న్యూఢిల్లీ: ‘యూ ఓన్లీ నీడ్ వన్ (యోనో)’ యాప్ ద్వారా కాగిత రహిత బ్యాంక్ ఖాతాలను తెరిచే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ నిర్ణయించింది. ఆధార్ వినియోగంపై పరిమితులు విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. డిజిటల్ అకౌంట్లను తెరవడానికి ప్రత్యామ్నాయ పరిష్కార సాధనాల వినియోగంపై స్పష్టతనివ్వాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్‌ను కోరినట్లు వివరించారు.
బ్యాంకింగ్ సేవలు మొదలైనవి పొందడానికి ఆధార్ నంబరును అనుసంధానం చేయడం తప్పనిసరేమీ కాదంటూ సెప్టెంబర్ 26న సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎలక్ట్రానిక్ పద్ధతిలో గుర్తింపు ధృవీకరణ (ఈ–కేవైసీ) కుదరని పరిస్థితి నెలకొంది. 2017 నవంబర్‌లో ప్రారంభించిన డిజిటల్ ప్లాట్‌ఫాం ‘యోనో’ ద్వారా బ్యాంకు శాఖకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఖాతాను తెరవడం నుంచి అన్ని రకాల ఆర్థిక సేవలను పొందే వెసులుబాటును ఎస్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment