కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: బ్యాంకింగ్ సేవలను ఆర్బీకేల స్థాయికి తీసుకు వచ్చేందుకు కలెక్టర్లు బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కౌలు రైతులకు నష్టం జరగకుండా కొత్త చట్టం తీసుకొచ్చామని, తద్వారా వారికి మేలు చేసే ప్రక్రియపై అవగాహన కలిగించాలని, వారికి రుణాలు వచ్చేలా చేయడం కలెక్టర్ల బాధ్యత అని స్పష్టం చేశారు. ఇ–క్రాపింగ్ అనేది చాలా ముఖ్యమని, ఇ–క్రాపింగ్ చేయకపోతే కలెక్టర్లు విఫలం ఆయ్యారని భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కనీసం 10 శాతం ఇ–క్రాపింగ్‌ను కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని, లేదంటే రైతులు నష్టపోతారన్నారు. స్పందనలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖరీఫ్ సన్నద్ధత, ఇ–క్రాపింగ్, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాపై జిల్లా అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇ– క్రాపింగ్ చాలా ముఖ్యం. వివాదంలో ఉన్న భూముల్లో పంట సాగు చేసినా.. ఇ–క్రాపింగ్ చేయాలి. లేదంటే రైతు నష్టపోతాడు. ఇ– క్రాపింగ్ పూర్తి స్థాయిలో చేయకపోతే.. కలెక్టర్ విఫలం అయ్యారని భావించవచ్చు. దిగువనున్న సిబ్బంది కూడా ఇ–క్రాపింగ్‌ను పర్యవేక్షించాలి. లేకపోతే సేవల్లో నాణ్యత ఉండదు. ఇ– క్రాపింగ్‌పై శిక్షణ కార్యక్రమం ఆర్బీకే లెవల్లో జూన్ 3 నుంచి 8 వరకు ఏర్పాటు చేశాం. ఎవరైనా మిస్ అయి ఉంటే తిరిగి శిక్షణ ఇప్పిస్తాం’ అని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
వ్యవసాయ సలహా మండలి
► ఆర్బీకేలు మొదలు మండల, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు కావాలి. వాటి సమావేశాలు కచ్చితంగా జరగాలి. ధర వచ్చే పంటలు, డిమాండ్ ఉన్న పంటలు వేయడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషించాలి.
► ఏ పంట వేయవచ్చు, ఏ వెరైటీ వేయకూడదన్న దానిపై కమిటీల సహాయంతో పంటల ప్రణాళిక వేసుకోవాలి. బోరుబావుల కింద, మెట్ట ప్రాంతాల్లో వరి వేయడం అన్నది చాలా రిస్క్. అలాంటి సందర్భాల్లో మంచి ఆదాయాలు వచ్చే పంటలను వారికి చూపించాలి.
► కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటలను, మెరుగైన ఆదాయాన్నిచ్చే పంటలను చూపించాలి. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వంగడాలపై రైతులకు చైతన్యం కలిగించాలి. అది రైతుకు, ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది.
కస్టమ్ హైరింగ్ సెంటర్లు.. హబ్స్
► కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హబ్స్ అనేవి వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు దారి తీస్తాయి. స్థానిక రైతులకు అందుబాటు ధరల్లో యంత్రాలు సేవలు అందిస్తాయి. జిల్లా స్థాయిలో రైతులతో కమిటీలను ఏర్పాటు చేసి వారి సహకారంతో ఏ యంత్రాన్ని ఎంత ధరకు అద్దెకు ఇవ్వొచ్చన్నదానిపై నిర్ణయించాలి.
► జూలై 8న మొదటి విడతగా 3 వేల ఆర్బీకేల పరిధిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. అక్టోబర్‌లో 2వ విడత, జనవరిలో మూడో విడత కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందాలి
► రైతులకు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలే అందాలి. నకిలీలకు ఆస్కారం ఉండకూడదు. ఈ విషయంలో కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మిర్చి, పత్తి, తదితర పంటలకు సంబంధించి ప్రీమియం విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందించాలి. అప్పుడు రైతులకు మరింత భరోసా ఉంటుంది. బ్లాక్ మార్కెటింగ్ కూడా ఉండదు.
► విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు జరగాలి. డీలర్లు అమ్మే వాటిలో నాణ్యత ఉన్నాయా? లేదా? కచ్చితంగా పరిశీలించాలి. పోలీసుల సహకారంతో ఈ రెయిడ్స్ జరగాలి. అప్పుడే బ్లాక్ మార్కెటింగ్, కల్తీలకు మనం అడ్డుకట్ట వేయగలుగుతాం.
► కర్ఫ్యూ సమయంలో కూడా వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలు కొనసాగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
► నాణ్యత పరీక్షించిన ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు అందించాలి. ఎక్కడా కొరత రానీయొద్దు. కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో ఉంచాలి. పురుగు మందుల విషయంలో కచ్చితంగా నాణ్యత పరీక్షలు జరగాలి.
రైతులకు భౌతిక రశీదు
► ఇ–క్రాపింగ్ వివరాల నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలి. మన అలసత్వం వల్ల రైతులకు నష్టం రాకూడదు. మనల్ని ప్రశ్నించే అవకాశం రైతులకు ఉండాలి. అందుకే ఇ–క్రాపింగ్‌పై ప్రతి రైతుకు డిజిటల్ అక్నాలెడ్జ్‌మెంట్‌తోపాటు భౌతికంగా కూడా రశీదు ఇవ్వాలి. ఈ వివరాల ఆ«ధారంగానే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా వస్తుంది. ఈ విషయంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి.
► ఇ– క్రాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఎకరం, ప్రతి పంట వివరాలు నమోదు చేయాలి. హార్టికల్చర్ విషయంలో సీజన్‌తో సంబంధం లేకుండా ఇ–క్రాపింగ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment