కాకినాడ కాజాకు, బందరు లడ్డూకు.. ఆత్రేయపురం పూతరేకులకు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో మధురమైన ప్రత్యేకత ఉంటుంది. ఈ వరుసలోనే విశాఖ జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే మాడుగుల హల్వా. పేరులోనే కాదు రుచిలో కూడా దీనికి సాటి మరొకటి లేదని చెప్పక తప్పదు. ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో 128ఏళ్ల క్రితం పుట్టిన ఈ హల్వా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది.
సాక్షి, మాడుగుల: విశాఖ జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన మిఠాయి వ్యాపారి దంగేటి ధర్మారావుకు 1890 ప్రాంతంలో కొత్తరకమైన మిఠాయి తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. అంతే.. బూడిద గుమ్మడి, కొబ్బరి కాయ రసంతో హల్వా తయారుచేశారు. దీని తయారీ ఎలాంటే.. ముందుగా మేలు రకం గోధుమలు 3 రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు తీయాలి. వాటిని ఒక రోజు పులియబెట్టాలి. ఆ తరువాత గోధుమ పాలు, నెయ్యి కలిపి దగ్గరకు మరిగే వరకు కలపాలి. ఆ పాకాన్ని దించి వాటిపై ఫ్లేవర్ కోసం జీడిపప్పు బాదం పప్పు వేయాలి. మాడుగుల హల్వా యవ్వన శక్తి పెంచడంతోపాటు శరీర స్థితిని నిలకడగా ఉంచుతుందని స్థానికుల నమ్మకం.
పెరుగుతున్న షాపులు
మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. దంగేటి కుటుంబంలో మాత్రమే హల్వా తయారీ జరిగేది. అయితే, తయారీ గుట్టు రట్టవ్వడంతో ప్రస్తుతం వ్యాపారం విస్తరించింది. ఇక్కడ తయారవుతున్న హల్వాను మొబైల్ వ్యాన్‌ల ద్వారా పార్శిళ్లు, కొరియర్ల ద్వారా ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాలకు పంపిస్తున్నారు. కాగా, ఇటీవల వరకు మేలు రకాన్ని కేజీ రూ.260 వరకు విక్రయించిన తయారీదారులు ముడిసరుకుల ధరలు పెరగడంతో దానిని రూ.400కు పెంచక తప్పలేదు.
1,500 కుటుంబాలకు ఆధారం
మాడుగుల కేంద్రంగా తయారయ్యే హల్వా వ్యాపారంపై ప్రత్యక్షంగా పరోక్షంగా 1500 మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ నుండి విశాఖ, అనకాపల్లి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వరకు దళారులు తీసుకెళ్లి విక్రయిస్తారు. విదేశాల్లో ఉంటే స్థానికులు ఇక్కడకు వచ్చి వెళ్ళినపుడల్లా హల్వాను తీసుకెళ్లడం పరిపాటి. ఇలా దేశ విదేశాలకు మాడుగుల హల్వా పరిచయమైంది. అంతేకాక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు జరిగినా ఇది ఉండడం ఆనవాయితీ.
ప్రముఖుల మెప్పు పొందిన హల్వా
విశాఖ జిల్లా అరుకు షూటింగ్‌లకు వచ్చే సినీ ప్రముఖులు చాలామంది ఈ హల్వా రుచిచూసి వహ్వా అన్నవారే. దివంగిత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారు. అలాగే, ఇందిరాగాంధీ 40 ఏళ్ల కిందట ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హల్వా రుచి చూసిన వారేనని స్థానిక సీనియర్ వ్యాపారులు చెబుతున్నారు. ఇలా దంగేటి ధర్మారావు సృష్టించిన ఈ హల్వాను అతని కుమారుడు కొండలరావు, మనుమడు మూర్తి, ముని మనముడు మోహన్ వరకూ నాలుగు తరతరాలుగా మిఠాయి ప్రియుల మన్ననలు అందుకుంటున్నారు.
మాడుగుల హల్వా రుచి అద్భుతం
మాడుగుల వచ్చినపుడల్లా అమెరికాకు హల్వా తీసుకెళ్లి స్నేహితులుకు అందజేస్తుంటాను. పుట్టింది మాడుగుల మండలం సత్యవరం గ్రామం. కానీ, ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్నాను. ఫంక్షన్లకు, పండుగలకు కొరియర్ల ద్వారా అమెరికాకు తెప్పించుకుంటున్నాం.
– గోకేడ వెంకటేశ్వర సత్యనారాయణ
తరాలుగా ఒకటే రుచి
తాతల నాటి క్వాలిటీని నేటికీ కొనసాగిస్తున్నాం. ఆవు నెయ్యి, గోధుమలకు, కూలీలకు ధరలు పెరిగినా పెద్దగా లాభాలు ఆశించకుండా సామాన్యులుకు అందుబాటులో «ధరలో ఉంచుతున్నాం. మా హల్వా రుచికరంగా ఉండడానికి ఇక్కడి నీరే కారణం.
– దంగేటి మోహన్, హల్వా వ్యాపారి, మాడుగుల
Comments
Please login to add a commentAdd a comment