ఉద్యోగుల సాధక బాధకాలు మొత్తం ప్రభుత్వానికి తెలుసు
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది
ప్రభుత్వం ఏర్పాటు, పరిపాలనలో ఉద్యోగుల పాత్ర వెల కట్టలేనిది
5 ఏళ్ల ప్రభుత్వ ప్రస్థానం ఉద్యోగుల సహకారంతో సాఫీగా సాగింది
బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్సెస్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవ హారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగమేనని, ప్రభుత్వం ఏర్పాటు లో, పరిపాలనలో వారి పాత్ర వెలకట్టలేనిదని తెలిపారు.
ఈ ఐదేళ్ల ప్రభుత్వ ప్రస్థానం ఉద్యోగుల సహకారంతో సాఫీగానే సాగిందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సాధక బాధకాలు మొత్తం ప్రభుత్వానికి తెలుసునని చెప్పా రు.
వారి ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వమే ఒక పాలసీని రూపొందిస్తుందని చెప్పారు. ఉద్యోగుల జీతాల మొత్తం భారీగా పెరిగినప్పటికీ, వేతనాలు పెంచామని, కొత్త ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కోవిడ్ సమయంలో రాష్ట్రానికి ఆదాయం రాలేదని, అదనంగా డబ్బు ఖర్చయిందని తెలిపారు. చంద్రబాబు దిగిపోతూ ప్రభుత్వంపై రూ.2.90 లక్షల కోట్లఅప్పులు పడేశారన్నారు. ప్రభుత్వానికి అప్పు పుట్టకుండా, ఆదాయం రాకుండా చంద్రబాబు రోజూ అవాంతరాలు కల్పిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది అన్న పెద్ద మనిషి.. ఈరోజు 18 ఏళ్లు దాటిన అ మ్మాయిల దగ్గర నుంచి పథకాలు ప్రకటించారని, 50 ఏళ్లు దాటగానే బీసీలకు పెన్షన్ ఇస్తానంటున్నారని అన్నారు. అర్హత ఉన్న వారిని తీసేసీ పథకాలు ఇవ్వడం చంద్రబాబు దగ్గర ఉన్న ట్రిక్కని చెప్పారు. కానీ సీఎం జగన్ మాత్రం జల్లెడపట్టి అర్హత ఉన్న వారిని గుర్తించి మరీ పథకాలు అందజేస్తున్నారని తెలిపారు. నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేయకుండా అమ్మ ఒడి ఇచ్చి వదిలేసి ఉంటే నిధులు మిగిలేవన్నారు.
కానీ సీఎం జగన్ ఎంత కష్టమైనా స్కూళ్లను అభివృద్ధి చేయాల్సిందేనని గట్టి పట్టుదలతో పాఠశాలలను అధునాతనంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఆస్పత్రులకు కోటాను కోట్లు ఖర్చు చేశారని, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ తెచ్చారని తెలిపారు. రూ.16 వేల కోట్లతో నాలుగు పోర్టులు వస్తున్నాయని, అభివృద్ధి అంటే ఇది అని వివరించారు. కోవిడ్ రెండేళ్లు తీసేస్తే మిగిలిన తక్కువ కాలంలోనే దేశంలోనే ఆదర్శవంతంగా వ్యవస్థలో మార్పులు తెచ్చారన్నారు.
బ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉంది
బ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. బ్రాహ్మణులలో పేదలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. సీఎం జగన్ బ్రాహ్మణులకు రాజకీయంగా, ఇతరత్రా సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు. 2014 –19 మధ్య రాష్ట్రంలో అరాచకం నడిచిందని, తిరిగి ఆ పాలన వస్తే ప్రజలు కష్టాల పాలవుతారని అన్నారు.
అన్ని వర్గాలకు అర్ధమయ్యేలా చెప్పగలిగినది బ్రాహ్మణ సామాజిక వర్గమే కనుక సీఎం జగన్ ప్రకటించినట్లు 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పి.కామేశ్వరరావు (పీకేరావు), ప్రభుత్వ సలహాదారులు నేమాని భాస్కర్, జ్వాలాపురం శ్రీ కాంత్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుందర రామశర్మ, బ్రాహ్మణ సంఘం నాయకులు అమ్మ ప్రసాద్, ద్రోణంరాజు రవికుమార్, పి. పురుషోత్తమ శర్మ, జ్వాలా నరసింహారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment