ATM services
-
గ్రామాల్లో ‘ఎనీ టైం మనీ’
సాక్షి, అమరావతి: చాలా గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఉన్నా అరకొరగానే ఉంటాయి. ఏటీఎంల సంగతి సరేసరి. డబ్బులు తీసుకోవాలంటే మైళ్లకొద్దీ దూరం వెళ్లాలి. తీరా అక్కడికి వెళ్లాక ఏటీఎంలో డబ్బులు లేకపోతే మరో ఏటీఎంకి ప్రయాణం కట్టాలి. ఇది గ్రామీణ ప్రజలు నిత్యం అనుభవిస్తున్న కష్టం. ఈ కష్టాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామీణులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు అందుబాటులో ఉండేలా ఆర్బీకేలలోనే ఏటీఎంలను ఏర్పాటు చేయిసున్నారు. వాటిలో ఎప్పుడూ నగదు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గ్రామీణులకు వ్యవసాయ ఉత్పాదకాలు, ఉపకరణాలతోపాటు నగదు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకు ఉదాహరణే ఈ రైతు.. పేరు ఆచంట శ్రీనివాసరావు. తూర్పు గోదావరి జిల్లా కురుకూరు. గతంలో ఏది కావాలన్నా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన దేవరాపల్లికి వెళ్లేవారు. గ్రామంలో ఆర్బీకే ఏర్పాటు చేశాక ఇప్పుడు అన్నీ అక్కడే దొరుకుతున్నాయి. గ్రామం దాటి వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలు కూడా పొందుతున్నారు. 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లంట్ల ఆర్బీకే వద్ద ఏర్పాటు చేసిన ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకే, ఏటీఎంల వల్ల వ్యయప్రయాసలు తగ్గాయని శ్రీనివాసరావు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. గ్రామీణుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఆర్బీకేలకు అనుసంధానం చేసింది. ప్రతి ఆర్బీకే వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేస్తోంది. రైతుల్లో ఆర్ధిక అక్షరాస్యతను పెంపొందించడం, మొబైల్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడం, పేపర్లు లేని (పేపర్‌లెస్) ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే 9,160 ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులోకి వచ్చారు. మిగిలిన ఆర్బీకేల్లోనూ వీరి నియామకానికి బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నాయి. పైలట్ ఏటీఎంలకు అనూహ్య స్పందన ప్రభుత్వ పిలుపు మేరకు ఆర్బీకేల వద్ద యూనియన్ బ్యాంక్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకో ఆర్బీకే వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేసింది. వీటి పనితీరుపై బ్యాంక్ అధ్యయనం చేసింది. ఈ ఏటీఎంలను ఆర్బీకేల పరిధిలోని ఏడు నుంచి పది గ్రామాలకు చెందిన పదివేల మందికి పైగా రైతులు, ప్రజలు వినియోగించుకుంటున్నట్టు గుర్తించారు. ప్రతి రోజూ 50 నుంచి 100 హిట్స్ వస్తున్నాయని, ప్రతి ఏటీఎం నుంచి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు నగదు తీసుకుంటున్నట్లు గుర్తించారు. పల్లంట్ల ఆర్బీకే ఏటీఎం ది బెస్ట్ తూర్పు గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం పల్లంట్ల ఆర్బీకేలో తొలి ఏటీఎం ఏర్పాటు చేశారు. ఇది బెస్ట్ ఏటీఎంగా నిలిచినట్టు యూనియన్ బ్యాంక్ ప్రకటించింది. పల్లంట్లతో పాటు కురుకూరు, లక్ష్మీపురం, త్యాజంపూడి, చిక్కాల, దూమంతుని గూడేనికి చెందిన 10 వేల మందికిపైగా ఈ ఏటీఎంను ఉపయోగించుకుంటున్నారు. గతంలో వీరంతా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరాపల్లి (మండల కేంద్రం)కి వెళ్లేవారు. గత సంవత్సరం నవంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం రైతులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ ఏటీఎంను రోజుకు 75 నుంచి 100 మంది వరకు ఉపయోగించుకుంటున్నట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. రోజుకు సుమారు రూ.4 లక్షలు విత్‌డ్రా అవుతున్నట్లు వెల్లడైంది. ఏ సమయానికి వెళ్లినా నగదు అందుబాటులో ఉండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నో క్యాష్ బోర్డు చూడలేదు నేను 16 ఎకరాల్లో మిరప, మొక్కజొన్న, కర్రపెండలం సాగు చేస్తున్నా. గతంలో ఏది కావాలన్నా దేవరాపల్లి వెళ్లే వాళ్లం. ఇప్పుడు పల్లంట్లలో ఏర్పాటు చేసిన ఆర్బీకే మా అవసరాలన్నీ తీరుస్తోంది. ఇక్కడి ఏటీఎంలో ఎప్పుడు వెళ్లినా డబ్బు ఉంటుంది. నో క్యాష్ బోర్డు ఎప్పుడూ చూడలేదు. –వి.కిషోర్, లక్ష్మీపురం, తూర్పు గోదావరి చాలా సౌకర్యంగా ఉంది నేను 18 ఎకరాల్లో ఆయిల్ పామ్, వరి, మినుము, జీడిమామిడి సాగుచేస్తా. ఇంతకు ముందు డబ్బుల కోసం చాలా అవస్థలు పడే వాడిని. ఏటీఎం, బ్యాంకు శాఖలకు వెళ్లాలంటే చాలా సమయం, ఖర్చు ఎక్కువగా ఉండేది. ఇప్పుడా అవస్థలు లేవు. మా గ్రామం ఆర్బీకేలోనే ఏటీఎం ఏర్పాటు చేయడంతో చాలా సౌకర్యంగా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి డబ్బులు తెచ్చుకోగలుగుతున్నాం. – గాంధీప్రసాద్, పల్లంట్ల, తూర్పు గోదావరి ఆర్బీకే ఏటీఎంలకు స్పందన బాగుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు ఆర్బీకేల వద్ద పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ఏటీఎంలకు మంచి స్పందన లభిస్తోంది. మండల కేంద్రాలు, నగరాల్లో చాలా ఏటీఎంలకు లభించని ఆదరణ ఇక్కడ లభిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మరిన్ని ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్బీకేల వద్ద ఏటీఎంల ఏర్పాటుకు మిగిలిన బ్యాంకులు కూడా ముందుకొస్తున్నాయి. మలి దశలో కనీసం 100 ఏటీఎంలు ఏర్పాటు చేయాలని సంకల్పించాం. – వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ -
సచివాలయాల్లో ఏటీఎంలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పల్లె ప్రజానీకానికి మరిన్ని సేవలు విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వీటి ద్వారా ఉన్న ఊళ్లోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 540 రకాలకు పైగా సేవలను అందిస్తున్న సర్కారు.. ఇప్పుడు కొత్తగా వాటిల్లో ఏటీఎం సేవలను అందించేందుకు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా.. తొలి దశలో వచ్చే ఉగాది నాటికి కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఒక్కో జిల్లా నుంచి ఒక్కో సచివాలయంలో ఈ ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఆయా జిల్లాల్లో కూడా ఒక సచివాలయంలో ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక రెండో దశలో రెవెన్యూ డివిజన్లో కార్యకలాపాలు ఎక్కువగా సాగే ఒక సచివాలయంలోను.. మూడో దశలో మండల కేంద్రాల్లో కార్యకలాపాలు అత్యధికంగా జరిగే ఒక సచివాలయంలోను ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చర్యలను చేపట్టింది. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఇక రాష్ట్రంలో 9,160 రైతుభరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించగా.. 4,240 కేంద్రాల్లో ఇప్పటికే వీరు సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో 500 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలందిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి మొత్తం 2,95,925 మందికి ఆధార్ సేవలందించారు. మరో 2,500 సచివాలయాల్లో వచ్చే ఉగాది నాటికి ఈ సేవలనూ అందుబాటులోకి తేనున్నారు. సచివాలయాల్లో తొలిదశ కింద ఇప్పటికే 51చోట్ల రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించగా రెండో దశలో మరో 613చోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దశల వారీగా ఏటీఎంలు గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతుభరోసా కేంద్రాల కార్యకలాపాలు అత్యధికంగా ఉన్నచోట తొలిదశలో ఉగాది నాటికి జిల్లాకొక సచివాలయంలో ఏటీఎంలను ఏర్పాటుచేయనున్నాం. వ్యవసాయానికి అవసరమైన కొనుగోళ్లు చేసే రైతులతోపాటు ఇతరులకూ ఈ ఏటీఎంలు ఉపయోగపడతాయి. క్రమంగా రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లోని ఒక్కో సచివాలయంలో వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ -
యుద్ధ నౌకలో ఏటీఎం
న్యూఢిల్లీ: భారత అతిపెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో శనివారం తొలిసారిగా ఏటీఎం సేవలు ప్రారంభించారు. ఎస్బీఐ నిర్వహించే ఈ ఏటీఎం సేవలను నౌకలో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 15 వందల మందికి పైగా సిబ్బంది, అధికారులు వినియోగించుకుంటారు. నగదు ఉపసంహరణ, బదిలీ, క్రెడిట్ కార్డు చెల్లింపులు తదితర సేవలు ఈ ఏటీఎంలో అందుబాటులో ఉన్నాయని సమీప భవిష్యత్తులో దీన్ని నగదు డిపాజిట్ మెషీన్‌గా కూడా తీర్చిదిద్దుతామని ఓ అధికారి తెలిపారు. అలాగే నగదురహిత లావాదేవీలకు ప్రోత్సాహించే దిశగా రాబోయే రోజుల్లో ఈ యుద్ధ నౌకలో పీఓఎస్‌ను కూడా నెలకొల్పుతామని చెప్పారు. -
పోస్టల్ కార్యాలయూల్లో ఏటీఎం సేవలు
చీపురుపల్లి : తపాలా శాఖ ఖాతాదారులు సౌకర్యార్థం పోస్టల్ కార్యాలయూల్లో ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు శ్రీకాకుళం తపాలా శాఖ సూపరింటెండెంట్, విజయనగరం, పార్వతీపురం డివిజన్ల ఇన్చార్జి జనపాల ప్రసాద్‌బాబు చెప్పారు. ఇక్కడి సబ్ పోస్టల్ కార్యాలయూన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి పోస్టల్ కార్యాలయూల్లో త్వరలో ఏటీఎంలు ప్రారంభించనున్నట్టు చెప్పారు. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి పోస్టల్ కార్యాలయూల్లో ఇప్పటికే మీసేవా విభాగాలు ప్రారంభించామన్నారు. మీ సేవా ద్వారా అందించే సేవలన్నీ తమ కార్యాలయూల్లోనే ఇక నుంచి అందనున్నాయని తెలిపారు. తపాలా శాఖ ఆధ్వర్యంలో మైస్టాంప్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. మైస్టాంప్ పథకం ద్వారా సామాన్యుని ఫొటో కూడా స్టాంపుపై వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఒక వ్యక్తి రూ.300 చెల్లిస్తే ఐదు రూపాయల విలువ గల 12 స్టాంపులు ఆ వ్యక్తికి అందజేయడమే కాకుండా ఆ స్టాంపులపై ఆయన ఫొటోను ముద్రించనున్నట్టు తెలిపారు. తపాలా శాఖ ఆధ్వర్యంలో ఆశీర్వాదం పథకం కూడా అమల్లో ఉందన్నారు. దీని ద్వారా ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెలవారీ మనియూర్డర్ చేస్తే వారికి తిరిగి అక్కడి ప్రసాదం, దేవుని ఫొటో అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరసవల్లి, శ్రీకూర్మాం ఆలయూలకు మనియూర్డర్ చేసే భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. -
సేవలకు తలుపులు తెరిచిన తపాలా
బ్యాంకింగ్, బీమా, హౌస్ షిఫ్టింగ్, మైస్టాంప్ వంటి సేవలు వినియోగదారుల ప్రశంసలు అందుకుంటున్న వైనం పోస్టాఫీసులంటే ఒకప్పుడు ఉత్తరాల బట్వాడాకే పరిమితం. మరిప్పుడో... బ్యాంకుల్లోలా డబ్బులు వెయ్యచ్చు..తీయవచ్చు. వేరే ఊరికి డబ్బులు పంపొచ్చు. ఏటీఎం సేవలూ లభ్యం. తపాలా సేవలతో అతితక్కువ ఖర్చుతో ఇల్లు మారవచ్చు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం, బీమా సేవలు... వీటితో పాటు మీకో చక్కటి వరం తిరుపతి వెంకన్న స్వామి అక్షింతలతో ‘ఆశీర్వచనం’ సేవలు. ‘మై స్టాంప్’ సేవల కింద మీ ఫొటోలతోనే స్టాంపులు మీకు లభ్యం. నిన్నమొన్నటి వరకు కొన్ని రకాల సేవలకే పరిమితమైన తపాలా శాఖ ప్రస్తుతం తలుపులు బార్లా తెరిచి బహుముఖాలుగా తన సేవలను విస్తరించింది. - న్యూఢిల్లీ కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడానే కాకుండా బహుముఖాలుగా సేవలందిస్తోంది. జిల్లాలో ఆరు హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. గుంటూరు హెడ్ పోస్టాఫీసు పరిధిలో 36 బ్రాంచి పోస్టాఫీసులు ఉన్నాయి. తపాలా శాఖ ప్రస్తుతం ఏఏ సేవలు... ఎలా అందిస్తోందన్నది పూర్తి వివరాలు మీకోసం... ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఈ సౌకర్యం ద్వారా 24 గంటల్లో డబ్బులు వేరే ప్రాంతంలో ఉండేవారికి అందజేయవచ్చు. మొదటగా పోస్టాఫీసులో వినియోగదారుడు డబ్బులు చెల్లించగానే సంబంధిత అధికారి ఏ ప్రాంతానికైతే మనీ ఆర్డర్ బుక్ అయిందో ఆయా ప్రాంత కార్యాలయ అధికారికి మెసేజ్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేసి డబ్బులు అందేటట్టు చూస్తారు. కొంచెం సుదూర ప్రాంతం, ఇతర సమస్యలు వస్తే మాత్రం 48 గంటల సమయంలో ఈ ఎలక్ట్రానిక్ మనీఆర్డర్‌ను వినియోగదారునికి అందజేస్తారు. సేవింగ్స్ బ్యాంక్ పోస్టల్ ఖాతాలో బ్యాంకుల్లో ఉన్న జమ, విత్‌డ్రా వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఏటీఎం సౌకర్యం సైతం అతిత్వరలో అందుబాటులోకి రానుంది. మరికొద్ది రోజుల్లో బ్యాంకు మాదిరిగా రుణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సేవింగ్స్ బ్యాంక్‌లో అయితే వయోవృద్ధులకు బ్యాంకులాగానే 9 శాతం వడ్డీని పోస్టల్‌శాఖ చెల్లిస్తుంది. కొన్ని రోజుల్లో పోస్టల్ బ్యాంక్‌లు కూడా వస్తాయని పోస్టల్ అధికారులంటున్నారు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం ఏ జిల్లాల్లో అయితే రైల్వే రిజర్వేషన్ కార్యాలయం లేదో, ఆ ప్రాంతంలోని పోస్టాఫీసులో ఈ సౌకర్యం లభిస్తుంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా సౌకర్యాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ దీని ప్రత్యేకత. పల్లె ప్రాంత ప్రజలకు గ్రామీణ తపాలా జీవిత బీమా, పట్టణంలోని ఇతరులందరికి ఎంప్లాయిస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. గ్రామాల్లో ఉండేవారికి గ్రామీణ తపాలా బీమా ఉపయోగపడుతుంది. ఆశీర్వచనం ఆశీర్వచనం పథకం ప్రశంసలు అందుకుంటోంది. పోస్టల్‌శాఖలో వినూత్న పథకంగా కొందరు భక్తులు చెబుతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంతన ఉన్న అక్షింతలను కేవలం రూ.5 ఆర్డర్ ద్వారా పొందవచ్చు. అక్షింతలతోపాటు స్వామివారి ఫోటో కూడా అందుతుంది. తిరుపతి వెళ్లలేని పరిస్థితి ఉన్నవారికి ఈ పథకం ఓ వరంగా చెప్పవచ్చు. లాజిస్టిక్ పోస్టు ఈ లాజిస్టిక్ పోస్టు సౌకర్యంలో మరికొన్ని సేవలు లభిస్తాయి. కొన్ని ముఖ్య వస్తువులను వేరే ప్రాంతాలకు పంపించుకోవచ్చు. నగరంలో నివసించే వారు అయితే హౌస్షిప్టింగ్కు కూడా వినియోగింపవచ్చు.ఇల్లు మార్పిడికి ఇక వేలకువేలు చెల్లించే అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు మారిపోవచ్చు. ఈ సౌకర్యం బాగుందని తపాలా శాఖ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ విధమైన హౌస్ షిప్టింగ్ సౌకర్యం ఉందని కొందరికి మాత్రమే తెలుసునని, దీనికి ఇంకా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని పోస్టల్ అధికారులు భావిస్తున్నారు. మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వారికైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం లభిస్తుంది. ముందుగా పోస్టల్ కార్యాలయంలో డబ్బు జమ చేయగానే, మనీ అందుకోవాల్సిన సంబంధిత చిరునామా గల వ్యక్తి మొబైల్‌కు ఓ కోడ్ నంబర్ ఆన్లైన్ ద్వారా మెసేజ్‌గా వెళ్తుంది. అనంతరం ఆ కోడ్ నంబర్‌గల మొబైల్‌ను డబ్బులు అందుకోవాల్సిన వ్యక్తి పోస్టల్ కార్యాలయంలో చూపిస్తే వెను వెంటనే బల్క్ మొత్తం డబ్బులు అయినా ఒక ఐడీ ఫ్రూఫ్‌ను తీసుకుని పోస్టల్ సిబ్బంది అందజేస్తారు. త్వరలో మరికొన్ని.. పోస్టల్‌శాఖలో మరికొన్ని సేవలు వస్తాయని తెలుస్తోంది. కూరగాయలను వేరే ప్రాంతాలకు చేరవేయడం, పోస్టల్ బ్యాంకులు అందుబాటులోకి తెచ్చి అన్ని ప్రాంతాలకు విస్తరించడం వంటి సౌకర్యాలు వస్తాయి. వీటితోపాటు మరికొన్ని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.