
న్యూఢిల్లీ: బ్యాంకు సర్వీసులను ’వ్యాపార అవసరాల’కు ఉపయోగించుకునే వ్యక్తులను ‘వినియోగదారు’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వినియోగదారు పరిధిలోకి రావాలంటే.. తాను స్వయం ఉపాధి ద్వారా జీవిక పొందేందుకు మాత్రమే బ్యాంకు సేవలను ఉపయోగించుకున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వ్యాపార లావాదేవీలను వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం పరిధిలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఓ సవరణ చేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు–శ్రీకాంత్ జి మంత్రి ఘర్ మధ్య ఓవర్‌డ్రాఫ్ట్ వివాదానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శ్రీకాంత్.. సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తాజా ఆదేశాలు వెలువడ్డాయి.