సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పల్లె ప్రజానీకానికి మరిన్ని సేవలు విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వీటి ద్వారా ఉన్న ఊళ్లోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 540 రకాలకు పైగా సేవలను అందిస్తున్న సర్కారు.. ఇప్పుడు కొత్తగా వాటిల్లో ఏటీఎం సేవలను అందించేందుకు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా.. తొలి దశలో వచ్చే ఉగాది నాటికి కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఒక్కో జిల్లా నుంచి ఒక్కో సచివాలయంలో ఈ ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఆయా జిల్లాల్లో కూడా ఒక సచివాలయంలో ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక రెండో దశలో రెవెన్యూ డివిజన్‌లో కార్యకలాపాలు ఎక్కువగా సాగే ఒక సచివాలయంలోను.. మూడో దశలో మండల కేంద్రాల్లో కార్యకలాపాలు అత్యధికంగా జరిగే ఒక సచివాలయంలోను ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చర్యలను చేపట్టింది.
ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు
ఇక రాష్ట్రంలో 9,160 రైతుభరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించగా.. 4,240 కేంద్రాల్లో ఇప్పటికే వీరు సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో 500 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలందిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి మొత్తం 2,95,925 మందికి ఆధార్ సేవలందించారు. మరో 2,500 సచివాలయాల్లో వచ్చే ఉగాది నాటికి ఈ సేవలనూ అందుబాటులోకి తేనున్నారు. సచివాలయాల్లో తొలిదశ కింద ఇప్పటికే 51చోట్ల రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించగా రెండో దశలో మరో 613చోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
దశల వారీగా ఏటీఎంలు
గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతుభరోసా కేంద్రాల కార్యకలాపాలు అత్యధికంగా ఉన్నచోట తొలిదశలో ఉగాది నాటికి జిల్లాకొక సచివాలయంలో ఏటీఎంలను ఏర్పాటుచేయనున్నాం. వ్యవసాయానికి అవసరమైన కొనుగోళ్లు చేసే రైతులతోపాటు ఇతరులకూ ఈ ఏటీఎంలు ఉపయోగపడతాయి. క్రమంగా రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లోని ఒక్కో సచివాలయంలో వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం.
– అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్
Comments
Please login to add a commentAdd a comment