ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం | Here is what Modi ministries did for you past year | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం

Published Wed, May 27 2015 12:42 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం - Sakshi

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం

ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించాం...
* ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు మరిన్ని చర్యలు...
* ఏడాది పాలనపై బహిరంగ లేఖలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: దారీతెన్నూలేని ఆర్థిక వ్యవస్థను తమ ప్రభుత్వ ఏడాది పాలనలో చక్కదిద్దామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించిన ఘనత కూడా తమదేనని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న భారీ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు చేపడతామని ప్రధాని హామీనిచ్చారు.

ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మోదీ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో ఈ ఆర్థికపరమైన అంశాలను ప్రస్తావించారు. ‘మా ప్రభుత్వ హయాంలో ఎకానమీ పునరుత్తేజితమైంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ద్రవ్యలోటును అదుపులోకి తీసుకొచ్చాం. విదేశీ పెట్టుబడులు పెరిగాయి. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారత్‌పై సానుకూల ధోరణిని అనుసరించేలా చేయగలిగాం’ అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.
 
పెండింగ్ సంస్కరణలకు మోక్షం...
తాము అధికారంలోకి వచ్చాకే డీజిల్ ధరలపై నియంత్రణల తొలగింపు... బీమా, రక్షణ వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి పెంపు వంటి పెండింగ్‌లో ఉన్న పలు సాహసోపేతమైన సంస్కరణలకు ఆమోదముద్ర వేశామని ప్రధాని పేర్కొన్నారు.  వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లో పురోగతి సాధించామన్నారు. ‘నవ భారత్ నిర్మా ణం, గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం కోసం మీరంతా(ప్రజలు) నమ్మకంతో ఏడాది క్రితం నాకు పట్టంగట్టారు.

ఈ దిశగా మేమెంతో ప్రగతి సాధించాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. 2014-15లో 7.4%గా నమోదైన జీడీపీ వృద్ధి రేటు(బేస్ ఇయర్ మార్పు తర్వాత) ఈ ఏడాది 8%పైగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కిరప్పించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయడమే కాకుండా.. పార్లమెంటులో దీనికి సంబంధించి చట్టాన్ని కూడా తీసుకొచ్చామని ప్రధాని వివరించారు.
 
మోదీ ఇంకా ఏం చెప్పారంటే..

* అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన కోసం ప్రారంభించిన జన ధన యోజన పథకం ద్వారా 15 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిపించాం. దీనిద్వారా రూ.15,800 కోట్ల విలువైన డిపాజిట్లు ఖాతాల్లో జమయ్యాయి.
* సామాజిక భద్రతకోసం ఉద్దేశించిన పెన్షన్, జీవితబీమా, ప్రమాద బీమా స్కీమ్‌లలో తొలి వారం రోజుల్లోనే 6.75 కోట్లమంది చేరారు.
* ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న వ్యాపారవేత్తలకు తగిన రుణ సదుపాయం అందించేందుకు రూ.20,000 కోట్లతో ముద్రా బ్యాంక్‌ను నెలకొల్పాం.
* లక్షలాది కొత్త కొలువుల సృష్టే లక్ష్యంగా ‘మేక్ ఇన్ ఇండియా’కు రూపకల్పన చేశాం. భారత్‌ను వ్యాపారాలకు అత్యంత అనువైన దేశంగా మార్చడంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాం.
* వంటగ్యాస్ ఇతరత్రా ప్రభుత్వ సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి చేర్చేలా తగిన చర్యలు తీసుకున్నాం.
* దేశాభివృద్ధిలో రాష్ట్రాలకు తగిన భాగస్వామ్యం కల్పించేలా ‘టీమ్ ఇండియా’ భావనను పెంపొ ందిస్తున్నాం. బొగ్గు గనుల వేలాన్ని పారదర్శకంగా నిర్వహించడం కోసం మైనింగ్ చట్టంలో మార్పులు చేయడమేకాకుండా దీనిద్వారా లభిం చనున్న రూ.3.35 లక్షల కోట్ల ఆదాయాన్ని సంబంధిత రాష్ట్రాలకు అందిస్తున్నాం.
* నిలిచిపోయిన హైవే ప్రాజెక్టులను పునరుద్ధరించాం. మా హయాంలోనే విద్యుత్‌ఉత్పత్తి ఆల్‌టైమ్ గనిష్టానికి చేరింది. ఏటా రూ.20 వేల కోట్ల ప్రభుత్వ నిధులను అందిచేలా కొత్తగా జాతీయ మౌలికరంగ పెట్టుబడి ఫండ్‌ను నెలకొల్పాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement