పశ్చిమ గోదావరి జిల్లా నడిపూడిలో టీడీపీ నేత అక్రమ ఇసుక తవ్వకాలు
నిబంధనలను మీరి ఇష్టారాజ్యంగా నదీగర్భానికి తూట్లు
ఎన్జీటీ, మైనింగ్, రెవెన్యూ తదితర శాఖల అనుమతులు లేకున్నా తవ్వకాలు
వారం రోజుల్లో రూ.అర కోటికి పైగా విలువైన ఇసుక తరలింపు
పట్టించుకోని అధికారులు
టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక అందిస్తున్నామని గొప్పులు చెప్పుకోవడం తప్పించి ఆచరణలో ఇది అమలు కావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నడిపూడి ర్యాంపులో నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా అక్రమ ఇసుక తవ్వకాలతో టీడీపీ నేత ఒకరు పేట్రేగిపోతున్నారు. ఒక్క వారం రోజుల్లోనే రూ.50 లక్షలకుపైగా విలువైన ఇసుకను తరలించేశారు. టీడీపీ నేతకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తవ్వకాలకు అనుమతి లేని రీచ్‌లో భారీ ఎత్తున టీడీపీ నేత ఇసుక కొల్లగొడుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు తూట్లు పొడుస్తూ నదీగర్భంలో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి నరసాపురం రూరల్ బియ్యపుతిప్ప వద్ద సముద్రంలో కలిసే వరకు వశిష్ట గోదావరిలో ఆరు ఓపెన్ రీచ్‌లు, ఐదు డిసిల్టేషన్ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వేవారు. సముద్రపు పోటుతో ఆయా ర్యాంపుల్లోని ఇసుకలో ఉప్పునీటి సాంద్రత పెరిగింది.
దీంతో నిర్మాణ పనులకు అనుకూలంగా లేకపోవడం, తీర ప్రాంత పరిరక్షణలో భాగంగా ఈ ర్యాంపులు సీఆర్‌జెడ్ పరిధిలోకి వెళ్లడంతో ఈ రీచ్‌లు మూతపడ్డాయి. ఇసుక కొరత నేపథ్యంలో వీటిని తెరిచేందుకు అధికార యంత్రాంగం పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. వీటిని తెరిచే వీలులేకపోవడంతో జిల్లా అవసరాల నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాలోని తీపర్రు, ఔరంగాబాద్ ర్యాంపులను ప్రభుత్వం కేటాయించింది. – సాక్షి, భీమవరం
చక్రం తిప్పిన శాండ్ కింగ్..
తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక తవ్వకాలకు పేరొందిన టీడీపీ నేత కన్ను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇసుక ర్యాంపులపైనా పడింది. జట్టు కార్మికుల ప్రాబల్యం తక్కువగా ఉండటం, బాట అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో తన అక్రమ తవ్వకాలకు ఆయన నడిపూడి ర్యాంపును ఎంచుకున్నారు. సాధారణంగా ర్యాంపు తెరవాలంటే నీటిపారుదల, గనులు, కాలుష్యం, రెవెన్యూ తదితర శాఖల అనుమతులు తప్పనిసరి.
అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) మార్గదర్శకాలను అనుసరించి తీర ప్రాంతం కోతకు గురికాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమిత అడుగుల లోతులో జట్టు కార్మికులతో తవ్వకాలు చేయించాలి. పగటిపూట మాత్రమే తవ్వకాలు, లోడింగ్ చేయాలి. అయితే ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ సదరు శాండ్ కింగ్ చక్రం తిప్పారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో నడిపూడి ర్యాంపులో అనధికార తవ్వకాలకు తెరలేపారు. పొక్లెయిన్‌లతో నదీగర్భంలో రెండు మూడు మీటర్ల లోతున ఇసుకను పైకి తోడి రాత్రివేళల్లో లోడింగ్ చేస్తున్నారు. నిర్మాణ పనులకు అనువు కాదని మూసివేసిన ర్యాంపులో వారం రోజులుగా యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
అదనపు చార్జీల రూపంలో భారీ వసూళ్లు..
ఇతర ర్యాంపుల కంటే తక్కువ ధరకు ఇసుక లోడింగ్ చేస్తుండడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి లారీలు నడిపూడి ర్యాంపు వద్ద బారులు తీరుతున్నాయి. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని పలు ర్యాంపుల్లో ఐదు యూనిట్ల లోడింగ్‌కు ప్రభుత్వ నిర్ణీత ధరతో పాటు అదనపు చార్జీల రూపంలో రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు టీడీపీ నేత దండుకుంటున్నారు. ఈ అనధికార ర్యాంపులో రూ.2,500కే ఐదు యూనిట్ల ఇసుక లోడింగ్ చేస్తుండడంతో లారీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ర్యాంపు వద్ద నుంచి సిద్ధాంతం వంతెన వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర లారీలు లోడింగ్ కోసం వేచి ఉంటున్నాయి. రోజూ 200కు పైగా లారీలు ఇసుక కోసం వస్తున్నాయి.
వీటి నుంచి రూ.6.50 లక్షలు – రూ.8 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత వారం రోజుల వ్యవధిలో దాదాపు రూ.అర కోటికి పైగా దండుకోగా ర్యాంపు నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన మొత్తం టీడీపీ అగ్రనాయకత్వానికి చేరుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అక్రమ తవ్వకాల్లో తమకు వాటా ఇవ్వకుండా మొత్తం పొరుగు జిల్లా నేత దోచుకుపోతున్నారని స్థానిక కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు. అధికారులకు అందుతున్న ఫిర్యాదుల్లో పేర్లు లేకుండా టీడీపీ నాయకులే చేస్తున్నవే ఎక్కువగా ఉంటున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment