Fact Check: పట్టు రైతులకు అండగా ప్రభుత్వం | Andhra Pradesh ranks second in raw silk production in the country | Sakshi
Sakshi News home page

Fact Check: పట్టు రైతులకు అండగా ప్రభుత్వం

Published Wed, Feb 28 2024 5:19 AM | Last Updated on Wed, Feb 28 2024 5:48 AM

Andhra Pradesh ranks second in raw silk production in the country - Sakshi

ఏటా పెరుగుతున్న విస్తీర్ణం, ఉత్పత్తి 

సకాలంలో రాయితీలు, ప్రోత్సాహకాలు చెల్లింపు  

చంద్రబాబు హయాంలో పట్టుగూళ్ల సగటు ధర కిలో రూ.350

ప్రస్తుతం కిలో రూ.480 నుంచి రూ.550 మధ్య ధర 

భారీ లాభాలను కళ్లజూస్తున్న రైతులు 

అయినా ప్రభుత్వంపై ‘ఈనాడు’ విషప్రచారం 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించింది. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు అండగా ఉండటానికి గ్రామాల్లోనే వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500, పంట నష్టపరిహారం, రైతులకు ఉచిత విద్యుత్‌..

ఇలా ఒకటా రెండా దేశంలో ఏ రాష్ట్రంలో లేన­న్ని పథకాలు.. దేశవిదేశాల నుంచి ఏపీ వ్యవసాయ విధానాలపై ప్రశంసలు.. ఇన్ని కళ్ల ముందు కనిపిస్తు­న్నా పచ్చకళ్ల కబోధి, ఈనాడు పత్రికాధినేత రామోజీరావుకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు.  

పట్టు రైతులు కష్టాలు పడుతున్నారని.. పథకాలకు ప్రభు­త్వం పాతరేసిందని.. రైతులకు రాయితీలు నిలిపేసిందని అసత్యాలు, అబద్ధాలతో మంగళవారం జగనన్న మంకు‘పట్టు’ అంటూ ఒక విష కథనాన్ని వండివార్చా­రు. దీనికి సంబంధించిన అసలు వాస్తవాలు ఇవిగో.. ముడిపట్టు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో గత ఐదేళ్లు­గా పట్టుసాగు భారీగా విస్తరించింది.

ప్రభుత్వం అండగా నిలవడంతో పట్టు రైతులు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో లాభాలు కళ్లజూస్తున్నారు. కొత్తగా ఈ రంగంలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇలా అడుగడుగునా చేయూ­తనిస్తుంటే ఈనాడు మాత్రం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది.  

ఆరోపణ: గతమెంతో ఘనం.. నేడు దైన్యస్థితిలో పట్టు రైతులు 
వాస్తవం: 2014–15 నుంచి 2018–19 మధ్య కొత్తగా 39,433 ఎకరాల్లో 15,362 మంది రైతులు పట్టు సాగు చేపట్టారు. 25,632 మెట్రిక్‌ టన్నుల పట్టుగూళ్లు పండించా­రు. 2019–20 నుంచి 2023–24 మధ్య కొత్తగా 40,362 ఎకరాల్లో 17,852 మంది రైతులు పట్టు సాగు చేపట్టారు.

అదనంగా 30,272 మెట్రిక్‌ టన్నుల పట్టుగూ­ళ్లు పండించారు. ఇక గతేడాది రికార్డు స్థాయిలో రూ.­4,075 కోట్ల విలువైన 55,363 టన్నుల క్రాస్‌ బ్రీడ్‌ పట్టుగూళ్లు, 12,542 టన్నుల బైవోల్టెన్‌ పట్టుగూళ్లు ఉత్పత్తయ్యా­యి. రూ.3,687.15 కోట్ల విలువైన 9,311 టన్ను­ల నాణ్యమైన ముడిపట్టును సిల్క్‌రీలర్లు ఉత్పత్తి చేశారు. 

ఆరోపణ: రాయితీలకు కోత.. నిధుల విడుదలకు సతాయింపు 
వాస్తవం: ఈ ఐదేళ్లలో పట్టు రైతులకు ప్రభుత్వం రూ.19.41 కోట్ల బైవోల్టిన్‌ కకున్‌ ఇన్సెంటివ్‌ను అందజేసింది. ఈ ఏడాది మరో రూ.4.50 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేసింది. ఇక పట్టు రీలర్లకు 4 ఏళ్లలో రూ.8.20 కోట్ల ఇన్సెంటివ్స్‌ ఇ చ్చింది. ఈ ఏడాది మరో రూ.2.75 కోట్లు విడుదల చేసింది.

ఈ ఏడాది పట్టు రైతులకు రాయితీలిచ్చేందుకు రూ.25 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇలా క్రమం తప్పకుండా పట్టు రైతులకు ఇన్సెంటివ్‌లు, రీలర్లకు ప్రోత్సాహకాలు ఇస్తూంటే.. ఈనాడు పత్రిక సత్యదూరమైన ఆరోపణలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది.

ఆరోపణ: 33 శాతం పైగా పెరిగిన ఉత్పత్తి వ్యయం 
వాస్తవం: కిలో పట్టు గూళ్లకు 2018–19లో మార్కెట్‌ ధర రూ.350లకు మించి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సరాసరి ధర రూ.480 నుంచి రూ.550 మధ్య పలుకుతోంది. అంటే 2018–19తో పోలిస్తే సరాసరి ఆదాయం కిలోకు అదనంగా రూ.200కు పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. గత ఐదేళ్లలో గరిష్టంగా బైవోల్టిన్‌ రకం పట్టు గూళ్లకు కిలోకి రూ.881కు పైగా లభించింది.

పైగా రైతుల పట్టుగూళ్ల ఉత్పాదకత కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ప్రతి వంద గుడ్లకు గతంలో 60 కిలోలొస్తే, ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తోన్న పట్టు సాగు బడుల ఫలితంగా ప్రస్తుతం 70–75  కిలోలు వస్తోంది. దీన్ని బట్టి చూస్తే రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యారే తప్ప ఈనాడు ఆరోపించినట్టు ఏ దశలోనూ ఇబ్బందిపడిన దాఖలాలు లేవు.

ఆరోపణ: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శీతకన్ను 
వాస్తవం: చౌకీ పురుగులు నూరు శాతం సరఫరా చేయడం, రీరింగ్‌ షెడ్లలో టర్బో వెంటిలేటర్స్, కూలింగ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేయడం, షూట్‌ రీరింగ్‌ పద్ధతులపై పట్టుసాగు బడుల ద్వారా అవగాహన కల్పించడం వల్ల సమయంతో పాటు కూలీల ఖర్చు 40 శాతం వరకు తగ్గింది. పైగా 15–20 శాతం మేర మల్బరీ ఆదా అవుతోంది. ఫలితంగా పట్టు రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 వేల ఎకరాల్లో మల్బరీ విస్తరణ లక్ష్యం కాగా ఇప్పటికే 5,242 మంది రైతులు 7,720 ఎకరాల్లో కొత్తగా సాగు చేస్తున్నారు.

ఈ క్రమంలో రూ.3,462 కోట్ల విలువైన 66,593 టన్నుల నాణ్యమైన కకూన్స్, 13,246 టన్నుల బైవోల్టెన్‌ కకూన్స్‌ను ఉత్పత్తి చేశారు. రూ.3,560 కోట్ల విలువైన 9,150 టన్ను­ల రా సిల్క్‌ ఉత్పత్తి అయ్యింది. ప్రస్తుత ఏడాదిలో పట్టు పరిశ్రమ కోసం రూ.99.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు జరపగా ఇప్పటికే రూ.28.80 కోట్లు విడుదల చేసింది. 2021–22లో పట్టు పరిశ్రమ స్థూలా­దాయం రూ.11,638 కోట్లు ఉండగా 2022–­23లో రూ.­12,098 కోట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ఆరోపణ: యాంత్రీకరణ సహా పథకాల ఎత్తివేత 
వాస్తవం: క్రిమిసంహారక మందుల కొనుగోలుకు 9,525 మంది రైతులకు రూ.2.38 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. యంత్ర పరికరాల కోసం పట్టు పరిశ్రమ ద్వారా 1,524 మంది రైతులకు రూ.8.25 కోట్లు ఇచ్చింది. పట్టు రైతులు నిర్మించుకున్న షెడ్లతో పాటు మల్బరీ తోటల సాగు, రీలింగ్‌ యూనిట్ల ఏర్పాటు కోసం రూ. 111.61 కోట్లు విడుదల చేసింది. పట్టు పురుగుల పెంపక షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీ బకాయిలన్నింటినీ రైతుల ఖాతాకు జమ చేస్తోంది. ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా యంత్ర పరికరాలకు మంగళం పాడేశారంటూ ఈనాడు అబద్ధాలను అచ్చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement