Putarekulu
-
పూతరేకులు.. వెరీ స్పైసీ గురూ..
సాక్షి, విశాఖపట్నం: పూతరేకు ఏంటీ.. స్పైసీగా ఉండట మేంటి...? విడ్డూరం కాకపోతేనూ...! అని అనుకుంటు న్నారా... లేదండీ... నిజమే.. ఇక నుంచి స్పైసీ పూత రేకులు మార్కెట్లో హాట్ హాట్‌గా కనిపించనున్నాయి. ప్రత్యేకంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం కాకరకాయ, వెల్లుల్లి కారంతో పూతరేకులను రూపొందించారు ఆత్రేయ పురానికి చెందిన తయారీదారులు. పూతరేకుల తయారీ అనేది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ పురం ప్రజలకు తరతరాలుగా వారసత్వంగా వస్తోంది. తొలినాళ్లలో పంచదారతోనే పూతరేకులు తయారు చేసేవారు. కాలానుగుణంగా మారుతున్న అభిరుచుల మేరకు పూతరేకుల్లోనూ అనేక రకాలు వచ్చేశాయి. బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో రకరకాల పూతరేకులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు పూతరేకుల తయారీదారులు ట్రెండ్ మార్చారు. స్పైసీ పూతరేకులు సిద్ధం చేశారు. కాకరకాయ, వెల్లుల్లి కారంపొడితో పూతరేకు చుడతారు. డయాబెటిక్‌తో ఉన్నవారికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఈ పూతరేకులు తింటే రక్తశుద్ధి, ఇన్సులిన్ సామర్థ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు. మార్కెట్లోకి స్సైసీ బిట్టర్గార్డ్, గార్లిక్ పూతరేకులు ఇన్నాళ్లూ పూతరేకులు తీయని రుచితో నోరూరిస్తూ.. మధుమేహ బాధితులకు మాత్రం శత్రువుగా ఉండేవి. షుగర్ ఫ్రీ పూతరేకులు అందుబాటులోకి వచ్చినా వాటిపై డయాబెటిక్ రోగులు అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే ఇప్పుడు స్వీట్‌ని హాట్‌గా తింటూ... మధుమేహాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఆత్రేయపురం వాసులు తయారు చేసిన కొత్త తరహా పూతరేకులను శుక్ర వారం మార్కెట్లోకి విడుదల చేశారు. అత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం ప్రతినిధులు తీసుకువచ్చిన స్పైసీ బిట్టర్గార్డ్, గార్లిక్ పూతరేకులను దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీసుధ మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా... ఆత్రేయపురం పూతరేకులు అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మా పూతరేకు ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ తినాలన్నదే తయారీదారులందరి కోరిక. పంచదారతో తయారు చేయడం వల్ల తినలేకపోతున్నామంటూ చాలామంది మధుమేహం ఉన్నవారు మా ఊరు వచ్చినప్పుడు చెప్పి బాధపడేవారు. అందుకే భౌగోళిక గుర్తింపు వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని స్పైసీ పూతరేకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. – గాదిరాజు ప్రసాదరాజు, ఆత్రేయపురం -
Recipes: అరిశెలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి! ఇక పూతరేకులు..
సంక్రాంతి దగ్గరకు వస్తోంది... పిల్లలకు పరీక్షలు వచ్చేశాయి. ఆ తర్వాత సెలవులు వస్తాయి. పండక్కి కొత్త దుస్తులు వస్తాయి. ఇంటికి రుచుల దినుసులు వస్తాయి. వంటింట్లో రుచులు మొలకెత్తుతాయి. ఈ రుచులకు ఇప్పుడే బాణలి పెట్టండి. పండగ వరకు తాజాగా ఉంటాయి. అరిశెలు కావలసినవి: ►బియ్యం – ఒకటింపావు కిలో ►బెల్లం – కిలో ►నువ్వులు– టేబుల్ స్పూన్ ►గసగసాలు– టేబుల్ స్పూన్ ►నెయ్యి లేదా నూనె – ముప్పావు కేజీ. తయారీ: ∙ ►బియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. ►సన్నని రంధ్రాలున్న జల్లెడతో జల్లించి ఒక పాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. ►బెల్లాన్ని పొడి చేయాలి. ►పెద్దపాత్రలో ఒక గ్లాసు నీరు, బెల్లం పొడిని వేసి పాకం వచ్చేదాకా మరగనిచ్చి బియ్యప్పిండి వేసి కలుపుకోవాలి. ►బాణలిలో నెయ్యి వేడి చేయాలి. ►పాకంపిండిని పెద్ద నిమ్మకాయంత తీసుకుని గసగసాలు, నువ్వులలో అద్ది పాలిథిన్ పేపర్ మీద పలుచగా తట్టి బాణలిలో వేయాలి. ►రెండువైపులా దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నెయ్యి కారిపోయేటట్లు వత్తాలి. ►అరిశెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్క గరిటెలు కూడా వాడవచ్చు. ►వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే వత్తి అదనపు నేతిని బాణలిలోకి జారేటట్లు వత్తవచ్చు. గమనిక: ►అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. ►గట్టిగా ఎక్కువ తీపితో కావాలనుకుంటే పాకాన్ని కాస్త ముదరనివ్వాలి. ►ఒక ప్లేటులో నీళ్లు పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూనుతో కొద్దిగా తీసుకుని నీటిలో వేయాలి. ►దీనిని చేత్తో నొక్కి రౌండ్ చేయాలి. జారి పోకుండా రౌండ్ వచ్చిందంటే పాకం వస్తున్నట్లు. ►ఆ రౌండ్‌ను పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు. ►ముదురు పాకం కావాలనుకుంటే ఆ రౌండ్ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చే దాకా పాకం పట్టుకోవాలి. ►అరిశెలు పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. ►తినే ముందు పెనం మీద వేడి చేస్తే అప్పుడు చేసిన అరిశెలాగా వేడిగా, మెత్తగా మారుతాయి. పూతరేకులు కావలసినవి: ►చక్కెర – కేజీ ►సగ్గుబియ్య– ముప్పావు కేజీ ►జీడిపప్పు– పావుకేజీ ►ఏలకులు– 50గ్రా ►నెయ్యి– 100 గ్రా. తయారీ: ►పూత రేకుల కోసం రేకులను తయారు చేసుకోవడం కొంచెం కష్టమే. ఇందుకు ప్రత్యేకమైన కుండ కావాలి. ∙ ►సగ్గుబియ్యాన్ని చిక్కటి గంజి చేసుకోవాలి. ►ఒక గట్టి కాటన్ క్లాత్‌ను నలుచదరంగా కట్ చేయాలి. ►కుండను మంట మీద బోర్లించి వేడెక్కిన తరువాత క్లాత్‌ను సగ్గుబియ్యం గంజిలో ముంచి వేడెక్కిన కుండ మీద పరచాలి. ►గంజి కుండకు అంటుకుని వేడికి పలుచని పొరలాగా వస్తుంది. ►ఆ పొర విరిగిపోకుండా అట్లకాడతో జాగ్రత్తగా తీయాలి. ►ఎన్ని రేకులు కావాలంటే అన్నింటికీ ఇదే పద్ధతి. ►రేకు ఏ సైజులో కావాలంటే క్లాత్‌ను ఆ సైజులో కట్ చేసుకోవాలి. ►చక్కెర, జీడిపప్పు, ఏలకులను పొడి చేసి కలుపుకోవాలి. ►ఇప్పుడు రెండు ఒక రేకు తీసుకుని నెయ్యిరాసి చక్కెర, జీడిపప్పు మిశ్రమాన్ని పలుచగా చల్లి పైన మరొక రేకు వేసి మడత వేయాలి. ►తెల్లగా నోరూరించే పూతరేకు రెడీ. ►ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. ►ఎక్కువ మోతాదులో రేకులను తయారు చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కెర మిశ్రమాన్ని వేసి పూతరేకులను చేసుకోవచ్చు. ►అలాగే చక్కెర బదులు బెల్లం పొడి, ఖర్జూరాల పొడితో కూడా పూతరేకులు చేసుకోవచ్చు. ►జీడిపప్పుతో పాటు బాదం పలుకులు కూడా వాడవచ్చు. -
Sankranthi: సున్నుండలు, పూతరేకులు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
Sankranti Special Food Items In Andhra: సంక్రాంతి... పండుగ సమీపిస్తోంది. అమ్మ పిండివంటలు చేసేందుకు సిద్ధమవుతోంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని పెంచే వంటకాలను మనకోసం తయారు చేస్తుంది. మరి ఆ పనిలో మనం కూడా మనకు తోచిన సాయం చేయాలి కదా! ఎందుకు ఆలస్యం! ఏటా వచ్చే సంక్రాంతి రుచినే కొత్తగా ఆస్వాదించాలనుకునే వారు సున్నండలు, కజ్జికాయలు, పూతరేకులను ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. సున్నుండలు కావలసినవి: మినప్పప్పు– పావు కేజీ, పెసరపప్పు– పావుకేజీ, బెల్లం– 400గ్రా., ఏలకుల పొడి– ఒక టీ స్పూను, నెయ్యి– 200గ్రా. తయారీ: మందపాటి బాణలిలో నూనె లేకుండా మినప్పప్పు, పెసరపప్పులను దోరగా వేయించుకుని పొడి చేయాలి ∙ఆ పొడిలో బెల్లం పొడి, ఏలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి ∙అన్నీ సమంగా కలిసిన తరువాత కావలసిన సైజులో ఉండలు చేయాలి ∙నెయ్యి వాడకాన్ని తగ్గించాలనుకుంటే నేతిని పిండిలో కలపకుండా చేతికి కాస్త రాసుకుంటూ ఉండలు చేసుకోవాలి. గమనిక: మినప్పప్పు, పెసరపప్పులను విడిగా వేయించుకుంటే మంచిది లేదా ముందుగా మినప్పప్పు వేసి ఒక మోస్తరుగా వేగిన తరువాత పెసరపప్పును వేయాలి. కజ్జికాయలు కావలసినవి: మైదా పిండి లేదా గోధుమ పిండి – ఒక కేజి, నువ్వులు – ఒక కేజి, బెల్లం – 800గ్రా., ఏలకులు– 10 గ్రా., జీడిపప్పు– వందగ్రాములు నెయ్యి లేదా నూనె– వేయించడానికి కావలసినంత. తయారీ: ∙పిండిని చపాతీలకు కలుపుకున్నట్లుగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. మిగిలినవి సిద్ధం చేసుకునే లోపుగా ఇది బాగా నానుతుంది నువ్వులను దోరగా వేయించి చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా గ్రైండ్ చేయాలి. బెల్లాన్ని పొడి చేసి అందులో ఏలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి జీడిపప్పును నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండిని చిన్న చిన్న రౌండ్లు చేసుకోవాలి. ఒక్కొక్క రౌండును ప్రెస్సర్‌తో పూరీలా వత్తుకుని దానిని సాంచిలో పరిచి అందులో ఒక స్పూను నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని, ఒక జీడిపప్పును పెట్టి సాంచిని మూత వేయాలి. కజ్జికాయ ఆకారం వస్తుంది సాంచిలో నుంచి తీసి కజ్జికాయను మరుగుతున్న నూనెలో వేసి దోరగా కాలనివ్వాలి ఇవి దాదాపుగా ఇరవై రోజుల వరకు తాజాగా ఉంటాయి ‘సాంచి’ అంటే చెక్కతో చేసిన మౌల్డ్. ఇందులో పూరీని పెట్టి మడత వేస్తే అంచులు నొక్కుకుని పిండి అతుక్కుపోతుంది ∙లోపల పెట్టిన మిశ్రమం బయటకు రాకుండా ఉంటుంది ∙దీనికి బదులుగా వెనుక చక్రం ఉండే స్పూనులు కూడా ఉంటాయి ∙వాటిని కూడా వాడవచ్చు. గమనిక: కజ్జికాయలను నేతిలో వేయిస్తే రుచి పెరుగుతుంది కాని, కజ్జికాయలు త్వరగా మెత్తబడతాయి ∙ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నూనెతో చేసుకోవడం మంచిది. పూతరేకులు కావలసినవి: చక్కెర లేదా బెల్లం– ఒక కేజి, సగ్గుబియ్యం– ముప్పావు కేజి, జీడిపప్పు– పావుకేజి, బాదంపొడి–100 గ్రా, ఏలకులు– 50గ్రా., నెయ్యి– 100 గ్రా. తయారీ: తెల్లగా, మెత్తగా చూడగానే నోరూరుతూ పూతరేకులు చుట్టడం సులభమే కాని అందుకోసం రేకులను తయారు చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమే. ఇందుకు ప్రత్యేకంగా కుండలు దొరుకుతాయి ముందుగా సగ్గుబియ్యాన్ని ఉడికించి చిక్కటి గంజి చేసుకోవాల ∙కుండను మంట మీద బోర్లించి వేడెక్కిన తరువాత సగ్గుబియ్యం గంజిలో ముంచిన క్లాత్‌ను పరిచి తీసేయాలి ∙గంజి కుండకు అంటుకుని వేడికి పలుచని పొరలాగా వస్తుంది ఆ పొర విరిగిపోకుండా అట్లకాడతో జాగ్రత్తగా తీయాలి ఇలా ఎన్ని రేకులు కావాలంటే అన్నింటికీ ఇదే పద్ధతి రేకు ఏ సైజులో కావాలంటే క్లాత్‌ను ఆ సైజులో కట్ చేసుకోవాలి ∙ఇందుకు కాటన్ క్లాత్‌ను వాడాలి ∙చక్కెర, జీడిపప్పు, ఏలకులను పొడి చేసి కలుపుకోవాలి ఇప్పుడు రేకులను రెండు పొరలు తీసుకుని వాటికి నెయ్యిరాసి ఆ పైన చక్కెర లేదా బెల్లం పొడి, జీడిపప్పు, బాదం పొడి మిశ్రమాన్ని పలుచగా వేసి పైన మరొక పొర రేకును వేసి మడత వేయాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి ఎక్కువ మోతాదులో రేకులను తయారు చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కెర లేదా బెల్లంపొడి మిశ్రమాన్ని వేసి తాజాగా రేకులను చుట్టుకోవచ్చు. -
మరో ఆత్రేయపురం.. మంచిలి స్వీటు
సాక్షి, అత్తిలి: పూతరేకులు గురించి ఉభయ గోదావరి జిల్లాల్లో తెలియనివారుండరు. ఆంధ్రా ప్రాంత సంప్రదాయ స్వీట్లలో వీటిది అగ్రస్థానమే. తూర్పుగోదావరి ఆత్రేయపురంలో ప్రాచుర్యం పొందిన పూతరేకులకు మన జిల్లాలో అత్తిలి మండలం మంచిలి గ్రామం ప్రసిద్ధి. ఇక్కడ వీటి తయారీ కుటీర పరిశ్రమగా వెలుగొందుతోంది. మహిళలు పూతరేకులు తయారీని వృత్తిగా ఎంచుకుని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ నుంచి దేశ, విదేశాలకు సైతం పూతరేకులు ఎగుమవుతుండటం విశేషం. సుమారు 300 కుటుంబాలకు పైబడి మంచిలి గ్రామంలో పూతరేకుల తయారీని వృత్తిగా చేపట్టారు. గ్రామంలో మొట్టమొదటి సారిగా పూతరేకుల స్వీటు తయారీని భగవాన్ ప్రారంభించారు. స్వీటు తయారీ విధానాన్ని ఆయన ఇలా వివరించారు. పూతరేకు స్వీటులో ప్రధానంగా బెల్లం, పంచదార, జీడిపప్పు, స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తుంటారు. పూతరేకుల తయారీలో ప్రధానం ఉపయోగించే బెల్లాన్ని కంచుస్తంభం పాలెం నుంచి బూరుగపల్లి బెల్లాన్ని కొనుగోలు చేస్తుంటారు. గుంటూరు, తెనాలి, మండపాక తదితర ప్రాంతాల నుంచి స్వచ్ఛమైన నెయ్యిని సేకరిస్తారు. వెన్నను కూడా సేకరించి నెయ్యిగా మార్చి స్వీటు తయారీకి వినియోగిస్తుంటారు. జీడిపప్పును తాడిమళ్ల, మోరి ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తారు. పలుచని బెల్లాన్ని మహిళలు రోటిలో దంచి పొడుంగా మారుస్తారు. ఈ పొడిని జల్లిస్తారు. నేతిలో జీడిపప్పు బద్దలను దోరగా వేయిస్తారు. పూతరేకు పై పొరపై బెల్లంపొడి, నెయ్యి, జీడిపప్పును చల్లి పై భాగంలో మరొక రేకును వేసి మడతగా చుడతారు. ఇలా చుట్టిన పూతరేకు స్వీటును ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేస్తారు. ఈ ప్రాంత నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, దేశ, విదేశాలకు వెళ్లే వారు తప్పనిసరిగా మంచిలి పూతరేకు స్వీట్లను తీసుకు వెళ్తుంటారు. ఇక్కడ క్వాలిటీతో పూతరేకు స్వీట్లను తయారు చేయడంతో అంతటి ప్రాచుర్యం పొందింది. 5 వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో సుమారు 1200 మంది పూతరేకుల తయారీ చేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. కుటుంబ యజమాని సంపాదనకు తోడు మహిళలు ఇంటి వద్దే పూతరేకులు తీసి ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. తయారీ ఇలా.. పూతరేకుల తయారీకి ప్రత్యేకంగా తయారు చేసిన మట్టికుండను వాడతారు. కుండ పై భాగం నున్నగా వెడల్పుగా ఉంటూ, మంటపెట్టడానికి కిందిభాగంలో రంధ్రాన్ని కల్గి ఉంటుంది. ఈ కుండలను పెనుమంట్ర గ్రామం నుంచి కొనుగోలు చేస్తారు. పూతరేకుల తయారీకి సోనామసూరి బియ్యం నూకలను వినియోగిస్తుంటారు. గతంలో బియ్యాన్ని ఒకరోజు ముందుగా నీటిలో నానబెట్టి మరుసటి రోజు రుబ్బురోలులో రుబ్బేవారు. ఈ ప్రక్రియ కష్టతరంగా మారడంతో మారుతున్న కాలానుగుణంగా గ్రైండర్లలో పిండి రుబ్బుతున్నారు. ఇలా మెత్తగా రుబ్బిన పిండిలో తగిన మోతాదులో నీటిని కలిపి పలుచగా జాలుగా వచ్చేలా చేస్తారు. బోర్లించిన కుండ అడుగు భాగం నుంచి కొబ్బరి ఆకులతో సన్నని మంట పెడుతూ కుండ వేడెక్కిన తరువాత పూతరేకుల తయారీ ప్రక్రియ ప్రారంభిస్తారు. మంచినూనె లేదా నేతిని కుండ పైభాగాన రాస్తారు. పలుచని వస్త్రాన్ని జాలుగా ఉన్న బియ్యపు పిండిలో ముంచి కుండ వేడెక్కిన తరువాత ఆ వ్రస్తాన్ని కుండపై ఒకవైపు నుంచి మరొక వైపుకు లాగుతారు. కుండ వేడిమికి పిండి పలుచని పొరలా వస్తుంది. ఇలా వచ్చిన రేకును ఒక పక్కన పేరుస్తారు. కుండకు తగిన వేడిని కలిగే విధంగా కొబ్బరి ఆకులతో మంట పెడుతుంటారు. మంట ఎక్కువైనా, తక్కువైనా పూతరేకులు విరిగిపోతుంటాయి. దీంతో పూతరేకు తయారు చేసే సమయంలో మహిళలు తగిన జాగ్రత్తలు పాటిస్తుంటారు. రోజుకు లక్ష పూతరేకుల తయారీ పూతరేకులు తయారీకి ఉపయోగించే నూకలు కిలో రూ.26 ధర ఉంది. కిలో నూకలతో 200 రేకులు తయారీ అవుతాయి. ఒక్కొక్క మహిళ రోజుకు 300 నుంచి 700 వరకు రేకులను తయారు చేస్తుంటారు. పూతరేకులు క్వాలిటీని బట్టి 100 రేకులను రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటారు. పూతరేకుల తయారీలో కుండను వేడిచేసే మంటకు కొబ్బరి ఆకులు ఉపయోగిస్తారు. 100 కొబ్బరి ఆకులు రూ.500 ధర ఉంది. ఖర్చు పోను ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.400 వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. ఏడాది పొడవునా పూతరేకులను తయారీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజుకు సుమారుగా లక్ష పూతరేకులు తయారవుతుంటాయని అంచనా. గ్రామంలో తయారైన పూతరేకులను పలువురు వ్యాపారస్తులు కొనుగోలు చేసి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పేరొందిన స్వీట్ల షాపులకు సరఫరా చేస్తుంటారు. దంచిన బెల్లపు పొడిని జల్లిస్తున్న దృశ్యం జీడిపప్పును గ్రేడింగ్ చేస్తున్న మహిళ ఆరోగ్యానికి పొగ పూతరేకుల తయారీలో మంటకు ఉపయోగించే కొబ్బరి ఆకుల వల్ల పొగచూరి మహిళలకు నేత్ర సంబంధ సమస్యలు కలుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే రేకులు తీయడంతో కండరాల నొప్పులు తలెత్తుతున్నాయని, వేడివల్ల పలు ఆరోగ్య రుగ్మతలు ఏర్పడుతున్నాయని పలువురు మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పూతరేకుల తయారీ ఒకే విధానంలో సాగుతోంది. మారుతున్న కాలానుగుణంగా యాంత్రీకరణ పనిముట్లు అన్ని రంగాలలో వినియోగిస్తున్నప్పటికీ పూతరేలకు తయారీ ప్రక్రియకు ఏ విధమైన యంత్రపరికరాలను ఆవిష్కరించలేదు. పూతరేకు స్వీట్ల తయారీలో నిమగ్నమైన మహిళలు మెషీన్లు వస్తే ఉపాధికి దెబ్బ పూతరేకుల స్వీటు తయారీకి వినియోగించే బెల్లాన్ని పొడి చేయడానికి మెషీనరీ వచ్చినప్పటికీ మహిళలకు ఉపాధి కలి్పంచాలనే ఉద్దేశంతో వాటిని కొనుగోలు చేయలేదు. 33 కిలోల బెల్లాన్ని రోలులో దంచడానికి రూ.700 వరకు ఖర్చు అవుతుంది. మనుషుల వల్ల అధిక వ్యయమైనప్పటికీ వారికి ఉపాధి కలి్పంచడానికి మెషీన్లను వినియోగించడంలేదు. బెల్లం, పంచదారతో పూతరేకు స్వీటును నాణ్యమైన క్వాలిటీతో మూడు సైజులలో తయారు చేస్తుంటాం. –భగవాన్, పూతరేకు స్వీటు వ్యాపారి, మంచిలి పూతరేకు స్వీట్లను కవర్లలో పెడుతున్న దృశ్యం ఆదరణ బాగుంది పూతరేకుల తయారీకి ఆదరణ బాగుంది. ఇంటి వద్దే ఉండి పూతరేకులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నాం. ఖర్చులు పోను రోజుకు రూ. 300 పైబడి ఆదాయం వస్తుంది. వేడి, పొగవల్ల ఇబ్బందులు పడుతున్నాం. –తులా గంగాభవానీ, మంచిలి -
వహ్వా.. హల్వా!
కాకినాడ కాజాకు, బందరు లడ్డూకు.. ఆత్రేయపురం పూతరేకులకు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో మధురమైన ప్రత్యేకత ఉంటుంది. ఈ వరుసలోనే విశాఖ జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే మాడుగుల హల్వా. పేరులోనే కాదు రుచిలో కూడా దీనికి సాటి మరొకటి లేదని చెప్పక తప్పదు. ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో 128ఏళ్ల క్రితం పుట్టిన ఈ హల్వా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. సాక్షి, మాడుగుల: విశాఖ జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన మిఠాయి వ్యాపారి దంగేటి ధర్మారావుకు 1890 ప్రాంతంలో కొత్తరకమైన మిఠాయి తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. అంతే.. బూడిద గుమ్మడి, కొబ్బరి కాయ రసంతో హల్వా తయారుచేశారు. దీని తయారీ ఎలాంటే.. ముందుగా మేలు రకం గోధుమలు 3 రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు తీయాలి. వాటిని ఒక రోజు పులియబెట్టాలి. ఆ తరువాత గోధుమ పాలు, నెయ్యి కలిపి దగ్గరకు మరిగే వరకు కలపాలి. ఆ పాకాన్ని దించి వాటిపై ఫ్లేవర్ కోసం జీడిపప్పు బాదం పప్పు వేయాలి. మాడుగుల హల్వా యవ్వన శక్తి పెంచడంతోపాటు శరీర స్థితిని నిలకడగా ఉంచుతుందని స్థానికుల నమ్మకం. పెరుగుతున్న షాపులు మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. దంగేటి కుటుంబంలో మాత్రమే హల్వా తయారీ జరిగేది. అయితే, తయారీ గుట్టు రట్టవ్వడంతో ప్రస్తుతం వ్యాపారం విస్తరించింది. ఇక్కడ తయారవుతున్న హల్వాను మొబైల్ వ్యాన్ల ద్వారా పార్శిళ్లు, కొరియర్ల ద్వారా ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాలకు పంపిస్తున్నారు. కాగా, ఇటీవల వరకు మేలు రకాన్ని కేజీ రూ.260 వరకు విక్రయించిన తయారీదారులు ముడిసరుకుల ధరలు పెరగడంతో దానిని రూ.400కు పెంచక తప్పలేదు. 1,500 కుటుంబాలకు ఆధారం మాడుగుల కేంద్రంగా తయారయ్యే హల్వా వ్యాపారంపై ప్రత్యక్షంగా పరోక్షంగా 1500 మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ నుండి విశాఖ, అనకాపల్లి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వరకు దళారులు తీసుకెళ్లి విక్రయిస్తారు. విదేశాల్లో ఉంటే స్థానికులు ఇక్కడకు వచ్చి వెళ్ళినపుడల్లా హల్వాను తీసుకెళ్లడం పరిపాటి. ఇలా దేశ విదేశాలకు మాడుగుల హల్వా పరిచయమైంది. అంతేకాక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు జరిగినా ఇది ఉండడం ఆనవాయితీ. ప్రముఖుల మెప్పు పొందిన హల్వా విశాఖ జిల్లా అరుకు షూటింగ్‌లకు వచ్చే సినీ ప్రముఖులు చాలామంది ఈ హల్వా రుచిచూసి వహ్వా అన్నవారే. దివంగిత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారు. అలాగే, ఇందిరాగాంధీ 40 ఏళ్ల కిందట ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హల్వా రుచి చూసిన వారేనని స్థానిక సీనియర్ వ్యాపారులు చెబుతున్నారు. ఇలా దంగేటి ధర్మారావు సృష్టించిన ఈ హల్వాను అతని కుమారుడు కొండలరావు, మనుమడు మూర్తి, ముని మనముడు మోహన్ వరకూ నాలుగు తరతరాలుగా మిఠాయి ప్రియుల మన్ననలు అందుకుంటున్నారు. మాడుగుల హల్వా రుచి అద్భుతం మాడుగుల వచ్చినపుడల్లా అమెరికాకు హల్వా తీసుకెళ్లి స్నేహితులుకు అందజేస్తుంటాను. పుట్టింది మాడుగుల మండలం సత్యవరం గ్రామం. కానీ, ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్నాను. ఫంక్షన్లకు, పండుగలకు కొరియర్ల ద్వారా అమెరికాకు తెప్పించుకుంటున్నాం. – గోకేడ వెంకటేశ్వర సత్యనారాయణ తరాలుగా ఒకటే రుచి తాతల నాటి క్వాలిటీని నేటికీ కొనసాగిస్తున్నాం. ఆవు నెయ్యి, గోధుమలకు, కూలీలకు ధరలు పెరిగినా పెద్దగా లాభాలు ఆశించకుండా సామాన్యులుకు అందుబాటులో «ధరలో ఉంచుతున్నాం. మా హల్వా రుచికరంగా ఉండడానికి ఇక్కడి నీరే కారణం. – దంగేటి మోహన్, హల్వా వ్యాపారి, మాడుగుల -
పూతరేకుపై కల్తీ పూత
కల్తీ నెయ్యితో తయారీ తింటే అనారోగ్యం ఖాయం అమలాపురం :నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయి.. కమ్మనైన రుచిని పంచే ఆత్రేయపురం పూతరేకుకు కల్తీ సెగ తగలింది. పూతరేకులకు అద్భుతమైన రుచిని తెచ్చేందుకు స్వచ్ఛమైన నెయ్యి వినియోగించే బదులు కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు స్వార్థంతో చేస్తున్న ఈ పని.. జాతీయ స్థాయిలో ఆత్రేయపురం పూతరేకుకున్న ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు కేంద్రంగా తయారవుతున్న కల్తీనెయ్యి ఇటీవల ఆత్రేయపురం మండలంలో పెద్ద ఎత్తున దొరికిన విషయం తెలిసిందే. జిల్లావ్యాప్తంగా సరఫరా అవుతున్నా ఇక్కడే ఇంత పెద్ద ఎత్తున దొరకడానికి కారణం దీనిని స్థానికంగా తయారు చేస్తున్న పూతరేకుల్లో వినియోగించడమే. ఒక్క ఈ మండలంలోనే ఏటా సుమారు రూ.10 కోట్ల విలువైన కల్తీ నెయ్యి అమ్మకాలు సాగుతున్నాయంటే ఇక్కడ వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆవులు, గేదెల కళేబరాల నుంచి సేకరించిన కొవ్వులో కొంత నెయ్యి కలిపి కల్తీ చేస్తున్నారు. ఇది సువాసన వచ్చేందుకు కొన్ని రకాల ఎసెన్స్ వాడుతున్నారు. కల్తీనెయ్యి వల్ల పెద్దపేగు, లివర్ సంబంధ వ్యాధులు వస్తాయి. కల్తీ మోతాదు పెరిగితే ఫుడ్ పాయిజన్ కూడా జరగవచ్చు. బహిరంగ మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి ధర కేజీ రూ.500 వరకూ ఉండడంతో కొందరు పూతరేకుల తయారీదారులు ఇలా పక్కదారి పట్టారు. రూ.250కే రావడంతో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారు. బ్రాండెడ్ అన్నట్టుగా బిల్డప్ ఆత్రేయపురం మండలం పులిదిండిలోని ఒక వ్యాపారి నిడదవోలు నుంచి పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి దిగుమతి చేసుకుంటున్నాడు. దీనిని స్థానిక వ్యాపారులు కేజీ రూ.110కి కొంటున్నారు. రాజమండ్రిలోని బ్రాండెడ్ కంపెనీ నుంచి తెచ్చినట్టు చెబుతూ వారు పూతరేకుల తయారీదారులను మోసగిస్తున్నారు. కేజీ రూ.250 చొప్పున రోజుకు 15 నుంచి 20 కేజీల వరకూ విక్రయిస్తున్నారు. ఖండాంతర ఖ్యాతికి మచ్చ కల్తీ అని తెలిసి కూడా కొంతమంది పూతరేకుల తయారీదారులు లాభాపేక్షతో దీనిని వినియోగిస్తున్నారు. ఇది ఆత్రేయపురం పూతరేకు ఖ్యాతికి మచ్చ తెచ్చింది. ఆత్రేయపురం నుంచి జిల్లాతోపాటు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలకు, అమెరికాకు కూడా పూతరేకులు ఎగుమతి అవుతూంటాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఇళ్లల్లో ఫంక్షన్లకు ఆత్రేయపురం పూతరేకును అతిథులకు అందించడం సర్వసాధారణమైంది. వీటి తయారీపై మండలంలో సుమారు 300 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నాయి. ఏటా రూ.25 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. ఇప్పుడు కల్తీ మచ్చవల్ల మొత్తం తయారీదారులపైనే అపనమ్మకం ఏర్పడుతోందని నిజాయితీగా వ్యవహరించే వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూతరేకులతోపాటు పలు స్వీట్ల వినియోగంలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారు. కొందరే ‘కల్తీ’ని వినియోగిస్తున్నారు నాణ్యమైన ముడిసరుకుతో తయారు చేయడంవల్లే ఆత్రేయపురం పూతరేకులకు అంత గుర్తింపు వచ్చింది. కొంతమంది స్వార్థపరులు కల్తీ నెయ్యి వినియోగించి పూతరేకుకు చెడ్డపేరు తెస్తున్నారు. వారివల్ల పూతరేకుల పరిశ్రమ దెబ్బతినేలా ఉంది. - సఖిలేటి రామకృష్ణంరాజు, పూతరేకుల వ్యాపారం, తాడిపూడి, ఆత్రేయపురం -
మధుర గోదావరి
పన్నెండేళ్లకోసారి గోదావరి మాత పరవశిస్తుంది... తన చెంతకు వచ్చేవారిని ఉత్తచేతులతో ఎందుకు పంపుతుంది ఆ తల్లి... తనలో స్నానం చేసి పునీతులవుతున్న వారందరికీ నోరు తీపి చేస్తుంది... మళ్లీ మళ్లీ తలచుకునేలా ఆదరిస్తుంది... పుష్కర నదీ తీరంలోని వారికి ఇదొక పండుగ... ఎక్కడెక్కడి వారూ పుట్టింటికి వస్తుంటారు... వచ్చినవారిని తియ్యగా పలకరించండి... పుష్కరాల సందర్భంగా గోదావరి తీరాన దొరికే మధుర రుచులు వారి నోటికి అందించండి... పుష్కరాల సందర్భంగా గోదావరి తీరంలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన వంటలు ఈ వారం అందరి కోసం... తాపేశ్వరం మడత కాజా కావలసినవి: మైదాపిండి - 2 కప్పులు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు; పంచదార - 2 కప్పులు; నూనె - వేయించడానికి తగినంత; ఉప్పు - కొద్దిగా; ఏలకుల పొడి - టీ స్పూను; వంటసోడా - చిటికెడు తయారీ: ఒక పాత్రలో కొద్దిగా నూనె, మైదా పిండి , ఉప్పు వేసి కలపాలి వంటసోడా జత చే సి మరోమారు కలపాలి తగినన్ని నీళ్లు పోసి పిండి మెత్తగా కలిపి, సుమారు గంటసేపు నాననివ్వాలి ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి తీగపాకం వచ్చే వరకు ఉంచాలి ఏలకుల పొడి జతచేయాలి బాగా నానిన మైదా పిండికి పొడిగా ఉన్న బియ్యప్పిండి కొద్దిగా జత చేసి బాగా మర్దనా చేయాలి చిన్న ఉండ తీసుకుని చపాతీ మాదిరిగా పల్చగా ఒత్తాలి ఒత్తిన చపాతీ మీద నూనె పూసి, ఆ పైన పొడి బియ్యప్పిండి చల్లాలి ఆ పైన మరో చపాతీ ఉంచాలి. దాని మీద కూడా నూనె రాసి బియ్యప్పిండి వేయాలి ఈ విధంగా మొత్తం మూడు చపాతీలు ఒకదాని మీద ఒకటి వేయాలి చివరి దాని మీద నూనె, పిండి వేశాక నెమ్మదిగా రోల్ చేయాలి అంచుల్లో విడిపోకుండా కొద్దిగా నూనె పూయాలి చాకు సహాయంతో చిన్న చిన్న కాజాలు కట్ చేయాలి వాటి మధ్యభాగంలో అప్పడాలకర్రతో నెమ్మదిగా ఒత్తాలి బాణలిలో నూనె కాగాక ఒక్కో కాజాను వేసి మీడియం మంట మీద కాజాలు బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి వాటిని వేడి వేడి పాకంలో వేసి సుమారు 20 నిమిషాలు నానిన తర్వాత తీసేయాలి కొద్దిగా వేడి తగ్గాక వడ్డించాలి. పెద్దాపురం వారి బెల్లం పాలకోవా కావలసినవి: పాలు - లీటరు; బెల్లం తురుము - పావు కేజీ; నెయ్యి - కొద్దిగా తయారీ: పాలను అడుగు మందంగా ఉన్న గిన్నెలో పోసి స్టౌ మీద చిన్న మంట మీద ఉంచి ఆపకుండా కలుపుతుండాలి ఎప్పటికప్పుడు అంచుల దగ్గర కలుపుతుండాలి నెమ్మదిగా పాలు చిక్కబడటం మొదలయ్యాక మరింత వేగంగా పాలు కలుపుతుండాలి బాగా చిక్కబడగానే బెల్లం తురుము వేసి ఆపకుండా కలపాలి మిశ్రమం బాగా దగ్గర పడ్డ తర్వాత నెయ్యి వేసి కలిపి వెంటనే దించేసి వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి చేతికి నెయ్యి రాసుకుంటూ పాలకోవా మాదిరిగా తయారుచేసి పళ్లెంలో ఉంచి ఆరనివ్వాలి గట్టి పడ్డాక వాటిని గాలిచొరని డబ్బాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి.. ఆత్రేయపురం పూతరేకులు కావలసినవి: బియ్యం - పావు కేజీ; పంచదార - పావు కేజీ; ఏలకుల పొడి - టీ స్పూను; నెయ్యి - పావు కేజీ; నూనె - కొద్దిగా తయారీ: బియ్యాన్ని ముందురోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బాలి తగినన్ని నీళ్లు జత చేసి బాగా పల్చగా చేసి ఒక వెడల్పాటి పళ్లెంలో పోయాలి పూతరేకు కుండను కట్టెల పొయ్యి మీద బోర్లించి, కుండంతా పట్టేలా నూనె రాసి, పళ్లెంలో పల్చటి వస్త్రాన్ని ముంచి, దానిని కుండ మీద వెనుక నుంచి ముందుకు వేగంగా లాగాలి రెండు నిమిషాలు కాలగానే జాగ్రత్తగా చేతితో కాని, అట్లకాడతో కాని పూతరేకును తీసి పక్కన ఉంచాలి ఈ విధంగా అన్ని రేకులూ తయారుచేసుకుని పక్కన ఉంచాలి నీరు బాగా పిండేసిన ఒక పొడి వస్త్రం మీద పూతరేకులను ఉంచి వెంటనే తీసేయాలి ఒక రేకు మీద ముందుగా నెయ్యి వేసి, ఆ పైన పంచదార పొడి వేయాలి పైన మరో పూతరేకు ఉంచి నెయ్యి, పంచదార పొడి వేసి పైన మరో పూతరేకు ఉంచాలి ముందుగా రెండుపక్కలా మడతలు వేసి వాటిని వరసగా మడవాలి అప్పటికప్పుడు తయారుచేసి తింటే రుచిగా ఉంటాయి. ధవళేశ్వరం జనార్దనస్వామి జీళ్లు కావలసినవి: బెల్లం తురుము - కేజీ (బూరుగపూడి బెల్లం శ్రేష్ఠం); నెయ్యి - 100 గ్రా; ఏలకుల పొడి - 3 టీ స్పూన్లు; బాగా మందంగా ఉన్న మేకు - 1 (గోడకు గాని, తలుపుకు కాని బిగించాలి) తయారీ: ఒక మందపాటి పాత్రలో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఆపకుండా కలుపుతుండాలి బెల్లం కరిగి ఉండ పాకం వచ్చాక మరి కాసేపు ఉంచి దించేయాలి గరిటెతో బాగా కలపాలి ఒకమాదిరి గట్టిగా అయిన తర్వాత ఆ మిశ్రమం పొడవాటి పలుచటి కడ్డీ మాదిరిగా తయారవుతుంది అప్పుడు ఆ మిశ్రమాన్ని మేకుకి వేసి పొడవుగా లాగుతుండాలి సుమారు పావు గంట సేపు లాగిన తర్వాత బెల్లం గట్టి పడుతుంది అప్పుడు వెడల్పాటి బల్ల మీద ఉంచి గుండ్రంగా రోల్ చేసి బియ్యప్పిండి, నువ్వుపప్పు అద్దుతూ రోల్ చేయాలి మనకు కావలసిన పరిమాణంలోకి వచ్చేవరకు రోల్ చేసి చాకు సహాయంతో చిన్న సైజులోకి జీళ్లను కట్ చేయాలి బాగా ఆరిన తర్వాత గాలి చొరని డబ్బాలోకి తీసి నిల్వ చేసుకోవాలి. కాకినాడ కోటయ్య కాజా కావలసినవి: మైదా - మూడు కప్పు; సెనగ పిండి - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; బేకింగ్ సోడా - చిటికెడు. తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి బేకింగ్ సోడా జత చేసి మరో మారు కలపాలి తగినన్ని నీళ్లు జత చేసి బాగా మెత్తగా వచ్చేలా కలపాలి (గట్టిగా ఉండకూడదు) కలిపిన తర్వాత పిండి చేతికి అంటుతుంటే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని పిండిని సుమారు పావుగంట సేపు బాగా మర్దనా చేయాలి. (ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగా వస్తాయి కాజాలు) పిండి బాగా సాగుతుండాలి పైన తడి వస్త్రం వేసి సుమారు మూడు గంటలసేపు నాననివ్వాలి వేరొక పాత్రలో కేజీ పంచదారకు తగినన్నీ నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి బాగా చిక్కటి పాకం వచ్చేవరకు కలపాలి ఏలకుల పొడి జత చేసి మరో మారు కలపాలి మైదా మిశ్రమాన్ని తీసుకుని మరోమారు బాగా మర్దనా చేయాలి పళ్లెం మీద కొద్దిగా పొడి పిండి వేసి మైదాపిండి మిశ్రమాన్ని దాని మీద దొల్లించి సన్నగా, పొడవుగా గొట్టం ఆకారంలో చేతితో ఒత్తాలి చాకుతో చిన్న చిన్న కాజాల మాదిరిగా కట్ చేయాలి వాటికి మళ్లీ రెండువైపులా బియ్యప్పిండి అద్ది పక్కన ఉంచాలి బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, నూనె కాగిన తర్వాత ఒక్కో గొట్టం కాజాను వేసి వేయించాలి (మీడియం మంట మీద తయారుచేయాలి) ఒక్కో కాజా బాగా పొంగుతాయి కాజాలు బంగారు వర్ణంలోకి మారాక తీసేసి పంచదార పాకంలో వేయాలి సుమారు 30 సెకండ్ల పాటు పాకంలో మునిగేలా చూడాలి. (లేదంటే అవి పాకం పీల్చుకోవు) ప్లేట్లోకి తీసుకుని వెంటనే వాటి మీద కొద్దిగా నెయ్యి వే సి చేత్తో కిందకు పైకి బాగా కలపాలి. (వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేయడం వల్ల అవి కాజాలకు అంటి మంచి రుచి వస్తాయి).