పేమెంట్ బ్యాంకులు మాకొద్దు! | Payment banks to have initial corpus of Rs800 cr: Ravi Shankar Prasad | Sakshi
Sakshi News home page

పేమెంట్ బ్యాంకులు మాకొద్దు!

Published Tue, May 31 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

పేమెంట్ బ్యాంకులు మాకొద్దు!

పేమెంట్ బ్యాంకులు మాకొద్దు!

లైసెన్సులు పొంది కూడా వెనక్కెళుతున్న సంస్థలు
ఇప్పటికే మూడు కంపెనీలు వెనకబాట
ఇక మిగిలినవి 8 కంపెనీలే
లాభదాయకత సమస్యలే కారణం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చే మహత్తర లక్ష్యంతో చాన్నాళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఈ మధ్య మళ్లీ కొత్త బ్యాంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే చిన్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసుకోవటానికి పచ్చజెండా ఊపింది. మైక్రోఫైనాన్స్ సంస్థలు మొదలుకుని రిలయన్స్ నుంచి బిర్లాల దాకా పెద్ద పెద్ద కంపెనీలు సైతం పోటీపడి మరీ వీటి లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 41 కంపెనీలు పోటీ పడితే చివరకు గతేడాది ఆగస్టులో 11 సంస్థలు పేమెంటు బ్యాంకు అనుమతుల్ని దక్కించుకున్నాయి. అయితే, ఇంత పోటీపడి అనుమతులు దక్కించుకున్నప్పటికీ ...  తీరా ఏర్పాటు చేసే సమయం వచ్చేసరికి ఒక్కొక్క సంస్థ వెనక్కి జారుకుంటోంది.

అన్నింటికన్నా ముందుగా ఈ ఏడాది మార్చిలో చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ సంస్థ తమకు పేమెంట్ బ్యాంకు లెసైన్స్ వద్దంటూ వెనక్కెళ్లిపోయింది. రెండు నెలల తర్వాత ఈ మే నెల్లో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కన్సార్షియం కూడా పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించాయి. పెద్ద ఎత్తున విస్తరించేందుకు సంఖ్యాపరంగా తమకు తగినన్ని శాఖలు/కార్యాలయాలు లేవని ప్రమోటర్లు భావించడమే ఇందుకు కారణంగా ఈ సంస్థలు చెప్పాయి. ఇక తాజాగా ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా సైతం తప్పుకుంది. మహీంద్రా ఫైనాన్స్‌తో కలిసి అక్టోబర్-నవంబర్ నాటికల్లా పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని కసరత్తు చేసినప్పటికీ... అధిక పోటీ, ఒత్తిళ్లు తదితర అంశాల వల్ల ఈ రంగంలో లాభాలు రావటానికి చాలా సమయం పడుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ చెప్పారు. తాము ఎంతో కష్టపడి మదింపు చేసి మరీ ఎంపిక చేసిన సంస్థలు ఇలా ఒక్కొక్కటిగా వైదొలుగుతుండటంతో ఆర్‌బీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

 ఎందుకిలా తిరుగు టపా!!
మొదట్లో అంత స్పష్టంగా వెల్లడించకపోయినా... రానురాను పేమెంటు బ్యాంకులకున్న పరిమితులన్నీ బయటపడ్డాయి. ఈ బ్యాంకులు రూ.1 లక్ష వరకూ మాత్రమే డిపాజిట్లు స్వీకరించే అవకాశం ఉంటుంది. దీనికితోడు ఎవ్వరికీ రుణాలివ్వటానికి వీలుండదు. క్రెడిట్ కార్డులు కూడా జారీ చేయకూడదు. వీటన్నిటికీ తోడు ఈ బ్యాంకులు తాము సేకరించే నిధుల్లో 75 శాతం నిధుల్ని ప్రభుత్వ బాండ్లలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మిగతా డబ్బును లిక్విడిటీ అవసరాల కోసం తమ వద్ద అట్టే పెట్టుకోవచ్చు. రుణాలెలా ఇవ్వవు కాబట్టి మొండి బకాయిల సమస్యా ఉండదు. అయితే, డిపాజిట్లను ఆకర్షించేందుకు అవి ఎంతో కొంత వడ్డీ రేటయితే చెల్లించక తప్పదు కదా!!. ఇక్కడే అసలు సమస్య వచ్చేది.

ఏడాది మెచ్యూరిటీ వ్యవధి ఉండే ప్రభుత్వ బాండ్ల విషయం చూస్తే ప్రస్తుతం సుమారు ఏడు శాతం పైచిలుకు మాత్రమే రాబడి ఉంటోంది. మరోవైపు, ఇతర బ్యాంకులతో పోటీ పడాలంటే ఈ పేమెంటు బ్యాంకులు డిపాజిట్లపై ఎంత లేదన్నా నాలుగు నుంచి ఆరున్నర శాతమైనా వడ్డీ రేటు ఇస్తే కానీ ఖాతాదారులు ముందుకు రారు. అంటే నికరంగా వాటికి అర శాతం నుంచి ఒక్క శాతం మాత్రమే మార్జిన్ ఉంటుంది. నిర్వహణ ఖర్చులన్నీ కూడా ఈ కాస్త మొత్తంలోనే చూసుకోవాలి. అది సాధ్యం కావాలంటే ఖాతాదారులు, లావాదేవీల సంఖ్య భారీగా ఉండటం తప్పనిసరి.

ఇతరత్రా బిల్లు పేమెంట్లు వంటివాటిపై చార్జీలు వసూలు చేసుకునే వీలున్నప్పటికీ... ఆరంభంలోనే వడ్డించడం మొదలుపెడితే కస్టమర్లు రారు. కాబట్టి ప్రారంభ దశలో కొన్నాళ్లైనా కొన్ని సేవలు ఉచితంగానే అందించక తప్పదు. ఇవన్నీ చూసుకుంటే సదరు బ్యాంకులు బ్రేక్ ఈవెన్ (లాభనష్ట రహిత స్థితి) సాధించాలన్నా కనీసం మూడు నుంచి అయిదేళ్ల కాలం పట్టేస్తుందని అంచనా. కోట్ల కొద్దీ కస్టమర్లు... భారీ నెట్‌వర్క్ ఉన్న టెలికం కంపెనీలు, పోస్టల్ విభాగం మొదలైన వాటికి ఈ పేమెంట్ బ్యాంకులు ప్రయోజనకరంగా ఉండగలవని విశ్లేషకుల అభిప్రాయం.

బరిలో మిగిలినవి..
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా నువో (ఐడియా సెల్యులార్), ఎయిర్‌టెల్, వొడాఫోన్, పోస్టల్ శాఖ, ఫినో పేటెక్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డీఎల్), విజయ్ శేఖర్ శర్మ (పేటీఎం వ్యవస్థాపకుడు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement