FactCheck: Payment Of Subsidy Of Rs 8 Plus Crore To Silk Reelers, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: ‘పట్టు’ తప్పిన రాతలు

Published Mon, Jul 31 2023 4:00 AM | Last Updated on Fri, Aug 11 2023 1:32 PM

Payment of subsidy of Rs 8 plus crore to silk reelers - Sakshi

సాక్షి, అమరావతి: ముడిపట్టు ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రోత్సాహంతో గడచిన నాలుగేళ్లుగా పట్టుసాగు విస్తరిస్తుండడమే కాదు.. ఆ రైతులు గతంలో ఎన్నడూలేని రీతిలో లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా నాలుగేళ్లలో కొత్తగా 39,640 ఎకరాల్లో పట్టుసాగు విస్తరించగా, బైవోల్టిన్‌ రకం పట్టుగూళ్ల ఉత్పత్తి మరో 13,905 టన్నులు పెరిగింది.

2018–19లో పట్టుగూళ్ల ధర (కకూన్స్‌) కిలో రూ.380 రావడం గగనంగా ఉండేది. కానీ, నేడు సగటున రూ.470 నుంచి రూ.620 వరకు లభిస్తోంది. అయినా, ప్రభుత్వంపై బురద జల్లడమే ఈనాడు లక్ష్యంగా పెట్టుకుంది. ‘పట్టు రైతుకు కుచ్చుటోపీ’ అంటూ నిసిగ్గుగా అబద్ధాలు అచ్చేసింది. ఈనాడు కథనంలో వాస్తవాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం.. 

రాష్ట్రంలో 76,395 మంది 1,37,420 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తున్నారు. 600 సిల్క్‌ రీలర్‌ కుటుంబాలు ముడిపట్టును ఉత్పత్తి చేస్తుంటే ఈ రంగంపై ఆధారపడి 14లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. పట్టు రైతులకు మెరుగైన ఆదాయకల్పన లక్ష్యంతో పట్టుగూళ్ల మార్కెట్లలో ఈ–మార్కెటింగ్‌ వ్యవస్థను తీసుకురావడమే కాదు.. పట్టుసాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తోంది. 

రైతులు, రీలర్లకు ఏటా ప్రోత్సాహకాలు.. 
ఇలా నాలుగేళ్లలో పట్టు రైతులకు రూ.19.41 కోట్ల బైవోలి్టన్‌ కకున్‌ ఇన్సెంటివ్‌ను అందజేసింది. ఈ ఏడాది మరో రూ.7.12 కోట్లు విడుదల చేసింది. అలాగే, పట్టు రీలర్లకు నాలుగేళ్లలో రూ.8.20 కోట్ల ఇన్సెంటివ్‌ ఇచ్చారు. ఈ ఏడాది మరో రూ.6 కోట్లు విడుదల చేశారు. మరోవైపు.. పట్టు రైతులు నిర్మించుకున్న 1,186 షెడ్లకు ప్రభుత్వం ఇప్పటికే రూ.37.88 కోట్ల రాయితీనందించగా, మరో రూ.11.97 కోట్ల రాయితీని విడుదల చేసేందుకు ఏర్పాట్లుచేసింది.

పట్టు పురుగుల పెంపకపు షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన బకాయిలన్నీ రైతుల ఖాతాలో జమచేశారు. అలాగే, పట్టుసాగులో అవసరమైన క్రిమిసంహార మందుల కొనుగోలు కోసం నాలుగేళ్లలో రూ.1.46 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. మరోవైపు.. కొత్తగా ఐదు ఆటోమేటిక్‌ రీలింగ్‌ మెషినరీ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నారు. 

పట్టు సాగుబడుల ద్వారా శిక్షణ.. 
చౌకీ పురుగులు నూరు శాతం సరఫరా చేయడం, రీరింగ్‌ షెడ్లలో టర్బో వెంటిలేటర్లు, కూలింగ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటుచేయడం, షూట్‌ రీరింగ్‌ పద్ధతులపై ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న పట్టుసాగు బడుల ద్వారా అవగాహన కల్పించడం వలన సమయంతో పాటు కూలీల ఖర్చు 40 శాతం వరకు తగ్గింది. పైగా 15–20 శాతం మేర మల్బరీ ఆదా అవుతోంది. ఫలితంగా ఈ రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.

ఇలా ప్రభుత్వ చర్యల ఫలితంగా 2019–23 మధ్యలో కొత్తగా 39,640 ఎకరాల మేర సాగులోకి వచి్చంది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.4,075 కోట్ల విలువైన 55,363 టన్నుల క్రాస్‌బ్రీడ్‌ పట్టుగూళ్లు, 12,542 టన్నుల బైవోల్టెన్‌ పట్టుగూళ్లు ఉత్పత్తి కాగా, రూ.3,687.15 కోట్ల విలువైన 9,311 టన్నుల నాణ్యమైన ముడిపట్టును సిల్‌్కరీలర్లు ఉత్పత్తి చేశారు. 2021–22లో స్థూలాదాయం (జీవీఏ) రూ.11,638 కోట్లు సాధించగా, 2022–23లో రూ.12,098 కోట్లు సాధించి పట్టు పరిశ్రమ కొత్త రికార్డు నెలకొల్పింది.  

ఏటా రికార్డు స్థాయి ధరలు.. 
గడిచిన నాలుగేళ్లలో గరిష్టంగా బైవోల్టిన్‌ రకం పట్టుగూళ్లకు కిలోకి రూ.881 లభించింది. నాలుగేళ్లలో రైతులు పొందిన సగటు ధరను పరిశీలిస్తే కిలో రూ.470 నుంచి రూ.620 మధ్య పలికింది. ఈ ఏడాది గడిచిన మూడునెలల్లో సగటు ధర కిలో రూ.400 నుంచి రూ.480 మధ్య ఉంది. సాధారణంగా ఏటా సెపె్టంబరు నుంచి ఫిబ్రవరి వరకు పట్టుగూళ్లకు మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరలు వచ్చే మూడునెలల్లో గరిష్ట స్థాయికి చేరే అవకాశముంది.

ఇక ఈ ఏడాది (2023–24) 12వేల ఎకరాల్లో మల్బరీ విస్తరణ ద్వారా 15వేల టన్నుల బైవోల్టెన్‌ పట్టుగూళ్లు, 65వేల టన్నుల క్రాస్‌బ్రీడ్‌ పట్టుగూళ్ల ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, ఇతర పట్టు రైతులకు ఈ ఏడాది రాయితీలిచ్చేందుకు రూ.25 కోట్ల వరకు ఖర్చుచేయడానికి కార్యాచరణను సిద్ధంచేసింది.

ఈనాడు ఆరోపణల్లో నిజంలేదు.. 
పట్టు రైతులకు కుచ్చుటోపీ అంటూ ఈనాడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ధరలు పడిపోయాయని, రైతులకు, రీలర్లకు ప్రోత్సాహకాలు, క్రిమిసంహాకర మందులకయ్యే వ్యయాన్ని నిలిపి వేసిందనడంలో ఎలాంటి వాస్తవంలేదు. నిజాలు తెలుసుకోకుండా బురద జల్లడం ఈనాడుకు సరికాదు. 
– డాక్టర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్, కమిషనర్, పట్టు శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement