cottage industry
-
విధిపై యుద్ధం! గద్దించాలనుంది.. కానీ గొంతు పెగలడంలేదు
ఉమ్మడి కుటుంబం.. ఇంటినిండా జనం.. అనుబంధాల గుమ్మం..అనురాగాల కాపురం.. విధి వికృతం..మేనరికం శాపమో..పేదరికం పాపమో.. విధిపై యుద్ధం చేయాలనుంది.. వైకల్యం వెక్కిరిస్తోంది..గద్దించాలనుంది..గొంతు ఉన్నా పెగలడంలేదు. కష్టాలను ఎదురీదుతామని విన్నవించుకోవడం తప్పా..వినలేని దైన్యం వారిది. రాయదుర్గంలోని నేసేపేటలో నివాసముంటున్న దొడగట్ట గంగమ్మ కుటుంబాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. శ్రమను నమ్ముకున్న ఈ కుటుంబంలో ఏకంగా నలుగురు బధిరులు ఉన్నారు. జీవన పోరాటం సాగిస్తూ కుటీర పరిశ్రమ కోసం చేయూత కోరుకుంటున్నారు. రాయదుర్గం: రాయదుర్గంలోని నేసేపేటలో నివాసముంటున్న దొడగట్ట గంగమ్మ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అందులో ఒక కుమారుడు దేవేంద్ర, కుమార్తె తిప్పక్క పుట్టుకతోనే మూగవారు. ఎదిగే కొద్దీ వినికిడి శక్తినీ కోల్పోయారు. దేవేంద్రకు సమీప బంధువైన నాగవేణితో వివాహమైంది. వీరికి రాధ, సంజయ్, పల్లవి సంతానం. వీరిలో సంజయ్‌కు మూగ, చెవుడు, అవయవలోపం ఉంది. పల్లవి కూడా మూగ, చెవుడుతో బాధపడుతోంది. వీరు పదో తరగతి వరకు చదువుకున్నారు. తిప్పక్కకు వివాహమైనప్పటికీ భర్తతో మనస్పర్థల నేపథ్యంలో తల్లి వద్దే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. గంగమ్మ మరో కుమార్తె వివాహమై మెట్టినింటికి వెళ్లిపోయారు. మొత్తం మీద తొమ్మిది మంది సభ్యులు గల ఈ ఉమ్మడి కుటుంబంలో నలుగురు మూగ, చెవుడు, వైకల్యంతో బాధపడుతున్నారు. సైగలతోనే సంభాషణ.. గంగమ్మ కుమారుడు దేవేంద్ర, కుమార్తె తిప్పక్క, మనవడు సంజయ్, మనవరాలు పల్లవి సైగలతోనే సంభాషిస్తుంటారు. అవతలి వారికి వీరి భాష అర్థం కాకపోతే కాగితంపై రాసి చూపుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు వేరేచోట ఉన్నపుడు వారితో అవసరం ఉంటే వాట్సాప్ వీడియో కాల్‌ను ఉపయోగించుకుంటున్నారు. కుటీర పరిశ్రమ కోసం వినతి.. దేవేంద్ర తన భార్య నాగవేణితో కలిసి ఇంట్లోనే కుట్టుమిషన్ పెట్టుకుని పీస్ వర్క్‌పై జీన్స్‌ప్యాంట్లు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్యనే కుమార్తె పల్లవికి కూడా కుట్టుమిషన్‌లో శిక్షణ ఇస్తున్నాడు. కుమారుడు సంజయ్ తనకు చేతనైన మేరకు తల్లిదండ్రులకు సహకారం అందిస్తున్నాడు. తల్లికి వృద్ధాప్య పింఛన్, దేవేంద్రకు వికలాంగుల పింఛన్ అందుతోంది. దేవేంద్ర సోదరి తిప్పక్కకు సెపరేట్ రేషన్‌కార్డు ఉన్నందున ఆమెకు పింఛన్ వస్తోంది. దీనితోనే అందరూ బతుకుబండి లాగుతున్నారు. అరకొర సంపాదనతో అవసరాలు పూర్తిస్థాయిలో తీరడం లేదు. పీస్ వర్క్ కాకుండా సొంతంగా వర్క్ ఆర్డర్ తెచ్చుకుని కుట్టివ్వడం ద్వారా సంపాదనను మరింత పెంచుకోవడానికి కుటీర పరిశ్రమ ఏర్పాటు కోసం తమకు బ్యాంకు ద్వారా రుణం ఇప్పించాలని దేవేంద్ర దంపతులు కోరుతున్నారు. ప్రతి క్షణం కుంగిపోతున్నాం నాకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు మూగ వారిగా జన్మించారు. కుమారుడికి కూడా ఇద్దరు పిల్లలు మూగ, చెవుడు, వైకల్య లోపంతో జన్మించడం బాధేస్తోంది. ఆ దేవుడు మాకే ఎందుకు ఇలా చేశాడని ప్రతిక్షణం కుంగిపోతున్నాం. అయినా బతుకుపోరాటం కొనసాగిస్తున్నాం. ఇంటి నిండా జనం. అయినా నిశ్శబ్దం. సైగలతోనే సహజీవనం. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటాం. – గంగమ్మ, కుటుంబ పెద్ద (చదవండి: పులినే చంపగల శునకం.. ఖరీదులో కనకం...) -
ఆహా ఏమి రుచి.. ఆత్రేయపురం మామిడి తాండ్ర..
ఆత్రేయపురం(కోనసీమ జిల్లా): రుచికి.. శుచికి.. తియ్యని మామిడి తాండ్రకు కేరాఫ్ అడ్రస్‌గా ఆత్రేయపురం పేరు గాంచింది. చుట్టూ పచ్చని పొలాలు.. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ గ్రామం తాండ్ర తయారీలో ప్రసిద్ధి పొందింది. అనేక మంది ప్రజలు దీనినే వృత్తిగా మార్చుకుని జీవనోపాధి పొందుతున్నారు. తియ్యని లాభాలు ఆర్జిస్తున్నారు. ఏటా వేసవి వచ్చిందంటే తాండ్ర తయారీలో ప్రజలు నిమగ్నమవుతుంటారు. సుమారు 500 కుటుంబాల వారు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాటి చాపలపై మామిడి తాండ్ర పూస్తుంటారు. ఈ మూడు నెలలూ అనేక మందికి జీవనోపాధి కలి్పస్తుంటారు. ఇప్పుడు తయారు చేసిన తాండ్రను నిల్వ ఉంచి, ఏడాది పొడవునా విక్రయిస్తూంటారు. 60 టన్నులు.. రూ.66 లక్షలు ప్రస్తుత సీజన్లో ఆత్రేయపురం కేంద్రంగా సుమారు రూ.66 లక్షల విలువైన 60 టన్నుల మామిడి తాండ్ర తయారవుతోంది. దీని తయారీకి అవసరమైన మామిడి కాయలను నూజివీడు, సత్తుపల్లి, కోరుకొండ, గోకవరం, తుని, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధానంగా కలెక్టర్ రకం మామిడినే తాండ్ర తయారీకి వాడుతుంటారు. ఆత్రేయపురానికి రోజూ రెండు లారీల చొప్పున మామిడి కాయలు తీసుకొస్తుంటారు. దిగుమతి చేసుకున్న మామిడి కాయలను కావు వేసి పండ్లుగా తయారు చేస్తారు. గుజ్జు తీసి.. చక్కెర వేసి.. పండిన మామిడి నుంచి గుజ్జు తీస్తారు. ఆ గుజ్జులో తగు పాళ్లలో పంచదార కలుపుతారు. తర్వాత ఎండలో ఉంచిన తాటి చాపలపై కూలీల సాయంతో ఒక్కో పొరను పూస్తారు. ఇలా రోజుకు ఒక్కో పొర చొప్పున ఐదారు పొరలు పూసిన అనంతరం మామిడి తాండ్ర తయారవుతుంది. మామిడి తాండ్ర పూసిన తాటి చాపలు వారం రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. దీనివల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అనంతరం ఆరంగుళాల పొడవు, వెడల్పు ఉండేలా ముక్కలు కోసి తిరిగి ఎండబెట్టి విక్రయాలకు సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఉన్న మామిడి ధరలతో తాండ్ర తయారీ తలకు మించిన భారంగా మారిందని తయారీదారులు వాపోతున్నారు. పెరిగిన ధరలతో గుబులు ప్రస్తుతం మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉండటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. టన్ను మామిడి కాయల ధర రూ.18 వేలు, పంచదార క్వింటాల్ రూ.3,800 పలుకుతుండటంతో రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. దీంతో సామాన్యులు మామిడి తాండ్ర తయారీకి ముందుకు వెళ్లే పరిస్థితులు లేవని తయారీదారుడు కఠారి సురేష్ ‘సాక్షి’కి తెలిపారు. టన్ను మామిడి కాయలతో 250 కిలోల తాండ్ర తయారవుతుండగా.. ప్రస్తుత ధరల ప్రకారం, కూలీల ఖర్చులతో కలసి సుమారు రూ.25 వేల వరకూ అవుతోంది. ఈ పరిస్థితుల్లో కిలో తాండ్రను రూ.150 నుంచి రూ.200 వరకూ అమ్మితేనే గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకూ.. ఆత్రేయపురంలో తయారైన మామిడి తాండ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా గ్రామానికి అంతర్జాతీయంగా పేరు తెస్తున్నారు. శ్రమనే దైవంగా నమ్ముకుని ఆత్రేయపురం పరిసర ప్రాంతాల ప్రజలు మామిడి తాండ్ర తయారీలో నిమగ్నమవుతున్నారు. లాభాలు ఆర్జించడంతో పాటు గ్రామానికి గుర్తింపు తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది తక్కువ రేటు మామిడి తాండ్ర పుట్టిన ప్రాంతంగా ఆత్రేయపురం ఖ్యాతికెక్కింది. వేసవిలో టన్నుల కొద్దీ మామిడి కాయలను కొనుగోలు చేసి, తాండ్ర తయారు చేస్తారు. దీనిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడాది మామిడికాయలు తక్కువ రావడంతో రేటు కూడా ఎక్కువగా ఉంది. తాండ్ర తయారు చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కకపోవచ్చు. – కఠారి సురేష్, ఆత్రేయపురం ప్రభుత్వం చేయూతనివ్వాలి ఈ ప్రాంతంలో ఎందరో మహిళలు ఉపాధి పొందుతున్న మామిడి తాండ్ర తయారీకి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలి. అలాగే ఈ ప్రాంతంలో స్టాల్స్ నిర్మించుకోవడానికి, నాణ్యమైన సరుకులు కొనుగోలు చేయడానికి సాయం అందించాలి. -చిలువూరి చిన వెంకట్రాజు, ఆత్రేయపురం -
మహిళా సర్వోదయంస్త్రీ శక్తి
సాధారణంగా స్వయం సహాయ సంఘాల మహిళలంటే తాము పొదుపు చేసుకున్న మొత్తానికి తోడు, బ్యాంకు లింకేజీ కింద వచ్చే రుణాలతో కిరాణాషాపులు.. పాడి పశువుల పెంపకం వంటి పనులకు పరిమితమవుతుంటారు. అయితే సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గంగ్లూర్ గ్రామానికి చెందిన మహిళలు ఓ అడుగు ముందుకేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గ్రామంలోని 126 మంది మహిళలు సంఘటితమై మూడు కుటీర పరిశ్రమలను స్థాపించారు. సర్వోదయ ఉమెన్ ఎంటర్పైజెస్ పేరుతో కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించారు. త్వరలోనే స్వయం సహాయక బృంగాల మహిళలు కాస్తా మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు. ‘సర్వోదయ మంజీరా’ బ్రాండ్ పేరుతో చేతితో చేసిన 15 రకాల సబ్బులు తయారు చేస్తున్నారు. 20కిపైగా రసాయనాలతో తయారయ్యే సాధారణ సబ్బులకు భిన్నంగా ఇవన్నీ బొప్పాయి, టమాట వంటి సహజ వనరులతో తయారు చేసినవే కావడం గమనార్హం. ఈ పరిశ్రమల్లో కోల్డ్‌ప్రెస్ వంటనూనెలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. పల్లి, పొద్దుతిరుగుడు, నువ్వుల నూనె, కొబ్బరినూనెలను తయారు చేస్తున్నారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ కూడా చేస్తున్నారు. స్థానికంగా పండే పప్పుదినుసుల ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తున్నారు. జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలు.. బహుళ జాతి సంస్థల ఉత్పత్తులకు ఏమాత్రం తీసిపోని విధంగా నాణ్యత విషయంలో రాజీ పడటం లేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), జీఎంపీ (గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్ట్) వంటి జాతీయ సంస్థల లైసెన్సులు తీసుకున్నారు. హ్యాండ్‌మేడ్ సబ్బులు వంటి కాస్మోటిక్స్ ఉత్పత్తుల కోసం ఆయుష్ విభాగం నుంచి అనుమతి పొందారు. త్వరలో మార్కెట్లోకి ఉత్పత్తులు.. సర్వోదయ ఉత్పత్తులు మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2022 జనవరిలోనే ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రారంభించాలని భావించినప్పటికీ కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం కారణంగా మరో పక్షం రోజులు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ఉత్పత్తుల కోసం వినియోగదారుల అభిరుచుల సేకరణ ప్రక్రియను కూడా చేపట్టారు. వారి అభిరుచుల మేరకు తమ ఉత్పత్తుల్లో మార్పు చేర్పులు కూడా చేసినట్లు మహిళలు చెబుతున్నారు. బాధ్యతగా పనిచేస్తున్నాం... ‘సర్వోదయ’లో పనిచేసే మేము అందరం ఈ పరిశ్రమలకు ఓనర్లమే. అందరికీ యాజమాన్య వాటా ఉంది. వచ్చే లాభాల్లో డివిడెండ్ వస్తుంది. అందువల్ల బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మేమందరం పప్పుల ప్రాసెసింగ్, నూనెలు తయారు చేయడం నేర్చుకుంటున్నాము. గ్రామంలోనే మా సొంత పరిశ్రమ లో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. – అంకమ్మగారి చిట్టెమ్మ, ‘సర్వోదయ’ సభ్యురాలు సొంతూరులోనే పని దొరుకుతోంది... ఇప్పటివరకు ఇంటిపనికే పరిమితమైన మాకు ఈ పరిశ్రమ వల్ల సొంత ఊరిలోనే పని దొరుకుతోంది. ఈ పరిశ్రమలో మా కుటుంబం పెట్టుబడి ఉండటంతో అందులో పనిచేస్తున్న నేను కార్మికురాలిగా కాకుండా యజమానురాలిగా భావిస్తున్నాను. ప్రస్తుతం నేను సబ్బుల తయారీలో పనిచేస్తున్నాను. – జంగం శిరీష, ‘సర్వోదయ’ సభ్యురాలు గ్రామీణాభివృద్ధి సేవలందిస్తున్నాం... సర్వోదయ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు విద్యా, వైద్యం, ఉపాధి, పర్యావరణం వంటి విషయాల్లో ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నాము. ఐఆర్ఎస్ అధికారులం కలిసి ఇప్పటి వరకు జిల్లాలో ఆరు గ్రామాల్లో కార్యకలాపాలను ప్రారంభించాం. కరస్‌గుత్తి, ఎద్దుమైలారం, మునిపల్లి, మైనంపల్లి, హన్మంతరావుపేట్‌లలో కూడా సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాము.. అనే నినాదం తో ముందుకెళుతున్నాం. – డాక్టర్ సుధాకర్ నాయక్, సర్వోదయ సంస్థ ఐఆర్ఎస్ అధికారుల సహకారం.. ఆదాయపు పన్ను శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన ఆర్కే పాలివాల్ అనే ఉన్నతాధికారి ఈ గంగ్లూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన స్ఫూర్తితో మరికొందరు ఐఆర్ఎస్ ఉన్నతాధికారులు సర్వోదయ సంస్థను స్థాపించి ఈ గ్రామంలోని మహిళలను సంఘటితం చేస్తున్నారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి సంయుక్తంగా మహిళలకు పారిశ్రామిక ఉత్పత్తిలో ఉన్నత స్థాయి శిక్షణ ఇప్పించారు. ఈ సంస్థ సహకారంతో మహిళలు ముందడుగు వేస్తున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఫొటోలు: బగిలి శివప్రసాద్ సర్వోదయ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ మహిళలు గొంగ్లూర్‌లో ఏర్పాటు చేసుకున్న పరిశ్రమ యూనిట్లు. హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తితో సమావేశమైన గొంగ్లూర్ మహిళలు -
పొరలు పొరలుగా.. నోరూరించేలా..
సాక్షి, చాగల్లు (పశ్చిమగోదావరి) : మామిడి పండు అంటేనే నోరూరుతుంది. ఇక ఆ మామిడితో చేసే తాండ్రను తింటే మనం ఒక పట్టాన వదిలిపెట్టం. తాండ్రను పొరలు పొరలుగా తీసుకుంటూ తింటూ ఉంటే ఆ రుచే వేరు. పిల్లలు, పెద్దలు అనే తేడా అందరికీ ఇష్టమైన ఈ మామిడి తాండ్ర తయారీ కొంచెం కష్టమైనా రుచిలో మాత్రం అద్భుతం. ఇక ఆ మామిడితాండ్రకు ప్రసిద్ధి చెందిన చాగల్లు మండలం ఊనగట్ల గ్రామం వెళ్తే సీజన్లో ఎక్కడ చూసినా తాండ్ర తయారు చేస్తూ బిజీగా కనిపిస్తుంటారు. చాపలపై మామిడి రసం పాముతూ తాండ్ర ఎండబెట్టేందుకు శ్రమిస్తుంటారు. వేసవిలో దొరికే మామిడిపళ్ల రుచి అన్ని సీజన్లలోనూ ఆస్వాదించేలా తయారు చేసే మామిడి తాండ్ర సంగతులు తెలుసుకునేందుకు ఒకసారి ఊనగట్ల వెళ్లొద్దాం రండి. ఊనగట్ల గ్రామంలో ఎప్పటి నుంచో ఈ మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. కాలం మారేకొద్దీ తయారీ విధానాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఏటా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాండ్ర తయారీ ముమ్మరంగా సాగుతుంది. మామిడి పండ్ల గుజ్జు నుంచి తాండ్రను తయారు చేస్తారు. గతంలో కాయలను రోళ్లలో వేసి గుజ్జు తీసేవారు. ఇప్పుడు అధునాతమైన యంత్రాల సాయంతో గుజ్జు తీస్తున్నారు. ఆ గుజ్జులో బెల్లం లేదా పంచదార కలిపి తాటాకు చాపలపై పూతగా పెడతారు. ఈ విధంగా ఎండాకాలంలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు చొప్పున వారం రోజులపాటు పూత పెడితే మామిడితాండ్ర తయారవుతుంది. తాండ్రను ఆరిన తరువాత ముక్కలుగా కోసి పెట్టెల్లో ప్యాక్ చేసి భద్రపరుస్తారు. మామిడికాయల గుజ్జును తీస్తున్న దృశ్యం ఇటీవల తగ్గిన తయారీ కేంద్రాలు మామిడితాండ్రకు కలెక్టర్, రసాలు, బంగినపల్లి వంటి మామిడిపళ్ల రకాలు వినియోగిస్తారు. నిడదవోలు, కొవ్వూరుపాడు, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెం, నూజివీడు, కొరుకొండ, రాజమండ్రి మార్కెట్ల నుంచి మామిడికాయలను టన్నుల లెక్కన కొనుగోలు చేస్తారు. మామిడితాండ్ర కోసం ఒక్కొక్కరూ రోజూ టన్ను మామిడికాయల వరకు దిగుమతి చేసుకుంటారు. ఇటీవల వాతావరణం అనుకూలించక మామిడి కాపు తగ్గి రేట్లు గణనీయంగా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం మామిడితాండ్ర తయారీ కేంద్రాలు గతంలో 50 వరకు ఉండగా, ప్రస్తుతం 15 కేంద్రాలకు తగ్గిపోయాయి. ఏటా వేసవిలో ఉపాధి మామిడి తాండ్ర పెద్ద తయారీ కేంద్రాల్లో 25 నుంచి 30.. చిన్న కేంద్రాల్లో 15 నుంచి 20 మంది ఉపాధి పొందుతుంటారు. సీజన్లో గ్రామంలో సుమారు 500 మందికి పైగా ఉపాధి దొరుకుతుంది. మామిడితాండ్ర తయారీ సమయంలో వ్యవసాయ పనులు లేకపోకపోవడంతో ఈ పరిశ్రమ మహిళలకు ఆదాయ వనరు ఉంటోంది. ఈ ప్రాంత ప్రజలకు మామిడితాండ్ర తయారీ చక్కని ఉపాధి అవకాశాలు కలిగిస్తోంది. గత రెండేళ్లుగా సీజన్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో తాండ్ర తయారీ నిర్వాహకులు భయపడ్డారు. భౌతిక దూరం, తగిన జాగ్రత్తలు పాటిస్తూ కూలీలతో పనులు చేసుకోవచ్చని ప్రభుత్వం భరోసా కల్పించడంతో తయారీ దారులు మామిడి కాయలను దిగుమతి చేసుకుని తాండ్ర తయారీ పనులు కొనసాగించారు. హైద్రాబాద్, ముంబై, చెన్నైలకు ఎగుమతి తాండ్రను తగిన సైజుల్లో ముక్కలుగా కోసి 50 కేజీలు చొప్పున పెట్టెలుగా పెట్టి 200 పెట్టెలను లారీకి ఎగుమతి చేస్తుంటారు. మామిడితాండ్ర ధర క్వింటాలు రూ.8 వేలు నుంచి రూ.9 వేల వరకు ఉంటుంది. సుమారు రూ.50 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. హైద్రాబాద్, ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు తాండ్ర ఎగుమతి చేస్తారు. మామిడితాండ్రను సైకిళ్లపై విక్రయిస్తూ మరో వంద మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఏడాది పొడవునా అమ్మకాలు ఎన్నో ఏళ్లుగా మామిడితాండ్ర తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నాం. తాండ్రను కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచి ఏడాది పొడవునా అమ్మకాలు చేస్తున్నాం. – బి. శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు తయారీవ్యయంతో ఇబ్బందులు పెరుగుతున్న మామిడి ధరలతో పాటు కూలీల కొరత అధికంగా ఉంటుంది. తాండ్రకు గిట్టుబాటు ధరలు అంతంత మాత్రంగా ఉండటంతో ఇటీవల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – కొండేపర్తి శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు తాండ్ర తయారీతో మహిళలకు ఉపాధి మామిడితాండ్ర కుటీర పరిశ్రమగా వేసవి కాలంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పనిని బట్టి రోజుకు రూ.200 నుంచి రూ.250 వరకు కూలీ లభిస్తుంది. ఈ ప్రాంత మహిళల అభివృద్ధి తాండ్ర పరిశ్రమ దోహదం చేస్తుంది. – కె. సీతామహాలక్ష్మి, మామిడితాండ్ర తయారీ కూలీ -
Cover Story: బతుకుదెరువుకు కొత్త దారులు
‘పూలమ్మిన చోట కట్టెలెలా అమ్మేది?!’ అంటూ తమకు వచ్చిన కష్టం గురించి ప్రస్తావించేవారు గతంలో. ఇప్పుడందరికీ కష్టకాలమే! మహమ్మారి కాలం. పెరుగుతున్న పాజిటివ్ కేసులు... వినిపిస్తున్న నెగెటివ్ మాటలు.. గడప దాటడానికి అడ్డం పడుతున్న నిబంధనలు. ఏమిటి చేయడం? ఎలా బతకడం?ఆందోళనల మధ్యనే అవకాశాల కోసం వెతుకులాట. ఏది మొదలో.. ఏది చివరో తెలియని ఆట. స్తంభించిపోయిన ఈ కాలమే కొత్త ఉపాధినీ కనిపెడుతోంది... మారిన పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కొత్త ఊపిరులు పోసుకుంటున్నాయి. బతుకుదెరువును ఖాయం చేస్తున్నాయి.. క్లీనింగ్ సర్వీస్లదే మొదటి స్థానం ‘చేతులు కడుక్కొండిరా నాయనా, స్నానం చేయండిరా బాబూ... ’ అంటూ గతంలో పెద్దవాళ్లు వెంటపడ్డా పట్టించుకునేది కాదు యువతరం. శుభ్రత పాఠం అంటూ జీవనశైలికి కొత్త సిలబస్ చేర్చింది కనోనా. ప్రాక్టికల్ పరీక్షలతో మెదడును ట్యూన్ చేసింది. ఫలితంగా పిల్లా పెద్దా ఒంటి శుభ్రతే కాదు, పరిసరాల పరిశుభ్రత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలెట్టారు. ఈ ప్రోగ్రెస్‌లో పట్టణ ప్రజానీకం ముందున్నారు. ‘మా ఇంటికి వచ్చి క్రిమిసంహారక మందులతో క్లీనింగ్ చేస్తారా?’ అంటూ సర్వీస్ ప్రొవైడర్స్‌ని అడిగేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని సదరు సర్వీస్ కంపెనీలు చెబుతున్నాయి. ఇండిపెండెంట్ హౌజ్‌లు, అపార్ట్మెంట్ కాంప్లెక్సులు, వాణిజ్య భవనాలు, కార్పొరేట్ కార్యాలయాలు.. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రోజువారీగా క్లీనింగ్.. దాంతో పాటు క్రిమిసంహార మందులను స్ప్రే చేసే సర్వీస్‌ను కోరుకుంటున్నాయి. డబ్బుకు వెనకాడ్డం లేదు. ఈ అవసరాన్ని వ్యాపారంగా మలుచుకునే చురుకుదనం, సరైన ప్రణాళిక, మార్కెటింగ్ నైపుణ్యం, పని పట్ల అంకితభావం గలవాళ్లు ‘అర్బన్ క్లీనింగ్’ బిజినెస్‌తో యమ బిజీగా ఉన్నారు. క్లీనింగ్‌లో స్కిల్ గలవారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా బుకింగ్ ఆర్డర్స్ తీసుకొని, డీప్ క్లీనింగ్ సర్వీసులను కొనసాగిస్తున్నారు. బాత్రూమ్ క్లీనింగ్ అయితే రూ.500, వంటగది అయితే రూ.2000 వేలు, పూర్తి ఇల్లు అయితే రూ.5000లు ఆపైన అంటూ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి సదరు స్టార్టప్‌లు. ఈ వ్యాపారంలో ఇప్పటికే ఆన్లైన్ యాప్స్ ద్వారా ముందంజలో ఉండి తమ సేవలను ప్రాంతాలవారీగా అందిస్తున్నవారు సైతం క్లీనింగ్ సర్వీస్‌లో పోటీపడుతున్నారు. అద్దెకు ఫర్నీచర్ ‘మరీ విడ్డూరం కాకపోతే’ అని ముక్కున వేలేసుకుంటారేమో! ‘ఎవరైనా ఇంటిని అద్దెకు తీసుకుంటాం. కానీ, రోజులు మారాయి కాబట్టి ఫుల్లీ ఫర్నిష్డ్ ఇళ్లూ రెంట్‌కు దొరుకుతున్నాయి. కేవలం ఫర్నీచరే అద్దెకు దొరకడమేంటీ.. కరోనా కాలం కాకపోతే’ అని సమాధానపడొచ్చు. అవును.. యేడాదిగా ఆఫీస్ పనీ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లోనే ఆఫీసు వాతావరణం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. రానురాను అదే సంస్కృతిగా స్థిరపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈసరికే కార్పోరేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌నే కొనసాగిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు అయితే వర్క్ ఫ్రమ్ నేటివిటీ పేరుతో తమ ఉద్యోగులు స్వస్థలాల నుంచి పనిచేసే అవకాశాన్నిస్తున్నాయి. ఇలా ఇంట్లోనే ఆఫీసు పని అనివార్యమైన ఈ రోజుల్లో కార్యాలయ వాతావరణం కుదిరేట్టు ఏర్పాటు చేసుకోకతప్పట్లేదు. అందుకు అనువైన ఫర్నీచర్ కొనుగోలు కోసం వేలల్లోంచి లక్షల్లో ఖర్చు ఉంటోంది. ఇలాంటి అవసరాలకు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కొంత బడ్జెట్‌ను కేటాయించి ఉద్యోగులకు లోన్లు ఇస్తున్నాయి. అయినా అంత ఖర్చు పెట్టడం అవసరమా అనుకునేవారి కోసం పట్టణ, నగర ప్రాంతాల్లో అద్దెకు ఫర్నీచర్ ఇచ్చే కంపెనీలు వెలిశాయి. వస్తువును బట్టి రిఫండబుల్ డిపాజిట్‌ను నిర్ణయించి ఈ అద్దె వ్యవహారాన్ని వ్యాపారంగా మార్చేశాయి. ఉదాహరణకు.. డెస్క్‌టాప్ టేబుల్‌కి మరీ తక్కువ కాకుండా రూ.1000 లోపు రిఫండబుల్ డిపాజిట్ చేసి, నెలకు రూ.150 అద్దెతో ఇంటికి తెచ్చేసుకోవచ్చు. ఇలా ఒక్కో ఫర్నీచర్‌కి దాని నాణ్యత, సౌకర్యాన్ని బట్టి అద్దె ఉంటుంది. టీవీ, బెడ్, సోఫా .. ఇలా ఇతరత్రా హోమ్ ఫర్నీచర్ కూడా ఈ అద్దె జాబితాలో చేరిపోయాయి. ఏ వస్తువు కావాలనుకున్నా అందుకు తగిన అద్దె చెల్లించి, ఉపయోగించుకోవచ్చు సదరు కంపెనీ నిబంధనలను అనుసరించి మాత్రమే. వీటిలో మూడు, ఆరు, పన్నెండు నెలల.. ఫుల్ హోమ్ ఫర్నీచర్ ప్యాకేజీ రెంటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. మూతికి మాస్క్‌లు కుడుతూ.. చేతికి శానిటైజర్ చేస్తూ... ముందున్న డిమాండ్ అంతా ఆరోగ్య స్పృహకు సంబంధించిన వస్తువులపైనే అని అంతర్జాతీయ మార్కెట్ పరిశోధనలు తమ హెల్త్ బాక్స్‌లు నొక్కి మరీ చెబుతున్నాయి. దాని మీద నమ్మకం కుదిరేలా ఇప్పటికే ఈ మహమ్మారి పుట్టించిన కొత్త ఉపాధిలో మాస్కులు, శానిటైజర్లు చేరనే చేరాయి. పెద్ద ఎత్తున వీటి అవసరం వచ్చి పడటంతో చిన్న చిన్న యూనిట్ల నుంచి పెద్ద స్థాయి దాకా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో వీటి తయారీ సంస్థలు వెలిశాయి. కొంతమంది ఒక గ్రూప్‌గా కలిసి, కొన్ని చోట్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులూ ఈ మాస్కులు కుట్టడంలో తీరికలేకుండున్నారు. ఇళ్లల్లోనూ కొందరు గృహిణులు మాస్కులు కుడుతూ కుటుంబ పోషణ భారాన్ని తేలిక చేసుకుంటున్నారు. బొటీక్లూ డిజైనర్ మాస్క్‌లతో వ్యాపారాన్ని కరోనాకాలానికనుగుణంగా మలచుకుంటున్నాయి. అనుమానం వచ్చిన ప్రతీసారీ చేతులు కడుక్కోండి లేదంటే శానిటైజర్లను వాడండి అంటూ 2020..వ్యాపార సంస్థలకు ఫ్యూచర్ విజన్ అందించింది. ఇంట్లో, వీధుల్లో, ఆఫీసుల్లో శానిటైజర్ల వాడకం పెరగడంతో వాటి తయారీదారులకు డిమాండ్ పెరిగింది. కొత్త వాళ్లకూ అవకాశం దొరికింది. శానిటైజర్ల కోసం స్వచ్ఛంద సంస్థల నుంచి వస్తున్న ఆర్డర్లు ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధినిస్తున్నాయి. ప్రముఖ ప్రపంచ సాంకేతిక పరిశోధన, సలహా సంస్థ టెక్నావియా 2021–2025 వరకు ఇండియాలో శానిటైజర్ మార్కెట్ 5.11 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అంటే మన రూపాయాల్లో 37 కోట్ల పైమాటే. ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి హ్యాండ్ శానిటైజర్ ఉత్పత్తి కోసం డిస్టిలరీస్, ఇతర యూనిట్లకు అవసరమైన లైసెన్సులను జారీచేశాయి. ముఖ్యమైన కార్యాలయాలు, భవనసముదాయల పైభాగంలో డ్రోన్ల ద్వారా శానిటైజ్ చేసే విధానమూ వచ్చింది. ఇక పీపీఇ కిట్ల తయారీ యూనిట్స్, హ్యాండ్ వాష్, ఆక్సీజన్ జనరేటర్.. వంటివీ ప్రాధాన్యాల్లో ఉన్నాయి. ఇళ్లలో ఉన్నవారికి ఆర్డర్ మీద పోర్టబుల్ ఆక్సీజన్ జనరేటర్స్‌ను అందజేస్తున్న హైదరాబాద్ స్టార్టప్ ‘ది పై ఫ్యాక్టరీ’ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ ఇంటి వంట మరో ఇంట హోటల్లో ఎన్ని రకాల వంటకాలున్నా ఇంట్లో చేసిన రుచి రాదన్నది వాస్తవం. అదే ఆలోచన ఇప్పుడు అమ్మలకు బిజినెస్ దారిని చూపింది. అమ్మ చేతి ఇంటి వంట ఇప్పుడెందరికో రుచి,శుచి గల భోజనాన్ని వడ్డిస్తున్నాయి. మహమ్మారి సృష్టించిన ఆర్థిక అనిశ్చితికి వంట ఓ పెద్ద ఆదరవుగా మారింది. రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ మీద తెప్పించుకునే వారు ఇప్పుడు ఇళ్ల నుంచి కూడా ఆర్డర్ ఇచ్చి మరీ ఫుడ్ తెప్పించుకుంటున్నారు. మహమ్మారి ముందు వరకు పిండివంటలు, పచ్చళ్లకు మాత్రమే గృహ ఫుడ్స్‌కి ఆర్డర్లు ఉండేవి. కరోనా పుణ్యమాని ఇంటి వంటా బిజినెస్ జాబితాలోకి చేరిపోయింది. ఉత్తర భారతదేశంలో అయితే గృహిణులు చేసే ఇంటి వంటలు యాప్‌లలో ఘుమఘుమలాడిస్తున్నాయి. అంతేకాదు లాక్డౌన్ కారణంగా మూతపడిన రెస్టారెంట్ల స్థానాన్ని ఇంటి వంటలు భర్తీ చేస్తూ ఆ వ్యాపారాన్ని వండుతున్నాయి. ఆర్థికంగా కుదేలయిన తమ కుటుంబాలను నిలబెట్టుకుంటున్నాయి. ఇంటి నుంచి మరో ఇంటికి చేర్చడానికి మోటార్ క్యాబ్ సర్వీసులూ అందుబాటులోకి రావడం, మనీ ట్రాన్స్ఫర్ చేసే యాప్‌లూ ఉండడంతో ఈ ఇంటి వంట బాగానే మార్కెట్ అవుతోంది. గతంలో కొన్ని రహదారులపై అక్కడక్కడా టిఫిన్, భోజన సదుపాయంతో ఫుడ్ ట్రక్స్ కనిపించేవి. ఇప్పుడు వీటి సంఖ్యా పెరిగింది. కిరాణా సరుకులు, కూరగాయలతో పాటు ఐస్‌క్రీమ్, కేక్ వంటి బేకరీ ఐటమ్స్‌తో భోజనప్రియుల కోసం మరిన్ని ఫుడ్ ట్రక్కులు అందుబాటులోకి రానున్నాయి. ఆన్లైన్లో గురువులు ఒక స్మార్ట్ ఫోన్.. పలు అవసరాలను తీర్చడమే కాదు పలురకాల ఆదాయాలకూ వనరుగా మారింది. కరోనా కాలంలో టెక్నాలజీ ఉపయోగం అనుభవంలోకి వచ్చింది. కోవిడ్ మూలంగా విద్యార్థులకు ఆన్లైనే బడి అయింది. ఇదే విధంగా ట్యూషన్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఫ్యాషన్, మేకప్, జ్యూయెలరీ తయారీ వంటి వాటికీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా మారింది. నిపుణులు ఆన్లైన్లోనే క్లాసులు తీసుకుంటున్నారు. కోర్సుకు, వర్క్‌షాప్స్‌కి తగిన మొత్తాన్ని ఫీజుగా పెట్టి ఆన్లైన్ గురువులు ఈ-క్లాసులను నిర్వహిస్తున్నారు. కరోనా భయం నుంచి బయటపడటానికి, ఆరోగ్య సలహాలకు, బంధాలు గట్టిపడటానికి కౌన్సెలింగ్ సెంటరూ ఆన్లైనే. మొక్కలు, పెంపుడు జంతువుల పెంపకానికి తగు సూచనలకు కన్సల్టెంట్స్ ఆన్లైన్ గురువులే. తమకున్న నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకోవడంతో పాటు, తగినంత ఆదాయాన్నీ పొందుతున్నారీ గురువులు. వర్చువల్ ఎగ్జిబిషన్స్... షాపింగ్.. చిత్రకారులు తమ చిత్రకళా ప్రతిభను ఇంకాస్త మెరుగుపరుచుకునే విధంగా కరోనా కాలం వర్చువల్ వేదికకు రూపమిచ్చింది. కళాకారులు తమ పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్స్‌ను ప్రదర్శించేవారు. దాని ద్వారా కస్టమర్‌కు నచ్చిన పెయింటింగ్‌ను అక్కడికక్కడే అమ్మకాలు జరిపేవారు. ఇప్పుడు వర్చువల్ ఎగ్జిబిషన్లో చూసి, ఆర్డర్ చేసిన వినియోగదారుడి చిరునామాకు ఆ చిత్రాన్ని డెలివరీ చేస్తున్నారు. ఇదే బాటలో ఫ్యాషన్ రంగంలో ఇదివరకే ఉన్న ఆన్లైన్ షాపింగ్‌ని వర్చువల్ అనుభూతిని యాడ్ చేస్తున్నాడు డిజైనర్లు. వినియోగదారుడు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా షాప్‌లో ఉండే అనుభూతిని పొందుతూ, తమకు నచ్చిన దుస్తులను కొనుగోలు చేస్తున్నారు. కరోనా టైమ్‌లో ఈ వర్చువల్ విధానం అమ్మకం, కొనుగోళ్లను సౌలభ్యం చేసి వ్యాపారం కుంటుపడకుండా చూస్తోంది. యూ ట్యూబ్ ఈ మహమ్మారి టైమ్‌లో దివాలా తీసిన బిజినెస్ ఎలా ఉన్నా హైలో ఉంది మాత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన యూ ట్యూబ్. రకరకాల చానెళ్లు జనాల క్రియేటివిటీని కళ్లముందుంచుతున్నాయి. ప్రతీ నెలా రెండు బిలియన్ల కొత్త యూజర్స్ యూట్యూబ్‌లో లాగిన్ అవుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు యూ ట్యూబ్‌ను క్లిక్ చేస్తున్నారని యూ ట్యూబ్ తన గ్లోబల్ రీసెర్చిలో తెలియజేసింది. సృజనాత్మకతతో పాటు కాసులనూ కురిపిస్తున్నాయీ యూట్యూబ్స్. అందుకే యూట్యూబ్ వేదికను ఉపాధిగా మలచుకుంటున్న సృజనకారుల çసంఖ్యా పెరుగుతోంది. డిజిటల్ మీడియమ్‌కు పెరిగిన డిమాండ్ దృష్ట్యా యూనిక్ రైటింగ్ కంటెంట్‌ను సృష్టించుకోవడం కంపెనీలకు సవాలుగా మారింది. ఇలాంటి కంటెంట్‌కు ఏజెన్సీల సాయం తీసుకుంటున్నాయి. దాంతో క్రియేటివ్ రైటర్స్‌ను గాలం వేసి పట్టుకుంటున్నాయి ఏజెన్సీలు. ఇలా డిజిటల్ మార్కెటింగ్కున్న అపారమైన అవకాశాలను ప్రపంచమంతా వినియోగించుకుంటోంది. దీంట్లో భాగంగా డిజిటల్ ఎక్స్పర్ట్స్ తమ నైపుణ్యానికి నగిషీలు చెక్కుతున్నారు. . రానున్న రోజుల్లోనూ డబ్బులు పండించే పంటగా స్థిరపడనుంది. సాఫీగా సాగిపోతున్న ప్రయాణానికి చెక్ పెట్టింది కరోనా. ఒక దారి మూసుకుపోతేనేం వచ్చిన అడ్డంకిలోంచే కొత్త దారిని వెదుక్కునే శక్తి తనకుందని తెలియజేస్తున్నాడు మనిషి. పెరుగుతూనే ఉండే డెలివరీ సేవలు ఇది హోడ్ డెలివరీల కాలం. చాలా వ్యాపారాలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌ను కేరాఫ్‌గా చేసుకున్నాయి. వినియోగదారులు వస్తువులను, సేవలను పొందుతున్నారు. వీటిని అందించగలిగే డెలివరీ సేవలకు విపరీతమైన డిమాండ్ సృష్టించింది కరోన. రానున్న రోజుల్లో సమర్ధవంతమైన డెలివరీ సేవలకు ఇంకా ఇంకా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. 2020తో పోల్చితే 2021 డెలివరీ సేవలు వ్యాపారంలో పెరుగుదలకు బలమైన వృద్ధిని కనబరుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ–కామర్స్ ద్వారా రెస్టారెంట్లు, ఫుడ్ షాప్స్, ఇతర వస్తు విక్రయాల డెలివరీకి అనుమతి ఇచ్చింది. దీని ద్వారా భవిష్యత్తులో ఈ తరహా సేవలకే అవసరం ఎక్కువుంటుందనే విషయం స్పష్టం అవుతోంది. కావాలంటే ఇంటినే హాస్పిటల్ చేస్తారు కరోనా పాజిటివ్ మనిషిని ఎంత నెగటివ్‌గా మారుస్తుందో అందరికి తెలిసిందే. వైరస్ వ్యాప్తితో ఆసుపత్రులు ఖాళీ లేవు. బెడ్స్‌కు కొరత. ఆక్సిజన్ బెడ్ అయితే గగనమే. ఈ సంక్షోభానికి పరిష్కారంగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు ‘ఐసియు ఎట్ హోమ్’ కాన్సెప్ట్‌తో రంగంలోకి దిగాయి. అపార్ట్మెంట్స్, హౌజింగ్ కమ్యూనిటీ సభ్యుల అభ్యర్థనతో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, ఐసోలేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. బెడ్, ఆక్సీజన్ సిలెండర్, మానిటరింగ్.. ఇలా అన్ని రకాల మెడికల్ ఎక్విప్మెంట్స్తో పాటు కన్సల్టెంట్ డాక్టర్ కూడా ఉండే సెంటర్లను ఏర్పాటు చేసే కంపెనీలవైపు హౌజింగ్ కమ్యూనిటీ గ్రూప్స్ తమ దృష్టిని సారిస్తున్నాయి. – నిర్మలా రెడ్డి -
ఆకు పెడుతున్న అన్నం
‘తాటి చెట్టు తల్లి కాదు’ అని సామెత. కానీ తల్లిలానే ఇల్లు నిలబెట్టడానికి తాటి చెట్టు ఇవ్వనిది ఏముంది? కప్పుకు ఆకు.. వంటకు కలపతో సహా. ఉత్తరాంధ్రలో ఆగస్టు నుంచి వ్యవసాయపనులు పెద్దగా ఉండవు. కాని తాటి ఆకుల సేకరణ, గ్రేడింగ్, బొమ్మల తయారీ పని కల్పిస్తోంది. అన్నమూ పెడుతోంది. ఆరునెలల పాటు దొరికే ఈ పనిని అక్కడి స్త్రీలు ఆడుతూ పాడుతూ చేసేస్తున్నారు. తాటాకులకు నీడనిచ్చే లక్షణం ఉంది. అవి ఉత్తరాంధ్రలో చాలామందికి బతుకు నీడను కూడా ఇస్తున్నాయి కళాకృతుల కోసం తాటాకు సేకరణ ఈ సీజన్లో అక్కడ ప్రధాన ఉపాధి. అందుకే నాగమణి, రత్నం వంటి మహిళలు ‘ఆడుతూ పాడుతూ రోజుకు నూటేభై రెండొందల రూపాయలు సంపాదించుకుంటున్నాం. ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. ఆర్నెల్లపాటు ఈ పని ఉంటుంది. నీడ పట్టున ఉంటూ కుటుంబాలను పోషించేందుకు అవసరమైన సంపాదన ఇది’ అంటారు. వీరిది విశాఖ జిల్లా చినదొడ్డిగల్లు. వీరనే ఏముంది విశాఖజిల్లాలోని నక్కపల్లి, వేపాడు, ఎస్.రాయవరం, చినగుమ్ములూరు, ఎలమంచిలి, చోడవరంలాంటి అనేకచోట్ల తాటాకుల సేకరణ, కళాకృతుల కోసం వాటి గ్రేడింగు, కత్తిరింపు చాలామందికి భృతిని కల్పిస్తున్నాయి. కుటీర పరిశ్రమ తాటాకు సేకరణ విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో కుటీర పరిశ్రమగా మారింది. వందలాది మంది తాటాకు కళాకృతుల కోసం అవసరమయ్యే ముడిసరుకు తయారీలో పనిచేస్తున్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే సుమారు 600 మంది వరకు కూలీలు ఉపాధి పొందుతున్నారు. వీరిలో మహిళలే ఎక్కువ. తాటాకు బొమ్మలు వివిధ దశల్లో తయారవుతాయి. అంతిమరూపు కోల్‌కతాలో తీసుకుంటాయి. ప్రాథమిక సేకరణ, గ్రేడింగు, కత్తిరింపు ఉత్తరాంధ్రలో జరుగుతోంది. ఇందుకోసం సేకరణ కేంద్రాలు ఉంటాయి. విశాఖలో నక్కపల్లి, నర్సీపట్నం, కోటవురట్ల, నాతవరం, ఎస్.రాయవరం, రాంబిల్లి అచ్చుతాపురం తదితర గ్రామాల్లో తాటిచెట్ల నుంచి ఆకు సేకరిస్తారు. ఇలా సేకరించిన ఆకును చినదొడ్డిగల్లు, గుమ్ములూరులలో ఉన్న సేకరణ కేంద్రాల వద్దకు తెస్తారు. ఇతర కులాల వారు కూడా తాటాకులను సేకరిస్తారు. ఇలా సేకరించిన 100 ఆకులను రూ.400లకు కొనుగోలు చేస్తారు. గ్రేడింగ్ సేకరించి అమ్ముకునేవారి పని అక్కడితో అయిపోయినట్టే. తర్వాత ఈ ఆకులను ఎండబెడతారు. రద్దు ఆకులను తీసి బాగా ఉన్న ఆకులను వేరు చేయడం కోసం ప్రత్యేకంగా కూలీలను నియమిస్తారు. వీరికి రోజుకు రూ.200 చెల్లిస్తారు. ఈ గ్రేడింగ్ తెలిసిన పనివాళ్లు అయిదొందల మంది వరకూ ఉన్నారు. వీరు సేకరించిన ఆకును ఎండటం కోసం మడదొక్కుతారు. వారు గ్రేడులుగా విభజిస్తారు. తర్వాత కత్తిరించేవారు రంగంలోకి దిగుతారు. వీరు తాటాకులను నునుపుగా చేసి కళాకృతులు తయారు చేసేందుకు గాను ఎనిమిది అంగుళాల సైజులో కత్తిరిస్తారు. ఇలా కత్తిరించి తయారు చేసే ఆకు ఒక్కంటికి 20 పైసల చొప్పున పొందుతారు. వీరు రోజుకు ఐదొందల నుంచి ఏడొందల వరకు సంపాదిస్తారు. ఇలా సైజు చేసిన ఆకులను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తరలిస్తారు. అక్కడ వాటికి మరిన్ని మెరుగులు దిద్ది కలకత్తా తరలిస్తారు. కలకత్తాలో ఈ తాటాకులతో కళాకృతులు తయారు చేసి విక్రయిస్తారు. ఇళ్లల్లోను, షోకేసుల్లోను, కార్యాలయాలు, షాపులు, మ్యూజియంలు తదితర చోట్ల వీటిని ఉపయోగించుకునే విధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. రకరకాలుగా, విభిన్న రూపాల్లో చిన్నపాటి సైజుల్లో ఉండే బొమ్మలను తయారు చేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. రంగుల తాటాకులు విశాఖ జిల్లా చినగుమ్ములూరులో తాటాకులతో తయారు చేసే కళాకృతులకు ముడి సరుకు సరఫరా చేసే కుటీర పరిశ్రమలు దాదాపు 10 వరకు ఉన్నాయి. ఇక్కడ శుద్ధి చేసిన ఆకును కోల్కత్తా, చెన్నై, టూటికారన్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ కుటీర పరిశ్రమల్లో సుమారు వందమందికి పైగా మహిళలు పని చేస్తుంటారు. ఆకులను ఎండబెట్టి గ్రేడులుగా విభజించి ప్యాకింగ్ చేసే పని మొత్తం ఆడవాళ్లే చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసినందుకు రోజుకు రూ.200లు కూలి వస్తుంది. గ్రేడులుగా విభజించిన తాటాకులకు రంగులు ఇక్కడే వేస్తారు. పింక్, ఎరుపు, ఆరెంజ్, గ్రీన్, వయోలెట్, ఎల్లో వంటి రంగులు వేసి ఎగుమతి చేస్తారు. 25 కిలోల రంగు 1.30 లక్షల బొమ్మలకు సరిపోతుందని చెప్పారు. ఇలా రంగులు వేసిన బొమ్మలు (ముడిసరుకును) వారు నెలకు 6 లక్షల పీసులు ఎగుమతి చేస్తారు. బీసీ కార్పోరేషన్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెబుతున్నారు. ఆరు మాసాలు పని ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు పూర్తయి ఖాళీగా ఉన్నవారంతా తాటాకు సేకరణ, ఆకులు గ్రేడింగ్ చేయడం, రద్దు వేరుచేయడం వంటి పనులకు వెళ్తుంటారు. వర్షాకాలంలోనే తాటాకు ఎక్కువగా లభిస్తుందని, వేసవి కాలంలో అయితే ఎండలకు ఆకు రాలిపోవడం కాక వేసవి ధాటికి చెట్లు, పుట్లంట వెళ్లి తాటాకు సేకరణ కష్టమవుతుందని సేకరణ కూలీలు చెబుతున్నారు. అంటే వర్షాకాలం లో ఎటువంటి కష్టం లేకుండా ఒకచోట కూర్చొని చేతినిండా దొరికే పనికోసం గిట్టుబాటు అయ్యే వేతనం కోసం స్థానికంగా ఉండే కూలీలు ఆసక్తి చూపుతుంటారు. – ఆచంట రామకృష్ణ, సాక్షి ప్రతినిధి, నక్కపల్లి, విశాఖ జిల్లా. -
అర్ధరాత్రి స్వతంత్రం
తల్లిని అంటిపెట్టుకుని ఉండే పిల్లలు పనుల్ని తెమలనివ్వరు. తల్లి అంటిపెట్టుకుని ఉండాల్సిన పిల్లలు పనుల్ని అసలు మొదలే పెట్టనివ్వరు. అందుకే ఈ తల్లులంతా.. అర్ధరాత్రి వెలిగే కిచెన్లు అయ్యారు. పిల్లలు నిద్రపోయే వరకు ఉండి.. కేకుల బేకింగ్ పనిలోకి దిగుతున్నారు. కోర్సు చేసింది.. ఆర్థిక స్వాతంత్య్రం కోసం. కళ్లు మూతలు పడుతున్నా మేల్కొని ఉంటోంది అర్ధరాత్రి స్వతంత్రం కోసం. ఒక బ్యాచ్ పూర్తయింది. రెండో బ్యాచ్‌కి లాక్డౌన్ అడ్డుపడింది. ‘క్రాఫ్ట్ బేకింగ్’కోర్సు అది. పూర్తయిన బ్యాచ్‌లోని మహిళలంతా రుచిగా కేకులు తయారు చేయడంలో సిద్ధహస్తులై ఉన్నారు. ‘వైట్ వాంచో’, ‘బార్బీ’ కేకులను చేస్తే వాళ్లు చెయ్యాల్సిందే. అంత రుచిగా వచ్చాయి కోర్సు ట్రైనింగ్‌లో. ఆ రెండు కేక్స్‌కి మంచి మార్కెట్ ఉంది. బయట మార్కెట్లే లేవు! చేసి చుట్టుపక్కల అమ్మేస్తున్నారు. అందరికీ నచ్చుతున్నాయి. ‘ఆంటీ.. మళ్లీ చేస్తారా?’ పిల్లలొచ్చి అడుగుతున్నారు. నేర్చుకున్న విద్య వృధాగా పోలేదు. లాక్‌డౌన్‌ని ఎత్తేస్తే వీళ్ల కుటీర కేక్ పరిశ్రమకు పెద్ద పెద్ద బేకరీలు బెంబేలెత్తి పోవాల్సిందే. ఇక్కడి వరకు చెప్పుకుని ఆపేస్తే ఇది స్వయం ఉపాధి కథ మాత్రమే అవుతుంది. క్రాఫ్ట్ బేకింగ్ కోర్సు ఫస్ట్ బ్యాచ్‌లోని 35 మంది మహిళలూ తల్లులే. వీరిలో 30 మంది ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ పిల్లలున్న తల్లులు. అరె! అలా ఎలా కుదిరింది. కుదర్లేదు. ఎంపిక చేసుకున్నారు. కోళికోడ్ నేషనల్ ట్రస్ట్, కోళికోడ్ పరివార్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలున్న తల్లుల సంఘం.. మూడూ కలిసి ట్రైనింగ్ ఇచ్చిన మాతృమూర్తులు వీరంతా. కేరళ ప్రభుత్వ పథకం ఎ.ఎస్.ఎ.పి. (అడిషనల్ స్కిల్ అక్విజిషన్ ప్రోగ్రామ్) కింద ఉన్న ఉపాధి కోర్సులలో ‘క్రాఫ్ట్ బేకింగ్’ కూడా ఒకటి. కోర్సు చేసిన వాళ్లంతా కోళికోడ్‌లోని దగ్గరి దగ్గరి ప్రాంతాల నుంచి వచ్చినవారే. కోర్సు అయిపోగానే ఇంటికి వచ్చి సోలియా బైజు అనే మహిళ చేసిన మొదటి పని.. వెనీలా, చాక్లెట్, స్ట్రా బెర్రీ కేకులను తయారు చేయడం. ఎలా వస్తాయో చూద్దాం అని చేసింది. ‘ఇంత బాగా ఎలా వచ్చాయి’ అనే ప్రశంసలు వచ్చాయి. కొడెంచెరీ, కొడువల్లి ప్రాంతాల్లో సోలియా కేకుల్ని తిన్నవారు.. ‘కొత్త బేకరీ పడిందా?’ అనుకున్నారు. అయితే సోనియా వాటిని రాత్రంతా మేల్కొనే ఉండి తెల్లవారు జామున చేస్తోందని వారికి తెలిసే అవకాశం లేదు. నిజానికి అప్పుడు మాత్రమే ఆమెకు కుదురుతుంది. తన నాలుగేళ్ల కొడుకును వదిలి పనిలో పడటానికి ఆమెకు దొరికే సమయం అది. ఆ చిన్నారికి నరాల బలహీనత. ఏ అర్ధరాత్రి తర్వాతో కాని నిద్రపోడు. అప్పటివరకు తల్లి తన పక్కన ఉండాల్సిందే. నజీబత్ సలీమ్, షైజాలది కూడా సోలియా పరిస్థితే. నిద్రకు ఆగలేగ రెప్పపడుతున్నా.. పిల్లల కంటికి అనుక్షణం రెప్పల్లా ఉండాలి. నజీబత్ చెంబుకడవులో, షైజా ఉన్నికుళంలో ఉంటారు. పిల్లలు పడుకున్నాక అర్ధరాత్రి కేకుల తయారీ మొదలుపెడతారు. సోలియాకు అప్పుడే కొంత డబ్బును వెనకేయడానికి వీలవుతోంది. ఆమె బిడ్డకు తరచు డైపర్స్ మారుస్తుండాలి. భర్తను డబ్బులు అడగవలసి వచ్చేది. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టనవసరం లేకపోవడం ఆమెకు సంతోషాన్నిస్తోంది. రోజుకు ఇరవై కేకులు చేసి అమ్మగలుగుతోంది. నజీబత్‌కు పద్నాలుగేళ్ల కూతురు ఉంది. అది తల్లికి సహాయం చేసే వయసే కానీ, మానసికంగా తనింకా పసిపాపే. ఎనభైశాతం ‘మెంటల్లీ ఛాలెంజ్డ్’. ఆ పాప నిద్రపోయాకే నజీబత్‌కు పని మొదలుపెట్టడం సాధ్యమౌతుంది. అయితే ఎప్పుడు నిద్రపోతుందో చెప్పలేం. అప్పటి వరకు ఆమె వేచి చూడవలసిందే. అప్పటికి నజీబత్ కళ్లూ నిద్రకు బరువెక్కుతుంటాయి. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం బలవంతంగా నిద్ర ఆపుకుంటుంది. ఆమె భర్త ఉపాధి కోసం ఆఫ్రికా వెళ్లాడు. షైజా కొడుకు వయసు 22 ఏళ్లు. అతడికి మానసిక వైకల్యంతో పాటు వినికిడి లోపం కూడా ఉంది. అతడు నిద్రపోయాకే కేకుల తయారీకి, కేకులపైన ఐసింగ్కీ వీలవుతుంది షైజాకు. లాక్డౌన్ పూర్తయ్యాక ఫస్ట్ బ్యాచ్‌లోని వాళ్లతో కేకులు తయారు చేయించి మార్కెట్ చేయాలని ఎ.ఎస్.ఎ.పి. జిల్లా కోఆర్డినేటర్ మెర్సీ ప్రియా ఇప్పటికే ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసి ఉంచారు. నిద్ర మానుకుని మరీ కష్టపడుతున్న ఈ తల్లులకు.. కష్టాన్ని మరిపించేలా ఆ ప్రతిఫలం ఉండబోతోందన్న మాట. బార్బీ కేకు, వైట్ వాంచో కేక్ -
మరో ఆత్రేయపురం.. మంచిలి స్వీటు
సాక్షి, అత్తిలి: పూతరేకులు గురించి ఉభయ గోదావరి జిల్లాల్లో తెలియనివారుండరు. ఆంధ్రా ప్రాంత సంప్రదాయ స్వీట్లలో వీటిది అగ్రస్థానమే. తూర్పుగోదావరి ఆత్రేయపురంలో ప్రాచుర్యం పొందిన పూతరేకులకు మన జిల్లాలో అత్తిలి మండలం మంచిలి గ్రామం ప్రసిద్ధి. ఇక్కడ వీటి తయారీ కుటీర పరిశ్రమగా వెలుగొందుతోంది. మహిళలు పూతరేకులు తయారీని వృత్తిగా ఎంచుకుని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ నుంచి దేశ, విదేశాలకు సైతం పూతరేకులు ఎగుమవుతుండటం విశేషం. సుమారు 300 కుటుంబాలకు పైబడి మంచిలి గ్రామంలో పూతరేకుల తయారీని వృత్తిగా చేపట్టారు. గ్రామంలో మొట్టమొదటి సారిగా పూతరేకుల స్వీటు తయారీని భగవాన్ ప్రారంభించారు. స్వీటు తయారీ విధానాన్ని ఆయన ఇలా వివరించారు. పూతరేకు స్వీటులో ప్రధానంగా బెల్లం, పంచదార, జీడిపప్పు, స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తుంటారు. పూతరేకుల తయారీలో ప్రధానం ఉపయోగించే బెల్లాన్ని కంచుస్తంభం పాలెం నుంచి బూరుగపల్లి బెల్లాన్ని కొనుగోలు చేస్తుంటారు. గుంటూరు, తెనాలి, మండపాక తదితర ప్రాంతాల నుంచి స్వచ్ఛమైన నెయ్యిని సేకరిస్తారు. వెన్నను కూడా సేకరించి నెయ్యిగా మార్చి స్వీటు తయారీకి వినియోగిస్తుంటారు. జీడిపప్పును తాడిమళ్ల, మోరి ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తారు. పలుచని బెల్లాన్ని మహిళలు రోటిలో దంచి పొడుంగా మారుస్తారు. ఈ పొడిని జల్లిస్తారు. నేతిలో జీడిపప్పు బద్దలను దోరగా వేయిస్తారు. పూతరేకు పై పొరపై బెల్లంపొడి, నెయ్యి, జీడిపప్పును చల్లి పై భాగంలో మరొక రేకును వేసి మడతగా చుడతారు. ఇలా చుట్టిన పూతరేకు స్వీటును ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేస్తారు. ఈ ప్రాంత నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, దేశ, విదేశాలకు వెళ్లే వారు తప్పనిసరిగా మంచిలి పూతరేకు స్వీట్లను తీసుకు వెళ్తుంటారు. ఇక్కడ క్వాలిటీతో పూతరేకు స్వీట్లను తయారు చేయడంతో అంతటి ప్రాచుర్యం పొందింది. 5 వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో సుమారు 1200 మంది పూతరేకుల తయారీ చేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. కుటుంబ యజమాని సంపాదనకు తోడు మహిళలు ఇంటి వద్దే పూతరేకులు తీసి ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. తయారీ ఇలా.. పూతరేకుల తయారీకి ప్రత్యేకంగా తయారు చేసిన మట్టికుండను వాడతారు. కుండ పై భాగం నున్నగా వెడల్పుగా ఉంటూ, మంటపెట్టడానికి కిందిభాగంలో రంధ్రాన్ని కల్గి ఉంటుంది. ఈ కుండలను పెనుమంట్ర గ్రామం నుంచి కొనుగోలు చేస్తారు. పూతరేకుల తయారీకి సోనామసూరి బియ్యం నూకలను వినియోగిస్తుంటారు. గతంలో బియ్యాన్ని ఒకరోజు ముందుగా నీటిలో నానబెట్టి మరుసటి రోజు రుబ్బురోలులో రుబ్బేవారు. ఈ ప్రక్రియ కష్టతరంగా మారడంతో మారుతున్న కాలానుగుణంగా గ్రైండర్లలో పిండి రుబ్బుతున్నారు. ఇలా మెత్తగా రుబ్బిన పిండిలో తగిన మోతాదులో నీటిని కలిపి పలుచగా జాలుగా వచ్చేలా చేస్తారు. బోర్లించిన కుండ అడుగు భాగం నుంచి కొబ్బరి ఆకులతో సన్నని మంట పెడుతూ కుండ వేడెక్కిన తరువాత పూతరేకుల తయారీ ప్రక్రియ ప్రారంభిస్తారు. మంచినూనె లేదా నేతిని కుండ పైభాగాన రాస్తారు. పలుచని వస్త్రాన్ని జాలుగా ఉన్న బియ్యపు పిండిలో ముంచి కుండ వేడెక్కిన తరువాత ఆ వ్రస్తాన్ని కుండపై ఒకవైపు నుంచి మరొక వైపుకు లాగుతారు. కుండ వేడిమికి పిండి పలుచని పొరలా వస్తుంది. ఇలా వచ్చిన రేకును ఒక పక్కన పేరుస్తారు. కుండకు తగిన వేడిని కలిగే విధంగా కొబ్బరి ఆకులతో మంట పెడుతుంటారు. మంట ఎక్కువైనా, తక్కువైనా పూతరేకులు విరిగిపోతుంటాయి. దీంతో పూతరేకు తయారు చేసే సమయంలో మహిళలు తగిన జాగ్రత్తలు పాటిస్తుంటారు. రోజుకు లక్ష పూతరేకుల తయారీ పూతరేకులు తయారీకి ఉపయోగించే నూకలు కిలో రూ.26 ధర ఉంది. కిలో నూకలతో 200 రేకులు తయారీ అవుతాయి. ఒక్కొక్క మహిళ రోజుకు 300 నుంచి 700 వరకు రేకులను తయారు చేస్తుంటారు. పూతరేకులు క్వాలిటీని బట్టి 100 రేకులను రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటారు. పూతరేకుల తయారీలో కుండను వేడిచేసే మంటకు కొబ్బరి ఆకులు ఉపయోగిస్తారు. 100 కొబ్బరి ఆకులు రూ.500 ధర ఉంది. ఖర్చు పోను ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.400 వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. ఏడాది పొడవునా పూతరేకులను తయారీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజుకు సుమారుగా లక్ష పూతరేకులు తయారవుతుంటాయని అంచనా. గ్రామంలో తయారైన పూతరేకులను పలువురు వ్యాపారస్తులు కొనుగోలు చేసి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పేరొందిన స్వీట్ల షాపులకు సరఫరా చేస్తుంటారు. దంచిన బెల్లపు పొడిని జల్లిస్తున్న దృశ్యం జీడిపప్పును గ్రేడింగ్ చేస్తున్న మహిళ ఆరోగ్యానికి పొగ పూతరేకుల తయారీలో మంటకు ఉపయోగించే కొబ్బరి ఆకుల వల్ల పొగచూరి మహిళలకు నేత్ర సంబంధ సమస్యలు కలుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే రేకులు తీయడంతో కండరాల నొప్పులు తలెత్తుతున్నాయని, వేడివల్ల పలు ఆరోగ్య రుగ్మతలు ఏర్పడుతున్నాయని పలువురు మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పూతరేకుల తయారీ ఒకే విధానంలో సాగుతోంది. మారుతున్న కాలానుగుణంగా యాంత్రీకరణ పనిముట్లు అన్ని రంగాలలో వినియోగిస్తున్నప్పటికీ పూతరేలకు తయారీ ప్రక్రియకు ఏ విధమైన యంత్రపరికరాలను ఆవిష్కరించలేదు. పూతరేకు స్వీట్ల తయారీలో నిమగ్నమైన మహిళలు మెషీన్లు వస్తే ఉపాధికి దెబ్బ పూతరేకుల స్వీటు తయారీకి వినియోగించే బెల్లాన్ని పొడి చేయడానికి మెషీనరీ వచ్చినప్పటికీ మహిళలకు ఉపాధి కలి్పంచాలనే ఉద్దేశంతో వాటిని కొనుగోలు చేయలేదు. 33 కిలోల బెల్లాన్ని రోలులో దంచడానికి రూ.700 వరకు ఖర్చు అవుతుంది. మనుషుల వల్ల అధిక వ్యయమైనప్పటికీ వారికి ఉపాధి కలి్పంచడానికి మెషీన్లను వినియోగించడంలేదు. బెల్లం, పంచదారతో పూతరేకు స్వీటును నాణ్యమైన క్వాలిటీతో మూడు సైజులలో తయారు చేస్తుంటాం. –భగవాన్, పూతరేకు స్వీటు వ్యాపారి, మంచిలి పూతరేకు స్వీట్లను కవర్లలో పెడుతున్న దృశ్యం ఆదరణ బాగుంది పూతరేకుల తయారీకి ఆదరణ బాగుంది. ఇంటి వద్దే ఉండి పూతరేకులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నాం. ఖర్చులు పోను రోజుకు రూ. 300 పైబడి ఆదాయం వస్తుంది. వేడి, పొగవల్ల ఇబ్బందులు పడుతున్నాం. –తులా గంగాభవానీ, మంచిలి -
పూవై పూచే పెళ్లిపత్రిక!
ఎంతో ప్రయాసపడి, దూరతీరాల నుంచి ఇల్లిల్లూ వెతుక్కుంటూ వచ్చి పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్లాక దాన్ని మనమేం చేస్తాం. అదెంత ఖరీదైనదైనా మహా అయితే పెళ్లి రోజు వరకూ ఉంచి ఆ తరువాత ఊడ్చి పారేస్తాం. అలా కాకుండా అందరూ భద్రంగా దాచుకునేలా తన కూతురి పెళ్లి పత్రికను తయారుచేయాలనుకున్నారు కేరళకు చెందిన ఓ ఎమ్మెల్యే. కేరళ తానూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్దుర్ రహ్మాన్ తన కుమార్తె రిజ్వానా షేరిన్ రిసెప్షన్‌కు వచ్చే అతిథులను ప్రత్యేకంగా ఆహ్వనించాలనుకున్నారు. తమ ఇంటి పెళ్లి పిలుపు వాళ్లింట్లో ఓ జ్ఞాపకంగా మిగిలిపోతే బావుంటుందని భావించారు. అందుకే స్క్రీన్ ప్రింటెడ్ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దారు. అన్ని రంగులూ అద్దుకొని గుండెలనిండా ఆహ్వానించే నిండైన పెళ్లి పత్రికను తయారు చేశారు. కాకపోతే మీరు చదివాక లేదా పెళ్లి అయిపోయాక దాన్ని పూడ్చిపెట్టాలని రాసి మరీ ఇచ్చారు. ఎందుకంటే అందులోని రకరకాల పూల విత్తనాలు లేదా కూరగాయల విత్తనాలు ప్రేమతో మొలకెత్తాలంటే పత్రికను మట్టిలో పెట్టి సూర్యరశ్మి పడేలా కుండీలో ఉంచి నీళ్లు పోస్తే సరి. ఎమ్మెల్యేగారి పెళ్లి పత్రిక మీ ఇంట్లో ఏ గులాబీ మొక్కగానో లేక చామంతిగానో మొలుస్తుంది. క్యారెట్టో, పాలకూరగానో పెళ్లి జ్ఞాపకాన్ని పదే పదే గుర్తుచేస్తుంది. అది పూచిన ప్రతిసారీ ఆ జ్ఞాపకం మీ మదిలో ఆనందమై విరుస్తుంది. అయితే ఇది తయారు చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే. రీసైకిల్ చేసేందుకు వీలైన అట్టలో పలు రకాల విత్తనాలు పొందుపరిచి మరీ ఈ పెళ్లి పత్రికను రూపొందించాలి మరి. అయితేనేం ఈ పత్రిక తయారీ కుటీర పరిశ్రమ ద్వారా పది మందికి అన్నంపెడుతున్నప్పుడు అంటారు ఎమ్మెల్యే సారు. -
నాటు ప్రాణాలకు చేటు
సీహెచ్ఎల్ఫురంలో ఒకరి బలి విచ్చలవిడిగా తయారీ, విక్రయాలు అరికట్టాలని కోరుతున్న ప్రజలు మండలంలో పలు గ్రామాల్లో సారా విచ్చలవిడిగా తయారవుతోంది. దీన్ని సేవించి పలువురు అస్వస్తతకు గురవడం, మృత్యువాత పడడం జరుగుతోంది. తాజాగా శనివారం తెల్లవారుజామున చుక్కలవానిలక్ష్మీపురం గ్రామంలో కొండలరావు అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. సారా విపరీతంగా సేవించడం వల్లే తమ సోదరుడు మృత్యువాత పడ్డాడని కొండలరావు సోదరుడు వైఎస్సార్ సీపీ నాయకుడు రాజబాబు, శ్రీనివాస్ తదితరులు ఆరోపించారు. కుటీ ర పరిశ్రమలా సారా తయారీ కుటీర పరిశ్రమగా మారిందని, నిత్యం వందలాది లీటర్ల సారా తయారు చేసి విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎక్జైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మందుబాబుల ఆగడాలు గ్రామానికి పెద్ద తలనొప్పిగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్టుషాపులు అరికట్టడంతో సారా తయారీ జోరందుకుంది. ఒక్క సీహెచ్ఎల్పురంలోనే కాదు పెదతీనార్ల, చినతీనార్ల, బోయపాడు, రాజయ్యపేట, డిఎల్ఫురం, చినదొడ్డిగల్లు, గొడిచర్ల, రమణయ్యపేట, రేబాక, చీడిక, దోసలపాడు, గుల్లిపాడు, నెల్లిపూడి, నామవరం, గుంటపల్లి, గునిపూడి గ్రామాల్లో సారా వ్యాపారం జోరుగా జరుగుతోంది. గ్రామాలకు దూరంగా ఉన్న తోటల్లో, కొండగెడ్డల్లో సారా తయారు చేస్తున్నారు. ప్యాకెట్లు ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.20లకు విక్రయిస్తున్నారు. చౌకగా లభించడంతో మందుబాబులు ఎగబడుతున్నారు. నాణ్యతలేని సారా తాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు దృష్టి సారించకపోతే చాలామంది ప్రాణాలు పొగొట్టుకొనే ప్రమాదముందని పలువురు అంటున్నారు. -
ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాలి
► ‘మన జిల్లా-మన ప్రణాళిక’పై అవగాహన ► మేనిఫెస్టో అమలే మా ఎజెండా ►ప్రణాళికలు పటిష్టంగా రూపొందించాలి ►అసంపూర్తి సాగు నీటి ప్రాజెక్టులపై దృష్టి ► పీహెచ్‌సీల స్థాయి పెంపు ►కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం ►డిప్యూటీ సీఎం రాజయ్య సాక్షి, హన్మకొండ: గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా ప్రణాళికలు రూపొందిస్తే కుదరదు... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సాంకేతిక లోపాలు లేనివిధంగా పటిష్టంగా రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సూచించారు. హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘మన జిల్లా-మన ప్రణాళిక’పై అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మరో రెండు రోజులు సమయం తీసుకుని పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మన జిల్లా-మన ప్రణాళికలోని అంశాల ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆస్పత్రులను 30 పడకల స్థాయికి పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో అన్ని రకాల వైద్యసేవలు అం దుబాటులోకి తెస్తామన్నారు. వంద పడకల ఆస్పత్రుల్లో అన్ని రకాల ఆపరేషన్లు చేసేందుకు సరిపడా వసతులు కల్పిస్తామన్నారు. జిల్లాలో విషజ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మం జూరు చేసిన రూ.150 కోట్ల నిధులతో జిల్లా కేంద్రంలో నిమ్స్ స్థాయిలో వెద్యసదుపాయం కల్పిస్తామన్నారు. హెల్త్ యూనివర్సిటీని వరంగల్‌లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటుందని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సూచనలు చేశారు. మామునూరు వద్ద అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో వెటర్నిటీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే... జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుతం వరి, కంది విత్తనాలపై జరుగుతున్న పరిశోధనలను మెట్ట పంటలకు విస్తరించాలని సూచించారు. భూసేకరణ, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి ఉపాధి కల్పనలో భాగంగా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమివ్వాలని మెజార్టీ ప్రజాప్రతినిధులు సూచించా రు. ఈ అంశంపై వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, వ్యాగన్ ఫ్యాక్టరీ, రైల్ కోచ్, టెక్స్టైల్స్ పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసే విధంగా వరంగల్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. కార్పొరేషన్ ఈ విషయంలో విఫలమమైతే మన దగ్గరకు వచ్చే పరిశ్రమలు వెనక్కి వెళ్లే అవకాశముందని హెచ్చరించారు. అంతకుముందు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మాట్లాడుతూ రైల్వే పరిశ్రమలతోపాటు విమానాశ్రయం, వెటర్నిటీ యూనివర్సిటీ, వరంగల్ చుట్టూ రింగురోడ్డు నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. మహబూబాబాద్‌లో ఉక్కు పరిశ్రమతోపాటు గిరిజన వర్సిటీని నెలకొల్పాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమిని గుర్తించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు కోరారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించాలి అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచిం చారు. పెండింగ్ ప్రాజెక్టుల జాబితా రూపొందించి ప్రాధాన్యాన్ని అనుసరించి పనులన్నీ రెండేళ్ల లోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతి ప్రాథమిక సహకార సంఘం పరిధిలో మూడు గోదాంలు నిర్మించాలని డీసీసీబీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి కోరారు. 30 ఏళ్ల తర్వాత వరంగల్ డీసీసీబీకి రూ.3 కోట్ల లాభం వచ్చిందన్నారు. తండాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయూలి గిరిజన తండాల్లోని మహిళలు, యువకులకు బీడీ, సబ్బుల తయారీ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించడంతోపాటు తండాల్లో కుటీర పరిశ్రలు నెలకొల్పాలని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ సూచించారు. తాను తండాల నుంచే వచ్చానని... సరైన ఉపాధి వనరులు లేక కారణంగానే కొన్ని గిరిజన తండాలు గుడుంబా తయారీ కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద జిల్లాకు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరవుతాయని, వీటిని సద్విని యోగం చేసే దిశగా అభివృద్ధి, సంక్షేమ ప్రణాళికలు రూపొందించాలని కడియం శ్రీహరి సూచించారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వేళకు రావడం లేదని, వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండటం లేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమం ఎంతో గొప్పదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిర్మాణాత్మక రూపం ఇవ్వడంలో భాగమే మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం అని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అజ్మీరా చందూలాల్, శంకర్‌నాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ జి.కిషన్, జేసీ పౌసుమిబసు, వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ సువర్ణదాస్పండా, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లుతోపాటు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. చివరి నిమిషం లో ఎంపీ గుండు సుధారాణి సమావేశానికి వచ్చారు. మల్లన్న భూములపై దీక్షకు సిద్ధం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సంబంధించిన చెరు వు భూములు అన్యాక్రాంతం కావడంపై ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఉదాసీనతపై ప్రశ్నించారు. రియల్ మాఫియా ధాటికి జిల్లాలో చాలా చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణకు గురైన మల్లన్న ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, అవసరమైన పక్షంలో అసెంబ్లీ ఎదుట మహాత్ముడి విగ్రహం వద్ద దీక్ష చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఒక నియోజకర్గం పరిధిలో ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలతో కమిటీ ఏర్పా టు చేసి ఆర్డీఓ అధ్యక్షతన సమావేశం నిర్వహించి ప్రణాళిక రూపొందిస్తే... అనుమానాలకు తావులేకుం డా ఉంటుందని ఆయన కలెక్టర్ కిషన్‌కు సూచించారు. కాగా, మల్లన్న జాగ మాయం, సమస్యలపై ‘సాక్షి’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది. ప్రజాప్రతినిధుల సూచనలు ►పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అవసరాలు తీర్చేందుకు భూపాలపల్లి కేటీపీపీ ఉత్పత్తి ►సామర్థ్యాన్ని 2 వేల మెగావాట్లకు పెంచాలి. ►భూపాలపల్లిలో ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నెలకొల్పాలి. ►వరంగల్ గోపాలపురంలో శిల్పారామానికి కేటాయించిన 13 ఎకరాల స్థలం ఆక్రమణకు గురవుతోంది. దీన్ని అరికట్టడంతోపాటు వెంటనే శిల్పారామం పనులు ప్రారంభించాలి. ►ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములను సేకరించాలి. ►ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పత్తి అనుబంధ పరిశ్రమలు విస్తరించాలి. ►అభివృద్ధి పనుల్లో ‘నిట్’ సహకారం తీసుకోవాలి.