CM YS Jagan : తనిఖీలు తప్పనిసరి | CM Jagan Video Conference With Collectors And SPs On Spandana | Sakshi
Sakshi News home page

CM YS Jagan : తనిఖీలు తప్పనిసరి

Published Wed, Jul 28 2021 2:07 AM | Last Updated on Wed, Jul 28 2021 8:37 AM

CM Jagan Video Conference With Collectors And SPs On Spandana - Sakshi

ఆగస్టు నెలలో అమలయ్యే పథకాలు ఇవీ..  
ఆగస్టు 10: నేతన్న నేస్తం  
ఆగస్టు 16: విద్యాకానుక  
ఆగస్టు 24: రూ. 20 వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు 
ఆగస్టు 27: ఎంఎస్‌ఎంఈలు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఇన్సెంటివ్‌ల చెల్లింపు   

ఉద్యోగానికి న్యాయం చేస్తున్నామా? 
క్షేత్రస్థాయి తనిఖీల ఉద్దేశ తీవ్రతను మీరు సరిగా అర్థం చేసుకున్నట్లు లేదు. అధికారులుగా మనం ఏం చేస్తున్నట్లు? మనం సరిగానే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామా? చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేస్తున్నామా? సచివాలయాల పర్యటనలకు వెళ్లకపోతే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా తెలుస్తాయి? పెన్షన్‌ సకాలంలో అందుతుందా? లేదా? ఎలా తెలుస్తుంది? మనం వెళ్లకపోతే సకాలానికి రేషన్‌ కార్డు వస్తుందా? లేదా? ఎలా తెలుస్తుంది? ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో వీటిని ప్రారంభించాం. అవి సరిగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయం తనిఖీలకు వెళ్లకుంటే ఎలా తెలుస్తుంది? అసలు మనం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లకపోతే మన విధులకు ఏం న్యాయం చేసినట్లు? ఇది ఆమోదయోగ్యం కాదు. మొదట మనం మనుషులం. ఆ తర్వాతే అధికారులం. మనలో మానవీయ దృక్పథం ఉండాలి. పేదలను పట్టించుకోకపోతే మనం విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లు కాదు. వచ్చే స్పందన కల్లా ప్రతి ఒక్కరూ 100 శాతానికి పైగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

బాధ కలిగిస్తున్నా.. 
మీకు మెమోలు జారీచేయడం నాకు చాలా బాధ కలిగించే విషయం. మీరంతా మన ఉద్యోగులు. కానీ క్రమశిక్షణ పాటించాలంటే వేరే మార్గం లేదు. మీకు మెమోలు ఇవ్వడం అంటే నా పని తీరుమీద నేను మెమో ఇచ్చుకున్నట్టే.
– ‘స్పందన’లో సీఎం జగన్‌  

సాక్షి, అమరావతి: ప్రజలకు పలు రకాల సేవలందించే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు జిల్లా అధికార యంత్రాంగం చేరువ కావాలని, అప్పుడే వీటి సమర్ధత మెరుగుపడుతుందని, వీటి పనితీరుపై కలెక్టర్లు, జేసీలు, సబ్‌ కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు నిర్దేశించిన ప్రకారం తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి మెమోలు జారీ చేయాల్సిందిగా తన కార్యాలయాన్ని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటానని.. ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తేనే తప్పులు, పొరపాట్లు ఏమైనా ఉంటే తెలుస్తాయని, వాటిని అంతా కలసి సరిచేసుకుందామన్నారు. ‘స్పందన’లో భాగంగా సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ..
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

లక్ష్యం 1,098.. తనిఖీలు 733 
సచివాలయాలు మన మానస పుత్రికలు. వాటి సమర్థత పెరగాలంటే తనిఖీలు చాలా ముఖ్యం. కలెక్టర్లు, జేసీలు, ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు, మునిసిపల్‌ కమిషనర్లు క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలను తప్పకుండా తనిఖీ చేయాలి. తనిఖీలు చేయకపోతే మన అంతట మనమే వాటి సమర్థతను తగ్గించినట్లు అవుతుంది. కలెక్టర్లు వారానికి 2 గ్రామ/వార్డు సచివాలయాలను తనిఖీ చేయాలి. జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు.. వీరంతా వారానికి కనీసం 4 గ్రామ/వార్డు సచివాలయాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు తప్పకుండా చేయాలని చెప్పాం. తనిఖీలపై సీఎం కార్యాలయం పర్యవేక్షణ చేస్తుందని కూడా చెప్పాం. కానీ పురోగతి చూస్తే.. 1,098 క్షేత్రస్థాయి తనిఖీలు చేయాలని నిర్దేశిస్తే 733 తనిఖీలే జరిగాయి. అంటే 66.75% మాత్రమే చేశారు. ఇందులో కలెక్టర్లు 78 చోట్ల క్షేత్రస్థాయి తనిఖీలు చేయాల్సి ఉండగా 83 చోట్ల నిర్వహించి 106% లక్ష్యాన్ని సాధించారు. జేసీ (గ్రామ, వార్డు సచివాలయాలు)లు 156 చోట్ల తనిఖీలు చేయాల్సి ఉండగా 167 చోట్ల జరిపారు. అంటే 107% లక్ష్యాన్ని చేరుకున్నారు. వీరంతా క్షేత్రస్థాయి తనిఖీల్లో బాగానే పని చేశారు. 

వీరందరికీ మెమోలు..
జేసీ రెవెన్యూ 78 శాతం, జేసీ హౌసింగ్‌ 49 శాతం, జేసీ (ఏ అండ్‌ డబ్ల్యూ) 85 శాతం, మునిసిపల్‌ కమిషనర్లు 89 శాతం, ఐటీడీఏ పీవోలు 18 శాతం, సబ్‌ కలెక్టర్లు 21 శాతం మాత్రమే తనిఖీలు చేశారు. వీరందరి పనితీరు చాలా బ్యాడ్‌గా ఉంది. ఇది అంగీకార యోగ్యం కాదు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయని వారందరికీ మెమోలు జారీ చేయాలని సీఎంవో అధికారులను ఆదేశించా. వీరందరికీ మెమోలు వస్తాయి. 

మనకు ఓటు వేయకున్నా...
క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్నప్పుడు అర్హులందరికీ డీబీటీ పథకాలు వస్తున్నాయా? లేదా? చూడండి. సామాజిక తనిఖీల కోసం ప్రదర్శిస్తున్న జాబితాలను ఒకసారి పరిశీలించండి. జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారో లేదో చూడండి. ప్రతి నెల వేర్వేరు పథకాలను అమలు చేస్తున్నాం. అర్హుల జాబితాలను అక్కడ ప్రదర్శిస్తున్నాం. కొంతమందికి సమయం కూడా ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నాం. వారంతా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని వెరిఫికేషన్‌ చేస్తున్నారా? లేదా? అని పరిశీలించండి. వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత పథకాలు వస్తున్నాయా? లేదా? మళ్లీ పరిశీలన చేయండి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్లు, బియ్యంకార్డులు, ఇంటి పట్టాలు, ఆరోగ్యశ్రీ... నిర్దేశిత సమయంలోగా వెరిఫికేషన్‌ పూర్తిచేసి అర్హులకు ఇస్తున్నామా? లేదా? చూడండి. మనకు ఓటు వేయని వారికి కూడా, అర్హులైతే  పథకాలు తప్పకుండా అందాల్సిందే. అనర్హులకు అందకూడదు. ఇది కూడా ముఖ్యమైన అంశం. వీటిని స్వయంగా పర్యవేక్షించాలి.

నిర్వహణ సరిగా ఉందా?
సచివాలయాలకు ఇచ్చిన ఫోన్లు, బయోమెట్రిక్‌ పరికరాలు, స్కానర్లు... ఈ హార్డ్‌వేర్‌ అంతా సరిగా పని చేస్తోందో లేదో చూడండి. రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ సరిగా ఉందా? ఉద్యోగుల బయోమెట్రిక్, వలంటీర్ల హాజరు ఇవన్నీ సరిగా నమోదవుతున్నాయా? అని పరిశీలించండి. సచివాలయాల్లో సిబ్బంది అటెండెన్స్‌ తరువాత అందుబాటులో ఉంటున్నారా? లేదా? చూడండి. సచివాలయ విధివిధానాలను సక్రమంగా అమలు చేస్తున్నారా? లేదా? వీటన్నింటిపైనా పర్యవేక్షణ చేయాలి. లేకపోతే వీటి సమర్థతకు గ్యారెంటీ ఇవ్వలేం.

తనిఖీలతో మెరుగైన సేవలు..
సచివాలయాల సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నారా? లేదా? అనేది అధికారులు తనిఖీల్లో భాగంగా పరిశీలించాలి. ప్రొబేషన్‌ నుంచి రెగ్యులర్‌ ఉద్యోగులు అవుతున్నప్పుడు నైపుణ్యాలను నేర్పించే కార్యక్రమాలను చేపట్టడం మన బాధ్యత. వారికి సరైన శిక్షణ కూడా ఇవ్వడం మన బాధ్యత. తనిఖీలు చేస్తున్నకొద్దీ అవన్నీ మనకు అవగతమవుతాయి. తనిఖీలు చేస్తున్నకొద్దీ ప్రజలకు సేవలు మెరుగుపడతాయి. 

చిరునవ్వుతో ప్రజలను స్వాగతించాలి
ప్రజలు ఏదైనా వినతితో మన దగ్గరకు వచ్చినప్పుడు వారిని చిరునవ్వుతో స్వాగతించడం చాలా ముఖ్యం. ఆమేరకు గ్రామ, వార్డు, సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలి. 2 శాతం.. అంటే 230 గ్రామ సచివాలయాల్లో ఇంకా హాజరును గణించడంలేదు. వివరాలు తెప్పించుకుని వెంటనే దీనిపై దృష్టి పెట్టండి. 1.42 లక్షల మందిలో 10 శాతం అటెండెన్స్‌ మార్కింగ్‌ ఇంకా జరగడం లేదు. వీటిని సరిదిద్దితే మంచి ఫలితాలు వస్తాయి. 

మీరే నాకు కళ్లు, చెవులు..
వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత అర్హులని తేలితే, అప్పటిదాకా వారికి పథకం రాకపోతే కచ్చితంగా ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. ఈ అంశాలను మా దృష్టికి తీసుకురావాలి. దీనివల్ల వెంటనే తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుంది. మీరే నా కళ్లు, చెవులు. తప్పకుండా క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లాలి. మీరు విఫలం అయితే.. నేను విఫలం అయినట్లే. ఒక జట్టు మాదిరిగా మనం కలసి పనిచేయడం చాలా ముఖ్యం. మీరు క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్తే ప్రజలకు మంచి జరుగుతుంది. క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తున్నప్పుడు వివిధ పథకాలకు సంబంధించిన పోస్టర్లను సచివాలయాల్లో ఉంచుతున్నారా? లేదా? అర్హుల జాబితాలను అతికిస్తున్నారా? లేదా? సంక్షేమ క్యాలెండర్‌ ఉందా?లేదా? ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన ఫోన్‌ నంబర్లు అక్కడ ఉన్నాయా? లేదా? అనేవి పరిశీలించండి. అర్హులైనప్పటికీ వారికి ఏదైనా పథకం వర్తించకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచించే నంబర్లను అక్కడ పొందుపరిచారో లేదో చూడండి. సచివాలయాల ద్వారా అందుతున్న సేవల జాబితాను తెలియచేసే వివరాలను ప్రదర్శిస్తున్నారో లేదో చూడండి. ఆ సేవలన్నీ నిర్దేశిత సమయంలోగా అందుతున్నాయో లేదో పరిశీలించండి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement