సాక్షి, అత్తిలి: పూతరేకులు గురించి ఉభయ గోదావరి జిల్లాల్లో తెలియనివారుండరు. ఆంధ్రా ప్రాంత సంప్రదాయ స్వీట్లలో వీటిది అగ్రస్థానమే. తూర్పుగోదావరి ఆత్రేయపురంలో ప్రాచుర్యం పొందిన పూతరేకులకు మన జిల్లాలో అత్తిలి మండలం మంచిలి గ్రామం ప్రసిద్ధి. ఇక్కడ వీటి తయారీ కుటీర పరిశ్రమగా వెలుగొందుతోంది. మహిళలు పూతరేకులు తయారీని వృత్తిగా ఎంచుకుని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ నుంచి దేశ, విదేశాలకు సైతం పూతరేకులు ఎగుమవుతుండటం విశేషం.
సుమారు 300 కుటుంబాలకు పైబడి మంచిలి గ్రామంలో పూతరేకుల తయారీని వృత్తిగా చేపట్టారు. గ్రామంలో మొట్టమొదటి సారిగా పూతరేకుల స్వీటు తయారీని భగవాన్ ప్రారంభించారు. స్వీటు తయారీ విధానాన్ని ఆయన ఇలా వివరించారు. పూతరేకు స్వీటులో ప్రధానంగా బెల్లం, పంచదార, జీడిపప్పు, స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తుంటారు. పూతరేకుల తయారీలో ప్రధానం ఉపయోగించే బెల్లాన్ని కంచుస్తంభం పాలెం నుంచి బూరుగపల్లి బెల్లాన్ని కొనుగోలు చేస్తుంటారు. గుంటూరు, తెనాలి, మండపాక తదితర ప్రాంతాల నుంచి స్వచ్ఛమైన నెయ్యిని సేకరిస్తారు. వెన్నను కూడా సేకరించి నెయ్యిగా మార్చి స్వీటు తయారీకి వినియోగిస్తుంటారు. జీడిపప్పును తాడిమళ్ల, మోరి ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తారు.
పలుచని బెల్లాన్ని మహిళలు రోటిలో దంచి పొడుంగా మారుస్తారు. ఈ పొడిని జల్లిస్తారు. నేతిలో జీడిపప్పు బద్దలను దోరగా వేయిస్తారు. పూతరేకు పై పొరపై బెల్లంపొడి, నెయ్యి, జీడిపప్పును చల్లి పై భాగంలో మరొక రేకును వేసి మడతగా చుడతారు. ఇలా చుట్టిన పూతరేకు స్వీటును ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేస్తారు. ఈ ప్రాంత నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, దేశ, విదేశాలకు వెళ్లే వారు తప్పనిసరిగా మంచిలి పూతరేకు స్వీట్లను తీసుకు వెళ్తుంటారు. ఇక్కడ క్వాలిటీతో పూతరేకు స్వీట్లను తయారు చేయడంతో అంతటి ప్రాచుర్యం పొందింది. 5 వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో సుమారు 1200 మంది పూతరేకుల తయారీ చేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. కుటుంబ యజమాని సంపాదనకు తోడు మహిళలు ఇంటి వద్దే పూతరేకులు తీసి ఆదాయాన్ని సమకూరుస్తున్నారు.
తయారీ ఇలా..
పూతరేకుల తయారీకి ప్రత్యేకంగా తయారు చేసిన మట్టికుండను వాడతారు. కుండ పై భాగం నున్నగా వెడల్పుగా ఉంటూ, మంటపెట్టడానికి కిందిభాగంలో రంధ్రాన్ని కల్గి ఉంటుంది. ఈ కుండలను పెనుమంట్ర గ్రామం నుంచి కొనుగోలు చేస్తారు. పూతరేకుల తయారీకి సోనామసూరి బియ్యం నూకలను వినియోగిస్తుంటారు. గతంలో బియ్యాన్ని ఒకరోజు ముందుగా నీటిలో నానబెట్టి మరుసటి రోజు రుబ్బురోలులో రుబ్బేవారు. ఈ ప్రక్రియ కష్టతరంగా మారడంతో మారుతున్న కాలానుగుణంగా గ్రైండర్‌లలో పిండి రుబ్బుతున్నారు. ఇలా మెత్తగా రుబ్బిన పిండిలో తగిన మోతాదులో నీటిని కలిపి పలుచగా జాలుగా వచ్చేలా చేస్తారు. బోర్లించిన కుండ అడుగు భాగం నుంచి కొబ్బరి ఆకులతో సన్నని మంట పెడుతూ కుండ వేడెక్కిన తరువాత పూతరేకుల తయారీ ప్రక్రియ ప్రారంభిస్తారు.
మంచినూనె లేదా నేతిని కుండ పైభాగాన రాస్తారు. పలుచని వస్త్రాన్ని జాలుగా ఉన్న బియ్యపు పిండిలో ముంచి కుండ వేడెక్కిన తరువాత ఆ వ్రస్తాన్ని కుండపై ఒకవైపు నుంచి మరొక వైపుకు లాగుతారు. కుండ వేడిమికి పిండి పలుచని పొరలా వస్తుంది. ఇలా వచ్చిన రేకును ఒక పక్కన పేరుస్తారు. కుండకు తగిన వేడిని కలిగే విధంగా కొబ్బరి ఆకులతో మంట పెడుతుంటారు. మంట ఎక్కువైనా, తక్కువైనా పూతరేకులు విరిగిపోతుంటాయి. దీంతో పూతరేకు తయారు చేసే సమయంలో మహిళలు తగిన జాగ్రత్తలు పాటిస్తుంటారు.
రోజుకు లక్ష పూతరేకుల తయారీ
పూతరేకులు తయారీకి ఉపయోగించే నూకలు కిలో రూ.26 ధర ఉంది. కిలో నూకలతో 200 రేకులు తయారీ అవుతాయి. ఒక్కొక్క మహిళ రోజుకు 300 నుంచి 700 వరకు రేకులను తయారు చేస్తుంటారు. పూతరేకులు క్వాలిటీని బట్టి 100 రేకులను రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటారు. పూతరేకుల తయారీలో కుండను వేడిచేసే మంటకు కొబ్బరి ఆకులు ఉపయోగిస్తారు. 100 కొబ్బరి ఆకులు రూ.500 ధర ఉంది. ఖర్చు పోను ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.400 వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. ఏడాది పొడవునా పూతరేకులను తయారీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజుకు సుమారుగా లక్ష పూతరేకులు తయారవుతుంటాయని అంచనా. గ్రామంలో తయారైన పూతరేకులను పలువురు వ్యాపారస్తులు కొనుగోలు చేసి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పేరొందిన స్వీట్ల షాపులకు సరఫరా చేస్తుంటారు.
దంచిన బెల్లపు పొడిని జల్లిస్తున్న దృశ్యం
జీడిపప్పును గ్రేడింగ్ చేస్తున్న మహిళ
ఆరోగ్యానికి పొగ
పూతరేకుల తయారీలో మంటకు ఉపయోగించే కొబ్బరి ఆకుల వల్ల పొగచూరి మహిళలకు నేత్ర సంబంధ సమస్యలు కలుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే రేకులు తీయడంతో కండరాల నొప్పులు తలెత్తుతున్నాయని, వేడివల్ల పలు ఆరోగ్య రుగ్మతలు ఏర్పడుతున్నాయని పలువురు మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పూతరేకుల తయారీ ఒకే విధానంలో సాగుతోంది. మారుతున్న కాలానుగుణంగా యాంత్రీకరణ పనిముట్లు అన్ని రంగాలలో వినియోగిస్తున్నప్పటికీ పూతరేలకు తయారీ ప్రక్రియకు ఏ విధమైన యంత్రపరికరాలను ఆవిష్కరించలేదు.
పూతరేకు స్వీట్ల తయారీలో నిమగ్నమైన మహిళలు
మెషీన్‌లు వస్తే ఉపాధికి దెబ్బ
పూతరేకుల స్వీటు తయారీకి వినియోగించే బెల్లాన్ని పొడి చేయడానికి మెషీనరీ వచ్చినప్పటికీ మహిళలకు ఉపాధి కలి్పంచాలనే ఉద్దేశంతో వాటిని కొనుగోలు చేయలేదు. 33 కిలోల బెల్లాన్ని రోలులో దంచడానికి రూ.700 వరకు ఖర్చు అవుతుంది. మనుషుల వల్ల అధిక వ్యయమైనప్పటికీ వారికి ఉపాధి కలి్పంచడానికి మెషీన్‌లను వినియోగించడంలేదు. బెల్లం, పంచదారతో పూతరేకు స్వీటును నాణ్యమైన క్వాలిటీతో మూడు సైజులలో తయారు చేస్తుంటాం. –భగవాన్, పూతరేకు స్వీటు వ్యాపారి, మంచిలి
పూతరేకు స్వీట్లను కవర్లలో పెడుతున్న దృశ్యం
ఆదరణ బాగుంది
పూతరేకుల తయారీకి ఆదరణ బాగుంది. ఇంటి వద్దే ఉండి పూతరేకులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నాం. ఖర్చులు పోను రోజుకు రూ. 300 పైబడి ఆదాయం వస్తుంది. వేడి, పొగవల్ల ఇబ్బందులు పడుతున్నాం. –తులా గంగాభవానీ, మంచిలి
Comments
Please login to add a commentAdd a comment