సాక్షి, అమరావతి : వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవలు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయం కార్యరూపం దాలుస్తోంది. ప్రభుత్వ కృషి ఫలితంగా ప్రతీ ఆర్బీకే పరిధిలో ఓ బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను ఆయా బ్యాంకులు కేటాయించాయి. నగదు జమ, ఉపసంహరణలతో పాటు సాగు ఉత్పాదకాల కొనుగోళ్లు.. కూలీలు, యాంత్రీకరణకు నగదు బదిలీతో సహా కొత్త రుణాల మంజూరు, పాత రుణాల నవీకరణ వంటి సేవలను కూడా ఈ కరస్పాండెంట్ల ద్వారా అందిస్తున్నారు.
రైతుల విలువైన సమయం ఆదాకు..
రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్‌బీకేలున్నాయి. వీటిలో 234 అర్బన్ ప్రాంతంలోనూ, 10,544 గ్రామీణ ప్రాంతంలో రైతులకు సేవలందిస్తున్నాయి. సీజన్‌లో రుణాల మంజూరు, రీషెడ్యూళ్లతో పాటు వివిధ రకాల బ్యాంకింగ్ సేవల కోసం రైతులు పడరాని పాట్లు పడేవారు. పంటకాలంలో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఆర్‌బీకేల ద్వారా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచన మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దిశగా బ్యాంకులు కూడా అడుగులు వేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో 24 ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు సేవలందిస్తున్నాయి. నిజానికి శాఖలులేని ప్రాంతాల్లో వాటి కార్యకలాపాల కోసం ఆయా బ్యాంకులు గతంలోనే 10,916 మంది కరస్పాండెంట్లను నియమించుకున్నాయి.
వీరిలో 503 మంది చురుగ్గాలేరు. ప్రస్తుతం 10,413 మంది సేవలందిస్తున్నారు. ప్రధానంగా.. ఎస్‌బీఐ పరిధిలో 3,289 మంది, యూనియన్ బ్యాంక్ పరిధిలో 1,320 మంది, ఏపీజీవీబీ పరిధిలో 1,091, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌కు 990, కెనరా బ్యాంకుకు 831, ఇండియా ఫస్ట్ బ్యాంకుకు 686 మంది ఉన్నారు. మరికొన్నింటిలో మిగిలిన వారు కొనసాగుతున్నారు. వీరిలో 9,160 మంది గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నట్లుగా గుర్తించారు. వీరందరినీ సమీప ఆర్‌బీకేలతో మ్యాపింగ్ చేశారు. అలాగే, వైఎస్సార్ కడప, విశాఖపట్నం జిల్లాల్లోని ఆర్‌బీకేలకు నూరు శాతం కరస్పాండెంట్లు అందుబాటులో ఉన్నట్లు గుర్తించగా.. 1,618 ఆర్‌బీకేలకు కరస్పాండెంట్‌లు లేరు. ఈ ప్రాంతాల్లోని ఆర్‌బీకేలను సమీప కరస్పాండెంట్లతో మ్యాపింగ్ చేశారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ ఆర్‌బీకేల బాధ్యతలు చూసేవారు రోజు విడిచి రోజు ఆయా ఆర్‌బీకేల్లో విధులు నిర్వర్తించేలా ఆదేశాలిచ్చారు. ఇక పూర్తిస్థాయిలో కరస్పాండెంట్లు అందుబాటులో ఉన్న ఆర్‌బీకేల్లో వారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్‌బీకేల్లో సేవలందిస్తున్నారు.
ఆర్బీకేల్లో అందుతున్న బ్యాంకింగ్ సేవలివే..
► మొబైల్ స్వైపింగ్ మిషన్ ద్వారా విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా ప్రతీ బ్యాంకింగ్ కరస్పాండెంట్ పరిధిలో గరిష్టంగా రూ.25వేల వరకు ఉంచుతున్నారు.
► ఖాతాల్లేని రైతులతో బ్యాంకు ఖాతాలు తెరిపించడం, నగదు జమ చేయించడం, పంట రుణాల మంజూరు కోసం దగ్గరుండి డాక్యుమెంటేషన్ చేయించడం చేస్తున్నారు.
► బ్యాంకింగ్ లావాదేవీలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
► ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్ (డిజిటల్ పేమెంట్లు) కార్యకలాపాలపై శిక్షణనిస్తున్నారు.
► ప్లాస్టిక్ మనీ వినియోగాన్ని పెంచే దిశగా రైతుల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు.
ప్రతీ ఆర్బీకేకు ఓ కరస్పాండెంట్
ఆర్బీకేల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల మేరకు బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవాలని బ్యాంకులన్నింటికీ ఆదేశాలిచ్చాం. ఆర్‌బీకేలున్న ప్రతీచోట సమీప బ్యాంకులకు చెందిన కరస్పాండెంట్లు సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ కార్యకలాపాలను ఆర్‌బీకేల ద్వారానే అందించేందుకు కార్యాచరణ సిద్ధంచేస్తున్నాం.
– వి. బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్‌ఎల్‌బీసీ
Comments
Please login to add a commentAdd a comment