1న గిట్టుబాటు ధరల ప్రకటన | CM YS Jagan‌ High Level Review On Grain Procurement | Sakshi
Sakshi News home page

1న గిట్టుబాటు ధరల ప్రకటన

Published Wed, Sep 30 2020 3:54 AM | Last Updated on Wed, Sep 30 2020 10:43 AM

CM YS Jagan‌ High Level Review On Grain Procurement  - Sakshi

కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఫామ్‌ గేట్‌ వద్దే పంటల సేకరణ జరుగుతుంది. అందుకని రైతుల రిజిస్ట్రేషన్‌ పక్కాగా జరగాలి. కల్లాల వద్దే ధాన్యం సేకరించడం కోసం, ఏరోజు వస్తారన్నది చెబుతూ రైతులకు కూపన్లు జారీ చేయాలి. కలెక్టర్లు, జేసీలు దీనిపై దృష్టి పెట్టాలి. ఎక్కడా మాన్యువల్‌ సర్టిఫికెట్లు అంగీకరించరు కాబట్టి ఈ–క్రాపింగ్‌ తప్పనిసరి. రబీకి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండే విధంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. శనగల సాగుకు ప్రత్యామ్నాయ పంటలు చూపాలి. రైతులు నష్టపోతే అందరికీ నష్టం జరుగుతుంది. అది దాదాపు 62 శాతం ప్రజలపై ప్రభావం చూపుతుంది. ఈ విషయం గుర్తు పెట్టుకోండి.

రాష్ట్ర, జిల్లా, మండల స్థాయితో పాటు, చివరకు ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలు ఏర్పాటు కావాలి. అవి తరచూ సమావేశం కావాలి. ఏ పంట వేయాలి? ఏది వద్దు? అన్న దానిపై ఆ కమిటీలు రైతులకు అవగాహన కల్పించాలి. నిజానికి గత ఖరీఫ్‌లో వ్యవసాయ సలహా కమిటీలు చాలా బాగా పని చేశాయి. ఉదాహరణకు ప్రకాశం, కర్నూలు జిల్లాలలో పత్తి సాగును 5.75 లక్షల హెక్టార్లకు పరిమితం చేయగలిగాం. వరిలో వంగడాలు కూడా విజయవంతంగా మార్చగలిగాం. ఆ విధంగా చేయలేకపోతే, పంటల సాగుపై ప్రణాళిక లేకపోతే వాటికి ధర కల్పించలేం.

సాక్షి, అమరావతి: ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర అనేది అక్టోబర్‌ 1వ తేదీన ప్రకటించబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఆ ధరలతో కూడిన పోస్టర్‌ను అక్టోబర్‌ 5వ తేదీ నాటికి అన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేలు) వద్ద ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ఆ ధరల కన్నా ఇంకా ఎక్కువే రైతులకు వచ్చేలా చూడాలని, అలా జరగకపోతే మార్కెట్‌ జోక్యంతో రైతులకు మేలు చేయాలని సూచించారు. సీఎం–యాప్‌ (సీఎం–ఏపీపీ) అమలయ్యేలా జేసీలు చూడాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ధాన్యం సేకరణ సన్నద్ధతపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

ఈ–క్రాపింగ్‌ కీలకం
► గ్రామ సచివాలయాల్లోనే ఈ–క్రాపింగ్‌ జరగాలి. ఖరీఫ్‌ పంట చేతికి వస్తోంది. అంటే ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలు కానుంది. ఈ ప్రక్రియలో ఆర్బీకేలు ప్రధాన పాత్ర పోషించాలి. 
► ఈ–క్రాపింగ్‌ పక్కాగా పూర్తి కావాలి. ఎక్కడా అది పెండింగ్‌ ఉండకూడదు. కాబట్టి కలెక్టర్లతో పాటు, ఆర్బీకేల ఇన్‌చార్జ్‌లుగా ఉన్న జేసీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ–క్రాపింగ్‌ వివరాలను సచివాలయాల్లో ప్రదర్శించాలి. ఎక్కడైనా రైతులు మిస్‌ అయితే, వారి పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇది చాలా ముఖ్యం.
► ఈ–క్రాపింగ్‌ ఉంటేనే, పంటల బీమా ప్రీమియమ్‌ చెల్లింపు, పంటల అమ్మకం, గిట్టుబాటు ధర కల్పన వంటివి సాధ్యం. అందువల్ల గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) ప్రత్యేక శ్రద్ధ చూపి, ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.

ఆర్బీకేల వద్ద ఎంపీఎఫ్‌సీ
► ప్రతి ఆర్బీకే వద్ద మల్టీపర్పస్‌ సదుపాయాల కేంద్రం (ఎంపీఎఫ్‌సీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పంటల సాగుకు ముందు, ఆ తర్వాత రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఆ కేంద్రం పని చేస్తుంది. 
► గోదాము, కోల్డ్‌ రూమ్, కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రం, ప్రైమరీ ప్రాసెసింగ్‌ (గ్రేడింగ్‌ అండ్‌ సార్టింగ్‌), ధాన్యం సేకరణ, జనతా బజార్, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్, ఆక్వాకు మౌలిక సదుపాయాల కల్పన, ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వంటి అన్నింటి కోసం ఆ కేంద్రాలు పని చేస్తాయి.
► ఆ కేంద్రాల కోసం ప్రతి ఆర్బీకే వద్ద భూమిని కలెక్టర్లు వచ్చే 15 రోజుల్లో సేకరించి, వ్యవసాయ శాఖకు  అప్పగించాలి. సదుపాయాల కల్పన కోసం వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,300 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.
► ఆ ప్రక్రియలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సం«ఘాలు (ప్యాక్స్‌) కూడా భాగస్వామ్యం వహిస్తాయి. కాబట్టి వచ్చే వారం రోజుల్లో అవి (ప్యాక్స్‌) తమ నివేదికలను ఆప్కాబ్‌కు అందజేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement