Self employment
-
నిశ్శబ్దాన్ని ఛేదించారు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వాళ్లంతా కాలం కాటేసిన అభాగ్యులు.. చేయని తప్పులకు సమాజం నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్న బాధితులు.. నిత్యం దేహంలోని శత్రువుతోపాటు సమాజంతోనూ పోరాడుతున్న ధీరులు. కుంగిపోతే సమాజం మరింత తొక్కేస్తుందని గుర్తెరిగి.. ధైర్యంగా తలెత్తుకొని నిలబడే ప్రయత్నం చేస్తూ ఇప్పుడిప్పుడే నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నారు. ఒక్కొక్కరుగా సంఘటితమవుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఎయిడ్స్, హెచ్ఐవీ బాధితులు కష్టాలను ఎదిరించి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు.రెండు జిల్లాల్లో సొసైటీలు...⇒ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులు నిశ్శబ్దాన్ని ఛేదించారు. మండలాలవారీగా సంఘాలుగా ఏర్పడుతున్నారు. జిల్లా స్థాయిలో సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేసుకుని నెలనెలా కొంత డబ్బు పొదుపు చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి ‘వర్డ్’అనే స్వచ్ఛంద సంస్థ అండగా నిలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో ‘స్వయం కృషి’పేరుతో, నిజామాబాద్‌లో ‘విజేత’పేరుతో 2021 సంవత్సరంలో మ్యూచ్‌వల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మాక్స్)లు ఏర్పాటు చేసుకున్నారు. సంఘంలో సభ్యత్వ రుసుముగా రూ.50తోపాటు రూ.100 చెల్లించి రూ.10 ముఖ విలువగల 10 షేర్లు కొని సభ్యులుగా చేరుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని స్వయంకృషి సంఘంలో 1,393 మంది సభ్యులు చేరగా, 63 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,330 మంది సభ్యులున్నారు. నిజామాబాద్ విజేత సంఘంలో 1,169 మంది సభ్యులకుగాను 82 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,087 మంది సభ్యులున్నారు. ప్రతినెలా సమావేశం.. ⇒ ఈ సంఘాల్లోని సభ్యులంతా నెలకోసారి మండల స్థాయిలో నిర్వహించు కునే సమావేశంలో కలుస్తారు. ఆ సమయంలో అందరూ తలా రూ.100 చొప్పున సంఘంలో జమ చేస్తారు. ఇలా ఇప్పటివరకు జమ చేసిన సొమ్ము ప్రస్తుతం స్వయంకృషి సొసైటీలో రూ.8.55 లక్షలకు, విజే త సొసైటీలో రూ.8.44 లక్షలకు చేరింది. ఈ సొసైటీలు ఏర్పా టు చేసి హెచ్ఐవీ బాధితులను చైతన్యపరుస్తున్న వర్డ్ స్వచ్ఛ ంద సంస్థ ఒక్కో సొసైటీలో రూ.2.50 లక్షల చొప్పున కార్పస్ ఫండ్‌ను ముందుగానే జమ చేసింది. దీంతో ఆయా సంఘాల్లో ఇప్పుడు రూ.10 లక్షలకు పైగానే డబ్బు జమయ్యింది. ప్రభుత్వ పథకాలు పొందుతూ..ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్‌ను తీసుకోవడంతోపాటు వారికి కావలసిన మందులు, వైద్య సేవలు పొందడానికి హెచ్ఐవీ బాధితులకు వర్డ్ సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో చాలామంది మంది వివిధ రకాల ప్రభుత్వ పథకాలు పొందారు. ఈ సంఘాల్లోని 12 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు లభించాయి. పది మందికి దళితబంధు పథకం ద్వారా లబ్ధి చేకూరింది. మిషన్ వాత్సల్య ద్వారా హెచ్ఐవీతో చనిపోయిన వారి పిల్లలు 27 మందికి నెలనెలా ప్రభుత్వ సాయం అందుతోంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.40 వేల చొప్పున పూర్తి సబ్సిడీపై మేకలు, గొర్రెలను 39 మందికి అందించారు. తొమ్మిది మంది రుణాలు పొంది కిరాణా దుకాణాలు, హోటళ్లు నిర్వహిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా పది మందికి రూ. 50 వేల చొప్పున సాయం అందింది.మానసిక స్థైర్యం కలి్పస్తూ... ప్రతినెలా బాధితులంతా మండలాలవారీగా ఒక చోట చేరతారు. ఆ సమావేశాల్లో సభ్యుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం, వారికి కావలసిన వైద్య సాయం అందించడం, మానసిక స్థైర్యం నింపటానికి కౌన్సెలింగ్ చేయడం వంటివి కొనసాగిస్తున్నారు. దీంతో చాలా మంది బాధితులు ధైర్యంగా తమతమ పనులు చేసుకుంటున్నారు. హెచ్ఐవీ బాధితులం అనే బాధ నుంచి బయటపడి సాధారణంగా ఉండే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారు.టైలరింగ్ చేస్తున్నా: నా భర్త చనిపోయాడు. స్వచ్ఛంద సంస్థ టైలరింగ్ నేరి్పంచి మిషన్ కూడా అందించింది. నేను బట్టలు కుడుతూ కొడుకును పెంచి పెద్ద చేశాను. డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా వచ్చింది. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా క్రమంతప్పకుండా మందులు వాడుతూ సంతోషంగా ఉన్నాను. – కామారెడ్డికి చెందిన హెచ్ఐవీ బాధితురాలుమేకల పెంపకంతో ఉపాధి..: మేకల పెంపకానికి నూరు శాతం సబ్సిడీ కింద ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అప్పుడు 4 మేకలు ఉండేవి. ఇప్పు డు మంద తయారైంది. వాటితో జీవనం సాగి స్తున్నాను. మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా అందాయి. ఏ ఇబ్బందీ లేదు. నెలనెలా సంఘం మీటింగ్‌కు హాజరవుతున్నా. – కామారెడ్డి జిల్లాకు చెందిన హెచ్ఐవీ బాధితుడు -
తగ్గుతున్న ఉద్యోగాలు.. అందరి చూపు అటువైపే!
నిరుద్యోగం అనేది భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒక సమస్యగా ఉంది. యూరప్ దేశమైన ఎస్టోనియాలో నిరుద్యోగం రేటు 2024 రెండో త్రైమాసికంలో 7.6 శాతం పెరిగిందని స్టాటిస్టిక్స్ ఎస్టోనియా సంస్థ 'టీ వాసిల్జెవా' (Tea Vassiljeva) వెల్లడించారు.టీ వాసిల్జెవా గణాంకాల ప్రకారం, 2023 రెండో త్రైమాసికంతో పోలిస్తే 2024 రెండో త్రైమాసికంలో నిరుద్యోగుల సంఖ్య 7,600 పెరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ భాగం యువత ఉన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. రెండవ త్రైమాసికంలో నిరుద్యోగుల సంఖ్య కొంత ఎక్కువే అని వాసిల్జెవా పేర్కొన్నారు.పెరిగిన స్వయం ఉపాధిఎస్టోనియాలో ఉద్యోగం రాలేదని ఎదురు చూడకుండా.. చాలామంది స్వయం ఉపాధివైపు అడుగులు వేశారు. దీంతో స్వయం ఉపాధి పెరిగింది, ఉపాధిలో ఉన్నవారి సంఖ్య వృద్ధి చెందింది. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో ఉపాధిలో ఉన్న వ్యక్తుల నిష్పత్తి 10.6 శాతానికి చేరింది.రాబోయే రోజుల్లో (మూడో త్రైమాసికం) స్వయం ఉపాధి మరింత పెరిగే అవకాశం ఉందని వాసిల్జెవా వెల్లడించింది. ఇందులో 15 నుంచి 74 సంవత్సరాల వయసున్న వారు ఉన్నారు. వీరందరూ ఉద్యోగం కోసం వేచి చూడక సొంత పని ప్రారంభిస్తున్నారు. ఇది వారి ఆర్థిక వృద్ధికి దోహదపడుతోంది.ఇదీ చదవండి: మార్చి నాటికి భారత్‌లో 6 లక్షల ఉద్యోగాలు: యాపిల్లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాల ప్రకారం, ఎస్టోనియాలో శాశ్వత నివాసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తాత్కాలికంగా ఉండేవారు లేదా ఉక్రేనియన్ శరణార్ధుల సంఖ్య తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది కూడా ఎస్టోనియాలో స్వయం ఉపాధి పెరగటానికి ఓ కారణమనే చెప్పాలి. ఎందుకంటే తాత్కాలికంగా ఉండే ప్రజలు ఉద్యోగం లేకుంటే.. ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. కానీ శాశ్వతంగా నివాసం ఉండేవారు అక్కడే ఉండాలని, ఉద్యోగం లేకపోతే స్వయం ఉపాధి చూసుకుంటున్నారు. ఇలా అక్కడ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పెరుగుతోంది. ఇదే ఫార్ములా ఎక్కడైనా, ఏ దేశంలో అయినా ఉపయోగించవచ్చు. ఉద్యోగం రాలేదని ఎదురు చూడక, స్వయం ఉపాధి పొందవచ్చు. -
సాధికార విజయం..మహిళల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు
-
సెల్ఫ్ ఎంపవర్మెంట్
కోల్‌కతాకు చెందిన దీప్తి ఘోష్ ఇంజనీరింగ్ చదువుకుంది. తండ్రి చనిపోవడంతో కుటుంబ బరువు బాధ్యతలు తనపై పడ్డాయి. ఉద్యోగాల వేటలో పడింది. అయితే వచ్చిన ఒకటీ రెండు ఉద్యోగాలు ‘ఔట్ ఆఫ్ కోల్‌కతా’ వచ్చాయి. తల్లి, చెల్లిని విడిచి దూరంగా ఉండలేని పరిస్థితి. సిటీలో ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో ఏమో అనుకునే పరిస్థితుల్లో ఖాళీగా ఉండడం ఎందుకని క్యాబ్ డ్రైవర్‌గా మారింది. మంచి ఆదాయాన్ని అర్జిస్తూ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. దీప్తి క్యాబ్‌లో ప్రయాణించిన దిల్లీకి చెందిన పరమ్ కల్యాణ్‌సింగ్ ఆమె స్టోరీని పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఇదే’ ‘చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదని బాధపడుతూ కూర్చోవడం కంటే ఇది ఎంత గొప్ప పని!’ ‘దీప్తి తన వృత్తిని గౌరవిస్తుంది. శ్రమజీవుల లక్షణం ఇది. స్త్రీ సాధికారతకు తిరుగులేని ఉదాహరణ దీప్తి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
రికార్డు సృష్టించిన ట్రాన్స్‌జెండర్ ఆషాఢం ఆశ.. ఎలా అంటే?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆ ఇద్దరూ.. ఊహ తెలిసినప్పటి నుంచీ.. తాము స్త్రీలమా.. పురుషులమా.. అన్న విషయం తెలియక మథనపడ్డారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్ ఇలా ప్రతి చోటా గుర్తింపు సమస్యే. పైపెచ్చు హేళన, వివక్ష. దీంతో మరింత మనోవేదనకు గురయ్యారు. ఇలాగే ఉంటే.. తమ మనుగడ కష్టమవుతుందని భావించారు. ఇంటి గడప దాటి తమలా ఉండే వారితో కలిసి జీవిస్తున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడే గౌరవ ప్రదమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తోటివారికి సైతం సహకరిస్తున్నారు. సమాజంలో అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారే కరీంనగర్‌కు చెందిన ఆషాఢం ఆశ, నక్కా సింధు. స్వయం ఉపాధికి ప్రభుత్వ రుణం సంపాదించిన రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఆషాఢం ఆశ రికార్డు సృష్టించింది. అదేవిధంగా స్వయం ఉపాధి కోసం డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించిన రాష్ట్రంలోని రెండో ట్రాన్స్‌జెండర్‌గా నక్కా సింధు గుర్తింపు సాధించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ తమ కమ్యూనిటీకి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ అనగానే.. ట్రాఫిక్ సిగ్నళ్లు, రైళ్లు, రైల్వేస్టేషన్లలో డబ్బులు వసూలు చేసేవాళ్లే కాదు.. అని కుండబద్ధలు కొడుతున్నారు. తమకు అవకాశాలిస్తే.. నైపుణ్యంతో సొంతకాళ్ల మీద నిలబడతామని ఢంకా భజాయిస్తున్నారు. ఫొటోగ్రఫీ వృత్తి కోసం 5 లక్షల రుణం సాధించిన ఆశ ప్రభుత్వ రుణం సంపాదించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డు కాలేజీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు.. కరీంనగర్‌కు చెందిన ఆషాఢం ఆశ మగాడిలా పుట్టినా.. చిన్ననాడే తన ఆలోచనలన్నీ అమ్మాయిలా ఉన్నా యని ఆమెకు అర్థమైపోయింది. ఆమె ప్రవర్తనను మొదట్లో కుటుంబసభ్యులు వ్యతిరేకించినా తర్వాత అర్థం చేసుకున్నారు. తన ఇష్టం మేరకు చదివించి హోటల్ మేనేజ్మెంట్లో సైతం చేర్పించారు. కానీ ఆఖరి సెమిస్టర్లో తాను థర్డ్ జెండర్ అని గుర్తించిన క్లాస్మేట్స్ వేధించడం ప్రారంభించారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆశ.. ఆపరేషన్లు చేయించుకుని పూర్తిగా అమ్మాయిలా మారింది. తీరా వెళ్లి సర్టిఫికెట్లు కావాలని అడిగితే కాలేజీ నిరాకరించింది. విధిలేని పరిస్థితుల్లో ఫొటోగ్రఫీ, గ్రాఫిక్స్ నేర్చుకుంది. మొదట్లో ఆల్బమ్‌లు అందంగా డిజైన్ చేసేది. తర్వాత తానే స్వయంగా ఫొటోలు తీయడం ప్రారంభించింది. మెల్లిగా ఈవెంట్లకు ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం చాలామంది అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ మెప్మా అధికారుల ద్వారా కలెక్టర్ కర్ణన్‌ను కలిసింది. ఆయన వెంటనే రూ.5 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించడంతో ఫొటోగ్రఫీ వృత్తిని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. సమాజం మారుతోంది.. సహకారం లభిస్తోంది సమాజంలో మాపై చిన్నచూపు ఇంకా ఉంది. తొలి నాళ్లలో నేను ఫొటోలు బాగా తీసినా థర్డ్ జెండర్నని చెప్పి వెనుకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తోంది. మా సమస్యలను సమాజం మెల్లిగా అర్థం చేసుకుంటోంది. ప్రముఖ నటులు లారెన్స్, సుధీర్‌బాబు, అక్షయ్ కుమా ర్లు మాలాంటి వారి కథలతో సినిమాలు తీయడం ద్వారా మా ఇబ్బందులు సమాజానికి తెలిసేలా చేశారు. ప్రభుత్వాలు, కోర్టుల నుంచి మాకు గుర్తింపు, సహకారం లభించడం గొప్ప విషయం. మాలాంటి వారికి ఆధార్, పాన్, ఓటరు తదితర గుర్తింపు కార్డులు, ప్రభుత్వ సాయాల సాధనకు కృషి చేస్తున్నా. ట్యాక్సీ కోసం డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సింధు సహచర థర్డ్ జెండర్లలో స్ఫూర్తి నింపుతున్న వైనం విజయగాథలతో స్ఫూర్తి పొంది.. కరీంనగర్‌కే చెందిన నక్కా సింధు కొన్నినెలల క్రితం వరకు ఎలాంటి పనిలేకుండా ఉండేది. ఆశ లాగానే థర్డ్ జెండర్ కావడం వల్ల ఎవరూ పనిచ్చేవారు కాదు. స్కూలు వరకే చదువుకోవడం, బయట వివక్ష , హేళన కారణంగా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కానీ ఉస్మాని యాలో ప్రభుత్వ డాక్టర్లుగా చేరిన ట్రాన్స్జెండర్లు డాక్టర్ ప్రాచీ రాథోడ్, డాక్టర్ రుతు జాన్పాల్ల గురించి తెలుసుకున్నాక సింధు జీవితంలో మార్పు వచ్చింది. తమిళనాడులో థర్డ్‌జెండర్ కోటాలో ఎస్సై ఉద్యోగం సాధించిన ప్రతీక యాష్మీ విజయ గాథ కూడా ఆమెలో స్ఫూర్తినింపింది. ఎలాగైనా తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదలతో కరీంనగర్ మెప్మా వారి సాయంతో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన రెండో థర్డ్‌జెండర్‌గా (తొలి లైసెన్స్ జనగామ జిల్లాలోని డాలీ పేరిట జారీ అయింది) ప్రత్యేక రికార్డు సాధించింది.వెంటనే ట్యాక్సీ తీసుకునేందుకు అవసరమైన రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. చిన్నచూపు పోవాలి.. నాకు చాలాకాలం పాటు ఎలాంటి పని దొరకక పోవడంతో చాలా కుంగిపోయా. కానీ నాలాంటి వారు కొందరి గురించి తెలుసుకున్నాక కొత్త ధైర్యం వచ్చింది. కరీంనగర్ మెప్మా వారి ప్రోత్సాహం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే పట్టుదలతో కలెక్టర్ గారి సహకారంతో డ్రైవింగ్ లైసెన్స్ సాధించా. ప్రస్తుతం ట్యాక్సీ తీసుకోవడానికి అవసరమైన రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను. సమాజంలో థర్డ్ జెండర్లపై చిన్నచూపు పోవాలి. అప్పుడే మాలాంటి వారికి అవకాశాలు వస్తాయి. – నక్కా సింధు -
మీ ఫ్యామిలీ బడ్జెట్ వేశారా?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి వచ్చేసరికి ప్రభుత్వాలు బడ్జెట్ పై కసరత్తు చేస్తుంటాయి. అది పెద్దస్థాయి కదా మనకెందుకులే అని వదిలేయద్దు. ఎందుకంటే, ఖర్చు ఎక్కడ పెట్టాలి..? ఎక్కడ తగ్గించుకోవాలి..? ఎంత మొత్తం పొదుపు చేయాలి..? వీటన్నింటికంటే ముందు ఆదాయం ఎంత? అన్న అంశాలపై అవగాహన ప్రతి కుటుంబానికీ కూడా ఉండాలి. అదే బడ్జెట్ ప్లానింగ్. మొన్న కేంద్ర బడ్జెట్ విడుదలైంది. ఇప్పుడు మన ఫ్యామిలీ బడ్జెట్ వంతు వచ్చింది. ఏమంటారు? నెలవారీ జీతాలతో లేదా స్వయం ఉపాధితో జీవనం సాగించే వారికి నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ అత్యవసరం. మనకు వచ్చేదెంత? అందులో మనం దేనికి, ఎంత ఖర్చుపెట్టాలి..? ఎక్కడ ఆదా చేయాలి..? అన్న అంశాలపై అవగాహన ఉంటే ఇంటి నిర్వహణ సులువు అవుతుంది. బడ్జెట్ ప్లానింగ్ ఉంటే మీ నెలవారీ ఖర్చులను సులభంగా నిర్వహించుకోవచ్చు. అత్యవసర పరిస్థితి కోసం కొంత మొత్తం జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే కొంత మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా.. మీ చేతికి వస్తున్న సంపాదనలో 20 నుంచి 30 శాతం వరకూ పొదుపు చేయడం మంచిది. ఒకవేళ ఇంత మొత్తంలో చేయలేకపోయినా.. అవకాశం ఉన్న మేరకు పక్కన పెట్టాలని పెద్దల సలహా. కుటుంబ సభ్యుల ఆమోదం: ఫలానా దానికి ఇంత మొత్తం ఖర్చు పెట్టాలి అని మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఇంట్లోని ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. అలా ఉండాలంటే ముందుగా మీరు చేయాల్సింది... నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ కోసం కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి వివరించాలి. రాబడి, ఖర్చుల విషయాలను అందరితో చర్చించాలి. అప్పుడు వారికి కూడా అవగాహన ఏర్పడి, ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వృథాను అరికట్టాలి మనం పొదుపు చేయాలి అంటే కుటుంబంలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఏది అవసరం, ఏది అనవసరం అనే అవగాహన ఉండాలి. ముఖ్యంగా వృథా ఖర్చులను తగ్గించాలి. సరుకులు లేదా వస్తు సామగ్రిని ఎక్కువెక్కువ తెచ్చుకోవడం, ఇష్టం వచ్చినంత వండటం, పారెయ్యటం వల్ల ఎంతో డబ్బు వృథా అవుతుంది. అందువల్ల అట్లాంటి వృథాకు అడ్డుకట్ట వేయాలి. క్రెడిట్ కార్డుతో జాగ్రత్త.. క్రెడిట్ కార్డు ఉన్నది అత్యవసర సమయంలో ఉపయోగపడటానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. చేతిలో కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చుపెట్టకూడదు. మీ నెలవారీ రాబడిని అంచనా వేసుకొని అప్పుడు మాత్రమే కార్డును వినియోగించాలి. పొదుపు పథకాల్లో.. ఇలా ప్రతి నెలా బడ్జెట్ ప్లానింగ్ చేసుకొని ఆదా చేసిన సొమ్మును ఖతాలో అలా ఉంచకుండా.. మార్కెట్ రిస్క్ లేని పెట్టుబడి పథకాలు అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. పొదుపు ఎంత ఉండాలి? ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్నే. పొదుపు చేయాలంటే ముందు మన ఆదాయాన్ని అంచనా వేసుకోవాలి. ఎందుకంటే, ఆదాయాన్ని బట్టి పొదుపు శాతం పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. అయితే, ఆదాయంతో సంబంధం లేకుండా, సాధారణ కుటుంబ ఖర్చులు మినహా మరే విధమైన అదనపు ఖర్చులూ లేకుండా ఉంటే పొదుపు ఎంత ఉండాలో చెప్పడానికి కొన్ని సూత్రాలు... ప్రతి మనిషి కనీసం ఆరునెలల జీతం లేదా ఆదాయాన్ని నగదు రూపంలో దాచుకోవాలి. ఒకవేళ ఒకేసారి అలా దాచుకోలేని వారు నెలనెలా కొంత పక్కనపెడుతూ ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ ఖర్చుకు సమానమైన ఆదాయం లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దిగువ మధ్యతరగతి వారు తమ ఆదాయం లో ఐదు నుంచి పది శాతం పొదుపు చేయాలి. పొదుపు చేయడానికి మిగలక పోయినా ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారానో, ఖర్చును తగ్గించుకోవడం ద్వారానో కచ్చితంగా పొదుపు చేయాలి. నెలవారీ సగటు కుటుంబ ఖర్చు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేవాళ్లు నెలనెలా 25 శాతం పొదుపు చేయాలి. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే భర్త ఇంటి ఖర్చులు పెడతారు కాబట్టి భార్య 50 శాతం పొదుపుచేయాలి. అధికాదాయ వర్గాలు అయితే కుటుంబ ఆదాయంలో సగం పొదుపునకు మళ్లించాలి. భవిష్యత్తులో ఆదాయం పొరపాటున తలకిందులైతే ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఇలా చేసిన పొదుపు ఆదుకుంటుంది. పొదుపు మార్గాలు కొన్ని... ► అవసరం లేకుండా డిస్కౌంట్లలో వచ్చే వస్తువులు కొనద్దు. ► అవసరానికి ముందే ఏ వస్తువులనూ కొనుగోలు చేయకండి. ► నిర్దిష్ట తేదీల్లోపు బిల్లులు చెల్లించండి. దీని కోసం బిల్స్ పే క్యాలెండర్ తయారు చేసుకోవాలి. ► మీ బ్యాంకు ఖాతాలు ప్రతి నెల చివరన చూసుకోండి. వృథా ఖర్చులు తెలుస్తాయి. వృథా ఖర్చుల జాబితా రాయండి. ప్రతినెలా ఎంత వృథా పోతుందో తెలిస్తే ఆటోమేటిక్‌గా అప్రమత్తత పెరుగుతుంది. ► ఏ వస్తువు కొనాలన్నా ఇంటర్నెట్æద్వారా వివిధ మాల్స్/దుకాణాల్లో వాటి ధరల తేడాలు చూసి ఎక్కడ తక్కువో అక్కడ కొనండి. ఎందుకంటే ప్రతి డీలరు వేర్వేరు ధరలపై వస్తువులను అమ్ముతారు. చివరగా ఒక మాట... మీ బడ్జెట్ ఎంత పకడ్బందీగా ఉంటే భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా మీ పిల్లలకు కూడా ఇప్పటినుంచే పొదుపు చేయడాన్ని అలవాటు చేయండి. వారికి ఇచ్చే పాకెట్ మనీతో వారికి కావలసిన వాటిని ఎలా కొనుక్కోవాలో నేర్పించండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ ఫైనాన్స్ మేనేజర్ లేదా నిపుణులైన హోమ్ మినిస్టర్ అవుతారు. ఇంతవరకు మీరు బడ్జెట్ వేసుకోకపోతే ఇప్పుడైనా వేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.. మీ బడ్జెట్‌ను నెలవారీ రివ్యూ చేసుకోవాలి. ఏమైనా మార్పులు అవసరం అయితే కచ్చితంగా ఆయా మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం మీ కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. కచ్చితంగా పెట్టవలసిన ఖర్చును పక్కన పెట్టి.. ఇంకా ఏమైనా ఆదా చేసుకునే మార్గం ఉందేమో చూడాలి. -
అలా చేస్తే వినియోగదారుల పరిధిలోకి రారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బ్యాంకు సర్వీసులను ’వ్యాపార అవసరాల’కు ఉపయోగించుకునే వ్యక్తులను ‘వినియోగదారు’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వినియోగదారు పరిధిలోకి రావాలంటే.. తాను స్వయం ఉపాధి ద్వారా జీవిక పొందేందుకు మాత్రమే బ్యాంకు సేవలను ఉపయోగించుకున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వ్యాపార లావాదేవీలను వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం పరిధిలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఓ సవరణ చేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు–శ్రీకాంత్ జి మంత్రి ఘర్ మధ్య ఓవర్‌డ్రాఫ్ట్ వివాదానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శ్రీకాంత్.. సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. -
దళితబంధులో మొత్తం 30 పథకాలు.. జాబితా ఇదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దళితబంధు కింద లబ్ధిదారులకు ఉపయోగపడే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దళితులకు స్వయం ఉపాధి కల్పన కోసం మొత్తం 30 రకాల పథకాలు/కార్యక్రమాల జాబితాను విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం మినీ డెయిరీ యూనిట్ నుంచి మినీ సూపర్ బజార్ వరకు వివిధ రకాల స్వయం ఉపాధి పథకాలను ఇందులో చేర్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారిని దృష్టిలో పెట్టుకుని వీటిని ఎంపిక చేసింది. దళితుల అభ్యున్నతికి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఈ పథకం కింద ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు.. ప్రభుత్వం ఎంపిక చేసిన ఈ 30 పథకాల్లో తమకు నచ్చిన ఒక దానిని ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ పథకం అమలుపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. -
సబ్సిడీపై 5,600 మినీ ట్రక్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీలకు 3,800 మినీ ట్రక్కులు, ఈబీసీలకు 1,800 మినీ ట్రక్కులు.. మొత్తం 5,600 మినీ ట్రక్కులను సబ్సిడీపై ప్రభుత్వం అందజేయనుంది. వెనుకబడిన తరగతులు (బీసీ), ఆర్థికంగా వెనుకబడిన వారి (ఈబీసీ) అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ)లను మంజూరు చేసింది. బీసీలు, ఈబీసీల సంక్షేమం, స్వయం ఉపాధి పథకం మార్గదర్శకాలను సోమవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము జారీ చేశారు. మొత్తం యూనిట్ (మినీ ట్రక్కు) వ్యయంలో 10 శాతం లబ్ధిదారుడు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 90 శాతాన్ని ఎంపిక చేసిన బ్యాంకు నుంచి రుణంగా అందిస్తారు. 90 శాతం అప్పులో లబ్ధిదారుడు 60 శాతం సబ్సిడీగా పోనూ మిగిలిన 30 శాతాన్ని 72 నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లించాలి. కాగా, ఇప్పటి వరకు లబ్ధిదారుడికి ఇస్తున్న 30 శాతం సబ్సిడీని 60 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లబ్ధిదారుడిపై ఆర్థిక భారం తగ్గుతుంది. లబ్ధిదారుడికి సబ్సిడీగా ఇచ్చిన 60 శాతాన్ని రాష్ట్ర ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి సంస్థ ద్వారా బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. -
కరోనాతో కుటుంబ పెద్ద మరణిస్తే.. రూ. 5 లక్షలతో స్వయం ఉపాధి
సాక్షి, హైదరాబాద్: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి కరోనా కాటుకు బలి అయితే, ఆ కుటుంబ సభ్యులు వీధిన పడకుండా చేయూత ఇచ్చేందుకు జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ) ‘స్మైల్’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, ఆ కుటుంబానికి ఆర్థికపరమైన అంశాల్లో ఆసరా ఇచ్చే లక్ష్యంతో స్మైల్‌ను ముందుకు తీసుకొచ్చింది. ఏడాదిన్నరగా కొనసాగుతున్న కోవిడ్–19 వ్యాప్తితో చాలా కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. పలు రంగాల్లో ఉద్యోగాల కోత విధించడంతో ఉపాధి కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. కోవిడ్–19తో కుటుంబ పెద్ద మరణిస్తే... ఆ కుటుంబానికి స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు ఎన్‌బీసీఎఫ్‌డీసీ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ స్వయం ఉపాధి యూనిట్‌పై గరిష్టంగా రూ.5 లక్షలు సమకూరిస్తే.. అందులో రూ.4 లక్షలు రాయితీ కింద ఎన్‌బీసీఎఫ్‌డీసీ లబ్ధిదారుకు అందిస్తుంది. మిగతా రూ.లక్షను బ్యాంకు నుంచి రుణం రూపంలో మంజూరు చేస్తుంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఈ ప్రతిపాదనలను ఈనెల 26లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దరఖాస్తుకు అర్హతలివీ... కరోనా వైరస్ సోకి మరణించిన కుటుంబ పెద్ద వయసు 60 సంవత్సరాలలోపు ఉండాలని ఎన్‌బీసీఎఫ్‌డీసీ స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుడి మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు తహసీల్దారు నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రం, కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలలోపు ఉన్నట్లు నిర్ధారణ పత్రం దరఖాస్తుతో జతచేయాలి. వీటిని నేరుగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాల్లో సమర్పించవచ్చు. దరఖాస్తులో మరణించిన కుటుంబ సభ్యుడి పేరు, మరణించిన రోజుకు వయసు, ఆధార్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, కులం తదితర వివరాలను భర్తీ చేయాలి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా సంక్షేమాధికారులు ఈనెల 26లోగా రాష్ట్ర కార్యాలయానికి పంపితే... రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఎన్‌బీసీఎఫ్‌డీసీ కార్యాలయానికి పంపుతుంది. బీసీ కుటుంబాలకు ప్రయోజనకరమైన ఈ పథకంపై పెద్దగా ప్రచారం లేకపోవడం... రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఈ నెల 23న సూచనలు జారీ చేసి కేవలం మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించడం క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించే అంశమే. -
Cover Story: బతుకుదెరువుకు కొత్త దారులు
‘పూలమ్మిన చోట కట్టెలెలా అమ్మేది?!’ అంటూ తమకు వచ్చిన కష్టం గురించి ప్రస్తావించేవారు గతంలో. ఇప్పుడందరికీ కష్టకాలమే! మహమ్మారి కాలం. పెరుగుతున్న పాజిటివ్ కేసులు... వినిపిస్తున్న నెగెటివ్ మాటలు.. గడప దాటడానికి అడ్డం పడుతున్న నిబంధనలు. ఏమిటి చేయడం? ఎలా బతకడం?ఆందోళనల మధ్యనే అవకాశాల కోసం వెతుకులాట. ఏది మొదలో.. ఏది చివరో తెలియని ఆట. స్తంభించిపోయిన ఈ కాలమే కొత్త ఉపాధినీ కనిపెడుతోంది... మారిన పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కొత్త ఊపిరులు పోసుకుంటున్నాయి. బతుకుదెరువును ఖాయం చేస్తున్నాయి.. క్లీనింగ్ సర్వీస్లదే మొదటి స్థానం ‘చేతులు కడుక్కొండిరా నాయనా, స్నానం చేయండిరా బాబూ... ’ అంటూ గతంలో పెద్దవాళ్లు వెంటపడ్డా పట్టించుకునేది కాదు యువతరం. శుభ్రత పాఠం అంటూ జీవనశైలికి కొత్త సిలబస్ చేర్చింది కనోనా. ప్రాక్టికల్ పరీక్షలతో మెదడును ట్యూన్ చేసింది. ఫలితంగా పిల్లా పెద్దా ఒంటి శుభ్రతే కాదు, పరిసరాల పరిశుభ్రత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలెట్టారు. ఈ ప్రోగ్రెస్‌లో పట్టణ ప్రజానీకం ముందున్నారు. ‘మా ఇంటికి వచ్చి క్రిమిసంహారక మందులతో క్లీనింగ్ చేస్తారా?’ అంటూ సర్వీస్ ప్రొవైడర్స్‌ని అడిగేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని సదరు సర్వీస్ కంపెనీలు చెబుతున్నాయి. ఇండిపెండెంట్ హౌజ్‌లు, అపార్ట్మెంట్ కాంప్లెక్సులు, వాణిజ్య భవనాలు, కార్పొరేట్ కార్యాలయాలు.. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రోజువారీగా క్లీనింగ్.. దాంతో పాటు క్రిమిసంహార మందులను స్ప్రే చేసే సర్వీస్‌ను కోరుకుంటున్నాయి. డబ్బుకు వెనకాడ్డం లేదు. ఈ అవసరాన్ని వ్యాపారంగా మలుచుకునే చురుకుదనం, సరైన ప్రణాళిక, మార్కెటింగ్ నైపుణ్యం, పని పట్ల అంకితభావం గలవాళ్లు ‘అర్బన్ క్లీనింగ్’ బిజినెస్‌తో యమ బిజీగా ఉన్నారు. క్లీనింగ్‌లో స్కిల్ గలవారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా బుకింగ్ ఆర్డర్స్ తీసుకొని, డీప్ క్లీనింగ్ సర్వీసులను కొనసాగిస్తున్నారు. బాత్రూమ్ క్లీనింగ్ అయితే రూ.500, వంటగది అయితే రూ.2000 వేలు, పూర్తి ఇల్లు అయితే రూ.5000లు ఆపైన అంటూ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి సదరు స్టార్టప్‌లు. ఈ వ్యాపారంలో ఇప్పటికే ఆన్లైన్ యాప్స్ ద్వారా ముందంజలో ఉండి తమ సేవలను ప్రాంతాలవారీగా అందిస్తున్నవారు సైతం క్లీనింగ్ సర్వీస్‌లో పోటీపడుతున్నారు. అద్దెకు ఫర్నీచర్ ‘మరీ విడ్డూరం కాకపోతే’ అని ముక్కున వేలేసుకుంటారేమో! ‘ఎవరైనా ఇంటిని అద్దెకు తీసుకుంటాం. కానీ, రోజులు మారాయి కాబట్టి ఫుల్లీ ఫర్నిష్డ్ ఇళ్లూ రెంట్‌కు దొరుకుతున్నాయి. కేవలం ఫర్నీచరే అద్దెకు దొరకడమేంటీ.. కరోనా కాలం కాకపోతే’ అని సమాధానపడొచ్చు. అవును.. యేడాదిగా ఆఫీస్ పనీ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లోనే ఆఫీసు వాతావరణం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. రానురాను అదే సంస్కృతిగా స్థిరపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈసరికే కార్పోరేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌నే కొనసాగిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు అయితే వర్క్ ఫ్రమ్ నేటివిటీ పేరుతో తమ ఉద్యోగులు స్వస్థలాల నుంచి పనిచేసే అవకాశాన్నిస్తున్నాయి. ఇలా ఇంట్లోనే ఆఫీసు పని అనివార్యమైన ఈ రోజుల్లో కార్యాలయ వాతావరణం కుదిరేట్టు ఏర్పాటు చేసుకోకతప్పట్లేదు. అందుకు అనువైన ఫర్నీచర్ కొనుగోలు కోసం వేలల్లోంచి లక్షల్లో ఖర్చు ఉంటోంది. ఇలాంటి అవసరాలకు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కొంత బడ్జెట్‌ను కేటాయించి ఉద్యోగులకు లోన్లు ఇస్తున్నాయి. అయినా అంత ఖర్చు పెట్టడం అవసరమా అనుకునేవారి కోసం పట్టణ, నగర ప్రాంతాల్లో అద్దెకు ఫర్నీచర్ ఇచ్చే కంపెనీలు వెలిశాయి. వస్తువును బట్టి రిఫండబుల్ డిపాజిట్‌ను నిర్ణయించి ఈ అద్దె వ్యవహారాన్ని వ్యాపారంగా మార్చేశాయి. ఉదాహరణకు.. డెస్క్‌టాప్ టేబుల్‌కి మరీ తక్కువ కాకుండా రూ.1000 లోపు రిఫండబుల్ డిపాజిట్ చేసి, నెలకు రూ.150 అద్దెతో ఇంటికి తెచ్చేసుకోవచ్చు. ఇలా ఒక్కో ఫర్నీచర్‌కి దాని నాణ్యత, సౌకర్యాన్ని బట్టి అద్దె ఉంటుంది. టీవీ, బెడ్, సోఫా .. ఇలా ఇతరత్రా హోమ్ ఫర్నీచర్ కూడా ఈ అద్దె జాబితాలో చేరిపోయాయి. ఏ వస్తువు కావాలనుకున్నా అందుకు తగిన అద్దె చెల్లించి, ఉపయోగించుకోవచ్చు సదరు కంపెనీ నిబంధనలను అనుసరించి మాత్రమే. వీటిలో మూడు, ఆరు, పన్నెండు నెలల.. ఫుల్ హోమ్ ఫర్నీచర్ ప్యాకేజీ రెంటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. మూతికి మాస్క్‌లు కుడుతూ.. చేతికి శానిటైజర్ చేస్తూ... ముందున్న డిమాండ్ అంతా ఆరోగ్య స్పృహకు సంబంధించిన వస్తువులపైనే అని అంతర్జాతీయ మార్కెట్ పరిశోధనలు తమ హెల్త్ బాక్స్‌లు నొక్కి మరీ చెబుతున్నాయి. దాని మీద నమ్మకం కుదిరేలా ఇప్పటికే ఈ మహమ్మారి పుట్టించిన కొత్త ఉపాధిలో మాస్కులు, శానిటైజర్లు చేరనే చేరాయి. పెద్ద ఎత్తున వీటి అవసరం వచ్చి పడటంతో చిన్న చిన్న యూనిట్ల నుంచి పెద్ద స్థాయి దాకా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో వీటి తయారీ సంస్థలు వెలిశాయి. కొంతమంది ఒక గ్రూప్‌గా కలిసి, కొన్ని చోట్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులూ ఈ మాస్కులు కుట్టడంలో తీరికలేకుండున్నారు. ఇళ్లల్లోనూ కొందరు గృహిణులు మాస్కులు కుడుతూ కుటుంబ పోషణ భారాన్ని తేలిక చేసుకుంటున్నారు. బొటీక్లూ డిజైనర్ మాస్క్‌లతో వ్యాపారాన్ని కరోనాకాలానికనుగుణంగా మలచుకుంటున్నాయి. అనుమానం వచ్చిన ప్రతీసారీ చేతులు కడుక్కోండి లేదంటే శానిటైజర్లను వాడండి అంటూ 2020..వ్యాపార సంస్థలకు ఫ్యూచర్ విజన్ అందించింది. ఇంట్లో, వీధుల్లో, ఆఫీసుల్లో శానిటైజర్ల వాడకం పెరగడంతో వాటి తయారీదారులకు డిమాండ్ పెరిగింది. కొత్త వాళ్లకూ అవకాశం దొరికింది. శానిటైజర్ల కోసం స్వచ్ఛంద సంస్థల నుంచి వస్తున్న ఆర్డర్లు ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధినిస్తున్నాయి. ప్రముఖ ప్రపంచ సాంకేతిక పరిశోధన, సలహా సంస్థ టెక్నావియా 2021–2025 వరకు ఇండియాలో శానిటైజర్ మార్కెట్ 5.11 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అంటే మన రూపాయాల్లో 37 కోట్ల పైమాటే. ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి హ్యాండ్ శానిటైజర్ ఉత్పత్తి కోసం డిస్టిలరీస్, ఇతర యూనిట్లకు అవసరమైన లైసెన్సులను జారీచేశాయి. ముఖ్యమైన కార్యాలయాలు, భవనసముదాయల పైభాగంలో డ్రోన్ల ద్వారా శానిటైజ్ చేసే విధానమూ వచ్చింది. ఇక పీపీఇ కిట్ల తయారీ యూనిట్స్, హ్యాండ్ వాష్, ఆక్సీజన్ జనరేటర్.. వంటివీ ప్రాధాన్యాల్లో ఉన్నాయి. ఇళ్లలో ఉన్నవారికి ఆర్డర్ మీద పోర్టబుల్ ఆక్సీజన్ జనరేటర్స్‌ను అందజేస్తున్న హైదరాబాద్ స్టార్టప్ ‘ది పై ఫ్యాక్టరీ’ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ ఇంటి వంట మరో ఇంట హోటల్లో ఎన్ని రకాల వంటకాలున్నా ఇంట్లో చేసిన రుచి రాదన్నది వాస్తవం. అదే ఆలోచన ఇప్పుడు అమ్మలకు బిజినెస్ దారిని చూపింది. అమ్మ చేతి ఇంటి వంట ఇప్పుడెందరికో రుచి,శుచి గల భోజనాన్ని వడ్డిస్తున్నాయి. మహమ్మారి సృష్టించిన ఆర్థిక అనిశ్చితికి వంట ఓ పెద్ద ఆదరవుగా మారింది. రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ మీద తెప్పించుకునే వారు ఇప్పుడు ఇళ్ల నుంచి కూడా ఆర్డర్ ఇచ్చి మరీ ఫుడ్ తెప్పించుకుంటున్నారు. మహమ్మారి ముందు వరకు పిండివంటలు, పచ్చళ్లకు మాత్రమే గృహ ఫుడ్స్‌కి ఆర్డర్లు ఉండేవి. కరోనా పుణ్యమాని ఇంటి వంటా బిజినెస్ జాబితాలోకి చేరిపోయింది. ఉత్తర భారతదేశంలో అయితే గృహిణులు చేసే ఇంటి వంటలు యాప్‌లలో ఘుమఘుమలాడిస్తున్నాయి. అంతేకాదు లాక్డౌన్ కారణంగా మూతపడిన రెస్టారెంట్ల స్థానాన్ని ఇంటి వంటలు భర్తీ చేస్తూ ఆ వ్యాపారాన్ని వండుతున్నాయి. ఆర్థికంగా కుదేలయిన తమ కుటుంబాలను నిలబెట్టుకుంటున్నాయి. ఇంటి నుంచి మరో ఇంటికి చేర్చడానికి మోటార్ క్యాబ్ సర్వీసులూ అందుబాటులోకి రావడం, మనీ ట్రాన్స్ఫర్ చేసే యాప్‌లూ ఉండడంతో ఈ ఇంటి వంట బాగానే మార్కెట్ అవుతోంది. గతంలో కొన్ని రహదారులపై అక్కడక్కడా టిఫిన్, భోజన సదుపాయంతో ఫుడ్ ట్రక్స్ కనిపించేవి. ఇప్పుడు వీటి సంఖ్యా పెరిగింది. కిరాణా సరుకులు, కూరగాయలతో పాటు ఐస్‌క్రీమ్, కేక్ వంటి బేకరీ ఐటమ్స్‌తో భోజనప్రియుల కోసం మరిన్ని ఫుడ్ ట్రక్కులు అందుబాటులోకి రానున్నాయి. ఆన్లైన్లో గురువులు ఒక స్మార్ట్ ఫోన్.. పలు అవసరాలను తీర్చడమే కాదు పలురకాల ఆదాయాలకూ వనరుగా మారింది. కరోనా కాలంలో టెక్నాలజీ ఉపయోగం అనుభవంలోకి వచ్చింది. కోవిడ్ మూలంగా విద్యార్థులకు ఆన్లైనే బడి అయింది. ఇదే విధంగా ట్యూషన్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఫ్యాషన్, మేకప్, జ్యూయెలరీ తయారీ వంటి వాటికీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా మారింది. నిపుణులు ఆన్లైన్లోనే క్లాసులు తీసుకుంటున్నారు. కోర్సుకు, వర్క్‌షాప్స్‌కి తగిన మొత్తాన్ని ఫీజుగా పెట్టి ఆన్లైన్ గురువులు ఈ-క్లాసులను నిర్వహిస్తున్నారు. కరోనా భయం నుంచి బయటపడటానికి, ఆరోగ్య సలహాలకు, బంధాలు గట్టిపడటానికి కౌన్సెలింగ్ సెంటరూ ఆన్లైనే. మొక్కలు, పెంపుడు జంతువుల పెంపకానికి తగు సూచనలకు కన్సల్టెంట్స్ ఆన్లైన్ గురువులే. తమకున్న నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకోవడంతో పాటు, తగినంత ఆదాయాన్నీ పొందుతున్నారీ గురువులు. వర్చువల్ ఎగ్జిబిషన్స్... షాపింగ్.. చిత్రకారులు తమ చిత్రకళా ప్రతిభను ఇంకాస్త మెరుగుపరుచుకునే విధంగా కరోనా కాలం వర్చువల్ వేదికకు రూపమిచ్చింది. కళాకారులు తమ పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్స్‌ను ప్రదర్శించేవారు. దాని ద్వారా కస్టమర్‌కు నచ్చిన పెయింటింగ్‌ను అక్కడికక్కడే అమ్మకాలు జరిపేవారు. ఇప్పుడు వర్చువల్ ఎగ్జిబిషన్లో చూసి, ఆర్డర్ చేసిన వినియోగదారుడి చిరునామాకు ఆ చిత్రాన్ని డెలివరీ చేస్తున్నారు. ఇదే బాటలో ఫ్యాషన్ రంగంలో ఇదివరకే ఉన్న ఆన్లైన్ షాపింగ్‌ని వర్చువల్ అనుభూతిని యాడ్ చేస్తున్నాడు డిజైనర్లు. వినియోగదారుడు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా షాప్‌లో ఉండే అనుభూతిని పొందుతూ, తమకు నచ్చిన దుస్తులను కొనుగోలు చేస్తున్నారు. కరోనా టైమ్‌లో ఈ వర్చువల్ విధానం అమ్మకం, కొనుగోళ్లను సౌలభ్యం చేసి వ్యాపారం కుంటుపడకుండా చూస్తోంది. యూ ట్యూబ్ ఈ మహమ్మారి టైమ్‌లో దివాలా తీసిన బిజినెస్ ఎలా ఉన్నా హైలో ఉంది మాత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన యూ ట్యూబ్. రకరకాల చానెళ్లు జనాల క్రియేటివిటీని కళ్లముందుంచుతున్నాయి. ప్రతీ నెలా రెండు బిలియన్ల కొత్త యూజర్స్ యూట్యూబ్‌లో లాగిన్ అవుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు యూ ట్యూబ్‌ను క్లిక్ చేస్తున్నారని యూ ట్యూబ్ తన గ్లోబల్ రీసెర్చిలో తెలియజేసింది. సృజనాత్మకతతో పాటు కాసులనూ కురిపిస్తున్నాయీ యూట్యూబ్స్. అందుకే యూట్యూబ్ వేదికను ఉపాధిగా మలచుకుంటున్న సృజనకారుల çసంఖ్యా పెరుగుతోంది. డిజిటల్ మీడియమ్‌కు పెరిగిన డిమాండ్ దృష్ట్యా యూనిక్ రైటింగ్ కంటెంట్‌ను సృష్టించుకోవడం కంపెనీలకు సవాలుగా మారింది. ఇలాంటి కంటెంట్‌కు ఏజెన్సీల సాయం తీసుకుంటున్నాయి. దాంతో క్రియేటివ్ రైటర్స్‌ను గాలం వేసి పట్టుకుంటున్నాయి ఏజెన్సీలు. ఇలా డిజిటల్ మార్కెటింగ్కున్న అపారమైన అవకాశాలను ప్రపంచమంతా వినియోగించుకుంటోంది. దీంట్లో భాగంగా డిజిటల్ ఎక్స్పర్ట్స్ తమ నైపుణ్యానికి నగిషీలు చెక్కుతున్నారు. . రానున్న రోజుల్లోనూ డబ్బులు పండించే పంటగా స్థిరపడనుంది. సాఫీగా సాగిపోతున్న ప్రయాణానికి చెక్ పెట్టింది కరోనా. ఒక దారి మూసుకుపోతేనేం వచ్చిన అడ్డంకిలోంచే కొత్త దారిని వెదుక్కునే శక్తి తనకుందని తెలియజేస్తున్నాడు మనిషి. పెరుగుతూనే ఉండే డెలివరీ సేవలు ఇది హోడ్ డెలివరీల కాలం. చాలా వ్యాపారాలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌ను కేరాఫ్‌గా చేసుకున్నాయి. వినియోగదారులు వస్తువులను, సేవలను పొందుతున్నారు. వీటిని అందించగలిగే డెలివరీ సేవలకు విపరీతమైన డిమాండ్ సృష్టించింది కరోన. రానున్న రోజుల్లో సమర్ధవంతమైన డెలివరీ సేవలకు ఇంకా ఇంకా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. 2020తో పోల్చితే 2021 డెలివరీ సేవలు వ్యాపారంలో పెరుగుదలకు బలమైన వృద్ధిని కనబరుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ–కామర్స్ ద్వారా రెస్టారెంట్లు, ఫుడ్ షాప్స్, ఇతర వస్తు విక్రయాల డెలివరీకి అనుమతి ఇచ్చింది. దీని ద్వారా భవిష్యత్తులో ఈ తరహా సేవలకే అవసరం ఎక్కువుంటుందనే విషయం స్పష్టం అవుతోంది. కావాలంటే ఇంటినే హాస్పిటల్ చేస్తారు కరోనా పాజిటివ్ మనిషిని ఎంత నెగటివ్‌గా మారుస్తుందో అందరికి తెలిసిందే. వైరస్ వ్యాప్తితో ఆసుపత్రులు ఖాళీ లేవు. బెడ్స్‌కు కొరత. ఆక్సిజన్ బెడ్ అయితే గగనమే. ఈ సంక్షోభానికి పరిష్కారంగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు ‘ఐసియు ఎట్ హోమ్’ కాన్సెప్ట్‌తో రంగంలోకి దిగాయి. అపార్ట్మెంట్స్, హౌజింగ్ కమ్యూనిటీ సభ్యుల అభ్యర్థనతో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, ఐసోలేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. బెడ్, ఆక్సీజన్ సిలెండర్, మానిటరింగ్.. ఇలా అన్ని రకాల మెడికల్ ఎక్విప్మెంట్స్తో పాటు కన్సల్టెంట్ డాక్టర్ కూడా ఉండే సెంటర్లను ఏర్పాటు చేసే కంపెనీలవైపు హౌజింగ్ కమ్యూనిటీ గ్రూప్స్ తమ దృష్టిని సారిస్తున్నాయి. – నిర్మలా రెడ్డి -
ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..
విజయనగరం ఫోర్ట్: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతకు ఓ చక్కని ఉపాధి మార్గం పెరటికోళ్ల పెంపకం. గ్రామీణ ప్రాంత రైతులే కాదు... పట్టణాల్లోని యువతకు కూడా ఇదో ఆదాయ వనరుగా మలచుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆదాయం పొందడానికి ఆస్కారం ఉండే ఈ తరహా వ్యాపకం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటి పెంపకంపై పశుసంవర్థకశాఖ జేడీ ఎం.వి.ఎ.నరసింహం పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. (చదవండి: ప్రాధేయపడినా కనికరించలేదు..) ♦రాజశ్రీ రకానికి చెందిన కోళ్లు పెంచుకుంటే అధిక ఆదాయం వస్తోంది. ఈ కోళ్లు అధిక ఉత్పాదక శక్తి కల్గి ఉండి ఏడాదికి 160 నుంచి 180 గుడ్లు పెడతాయి. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుంటాయి. ♦వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. పోషణ ఖర్చు తక్కువ. సాధారణ నాటు కోళ్ల మాదిరిగానే ఉంటాయి. ♦వీటి గుడ్లు నాటు కోడి గుడ్లు కన్నా పెద్దవిగా ఉంటాయి. పుంజుల్లో ఎదుగుదల నాటుకోళ్లతో పోలిస్తే ఎక్కువగా ఉండి, అధిక బరువు కల్గి ఉంటాయి. ఇవి నాటు కోళ్లమాదిరి త్వరగా మనిషికి మచ్చిక అవుతాయి. ♦రాజశ్రీ రకానికి చెందిన కోళ్లకు పొదుగు లక్షణాలు లేకపోవడం వల్ల ఈ కోళ్ల నుంచి వచ్చే గుడ్లు నాటు కోడి కిందగానీ, ఇంక్యూబేటర్ ద్వారా గాని పొదిగించి పిల్లలు పొందవచ్చు. కోడి పిల్లల సంరక్షణ: ♦నేలపై రెండు అంగుళాల మందంలో గుండ్రంగా వరి ఊకను గానీ వేరుశనగ తొక్కును గానీ పరిచి దానిపై ఒక పొర మందంగా పేపర్లు పరచాలి. ♦దానిపై ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉండే అట్ట ముక్క లు గానీ జీఐ షీట్లు గానీ అమర్చాలి. దీనిని చిక్ గార్డ్ అంటారు. ♦7 నుంచి 8 అంగుళాల వైశాల్యం ఉండే ప్రదేశం 250 కోడి పిల్లలు ఉండేందుకు సరిపోతుంది. ♦కోడి పిల్లలకు ఉష్ణోగ్రతను అందించేందుకు ఒక గొడు గు వంటి దానిని నేలపై ఉంచి అడుగు ఎత్తులో వేలాడ దీసి దానికి ఒక కోడి పిల్లకు ఒక వాట్ చొప్పున లెక్కవేసి విద్యుత్ బల్బులు అమర్చాలి. ♦100 కోడి పిల్లలకు 100 వాట్ బల్బులు సరిపోతాయి. ♦మొదటగా పిల్లలను తెచ్చిన వెంటనే బీకాంప్లెక్స్ను కలిపిన నీటిని వేరుగా ఉంచి కోడి పిల్ల ముక్కులు దానిలో ముంచి తరువాత చిక్ గార్డ్‌లోకి వదలాలి. ♦పేపర్‌పైన నూకలాగా మరపట్టిన మొక్క జొన్నను పలుచగా చల్లాలి. మొదటి వారం అంతా 24 గంటలు బల్బు వెలుగుతూ ఉండేలా చూడాలి. రెండో వారం నుంచి ఉష్ణోగ్రత తగ్గించాలి. ♦దీనికోసం గొడుగును కొంచెం ఎత్తు పెంచడం గానీ బల్బు సామర్ధ్యం తగ్గించడం గానీ చేయాలి. ♦10వ రోజున పేపర్ తీసివేసి చిక్గార్డు సైజ్ పెంచాలి. క్రమేపీ వయస్సు పెరిగిన కొద్దీ చిక్ గార్డు వెడల్పు చేస్తూ రెండో వారం చివరిలోగాని మూడవ వారంలో పూర్తిగా తీసి వేయవచ్చు. అనంతరం చిక్ గార్డు నుంచి బయటకు తీసి స్వేచ్ఛగా మెల్లగా పెరటిలోకి అలవాటు చేయాలి. ♦పెరటి కోళ్లకు దాణా కోనాల్సిన అవసరం ఉండదు. ఇవి కీటకాలు, గింజలు లేత గడ్డి ఇంట్లో ఉండే వ్యర్ధ పదార్థాలను తిని బతుకుతాయి. ♦పెరట్లో దొరికే ఆహారాన్ని బట్టి నూకలు మొక్కజొన్న తవుడుతో తయారు చేసిన సమీకృత దాణాను కూడా కొద్దిగా అందించాలి. ♦ఈ రకానికి చెందిన కోళ్లు 6 నెలల వయస్సు వచ్చేసరికి గుడ్డు పెట్టడం మొదలు పెడుతుంది. ఈ దశలో కాంతిని అందించడం అనేది ముఖ్యమైన చర్య. దీని కోసం గృహ వసతి అవసరం. ♦ఎంత కాంతి అందించాలి అనేది కాలాలను, వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. శీతా కాలం అయితే రాత్రి సమయాల్లో కాంతిని నాలుగు, ఐదు గంటలు పాటు, వేసవి కాలంలో రెండునుంచి 3 గంటలపాటు సూర్యాస్తమయం తరువాత అందించాలి. -
ఉపాధి హామీతోనే గ్రామీణ వికాసం
గ్రామీణ భారతదేశంలో ప్రజల వినియోగాన్ని క్షీణింపజేయడంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ విధానాల్లోని తప్పటడుగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. వ్యవసాయానికి పోటీగా వాణిజ్యాన్ని నిలబెట్టడం, ద్రవ్యోల్బణంపైనే గురిపెడుతున్న ద్రవ్యవిధానం, పెద్దనోట్ల రద్దు, అధిక మొత్తం నగదు లావాదేవీలపై పన్ను, జీఎస్టీ వంటివి మొత్తంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై శీతకన్ను వేస్తున్నాయి. ఇవన్నీ కలిసి గ్రామీణ మార్కెట్లలో నగదు చెలామణీని, మొదటి నుంచి వాడుకలో ఉన్న నగదు లావాదేవీలను విచ్ఛిన్నపర్చడానికే తోడ్పడ్డాయి. అందుచేత గ్రామీణ ఆర్థిక ఉద్దీపనను అమలు చేయడానికి మరింత మెరుగుపర్చిన రూపంలోని జాతీయ ఉపాధి హామీ పథకం ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. ఇది ఒక డిమాండ్‌ను సృష్టించే పథకం. పనికోసం చూస్తున్న ఎవరికైనా ఈ పథకం పని కల్పిస్తుంది. కాబట్టి ఆదాయ మద్దతు పథకాలతో ఘర్షించే సమస్యలను ఇది అధిగమించి గ్రామీణ ప్రాంతంలో శ్రమజీవులకు ఎక్కువ మేలు చేస్తుంది. ప్రస్తుతం దేశంలో అలుముకుంటున్న ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న మన విధాన నిర్ణేతలు భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న సంక్షోభాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని నెలల క్రితం ఎన్నికలు సమీపించిన తరుణంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భారతీయ విధాన నిర్ణేతల ప్రథమ ప్రాధాన్యతగా ఉండేది. ఈ సంవత్సరం జనవరిలో ప్రధానమంత్రి–కిసాన్ యోజన్ పథకాన్ని ప్రకటించి భారీ ఎత్తున అమలుకు ప్రయత్నాలు చేశారు. కానీ సరిగ్గా అయిదు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతోందని గుర్తిస్తున్నప్పటికీ పీఎం కిసాన్ యోజన పథకం అమలు వేగాన్ని తగ్గిస్తూ వస్తోంది. కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం రైతులకు మూడో విడత నగదు చెల్లింపు మొత్తం తొలి రెండు విడతల కంటే గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. తొలి రెండు విడతల నగదును ఎన్నికల ప్రచార సమయంలో సత్వరం పంపిణీ చేసిన వాస్తవాన్ని మర్చిపోకూడదు. బహుశా, పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం కేంద్ర ప్రభుత్వ రాజకీయ గణాంకాలను మార్చివేసి ఆర్థిక వ్యవస్థలోని ఇతర అంశాలపై తన దృష్టిని మరల్చినట్లుంది. కార్పొరేట్, ద్రవ్యరంగం ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి మిక్కుటంగా కృషి చేస్తోంది. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విస్మరించి పెట్టుబడుల పెంపుదల కోసం ప్రయత్నించడం అంటే చాలా తీవ్రమైన తప్పిదం కాగలదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కార్పొరేట్ పన్నులను భారీగా తగ్గిస్తూ ప్రస్తుతం విధానపరంగా తీసుకున్న చర్యలు దేశంలో డిమాండును పెంచే సమస్యను పరిష్కరించడంలో భవిష్యత్తులో విఫలం కాక తప్పదనిపిస్తోంది. ప్రముఖ ఆర్థిక వేత్త హిమాన్షు నొక్కి చెప్పినట్లుగా భారతదేశం వినియోగ సరకులకోసం పెట్టే ఖర్చు కనీవినీ ఎరుగని స్థితికి దిగజారిపోయింది. జాతీయ శాంపిల్ సర్వే ఆఫీసు డేటాను ఉపయోగించి గ్రామీణ భారతదేశంలో సంవత్సరానికి 4.4 శాతం చొప్పున దేశీయ వినియోగ వ్యయం క్షీణించిపోయిందని ఆయన లెక్కించారు. అదే పట్టణ ప్రాంతాల్లో వినియోగ వ్యయం 4.8 శాతం పడిపోయింది. రెండోది.. గ్రామీణ భారతదేశంలో ప్రజల వినియోగాన్ని క్షీణిం పజేయడంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ విధానాల్లో తీసుకున్న తప్పటడుగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. వ్యవసాయానికి పోటీగా వాణిజ్యాన్ని నిలబెట్టి ద్రవ్యోల్బణంపై గురిపెడుతున్న ద్రవ్యవిధానం, పెద్దనోట్ల రద్దు, అధిక మొత్తంలో నగదు లావాదేవీలపై పన్ను, జీఎస్టీ వంటివి మొత్తంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై శీతకన్ను వేస్తున్నాయి. ఇవన్నీ కలిసి గ్రామీణ మార్కెట్లలో నగదు చెలామణీని, మొదటి నుంచి వాడుకలో ఉన్న నగదు లావాదేవీలను విచ్ఛిన్నపర్చడానికే ఇతోధికంగా తోడ్పడ్డాయి. విధాన పరమైన ఈ తప్పటడుగులను ప్రత్యేకంగా సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలహీనంగా ఉన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వినియోగం తగ్గిపోవడం అంటేనే అక్కడ దారిద్య్రం పెరుగుతోందని అర్థం. అందుకే అతితక్కువ కాలంలోనే వినియోగ డిమాం డును పునరుద్ధరించడానికి గ్రామీణ భారతదేశానికి సత్వరమే ఆర్థిక ఉద్దీపన అనేది అవసరం కార్పొరేట్ ఇండియాకంటే మించిన ఉద్దీపన ప్యాకేజీనీ మన గ్రామప్రాంతాలకు అందించి తీరాలి. గ్రామీణ ఉద్దీపన ప్యాకేజీకి అందించాల్సిన రెండు విధానపరమైన సాధనాలపై ఇటీవలకాలంలో చాలా విస్తృతమైన వాదనలు చోటుచేసుకున్నాయి. అవి కనీస మద్దతు ధరను పెంచడం, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేశంలోని అనేక రాష్ట్రాలు ఇటీవలికాలంలో కేంద్ర ప్రభుత్వ అడుగుల్లో అడుగులేసి తమవైన రైతు ఆదాయ మద్దతు విధానాలను ప్రకటించాయి. ఇవి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కంటే ఎక్కువగా తమ తమ బడ్జెట్లలో అధిక మొత్తాన్ని రైతు సహాయ నగదు పథకాల కోసం కేటాయించాయి. కానీ ఇలాంటి ఉద్దీపన సాధనాలకు పరిమితులున్నాయి. కనీస మద్దతు ధరను దెబ్బతీసే ధరలు, పంటల ఎంపికలు అనేవి వ్యవసాయ సంస్కరణల అమలును దీర్ఘకాలంలో దెబ్బతీస్తాయి. పైగా, కేంద్రప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేయనటువంటి ఆహార ధాన్యాలను భారీస్థాయిలో నిల్వ చేసుకుని సిద్ధం చేసుకుని కూర్చుంది. దీంతో అదనపు ధాన్య సేకరణకు అవకాశాలు చాలా పరిమితమైపోయాయి. నగదు మద్దతు పథకాలు కనీస మద్దతు ధరపై ప్రతికూల ప్రభావాలను తగ్గించగలుగుతాయి కానీ వీటి అమలులో తీవ్రమైన సవాళ్లు ఎదురుకాక తప్పదు. 2018–19 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై భారతీయ రిజర్వ్ బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదిక ఎత్తి చూపినట్లుగా, ఇలాంటి ప్రత్యక్ష నగదు పంపిణీ పథకాల విజయం అనేది భూ రికార్డులను డిజిటలీకరించడం, వాటిని బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయడం పూర్తిగా నెరవేర్చారా లేదా అనే షరతులపై ఆధారపడి ఉంటుంది. పైగా లక్షలాది మంది రైతుల భూ రికార్డుల డిజిటలీకరణ అనేది ఒక్క రాత్రిలో జరిగిపోదు. అందుకే పీఎమ్ కిసాన్ సభను వేగంగా అమలు చేయాలంటే సాధ్యపడదు. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని దేశంలోనే మొదటిసారిగా అమలు చేసిన తెలంగాణ రాష్ట్రం తన రైతుల భూ రికార్డుల డేటా బేస్‌ను సరిచేయడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టిందంటే వాస్తవ పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు. అందుచేత గ్రామీణ ఆర్థిక ఉద్దీపనను అమలు చేయడానికి మరింత మెరుగుపర్చిన రూపంలోని జాతీయ ఉపాధి హామీ పథకం ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. ఈ పథకం గొప్పదనం ఏమిటంటే ఇది ఒక డిమాండ్‌ను సృష్టించే పథకం. పనికోసం చూస్తున్న ఎవరికైనా ఈ పథకం పని కల్పిస్తుంది. కాబట్టి ఆదాయ మద్దతు పథకాలతో ఘర్షించే సమస్యలను చాలావాటిని ఇది అధిగమించి గ్రామీణ ప్రాంతంలో శ్రమజీవులకు ఎక్కువ మేలు చేస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అనేది రైతులకు మాత్రమే కాకుండా వ్యవసాయ కార్మికుల విస్తృత భాగస్వామ్యానికి వీలిచ్చేలా రూపొందించడమైనది. అందుకే ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల ప్రజల ఆదాయాలను బాగా పెంచగలుగుతుంది. చివరగా, జాతీయ ఉపాధి హామీ పథకం ప్రధానంగా గుంతలు తవ్వే పనులకే పరిమితమైపోయిందనే భావన విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, వ్యవసాయ భూమిలో ఉత్పాదకతను మెరుగు పర్చడంలో ఇది అతి ముఖ్యమైన పాత్ర పోషించింది. ఉపాధి హామీ పథకం కింద పనుల్లో ఎక్కువ భాగం సన్నకారు రైతుల యాజమాన్యంలోని భూ కమతాలను అభివృద్ధి చేయడం పైనే దృష్టి పెట్టాయి. ఉదాహరణకు సాగునీటి వసతుల నిర్మాణం, పశువులు, జంతువుల షెడ్ల నిర్మాణం వంటివి. భూ ఉత్పాదకతను మెరుగుపర్చడం అంటేనే రైతుల ఆదాయాలను సూత్రబద్ధంగా పెంచడం, వ్యవసాయ కార్మికులకు డిమాండును అధికంగా ఏర్పర్చడం అన్నమాట. అయితే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పైకెత్తాలంటే బడ్జెట్లలో కేటాయింపులను పెంచవలసి ఉంటుంది. అధిక వేతనాలు ఇవ్వడం, అమలులో మెషిన్ తరహా క్రమబద్ధమైన పర్యవేక్షణను సాగించడం చేయాల్సి ఉంటుంది. 2012–13 సంవత్సరం నాటి నుంచి ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులను తగ్గిస్తూ వచ్చినప్పటికీ పనికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో 2017–18 నాటికి రూ. 5,000 కోట్ల రూపాయల విలువైన అదనపు వ్యయం వెచ్చించాల్సి వచ్చింది. పర్యవసానంగా, వేతన చెల్లింపుల్లో ఆలస్యం జరిగింది. 2017–18 సంవత్సరం తొలి సగంలో 32 శాతం వేతనాలు మాత్రమే సకాలంలో పంపిణీ చేయగలిగారు. పైగా రాష్ట్ర కనీస వేతనాల కంటే తక్కువ స్థాయిలో జాతీయ ఉపాధి హామీ పథకంలో చెల్లించే వేతనాలు తగ్గుస్థాయికి పడిపోయాయి. ఈ అడ్డంకులను అధిగమించడం పరిష్కరించడం సంక్లిష్టంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 10 శాతం వరకు అధిక అప్పులను చేస్తున్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని విస్తరింపజేయడం ఎలా అనేది ప్రశ్న. ప్రభుత్వం అప్పుల జోలికి వెళ్లకుండానే ఈ పథకానికి నిధులను సమకూర్చవచ్చు. ఎరువులు, నీరు, విద్యుత్ వంటి వాటిపై ఇస్తున్న భారీ సబ్సిడీలను దశలవారీగా హేతుబద్దీకరించడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. సంక్షోభం అనూహ్య అవకాశాలను కల్పిస్తుంది. భారతీయ సబ్సిడీ రాజ్‌ని సంస్కరించడం చాలాకాలంగా పెండింగులో ఉంది. ఉపాధి హామీ పథకాన్ని విస్తృతం చేయడం అంటేనే వ్యవస్థ నిర్మాణాత్మక సంక్షోభానికి ఒక పరిష్కారం కావచ్చు. యామిని అయ్యర్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ -
రాయితీ ఇంకా రాకపాయె!
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి యూనిట్ల లబ్ధిదారుల ఆవేదన అరోణ్యరోదన అయింది. రాయితీ రుణాల కోసం రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వంలో చలనంలేదు. నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి యూనిట్ల వైపు ప్రోత్సహించేందుకు ఎస్సీ కార్పొరేషన్ విరివిగా రాయితీ రుణాలిచ్చేలా కార్యాచరణ రూపొందించింది. పెద్దసంఖ్యలో లబ్ధి కలిగించాలని భారీ ప్రణాళికలు రచించింది. వీటిని ప్రభుత్వం ఆమోదించడంతో లబ్ధిదారులను ఎంపిక చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 33,607 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. వీరికి రాయితీ రూపంలో రూ.454.01 కోట్లు అవసరమని ఎస్సీ కార్పొరేషన్ ప్రతిపాదనలు సమర్పించగా ప్రభుత్వం ఆమోదించింది. కానీ 27,261 మంది లబ్ధిదారులకు మాత్రమే రాయితీ యూనిట్లు మంజూరు చేసింది. ఈ మేరకు లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. కార్పొరేషన్ నిర్దేశించిన మేరకు రూ.351.26 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ, సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు కార్పొరేషన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు 2016–17 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన రాయితీ రుణాల పంపిణీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దాదాపు 3610 మంది లబ్ధిదారులకు రూ.56 కోట్లు చెల్లించాల్సి ఉంది. వార్షిక ప్రణాళికకేదీ ఆమోదం... 2018–19 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ రూ.వెయ్యి కోట్లతో వార్షిక ప్రణాళికను తయారు చేసి రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి సమర్పించింది. ఇంకా ఆమోదం లభించలేదు. 50 వేల మందికి లబ్ధి చేకూర్చేలా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అయోమయంలో పడ్డారు. ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొలి త్రైమాసిక ముగిసింది. ఇప్పటికిప్పుడు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టినా ప్రక్రియ పూర్తి కావడానికి కనిష్టంగా మూడు నెలలు పడుతుంది. బ్యాంకు నుంచి సమ్మతిపత్రాలు పొందడానికి,రుణాల మంజూరు పూర్తికావడానికి సమయం పడుతుంది. దీంతో రుణ ప్రణాళిక అమలు కష్టంగా మారే అవకాశముందని ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. వార్షిక ప్రణాళికకు ఆమోదం లభించిన వెంటనే చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
బీసీ స్వయం ఉపాధి అర్హుల ఎంపిక విధివిధానాలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల నిరుద్యోగులకు బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాల్లో గ్రామ సభ, పట్టణాల్లో వార్డు సభలను నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. పథకానికి కేటాయించిన బడ్జెట్లో 50% నిధులను సాంప్రదాయ వృత్తి దారులకు, మిగతా 50% జనరల్ స్కీంలకు కేటాయించనున్నారు. ఒక కుటుంబం నుంచి ఒక అభ్యర్థినే ఎంపిక చేయాలని, గతంలో లబ్ధి పొందిన వారిని ఎంపిక చేయకూడదని నిబంధన విధించారు. లబ్ధిదారుల్లో 33% మహిళలకు కేటాయించనున్నారు. పేదలకు, దివ్యాంగులకు, సంచార జాతుల వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించరాదు. -
ఇక మీ ఇష్టమే..!
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో బీసీ సంక్షేమ శాఖ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. యూనిట్ల స్థాపనకు బ్యాంకు రుణం తప్పనిసరి కాదని, ఆ నిర్ణయం లబ్ధిదారుకే వదిలేస్తున్నామని వెల్లడించిది. మొత్తం వ్యయాన్ని లబ్ధిదారు వ్యక్తిగతంగా భరిస్తే సబ్సిడీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల్లో వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు 2018ృ19 వార్షిక సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణకు బీసీ కార్పొరేషన్‌తోపాటు 11 బీసీ ఫెడరేషన్లు ఉపక్రమించాయి. ఆర్థిక సహకార సంస్థ (ఫైనాన్స్ కార్పొరేషన్) ఇచ్చే రాయితీలు ఇప్పటివరకు బ్యాంకులిచ్చే రుణాలతో ముడిపడి ఉండేవి. యూనిట్ ప్రారంభించాలనుకున్న లబ్ధిదారు ముందుగా కార్పొరేషన్‌కు రాయితీ కోసం దరఖాస్తు చేసుకునేవారు. అక్కడి నుంచి ఆమోదం వచ్చాక రాయితీ డబ్బులు పోను మిగిలిన మొత్తానికి సమీప బ్యాంకులో రుణం పొందేందుకు అర్జీ పెట్టుకునేవారు. అక్కడ రుణం దొరికితేనే రాయితీ ఫలాలు అందేవి.. లేదంటే అంతే సంగతి. ఏళ్ల నాటి ఈ నిబంధనలకు సంక్షేమ శాఖ స్వస్తి పలికింది. రూ. లక్షకు రూ.80 వేల రాయితీ స్వయం ఉపాధి యూనిట్లపై బ్యాంకు రుణం పొందడం ఆషామాషీ కాదు. బ్యాంకు నిబంధనలు పాటిస్తేనే రుణం మంజూరవుతుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉన్నా బ్యాంకర్ల సహకారం లేకుంటే రుణ మంజూరు గగనమే. దీంతో రుణాలందక లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేయలేకపోతున్నారని కార్పొరేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సొమ్ము మొత్తం లబ్ధిదారుడే భరిస్తే రాయితీ విడుదల చేసేందుకు సంక్షేమ శాఖ వెసులుబాటునిస్తోంది. రూ.లక్షతో ఏర్పాటు చేసే యూనిట్‌కు సర్కారు రూ.80 వేల రాయితీ ఇవ్వనున్నారు. రూ.2 లక్షలుంటే రూ.1.40 లక్షలు, రూ.5 లక్షలకు పైబడి ఉంటే 50 శాతం రాయితీ ఇస్తారు. రూ.1,400 కోట్లు..! మూడేళ్లుగా రాయితీలివ్వని బీసీ సంక్షేమ శాఖ.. ఈసారి భారీ ప్రణాళికతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఇందుకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఆ శాఖ.. ఈ నెల 21 వరకు గడువు విధించింది. అలాగే పెండిగ్లో ఉన్న దరఖాస్తులను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు ఈ సారి బడ్జెట్లో రూ.1,400 కోట్లు కేటాయించిన నేపథ్యంలో లక్ష మందికి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేసే వీలుంది. 2018ృ19 వార్షిక సంవత్సరం ప్రణాళికను బీసీ కార్పొరేషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. అక్కడి నుంచి ఆమోదం లభిస్తే దరఖాస్తులు పరిశీలన మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. -
రుణాలు కొందరికే..!
ఆదిలాబాద్ రూరల్: ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి కింద ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం బీసీ ఫెడరేషన్లకు నిధులు మంజూరు చేసింది. వేలల్లో దరఖాస్తులు రాగా.. నిధులు అంతంత మాత్రంగానే విడుదల చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో గత డిసెంబర్ మాసం వరకు 139 వివిధ సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫెడరేషన్ల కోసం వివిధ రకాల రుణాలు అందించేందుకు రూ.250 కోట్లు మంజూరు చేసింది. ఫెడరేషన్లు ఇవే.. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఫెడరేషన్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రభుత్వం వ్యక్తిగత రుణాలతోపాటు సొసైటీకి రుణాలు మంజూరు చేయనుంది. ప్రస్తుతం జిల్లాలో 139 సొసైటీలు రిజిస్టర్ చేసుకున్నాయి. ఇందులో వాషర్మెన్, కోఆపరేటీవ్ సొసైటీ, నాయీబ్రాహ్మణ సొసైటీ, వడ్డర సొసైటీ, సాగర(ఉప్పర), వాల్మీకి, బోయ, క్రిష్ణబలిజపోసాల, బట్రాజ్, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి శాలివాహన, నూర్‌బాషా, మేదర, టాడిటాపర్స్ కోఆపరేటీవ్ సొసైటీలు ఉన్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా ఆయా ఫెడరేషన్లకు సబ్సిడీపై రుణాలను అందజేయనుంది. వ్యక్తిగత రుణాలు రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు బ్యాంక్‌తో సంబంధం లేకుండా అందజేయనుంది. సొసైటీలకు బ్యాంక్ లింకేజీతో రుణాలను అందజేయనుంది. ఆయా రుణాలు కోసం 21 నుంచి 55 సంవత్సరాల వయస్సు నిండి ఉన్నవారికి వీటిని అందజేయడం జరుగుతుంది. వేలల్లో దరఖాస్తులు.. రాష్ట్ర ప్రభుత్వం ఫెడరేషన్లతోపాటు వ్యక్తిగత రుణాలను కలుపుకొని రూ.250 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో వేలాది సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. నిధులు అంతంత మాత్రంగానే ఉండడంతో కొంతమందికే రుణం అందే అవకాశం ఉంది. ప్రభుత్వం నిధులు పెంచి ఇతరులకు సైతం అవకాశం కలిగేలా చూడాలని కోరుతున్నారు. -
స్వయం ఉపాధిలో రాణించాలి
–మహిళలకు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పిలుపు – ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు, రుణ మంజూరు పత్రాల పంపిణీ కర్నూలు(ఓల్డ్‌సిటీ): వృత్తి విద్యలో శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పిలుపునిచ్చారు. ఎన్‌బీసీఎఫ్‌డీసీ సౌజన్యంతో, అపిట్కో ఆధ్వర్యంలో నగరంలోని మురికివాడలకు చెందిన వంద మంది మహిళలకు ఆధునిక దుస్తుల తయారీలో రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. విజయవంతంగా ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సోమవారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లో సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ బుట్టా రేణుక అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణలో సాధించిన నైపుణాన్ని వస్తువు తయారీలో చూపించాలన్నారు. అలాగే మార్కెటింగ్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తన వంతుగా మొదటి దశలో ఆర్డర్లు ఇప్పిస్తానని చెప్పారు. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఎంపీ చొరవతో ముస్లిం మహిళలు ఇంట్లోనే ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. మహిళలు ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నేర్చుకున్న అంశంపై ఉత్తమ వర్క్‌బుక్‌లు తయారు చేసిన ఇద్దరు మహిళలకు హఫీజ్‌ఖాన్ ట్రస్టు ద్వారా నగదు బహుమతులు అందజేశారు. శిక్షణ పొందిన మహిళలను వైఎస్ఆర్సీపీ సీఈసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు శిక్షణ పొందిన ఒక్కో మహిళకు రూ. 25 వేల చొప్పున ముద్ర రుణాల మంజూరు పత్రాలను ఎంపీ అందజేశారు. ఈ కార్యక్రమానికి అపిట్కో ఇన్చార్జి మోహన్‌రాజు అధ్యక్షత వహించగా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్ అహ్మద్ ఖాన్, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, నాయకులు డి.కె.రాజశేఖర్, ఎస్.ఎ.అహ్మద్, పి.వి.రాఘవ, సఫియా ఖాతూన్, అన్వర్‌బాషా, కేడీసీసీ బ్యాంక్ డైరక్టర్ లోక్‌నాథ్ యాదవ్, సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘స్వయం ఉపాధి’కి దరఖాస్తుల వెల్లువ
సాక్షి. హైదరాబాద్: స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 31వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుండగా, ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు కలుపుకుని 1.30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నాటికి బీసీ కార్పొరేషన్‌కు 1,03,000 దరఖాస్తులు, 10 బీసీ ఫెడరేషన్లకు 17 వేలు, ఎస్సీ కార్పొరేషన్‌కు 10,600, ఎస్టీ కార్పొరేషన్‌కు 6 వేల వరకు దరఖాస్తులు అందాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల ద్వారా 2015-16లో పథకాలకు రూ.లక్షకు 80 శాతం రాయితీ(సబ్సిడీ)తో, రూ.2 లక్షలకు 70 శాతం రాయితీ, రూ.10 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ(5 లక్షలకు మించ కుండా)తో రుణాలు ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళికలను గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రూ.లక్ష వరకు గరిష్ట రుణానికి 60 శాతం వరకు సబ్సిడీని ఇస్తుండగా, ప్రస్తుతం గరిష్ట రుణ సౌకర్యాన్ని రూ.10 లక్షల వరకు పెంచడం (60 శాతం సబ్సిడీ రూ.5 లక్షలు దాటకుండా)తో ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందవచ్చని ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. బీసీ కార్పొరేషన్ 2015-16 లో 17 వేల మందికి, బీసీ ఫెడరేషన్ల ద్వారా దాదాపు 15 వేలమంది వరకు లబ్ధి చేకూరే అవకాశముంది. రూ.5-10 లక్షల మధ్య రుణం కోసం దాదాపు 40 వేల దరఖాస్తులురాగా వాటిలో 400 లోపే రుణాలు అందే అవకాశాలున్నాయి. రూ.లక్ష వరకు రుణాలకు 20 వేలకుపైగా, రూ.2 లక్షల రుణాలకు 40 వేలకుపైగా దరఖాస్తులు అందినట్లు సమాచారం. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యనిచ్చే రుణాలకు వచ్చే దరఖాస్తుల్లో అన్ని అర్హతలను పరిశీలించి, రుణానికి అర్హత పొందిన లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేయాలనే అభిప్రాయంతో బీసీ సంక్షేమ శాఖ ఉంది. కల్లుగీత ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇతరత్రా మరో నెలరోజుల ఆలస్యం కానుండగా, వారికి ఆ మేరకు సమయాన్ని ఇచ్చి కొత్త ఫెడరేషన్ కింద లబ్ధి చేకూర్చాలని బీసీ శాఖ నిర్ణయించింది. దళారులను నమ్మి మోసపోవద్దు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే విషయంలో దళారులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని బీసీ కార్పొరేషన్, 11 ఫెడరేషన్ల ఎం.డి.మల్లయ్యభట్టు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా రుణాలిప్పిస్తామని, డబ్బులు అడిగితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘ఉపాధి’ కూలీలకు ఊతం
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకానికి మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 100 రోజులపాటు ఈ పథకం పనులను పూర్తి చేసిన కూలీలకు ఆయా అంశాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్యం పెంచాలని, తద్వారా వారి ఆదాయం పెంచాలని భావిస్తోంది. ఆయా కుటుంబాల్లోని సభ్యులకు నైపుణ్యాల పెంపుదల, స్వయం ఉపాధి కల్పన నిమిత్తం లైవ్లీహుడ్ ఇన్ ఫుల్ ఎంప్లాయిమెంట్(లైఫ్) ప్రాజెక్ట్ కింద శిక్షణ ఇవ్వనుంది. లైఫ్ ప్రాజెక్ట్‌కు అర్హులైన కుటుంబాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఎంపిక చేశారు. ఏఏ అంశాల్లో శిక్షణ అంటే.. స్కిల్ డెవలప్మెంట్: వ్యవసాయ రంగ సంబంధిత నైపుణ్యాలు, వైద్య, ఆరోగ్య అనుబంధిత రంగాలు, వాహన మరమ్మతులు, బ్యాంకింగ్, అకౌంటింగ్, కేశాలంకరణ, తోలు ఆట వస్తువులు, నిర్మాణ రంగంలో నైపుణ్యాల పెంపు, ఆతిథ్యం, సమాచారం, కమ్యూనికేషన్, బీమా సంబంధిత రంగాలు, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ముద్రణ తదితర రంగాల్లో శిక్షణ పొందేందుకు అవకాశం కల్పిస్తారు. ఆపై ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలను అందిస్తారు. స్వయం ఉపాధి పాడి పరిశ్రమ, వ్యవసాయం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, బయోగ్యాస్ ప్లాంట్లు, పూల పెంపకం, కంప్యూటర్ హార్డ్‌వేర్, హోమ్ నర్సింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్స్, వెల్డింగ్, ఏసీ రిపేరింగ్, సెక్యూరిటీ గార్డులు, బ్యూటీ పార్లర్, ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, ఆల్బమ్‌ల తయారీ, మొబైల్ రిపేరింగ్ అంశాల్లోనూ శిక్షణ ఇస్తారు. జీవనోపాధుల పెంపుదల వ్యవసాయ అనుబంధ(హార్టికల్చర్, సెరికల్చర్, కూరగాయల పెంపకం) రంగాలు, సేంద్రియ ఎరువుల తయారీ తదితర రంగాల్లో శిక్షణకు అవకాశం కల్పిస్తారు. కుటుంబ ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలను చూపుతారు. ‘లైఫ్’ ముఖ్యాంశాలు... ►18 నుంచి 35 ఏళ్ల లోపున్న కూలీలకు లైఫ్ కింద శిక్షణ ►మహిళలు, గిరిజనులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్లు తదితర కేటగిరీల వారికి 45 ఏళ్ల వరకు అవకాశం ► ప్రస్తుతం పొందుతున్న దాని కన్నా అధికంగా ఆదాయం కల్పించడం ► తగిన అర్హతలున్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ కల్పన ► వివిధ చేతి వృత్తులవారికి నైపుణ్య శిక్షణనిచ్చి స్వయం ఉపాధి కల్పించడం ► రాష్ట్రవ్యాప్తంగా(హైదరాబాద్ మినహా) తొమ్మిది జిల్లాల నుంచి 2,05,393 మంది కూలీలు ఎంపిక ► 41 అంశాల్లో నైపుణ్య శిక్షణ ► ఎస్టీ, ఎస్టీ ఉప ప్రణాళికలు, పల్లె ప్రగతి నిధులు, స్త్రీనిధి బ్యాంకు నుంచి వడ్డీలేని రుణాలు ► సుమారు రూ.1,100 కోట్లతో లైఫ్ ప్రాజెక్ట్ అమలు -
ఇంటి రుణం... ఇలా సులభం
మీరు గృహ రుణం తీసుకుంటున్నారా? అయితే పలు పత్రాలు, వివరాలు అందజేయక తప్పదు. వీటి ఆధారంగానే సదరు సంస్థ... రుణం తీసుకునే వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోగలుగుతుంది. అటుపై మళ్లీ ముఖాముఖిగా మీతో భేటీ అవుతుంది. దీన్నే సాధారణంగా పర్సనల్ డిస్కషన్ అంటుంటారు. ఈ డిస్కషన్ చాలా కీలకమైనది. రుణం మంజూరవుతుందా... లేదా? ఎంత మొత్తం లభిస్తుంది? మొదలైన అంశాలన్నీ ఇందులో చర్చకు వస్తాయి. అత్యంత ప్రాధాన్యమున్న పర్సనల్ డిస్కషన్ ప్రధాన ఉద్దేశంపై అవగాహన కల్పించేదే ఈ కథనం. కచ్చితమైన ఆదాయాన్ని మదింపు చేయడం.. సాధారణంగా రుణదాత సంస్థకు (లెండరు) ఇచ్చే స్టేట్మెంట్స్లో మీ ఆదాయ వివరాలున్నప్పటికీ... రుణ చెల్లింపునకు ఉపయోగపడేలా ఇతరత్రా ఆదాయ మార్గాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి ఈ డిస్కషన్ తోడ్పడుతుంది. మీ స్టేట్మెంట్స్లో ప్రతిబింబించని డిపాజిట్లు, ఇతరత్రా ఆర్థిక సాధనాలు మొదలైనవి ఏవైనా ఉంటే ఈ సమావేశం ద్వారా తెలుసుకుని, తదనుగుణంగా మీ కచ్చితమైన ఆదాయాన్ని మదింపు చేసే వీలుంటుంది. మీ ఆస్తుల నికర విలువను అంచనా వేయడం.. మీకేవైనా ఆస్తులు ఉంటే ఆ వివరాలు, వాటి విషయంలో మీ ప్రణాళికల గురించి రుణ దాత అడగవచ్చు. ఒకవేళ రెగ్యులర్‌గా వచ్చే ఆదాయానికి ఏదైనా అవాంతరం ఏర్పడినా... రుణాన్ని తిరిగి చెల్లించేందుకు తగిన ఆర్థిక స్థోమత ఉందా లేదా అన్నది నిర్ధారించుకోవడమే ఈ ప్రశ్నల లక్ష్యం. మీ వ్యాపార స్వభావం గురించి తెలుసుకోవడం స్వయం ఉపాధి పొందుతున్న వారి ఆదాయాలు ఒకోసారి హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. అటువంటి వారి వ్యాపారాల స్వభావం, ఎదురయ్యే ఒత్తిళ్లు మొదలైన వాటి గురించి లెండరు తెలుసుకుంటారు. వీటిని బట్టి నిలకడగా నెలవారీ వాయిదాలు చెల్లించగలరా లేదా అన్న దానిపై నిర్ధారణకు వస్తారు. వ్యయాలు అంచనా వేయడం.. ఒక్కొక్కరికీ ఒక్కో జీవన విధానం.. దానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. కనుక మీ ఖర్చుల తీరుతెన్నుల గురించి తెలుసుకున్న మీదట మీరు నెలవారీ వాయిదా ఎంత మేర చెల్లించగలరన్నది లెండరు అంచనా వేస్తారు. అలాగే, మీరు ఇతరత్రా రుణాలేమైనా ఇప్పటికే చెల్లిస్తున్న పక్షంలో మీరు కొత్తగా గృహ రుణం తీసుకుంటే అది మరింత భారం అవుతుందా లేక మీరు సమర్థంగా చెల్లించగలుగుతారా లేదా అన్నది కూడా చూస్తారు. భవిష్యత్ అవకాశాలు.. మీరు ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా భవిష్యత్‌లో వృద్ధి అవకాశాల గురించి లెండరు తెలుసుకుంటారు. మం జూరయ్యే రుణ మొత్తంతో పాటు భవిష్యత్‌లో నెలవారీ చెల్లించాల్సిన వాయిదా మొత్తాన్ని పెంచుకునే అవకాశాలు దీని వల్ల మదింపు చేయడానికి వీలవుతుంది. పర్సనల్ డిస్కషన్‌ను ఎదుర్కొనేందుకు భారీగా కసరత్తు చేయాల్సిన అవసరమేమీ లేదు. అయితే, కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుంటే మంచిది. అవేంటంటే.. నిజాయితీగా వివరాలు చెప్పండి మిగతా అన్ని చోట్లలాగే గృహ రుణం ఇచ్చే లెండరు దగ్గరా నిజాయితీగా వివరాలు చెప్పడం మంచిది. ప్రస్తుతం ఇంటర్నెట్లో సమాచారమంతా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో అన్ని విషయాలు ఉన్నవి ఉన్నట్లుగా లెండరుకు వివరించడం మంచిది. అబద్ధం చెప్పినట్లు గానీ, ఏవైనా కీలక విషయాలు చెప్పకుండా దాచిపెట్టినట్లు గానీ తేలితే అది రుణ మంజూరీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అన్ని పత్రాలు దగ్గరుంచుకోండి... లెండరు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలతో పాటు అవసరమైన పత్రాలు అన్నీ అందించిన పక్షంలో రుణ మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ధీమాగా ఉండండి.. చిట్టచివరిగా చెప్పేదేమిటంటే.. ఈ ప్రక్రియ గురించి కంగారు, ఆందోళన చెందనవసరం లేదు. ధీమాగా వ్యవహరించండి. రుణం తీసుకోవాలంటే ఒక కస్టమరుగా.. మీకు మార్కెట్లో బోలెడన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీ ఆర్థిక స్థితిగతుల గురించిన వివరాలను స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో వివరించడమే. - అనిల్ కొత్తూరి సీఈవో,ఎడెల్వీజ్ హౌసింగ్ ఫైనాన్స్