. బ్యాంకుల వైఫల్యం అంతకంతకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ కొత్త మార్గం ఎంతవరకూ శ్రేయస్కరమో పాలకులు ఆలోచించాలి. కార్పొరేట్ దిగ్గజాలు బ్యాంకులు ప్రారంభిస్తే మొదట్లో అవి జనాన్ని ఆకర్షిస్తాయి. డిపాజిట్లు వెల్లువలా వస్తాయి. కానీ రకరకాల రూపాల్లో నియంత్రణ వ్యవస్థల కన్నుగప్పి సొంత ప్రయోజనాలకు భారీ మొత్తాలు మళ్లించుకుంటే...ఆనక ఆ బ్యాంకులు దివాళా తీస్తే ప్రజానీకం తీవ్రంగా నష్టపోతారు. కనుక ఈ విషయంలో ఆచితూచి అడుగేయడమే ఉత్తమమని కేంద్రం, ఆర్బీఐ గుర్తిస్తే మంచిది. -
కొత్తగా 14వేల మంది కరస్పాండెంట్ల నియామకం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో భాగంగా తన బ్యాంకింగ్ కరస్పాండెట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని యోచిస్తోంది. దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి కస్టమర్‌కు ఉత్తమ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ అధికారి సమిత్ భగత్ పేర్కొన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న 11వేల మంది కరస్పాండెట్లకు మరో అదనంగా 14వేల మందిని నియమిస్తామని తెలిపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని వారు కొత్త ఖాతాను తెరవడం, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, పేమెంట్ ప్రొడెక్ట్‌లు, లోన్ క్లోజింగ్ లాంటి సదుపాయాలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చని ఆమె వివరించారు. అలాగే కరస్పాండెంట్ల వ్యవస్థను మరింత బలపరించేందుకు, విస్తరించేందుకు ప్రభుత్వ కామన్ సర్వీసు సెంటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకునే యత్నాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
ఆర్థిక పునరుత్తేజంలో బ్యాంకులే ఆయుధం
ముంబై: ఆర్థిక పునరుత్తేజంలో బ్యాంకులదీ కీలక పాత్ర అని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి పీఎస్బీ అలయెన్స్ కార్యక్రమాన్ని బుధవారం ఆమె ఆవిష్కరించారు. ప్రజలకు మరింత చేరువకావడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడారు. బ్యాంకింగ్ తమ వ్యాపార కార్యకలాపాలతో పాటు ఆర్థికవృద్ధి, సంక్షేమం పట్ల కూడా దృష్టి కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. ‘‘ రుణాలు ఇవ్వడం... తద్వారా డబ్బు సంపాదించడం. ఇది మీ చట్టబద్ధమైన కార్యక్రమం. దీనిని మీరు మర్చిపోవక్కర్లేదు. మీరు మీ విధిని నిర్వహించాల్సిందే. అయితే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావడంపైనా బ్యాంకింగ్ దృష్టి పెట్టాలి’’ అని ఆమె అన్నారు. ప్రైవేటు బ్యాంకుల సహకారం అవసరం ప్రభుత్వ పథకాలు విజయవంతం కావడానికి ప్రైవేటు రంగంలోని బ్యాంకులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని ఆర్థికమంత్రి అన్నారు. బ్యాంకుల ద్వారా అమలు జరిగే ప్రభుత్వ పథకాల వివరాలు అన్నింటినీ సిబ్బంది తెలుసుకోవాలని ఆమె అన్నారు. ‘‘పలు పథకాలను కేంద్రం మీ ద్వారానే ప్రజలకు అందిస్తుంది. అందువల్ల ఈ పథకాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవడమూ మీ బాధ్యతే. ఉద్యోగులకు సంబంధించి ప్రతి స్థాయిలో ఆయా అంశాలను తెలుసుకుంటారని భావిస్తున్నా’’ అని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా అన్నారు. తద్వారా ప్రభుత్వ పథకాలు పొందాలనుకునే ప్రజలకు బ్యాంకింగ్ మరింత చేరువవుతుందన్నారు. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకింగ్ సేవల విస్తరణకు ఉద్దేశించిన పీఎస్బీ అలయెన్స్ కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా కూడా చిత్రంలో ఉన్నారు -
ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) నుంచి మరో వినూత్న సేవను అందించేందుకు వ్యవసాయ శాఖ సంకల్పించింది. రైతులకు బ్యాంకింగ్ సేవలను సైతం ఆర్బీకేల నుంచి అందించడానికి కృషి చేస్తోంది. ఈమేరకు వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన ముసాయిదాను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్రాథమిక అవగాహన కూడా కుదిరింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే ఆర్బీకేల నుంచి సేవలు ప్రారంభించనున్నారు. అన్నదాతలకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ కొత్త ఆలోచన మరో తార్కాణం అని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. పరపతి (క్రెడిట్) సౌకర్యం లేకనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ పలు కమిటీలు చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రానికి నివేదించిన అంశాలు ► వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే క్రమంలో భాగంగా రాష్ట్రంలో గత నెల 30న సీఎం వైఎస్ జగన్ 10,641 ఆర్బీకేలను ప్రారంభించారు. ► ఆర్బీకేలలో గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ), గ్రామ ఉద్యాన సహాయకులు (వీహెచ్ఏ), విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ (వీఎస్ఏ) కీలకపాత్ర పోషిస్తారు. ► వ్యవసాయానికి అవసరమైన అన్నింటిని రైతు ఇంటి ముంగిటే అందించడం ఆర్బీకేల ఉద్దేశం. ఈ క్రమంలో బ్యాంకింగ్ సేవల్ని సైతం రైతుకు తన సొంత గ్రామంలోనే అందించాలని ప్రతిపాదిస్తున్నాం. ► బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందించే సేవలు.. ఆర్బీకేల్లో వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏలు అందించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాం. రైతులు, బ్యాంక్ బ్రాంచ్‌ల మధ్య వారు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ► క్రెడిట్ కోసం బ్యాంక్‌కు సమర్పించడానికి వీలుగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో దరఖాస్తు ఫారాలను నింపడానికి సహకరిస్తారు. పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. ► రూపే కిసాన్ క్రెడిట్ కార్డు జారీకి అవసరమైన ఆధార్ కార్డుల అనుసంధానానికి, కొత్త కార్డుల జారీకి, కేసీసీ పునరుద్ధరణకు దరఖాస్తు ఫారాలు ఆర్బీకేలలో అందుబాటులో ఉంచవచ్చు. ► పీఎంజేడీవై, పీఎంఎస్బీవై, ఏపీవై పథకాలలో నమోదుకు అర్హులైన రైతుల నుంచి సమ్మతి పత్రాలను సేకరించడానికి అనుమతించవచ్చు. అర్హత ఉన్న రైతులందరికీ లబ్ధి చేకూరేలా చూడవచ్చు. ► అర్హులైన వారికి రైతు భరోసా డబ్బు జమ కాకపోతే.. ఆ రైతుల తరఫున బ్యాంకులకు కావాల్సిన పత్రాలను సమర్పించవచ్చు. ► రుణాల రికవరీలో వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏలు బ్యాంకులకు సహాయం చేస్తారు. ► తనిఖీ కోసం బ్యాంకర్లు తమ రుణగ్రహీతల జాబితాలను వారికి అందజేయవచ్చు. ► అన్ని రకాల వ్యవసాయ రుణాలను సమీక్షించేందుకు (క్వాంటిటేటివ్) బ్యాంకులు తమకు బకాయి ఉన్న వారి వివరాలను వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏలతో పంచుకోవచ్చు. ► ఆర్బీకే సిబ్బందికి బ్యాంకులు ఓ సమయాన్ని కేటాయిస్తే ఇతర ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పని పూర్తికి వీలు కల్పించవచ్చు. ► బ్యాంక్ మిత్రలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు తమ సేవలను ఆర్బీకేల నుంచి సాగించవచ్చు. వారే అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి సందేహాలు తీర్చవచ్చు. అవసరమైన సేవల్ని అందించవచ్చు. ► నిర్దేశిత సమయంలో బ్యాంక్ అధికారులు ఆర్బీకేకు వెళితే ఆ గ్రామ రైతులతో భేటీ అయి బ్యాంకింగ్ సమస్యలన్నింటినీ అక్కడికక్కడే పరిష్కరించవచ్చు. పరపతి లక్ష్యాలను చేరుకునేందుకు వేదికలుగా ఆర్బీకేలను ఉపయోగించుకోవచ్చు. ► ఇలా చేయడం వల్ల బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ రైతులకు తప్పుతుంది. రుణాల జాప్యాన్ని నివారించవచ్చు. అర్హులైన వారందరికీ రుణాలు ఇచ్చి పంటల సాగుకు తోడ్పడవచ్చు. రైతులకు సేవలందించే క్రమంలో బ్యాంకర్లు ఆర్బీకే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. రుణాలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించేందుకే.. రైతులకు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న ఆలోచనల్లో భాగంగా వారి ఇంటి ముంగిటే బ్యాంకింగ్ సేవలు అందించాలన్న ప్రతిపాదన వచ్చింది. రైతుల్లో చాలా మందికి బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఉండదు. ఆ అంశాలపై అవగాహన కల్పించి త్వరితగతిన సేవలు అందిస్తే రైతులు తమ ఊరికి దూరంగా ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి సమయాన్ని వృథా చేసుకునే అవసరం ఉండదు. దరఖాస్తు ఫారాలను నింపడానికి ఇతరుల సహకారం తీసుకునే పని ఉండదు. ఆధార్ అనుసంధానం కాలేదన్న సాకుతో రుణాలో, ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయమో సకాలంలో అందలేదన్న ఫిర్యాదులు లేకుండా చేయొచ్చు. రుణాలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించే కృషిలో భాగంగా ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది. – కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి -
యస్పై మారటోరియం ఎత్తివేత
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ 13 రోజుల తర్వాత మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటపడింది. బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకింగ్ వేళలను కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం మార్చి 19 నుంచి 21 దాకా ఉదయం 8.30 గం.లకే శాఖలు తెరుచుకుంటాయి. సీనియర్ సిటిజన్ ఖాతాదారుల కోసం మార్చి 19 నుంచి 27 దాకా సాయంత్రం 4.30 గం.ల నుంచి 5.30 గం.ల దాకా సేవలు అందిస్తాయి. అయితే, సేవలు పునరుద్ధరించిన కాస్సేపటికే మొబైల్ యాప్ క్రాష్ కావడం, వెబ్సైట్ పనిచేయకపోవడంతో ఖాతాదారులు అసహనానికి లోనయ్యారు. సోషల్ మీడియాలో బ్యాŠంక్ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సమస్యలిక పడలేమని, తాము డిపాజిట్లను మరో బ్యాంకుకు మార్చేసుకుంటామని సూచిస్తూ పలువురు పోస్ట్ చేశారు. దీంతో ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి యస్ బ్యాంక్ క్షమాపణలు కోరింది. సమస్యను సత్వరం పరిష్కరిస్తున్నామని పేర్కొంది. మార్చి 5 నుంచి నెలరోజులపాటు యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ మారటోరియం విధించడం, ఈ వ్యవధిలో రూ. 50,000కు దాటకుండా విత్డ్రాయల్స్పై ఆంక్షలు విధించడం తెలిసిందే. ఎస్బీఐ సహా ఇతరత్రా బ్యాంకులు.. యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేయడంతో మారటోరియం తొలగింది. మరోవైపు, యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌పై మనీ లాండరింగ్ కేసులో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి భయాలను ఇందుకు కారణంగా వారు చూపారు. ఇండస్ఇండ్ బ్యాంకు పటిష్టంగానే ఉంది బ్యాంకు యాజమాన్యం ప్రకటన న్యూఢిల్లీ: ఆర్థికంగా బలమైన స్థితిలో, తగినన్ని నిధులతో, లాభాలతో, బలమైన నిర్వహణతో నడుస్తున్నట్టు ఇండస్ఇండ్ బ్యాంకు ప్రకటించింది. యస్ బ్యాంకు సంక్షోభం అనంతరం ఇండస్ఇండ్ బ్యాంకు ఆర్థిక సామర్థ్యంపై పెద్ద స్థాయిలో మార్కెట్ వదంతులు, ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. డిసెంబర్ త్రైమాసికం నాటికి బ్యాంకు స్థూల ఎన్పీఏలు 2.18%గా ఉన్నాయని, పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఇది తక్కువగా ఉందని తెలిపింది. ‘‘క్రితం త్రైమాసికం స్థాయిలోనే స్థూల ఎన్పీఏలు ప్రస్తుత త్రైమాసికంలోనూ ఉండొచ్చు. అలాగే, క్రితం త్రైమాసికం నాటికి 1.05%ఉన్న నికర ఎన్పీఏలు ప్రస్తుత త్రైమాసికంలో 1%లోపునకు తగ్గనున్నాయి’’ అని బ్యాంకు తన ప్రకటనలో వివరించింది. ఫిబ్రవరి నాటికి వాణిజ్య, నివాస రియల్టీ, జెమ్స్, జ్యుయలరీ రంగాలకు ఎక్స్పోజర్ లేదని స్పష్టం చేసింది. -
కొనసాగుతున్న భారత్ బంద్.. విజయవాడలో ఉద్రిక్తత
నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 ప్రధాన కార్మిక సంఘాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పలు చోట్ల బంద్ ప్రారంభమైంది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యతిరేకంగా ఈ సమ్మె జరగనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్‌లో దాదాపు 25 కోట్ల మంది దాకా పాల్గొంటున్నారని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. విజయవాడ: విజయవాడలో బంద్ కొనసాగుతోంది. బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై వామపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్ చేపట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ఎన్ఆర్సీ, సీఏఏ ,అలాగే కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని కేంద్రంలోని బీజేపీకి కాలం చెల్లిందాని ఆందోళన కారులు నిరసన తెలియజేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో వామపక్ష నేతలతో పాటు కార్మిక సంఘాలు కదంతొక్కాయి. ఉదయం 6 గంటల నుంచి కార్మికులంతా సమ్మెలో పాల్గొని నిరసనలు తెలిపారు. కేంద్రం.. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్‌కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో విద్యాలయాలకు, వ్యాపార సంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. బస్టాండ్ వద్ద వామపక్ష పార్టీ నేతలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. బీఎస్ఎన్ఎల్, రైల్వేస్, పోస్ట్ ఆఫీస్ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వామపక్ష నేతలు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్నారు. మంచిర్యాల/ భద్రాద్రి/ పెద్దపల్లి: మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లో సింగరేణి కార్మికులు రోడ్డెక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మెకు దిగారు. నిరసన చేపట్టిన కార్మిక నాయకులు గనుల్లోకి వచ్చేందుకు ప్రత్నించడంతో పోలీసులువారి అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, కార్మిక నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు.