Cover Story: బతుకుదెరువుకు కొత్త దారులు | Self And Skilled Employment Over Corona And Lockdown | Sakshi
Sakshi News home page

Cover Story: బతుకుదెరువుకు కొత్త దారులు

Published Sun, May 30 2021 11:56 AM | Last Updated on Sun, May 30 2021 12:48 PM

Self And Skilled Employment Over Corona And Lockdown - Sakshi

‘పూలమ్మిన చోట కట్టెలెలా అమ్మేది?!’ అంటూ తమకు వచ్చిన కష్టం గురించి ప్రస్తావించేవారు గతంలో. ఇప్పుడందరికీ కష్టకాలమే! మహమ్మారి కాలం. పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు... వినిపిస్తున్న నెగెటివ్‌ మాటలు.. గడప దాటడానికి అడ్డం పడుతున్న నిబంధనలు. ఏమిటి చేయడం? ఎలా బతకడం?ఆందోళనల మధ్యనే అవకాశాల కోసం వెతుకులాట. ఏది మొదలో.. ఏది చివరో తెలియని ఆట. స్తంభించిపోయిన ఈ కాలమే కొత్త ఉపాధినీ కనిపెడుతోంది... మారిన పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కొత్త ఊపిరులు పోసుకుంటున్నాయి. బతుకుదెరువును ఖాయం చేస్తున్నాయి..  

క్లీనింగ్‌ సర్వీస్‌లదే మొదటి స్థానం
‘చేతులు కడుక్కొండిరా నాయనా, స్నానం చేయండిరా బాబూ... ’ అంటూ గతంలో పెద్దవాళ్లు వెంటపడ్డా  పట్టించుకునేది కాదు యువతరం. శుభ్రత పాఠం అంటూ జీవనశైలికి కొత్త సిలబస్‌ చేర్చింది కనోనా. ప్రాక్టికల్‌ పరీక్షలతో మెదడును ట్యూన్‌ చేసింది. ఫలితంగా పిల్లా పెద్దా ఒంటి శుభ్రతే కాదు, పరిసరాల పరిశుభ్రత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలెట్టారు. ఈ ప్రోగ్రెస్‌లో పట్టణ ప్రజానీకం ముందున్నారు. ‘మా ఇంటికి వచ్చి క్రిమిసంహారక మందులతో క్లీనింగ్‌ చేస్తారా?’ అంటూ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ని అడిగేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని సదరు సర్వీస్‌ కంపెనీలు చెబుతున్నాయి. ఇండిపెండెంట్‌ హౌజ్‌లు, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్సులు, వాణిజ్య భవనాలు, కార్పొరేట్‌ కార్యాలయాలు.. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రోజువారీగా క్లీనింగ్‌.. దాంతో పాటు క్రిమిసంహార మందులను స్ప్రే చేసే  సర్వీస్‌ను కోరుకుంటున్నాయి.

డబ్బుకు వెనకాడ్డం లేదు. ఈ అవసరాన్ని వ్యాపారంగా మలుచుకునే చురుకుదనం, సరైన ప్రణాళిక, మార్కెటింగ్‌ నైపుణ్యం, పని పట్ల అంకితభావం గలవాళ్లు ‘అర్బన్‌ క్లీనింగ్‌’ బిజినెస్‌తో యమ బిజీగా ఉన్నారు. క్లీనింగ్‌లో స్కిల్‌ గలవారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ ఆర్డర్స్‌ తీసుకొని, డీప్‌ క్లీనింగ్‌ సర్వీసులను కొనసాగిస్తున్నారు. బాత్రూమ్‌ క్లీనింగ్‌ అయితే రూ.500, వంటగది అయితే రూ.2000 వేలు, పూర్తి ఇల్లు అయితే రూ.5000లు ఆపైన అంటూ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి సదరు స్టార్టప్‌లు. ఈ వ్యాపారంలో ఇప్పటికే ఆన్‌లైన్‌ యాప్స్‌ ద్వారా ముందంజలో ఉండి తమ సేవలను ప్రాంతాలవారీగా అందిస్తున్నవారు సైతం క్లీనింగ్‌ సర్వీస్‌లో పోటీపడుతున్నారు. 

అద్దెకు ఫర్నీచర్‌ 
‘మరీ విడ్డూరం కాకపోతే’ అని ముక్కున వేలేసుకుంటారేమో! ‘ఎవరైనా ఇంటిని అద్దెకు తీసుకుంటాం. కానీ, రోజులు మారాయి కాబట్టి ఫుల్లీ ఫర్నిష్డ్‌ ఇళ్లూ రెంట్‌కు దొరుకుతున్నాయి. కేవలం ఫర్నీచరే అద్దెకు దొరకడమేంటీ.. కరోనా కాలం కాకపోతే’ అని సమాధానపడొచ్చు. అవును.. యేడాదిగా ఆఫీస్‌ పనీ ఫ్రమ్‌ హోమ్‌ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లోనే ఆఫీసు వాతావరణం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. రానురాను అదే సంస్కృతిగా స్థిరపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈసరికే  కార్పోరేట్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌నే కొనసాగిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు అయితే వర్క్‌ ఫ్రమ్‌ నేటివిటీ పేరుతో తమ ఉద్యోగులు స్వస్థలాల నుంచి పనిచేసే అవకాశాన్నిస్తున్నాయి. ఇలా ఇంట్లోనే ఆఫీసు పని అనివార్యమైన ఈ రోజుల్లో కార్యాలయ వాతావరణం కుదిరేట్టు ఏర్పాటు చేసుకోకతప్పట్లేదు.

అందుకు అనువైన ఫర్నీచర్‌ కొనుగోలు కోసం వేలల్లోంచి లక్షల్లో ఖర్చు ఉంటోంది. ఇలాంటి అవసరాలకు కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కొంత బడ్జెట్‌ను కేటాయించి ఉద్యోగులకు లోన్లు ఇస్తున్నాయి.  అయినా అంత ఖర్చు పెట్టడం అవసరమా అనుకునేవారి కోసం  పట్టణ, నగర ప్రాంతాల్లో అద్దెకు ఫర్నీచర్‌ ఇచ్చే కంపెనీలు వెలిశాయి. వస్తువును బట్టి రిఫండబుల్‌ డిపాజిట్‌ను నిర్ణయించి ఈ అద్దె వ్యవహారాన్ని వ్యాపారంగా మార్చేశాయి. ఉదాహరణకు.. డెస్క్‌టాప్‌ టేబుల్‌కి మరీ తక్కువ కాకుండా రూ.1000 లోపు రిఫండబుల్‌ డిపాజిట్‌ చేసి, నెలకు రూ.150 అద్దెతో ఇంటికి తెచ్చేసుకోవచ్చు.

ఇలా ఒక్కో ఫర్నీచర్‌కి దాని నాణ్యత, సౌకర్యాన్ని బట్టి అద్దె ఉంటుంది. టీవీ, బెడ్, సోఫా .. ఇలా ఇతరత్రా హోమ్‌ ఫర్నీచర్‌ కూడా ఈ అద్దె జాబితాలో చేరిపోయాయి. ఏ వస్తువు కావాలనుకున్నా అందుకు తగిన అద్దె చెల్లించి, ఉపయోగించుకోవచ్చు సదరు కంపెనీ నిబంధనలను అనుసరించి మాత్రమే. వీటిలో మూడు, ఆరు, పన్నెండు నెలల.. ఫుల్‌ హోమ్‌ ఫర్నీచర్‌ ప్యాకేజీ రెంటల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా ఇస్తున్నారు. 

మూతికి మాస్క్‌లు కుడుతూ.. చేతికి శానిటైజర్‌  చేస్తూ...
ముందున్న డిమాండ్‌ అంతా ఆరోగ్య స్పృహకు సంబంధించిన వస్తువులపైనే అని అంతర్జాతీయ మార్కెట్‌ పరిశోధనలు తమ హెల్త్‌ బాక్స్‌లు నొక్కి మరీ చెబుతున్నాయి. దాని మీద నమ్మకం కుదిరేలా ఇప్పటికే  ఈ మహమ్మారి పుట్టించిన కొత్త ఉపాధిలో మాస్కులు, శానిటైజర్లు చేరనే చేరాయి. పెద్ద ఎత్తున వీటి అవసరం వచ్చి పడటంతో చిన్న చిన్న యూనిట్ల నుంచి పెద్ద స్థాయి దాకా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో వీటి తయారీ సంస్థలు వెలిశాయి. కొంతమంది ఒక గ్రూప్‌గా కలిసి, కొన్ని చోట్ల  సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులూ ఈ మాస్కులు కుట్టడంలో తీరికలేకుండున్నారు. ఇళ్లల్లోనూ కొందరు గృహిణులు మాస్కులు కుడుతూ కుటుంబ పోషణ భారాన్ని తేలిక చేసుకుంటున్నారు. బొటీక్‌లూ డిజైనర్‌ మాస్క్‌లతో వ్యాపారాన్ని కరోనాకాలానికనుగుణంగా మలచుకుంటున్నాయి. 

అనుమానం వచ్చిన ప్రతీసారీ చేతులు కడుక్కోండి లేదంటే శానిటైజర్లను వాడండి అంటూ  2020..వ్యాపార సంస్థలకు ఫ్యూచర్‌ విజన్‌ అందించింది.  ఇంట్లో, వీధుల్లో, ఆఫీసుల్లో శానిటైజర్ల వాడకం పెరగడంతో వాటి తయారీదారులకు డిమాండ్‌ పెరిగింది. కొత్త వాళ్లకూ అవకాశం దొరికింది. శానిటైజర్ల కోసం  స్వచ్ఛంద సంస్థల నుంచి వస్తున్న ఆర్డర్లు ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధినిస్తున్నాయి.  ప్రముఖ ప్రపంచ సాంకేతిక పరిశోధన, సలహా సంస్థ టెక్నావియా 2021–2025 వరకు ఇండియాలో శానిటైజర్‌ మార్కెట్‌ 5.11 మిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

అంటే మన రూపాయాల్లో 37 కోట్ల పైమాటే.  ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి హ్యాండ్‌ శానిటైజర్‌ ఉత్పత్తి కోసం డిస్టిలరీస్, ఇతర యూనిట్లకు అవసరమైన లైసెన్సులను జారీచేశాయి. ముఖ్యమైన కార్యాలయాలు, భవనసముదాయల పైభాగంలో డ్రోన్ల ద్వారా శానిటైజ్‌ చేసే విధానమూ వచ్చింది. ఇక పీపీఇ కిట్ల తయారీ యూనిట్స్, హ్యాండ్‌ వాష్, ఆక్సీజన్‌ జనరేటర్‌.. వంటివీ ప్రాధాన్యాల్లో ఉన్నాయి. ఇళ్లలో ఉన్నవారికి ఆర్డర్‌ మీద పోర్టబుల్‌ ఆక్సీజన్‌ జనరేటర్స్‌ను అందజేస్తున్న హైదరాబాద్‌ స్టార్టప్‌ ‘ది పై ఫ్యాక్టరీ’ని ఇందుకు ఉదాహరణగా  తీసుకోవచ్చు.

ఈ ఇంటి వంట మరో ఇంట
హోటల్‌లో ఎన్ని రకాల వంటకాలున్నా ఇంట్లో చేసిన రుచి రాదన్నది వాస్తవం. అదే ఆలోచన ఇప్పుడు అమ్మలకు బిజినెస్‌ దారిని చూపింది. అమ్మ చేతి ఇంటి వంట ఇప్పుడెందరికో రుచి,శుచి గల భోజనాన్ని వడ్డిస్తున్నాయి. మహమ్మారి సృష్టించిన ఆర్థిక అనిశ్చితికి వంట ఓ పెద్ద ఆదరవుగా మారింది. రెస్టారెంట్ల నుంచి ఆర్డర్‌ మీద తెప్పించుకునే వారు ఇప్పుడు ఇళ్ల నుంచి కూడా ఆర్డర్‌ ఇచ్చి మరీ ఫుడ్‌  తెప్పించుకుంటున్నారు.

మహమ్మారి ముందు వరకు పిండివంటలు, పచ్చళ్లకు మాత్రమే గృహ ఫుడ్స్‌కి ఆర్డర్లు ఉండేవి. కరోనా పుణ్యమాని ఇంటి వంటా బిజినెస్‌ జాబితాలోకి చేరిపోయింది. ఉత్తర భారతదేశంలో అయితే గృహిణులు చేసే ఇంటి వంటలు యాప్‌లలో ఘుమఘుమలాడిస్తున్నాయి. అంతేకాదు లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన రెస్టారెంట్ల స్థానాన్ని ఇంటి వంటలు భర్తీ చేస్తూ ఆ వ్యాపారాన్ని వండుతున్నాయి. ఆర్థికంగా కుదేలయిన తమ కుటుంబాలను నిలబెట్టుకుంటున్నాయి. ఇంటి నుంచి మరో ఇంటికి చేర్చడానికి మోటార్‌ క్యాబ్‌ సర్వీసులూ అందుబాటులోకి రావడం, మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసే యాప్‌లూ ఉండడంతో  ఈ ఇంటి వంట బాగానే మార్కెట్‌ అవుతోంది. 

గతంలో కొన్ని రహదారులపై అక్కడక్కడా టిఫిన్, భోజన సదుపాయంతో ఫుడ్‌ ట్రక్స్‌ కనిపించేవి. ఇప్పుడు వీటి సంఖ్యా పెరిగింది. కిరాణా సరుకులు, కూరగాయలతో పాటు ఐస్‌క్రీమ్, కేక్‌ వంటి బేకరీ ఐటమ్స్‌తో  భోజనప్రియుల కోసం మరిన్ని ఫుడ్‌ ట్రక్కులు అందుబాటులోకి రానున్నాయి.  

ఆన్‌లైన్‌లో గురువులు
ఒక స్మార్ట్‌ ఫోన్‌.. పలు అవసరాలను తీర్చడమే కాదు పలురకాల ఆదాయాలకూ  వనరుగా మారింది. కరోనా కాలంలో టెక్నాలజీ ఉపయోగం అనుభవంలోకి వచ్చింది.  కోవిడ్‌ మూలంగా విద్యార్థులకు ఆన్‌లైనే బడి అయింది. ఇదే విధంగా ట్యూషన్లు, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్, ఫ్యాషన్, మేకప్, జ్యూయెలరీ తయారీ వంటి వాటికీ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌గా మారింది.  నిపుణులు ఆన్‌లైన్‌లోనే క్లాసులు తీసుకుంటున్నారు.

కోర్సుకు, వర్క్‌షాప్స్‌కి తగిన మొత్తాన్ని ఫీజుగా పెట్టి ఆన్‌లైన్‌ గురువులు ఈ-క్లాసులను నిర్వహిస్తున్నారు. కరోనా భయం నుంచి బయటపడటానికి, ఆరోగ్య సలహాలకు,  బంధాలు గట్టిపడటానికి కౌన్సెలింగ్‌ సెంటరూ ఆన్‌లైనే. మొక్కలు, పెంపుడు జంతువుల పెంపకానికి తగు సూచనలకు  కన్‌సల్టెంట్స్‌ ఆన్‌లైన్‌ గురువులే.   తమకున్న నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకోవడంతో పాటు, తగినంత ఆదాయాన్నీ పొందుతున్నారీ గురువులు.  

వర్చువల్‌ ఎగ్జిబిషన్స్‌... షాపింగ్‌..
చిత్రకారులు తమ చిత్రకళా ప్రతిభను ఇంకాస్త మెరుగుపరుచుకునే విధంగా కరోనా కాలం వర్చువల్‌ వేదికకు రూపమిచ్చింది. కళాకారులు తమ పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్స్‌ను ప్రదర్శించేవారు. దాని ద్వారా కస్టమర్‌కు నచ్చిన పెయింటింగ్‌ను అక్కడికక్కడే అమ్మకాలు జరిపేవారు. ఇప్పుడు వర్చువల్‌ ఎగ్జిబిషన్‌లో చూసి, ఆర్డర్‌ చేసిన వినియోగదారుడి చిరునామాకు ఆ చిత్రాన్ని డెలివరీ చేస్తున్నారు.

ఇదే బాటలో ఫ్యాషన్‌ రంగంలో ఇదివరకే ఉన్న ఆన్‌లైన్‌  షాపింగ్‌ని వర్చువల్‌ అనుభూతిని యాడ్‌ చేస్తున్నాడు  డిజైనర్లు. వినియోగదారుడు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా షాప్‌లో ఉండే అనుభూతిని పొందుతూ, తమకు నచ్చిన దుస్తులను కొనుగోలు చేస్తున్నారు. కరోనా టైమ్‌లో ఈ వర్చువల్‌ విధానం అమ్మకం, కొనుగోళ్లను సౌలభ్యం చేసి వ్యాపారం కుంటుపడకుండా చూస్తోంది. 

యూ ట్యూబ్‌
ఈ మహమ్మారి టైమ్‌లో దివాలా తీసిన బిజినెస్‌ ఎలా ఉన్నా  హైలో ఉంది మాత్రం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన యూ ట్యూబ్‌. రకరకాల చానెళ్లు జనాల క్రియేటివిటీని కళ్లముందుంచుతున్నాయి. ప్రతీ నెలా రెండు బిలియన్ల కొత్త యూజర్స్‌ యూట్యూబ్‌లో లాగిన్‌ అవుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు యూ ట్యూబ్‌ను క్లిక్‌ చేస్తున్నారని యూ ట్యూబ్‌ తన గ్లోబల్‌ రీసెర్చిలో తెలియజేసింది. సృజనాత్మకతతో పాటు కాసులనూ కురిపిస్తున్నాయీ యూట్యూబ్స్‌. అందుకే యూట్యూబ్‌ వేదికను ఉపాధిగా మలచుకుంటున్న సృజనకారుల çసంఖ్యా పెరుగుతోంది. 

డిజిటల్‌ మీడియమ్‌కు పెరిగిన డిమాండ్‌ దృష్ట్యా యూనిక్‌ రైటింగ్‌ కంటెంట్‌ను సృష్టించుకోవడం కంపెనీలకు సవాలుగా మారింది. ఇలాంటి కంటెంట్‌కు ఏజెన్సీల సాయం తీసుకుంటున్నాయి. దాంతో క్రియేటివ్‌ రైటర్స్‌ను గాలం వేసి పట్టుకుంటున్నాయి ఏజెన్సీలు. ఇలా డిజిటల్‌ మార్కెటింగ్‌కున్న అపారమైన అవకాశాలను ప్రపంచమంతా వినియోగించుకుంటోంది. దీంట్లో భాగంగా డిజిటల్‌ ఎక్స్‌పర్ట్స్‌ తమ నైపుణ్యానికి నగిషీలు చెక్కుతున్నారు. . రానున్న రోజుల్లోనూ డబ్బులు పండించే పంటగా స్థిరపడనుంది.  
సాఫీగా సాగిపోతున్న ప్రయాణానికి చెక్‌ పెట్టింది కరోనా.  ఒక దారి మూసుకుపోతేనేం వచ్చిన అడ్డంకిలోంచే కొత్త దారిని వెదుక్కునే శక్తి తనకుందని తెలియజేస్తున్నాడు మనిషి.

పెరుగుతూనే ఉండే డెలివరీ సేవలు
ఇది హోడ్‌ డెలివరీల కాలం. చాలా వ్యాపారాలు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ను కేరాఫ్‌గా చేసుకున్నాయి. వినియోగదారులు  వస్తువులను, సేవలను పొందుతున్నారు. వీటిని అందించగలిగే డెలివరీ సేవలకు విపరీతమైన డిమాండ్‌ సృష్టించింది కరోన. రానున్న రోజుల్లో సమర్ధవంతమైన డెలివరీ సేవలకు ఇంకా ఇంకా డిమాండ్‌ పెరుగుతూనే ఉంటుంది. 2020తో పోల్చితే 2021 డెలివరీ సేవలు వ్యాపారంలో పెరుగుదలకు బలమైన వృద్ధిని కనబరుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ–కామర్స్‌ ద్వారా రెస్టారెంట్లు, ఫుడ్‌ షాప్స్, ఇతర వస్తు విక్రయాల డెలివరీకి అనుమతి ఇచ్చింది. దీని ద్వారా భవిష్యత్తులో ఈ తరహా సేవలకే అవసరం ఎక్కువుంటుందనే  విషయం స్పష్టం అవుతోంది. 

కావాలంటే ఇంటినే హాస్పిటల్‌ చేస్తారు
కరోనా పాజిటివ్‌ మనిషిని ఎంత నెగటివ్‌గా మారుస్తుందో అందరికి  తెలిసిందే. వైరస్‌ వ్యాప్తితో ఆసుపత్రులు ఖాళీ లేవు. బెడ్స్‌కు కొరత. ఆక్సిజన్‌ బెడ్‌ అయితే గగనమే. ఈ సంక్షోభానికి పరిష్కారంగా కొన్ని ప్రైవేట్‌ కంపెనీలు ‘ఐసియు ఎట్‌ హోమ్‌’ కాన్సెప్ట్‌తో రంగంలోకి దిగాయి. అపార్ట్‌మెంట్స్, హౌజింగ్‌ కమ్యూనిటీ సభ్యుల అభ్యర్థనతో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్స్, ఐసోలేషన్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. బెడ్, ఆక్సీజన్‌ సిలెండర్, మానిటరింగ్‌.. ఇలా అన్ని రకాల మెడికల్‌ ఎక్విప్‌మెంట్స్‌తో పాటు కన్సల్టెంట్‌ డాక్టర్‌  కూడా ఉండే సెంటర్లను ఏర్పాటు చేసే కంపెనీలవైపు హౌజింగ్‌ కమ్యూనిటీ గ్రూప్స్‌ తమ దృష్టిని సారిస్తున్నాయి. 
– నిర్మలా రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement