గ్రామాల్లో ‘ఎనీ టైం మనీ’ | CM Jagan To Arrange ATM Services At Rythu Bharosa Centres | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ‘ఎనీ టైం మనీ’

Published Thu, Apr 28 2022 4:34 AM | Last Updated on Thu, Apr 28 2022 7:57 AM

CM Jagan To Arrange ATM Services At Rythu Bharosa Centres - Sakshi

సాక్షి, అమరావతి: చాలా గ్రామాలకు బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉండవు. ఉన్నా అరకొరగానే ఉంటాయి. ఏటీఎంల సంగతి సరేసరి. డబ్బులు తీసుకోవాలంటే మైళ్లకొద్దీ దూరం వెళ్లాలి. తీరా అక్కడికి వెళ్లాక ఏటీఎంలో డబ్బులు లేకపోతే మరో ఏటీఎంకి ప్రయాణం కట్టాలి. ఇది గ్రామీణ ప్రజలు నిత్యం అనుభవిస్తున్న కష్టం. ఈ కష్టాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామీణులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు అందుబాటులో ఉండేలా ఆర్బీకేలలోనే ఏటీఎంలను ఏర్పాటు చేయిసున్నారు. వాటిలో ఎప్పుడూ నగదు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గ్రామీణులకు వ్యవసాయ ఉత్పాదకాలు, ఉపకరణాలతోపాటు నగదు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకు ఉదాహరణే ఈ రైతు..

పేరు ఆచంట శ్రీనివాసరావు. తూర్పు గోదావరి జిల్లా కురుకూరు. గతంలో ఏది కావాలన్నా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన దేవరాపల్లికి వెళ్లేవారు. గ్రామంలో ఆర్బీకే ఏర్పాటు చేశాక ఇప్పుడు అన్నీ అక్కడే దొరుకుతున్నాయి. గ్రామం దాటి వెళ్లకుండానే బ్యాంకింగ్‌ సేవలు కూడా పొందుతున్నారు. 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లంట్ల ఆర్బీకే వద్ద ఏర్పాటు చేసిన ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకే, ఏటీఎంల వల్ల వ్యయప్రయాసలు తగ్గాయని శ్రీనివాసరావు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

గ్రామీణుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లను ఆర్బీకేలకు అనుసంధానం చేసింది. ప్రతి ఆర్బీకే వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేస్తోంది. రైతుల్లో ఆర్ధిక అక్షరాస్యతను పెంపొందించడం, మొబైల్, నెట్‌ బ్యాంకింగ్‌ వంటి డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన కల్పించడం, పేపర్లు లేని (పేపర్‌లెస్‌) ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామ స్థాయిలో బ్యాంకింగ్‌ సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే 9,160 ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లు అందుబాటులోకి వచ్చారు. మిగిలిన ఆర్బీకేల్లోనూ వీరి నియామకానికి బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నాయి.

పైలట్‌ ఏటీఎంలకు అనూహ్య స్పందన
ప్రభుత్వ పిలుపు మేరకు ఆర్బీకేల వద్ద యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎంలు ఏర్పాటు చేస్తోంది. పైలట్‌ ప్రాజెక్టుగా జిల్లాకో ఆర్బీకే వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేసింది. వీటి పనితీరుపై బ్యాంక్‌ అధ్యయనం చేసింది. ఈ ఏటీఎంలను ఆర్బీకేల పరిధిలోని ఏడు నుంచి పది గ్రామాలకు చెందిన పదివేల మందికి పైగా రైతులు, ప్రజలు వినియోగించుకుంటున్నట్టు గుర్తించారు. ప్రతి రోజూ 50 నుంచి 100 హిట్స్‌ వస్తున్నాయని, ప్రతి ఏటీఎం నుంచి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు నగదు తీసుకుంటున్నట్లు గుర్తించారు. 

పల్లంట్ల ఆర్బీకే ఏటీఎం ది బెస్ట్‌
తూర్పు గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం పల్లంట్ల ఆర్బీకేలో తొలి ఏటీఎం ఏర్పాటు చేశారు. ఇది బెస్ట్‌ ఏటీఎంగా నిలిచినట్టు యూనియన్‌ బ్యాంక్‌ ప్రకటించింది. పల్లంట్లతో పాటు కురుకూరు, లక్ష్మీపురం, త్యాజంపూడి, చిక్కాల, దూమంతుని గూడేనికి చెందిన 10 వేల మందికిపైగా ఈ ఏటీఎంను ఉపయోగించుకుంటున్నారు. గతంలో వీరంతా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరాపల్లి (మండల కేంద్రం)కి వెళ్లేవారు. గత సంవత్సరం నవంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం రైతులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ ఏటీఎంను రోజుకు 75 నుంచి 100 మంది వరకు ఉపయోగించుకుంటున్నట్లు బ్యాంక్‌ అధికారులు గుర్తించారు. రోజుకు సుమారు రూ.4 లక్షలు విత్‌డ్రా అవుతున్నట్లు వెల్లడైంది. ఏ సమయానికి వెళ్లినా నగదు అందుబాటులో ఉండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నో క్యాష్‌ బోర్డు చూడలేదు
నేను 16 ఎకరాల్లో మిరప, మొక్కజొన్న, కర్రపెండలం సాగు చేస్తున్నా. గతంలో ఏది కావాలన్నా దేవరాపల్లి  వెళ్లే వాళ్లం. ఇప్పుడు పల్లంట్లలో ఏర్పాటు చేసిన ఆర్బీకే మా అవసరాలన్నీ తీరుస్తోంది. ఇక్కడి ఏటీఎంలో ఎప్పుడు వెళ్లినా డబ్బు ఉంటుంది. నో క్యాష్‌ బోర్డు ఎప్పుడూ చూడలేదు.    
    –వి.కిషోర్, లక్ష్మీపురం, తూర్పు గోదావరి

చాలా సౌకర్యంగా ఉంది
నేను 18 ఎకరాల్లో ఆయిల్‌ పామ్, వరి, మినుము, జీడిమామిడి సాగుచేస్తా. ఇంతకు ముందు డబ్బుల కోసం చాలా అవస్థలు పడే వాడిని. ఏటీఎం, బ్యాంకు శాఖలకు వెళ్లాలంటే చాలా సమయం, ఖర్చు ఎక్కువగా ఉండేది. ఇప్పుడా అవస్థలు లేవు. మా గ్రామం ఆర్బీకేలోనే ఏటీఎం ఏర్పాటు చేయడంతో చాలా సౌకర్యంగా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి డబ్బులు తెచ్చుకోగలుగుతున్నాం.    
    – గాంధీప్రసాద్, పల్లంట్ల, తూర్పు గోదావరి

ఆర్బీకే ఏటీఎంలకు స్పందన బాగుంది
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం మేరకు ఆర్బీకేల వద్ద పైలెట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ఏటీఎంలకు మంచి స్పందన లభిస్తోంది. మండల కేంద్రాలు, నగరాల్లో చాలా ఏటీఎంలకు లభించని ఆదరణ ఇక్కడ లభిస్తోంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా మరిన్ని ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్బీకేల వద్ద ఏటీఎంల ఏర్పాటుకు మిగిలిన బ్యాంకులు కూడా ముందుకొస్తున్నాయి. మలి దశలో కనీసం 100 ఏటీఎంలు ఏర్పాటు చేయాలని సంకల్పించాం.
    – వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్‌ఎల్‌బీసీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement