
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.11 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ నగల వ్యాపారి నీరవ్ మోదీ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయించాలని, ఆయనను భారత్‌కు అప్పగించేలా చూడాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. ఈ కుంభకోణం ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని న్యాయవాది జేపీ ధండా వాదనలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఏకీభవించింది.
న్యాయవాది వినీత్ ధండా ఈ పిటిషన్ దాఖలు చేశారు. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక, న్యాయ శాఖలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీని, ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను దేశానికి అప్పగించే ప్రక్రియ ప్రారంభించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల ప్రమేయం ఉన్న ఈ స్కాంను సిట్‌తో విచారణ జరిపించాలని కూడా కోరారు. స్కాంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నతాధికారుల పాత్ర విషయంలో కూడా దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకులకు మార్గదర్శకాలు రూపొందించేలా ఆర్థిక శాఖను ఆదేశించాలని కూడా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment