bandar laddu
-
క్రేజీ ఫుడ్డు.. బందరు లడ్డు
సాక్షి, మచిలీపట్నం: బెల్లం తునక.. బంగారు పుడక (శనగ పిండితో చేసే సన్నపూస) కలిస్తే బందరు లడ్డూ రెడీ అవుతుంది. సై అనడమే ఆలస్యం. సరసకు చేరిపోతుంది. నోట్లో వేయగానే నేతిని ఊరిస్తూ తీయగా గొంతులోకి జారిపోతుంది. తోక గోధుమ పాలు, బెల్లం పాకం కలగలిస్తే నల్ల హల్వా ప్రత్యక్షమవుతుంది. తియ్యటి రుచుల్ని భలే పంచుతుంది. నిన్నమొన్నటి వరకు తెలుగు ప్రాంతాలకే పరిమితమైన ఈ క్రేజీ వంటకాలు ఇప్పుడు భౌగోళిక గుర్తింపును సొంతం చేసుకుని ప్రపంచ దేశాల్ని చుట్టేస్తున్నాయి. బందరు ఖ్యాతిని దశ దిశలా చాటుతున్నాయి. ఇలా మొదలైంది క్రీస్తు శకం 17వ శతాబ్దం చివరిలో బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి బందరుకు వలస వచ్చిన మిఠాయి వ్యాపారి బొందలి రామ్‌సింగ్ సోదరులు బెల్లపు తొక్కుడు లడ్డూ, నల్ల హల్వాను ఈ ప్రాంత వాసులకు పరిచయం చేశారు. వారి నుంచి మిఠాయి తయారీ విధానాన్ని అందిపుచ్చుకున్న బందరు వాసులు కశిం సుబ్బారావు, విడియాల శరభయ్య, శిర్వశెట్టి రామకృష్ణారావు (రాము), శిర్విశెట్టి సత్యనారాయణ (తాతారావు), గౌరా మల్లయ్య తదితరులు లడ్డూ, హల్వా ప్రాశస్త్యాన్ని కాపాడుకుంటూ విశ్వవ్యాప్తం చేశారు. తయారీయే ప్రత్యేకం లడ్డూ తయారీకి కనీసం 12 గంటల సమయం పడుతుంది. ఇందులో శనగపిండి, బెల్లం, నెయ్యి, పటిక బెల్లం, యాలకుల పొడి, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, బాదం పప్పు వినియోగిస్తారు. తొలుత శనగ పిండిని నీట్లో కలిపి నేతి బాండీలో కారప్పూస మాదిరిగా పోస్తారు. అలా వచ్చిన పూసను ఒకపూట ఆరబెట్టి రోకలితో దంచి పొడి చేస్తారు. ఆ పొడిని శుద్ధమైన బెల్లం పాకంలో వేసి లడ్డూ తయారీకి అనువుగా మారేంత వరకు కలుపుతారు. ఈ మిశ్రమాన్ని కొంతసేపు ఆరబెట్టి మళ్లీ రోకళ్లతో దంచుతూ మధ్య మధ్యలో నెయ్యి దట్టిస్తారు. ఒకరు పిండిని తిప్పుతుండగా మరొకరు రోకలితో మిశ్రమాన్ని దంచి జీడిపప్పు, యాలకుల పొడి, పటిక బెల్లం ముక్కలు కలుపుతారు. ఈ మిశ్రమం లడ్డూ తయారీకి అనువుగా మారిన తర్వాత రెండుగంటలు ఆరబెట్టి చెక్క బల్లపై ఒత్తుతూ తగినంత సైజులో లడ్డూలు చుడతారు. ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. నేతి హల్వా తయారీలో తోక గోధుమలను వినియోగిస్తారు. వాటిని రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు పిండిగా రుబ్బి.. దాని నుంచి పాలు తీస్తారు. దశల వారీగా బెల్లం పాకంలో పోస్తూ కలియ తిప్పతారు. దానిని పొయ్యి నుంచి దించే అరగంట ముందు తగినంత నెయ్యి పోస్తారు. ఆ తర్వాత సరిపడా జీడిపప్పును దట్టించి ప్రత్యేక ట్రేలలో పోసి 24 గంటల పాటు ఆరబెడతారు. ఈ హల్వా రెండు నెలలు నిల్వ ఉంటుంది. దేశ విదేశాలకు ఎగుమతులు బృందావన మిఠాయి వర్తక సంఘం పరిధిలో 50 మందికి పైగా వ్యాపారులు బందరు లడ్డూ, హల్వా విక్రయిస్తున్నారు. వీరి వద్ద వెయ్యి మందికి పైగా పని చేస్తుండగా, వారిలో 200 మందికి పైగా మహిళలు. బందరు బెల్లపు తొక్కుడు లడ్డూ పరిశ్రమకు 2017లో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ విభాగం భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్) ఇచ్చింది. సంఘం తరఫున మల్లయ్య స్వీట్స్‌కు పేటెంట్ హక్కు (పార్ట్–బి) లభించింది. దీంతో ప్రపంచ దేశాలకు బందరు లడ్డూ, హల్వా ఎగుమతులు భారీగా పెరిగాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, లండన్, దుబాయ్, కువైట్, బాగ్దాద్ వంటి దేశాలకు నిత్యం ఎగుమతి అవుతున్నాయి. జీఐ గుర్తింపు రావడం గర్వకారణం మా నాన్న మల్లయ్య తోపుడు బండిపై తిరుగుతూ లడ్డూ అమ్మేవారు. ఆయన వారసులుగా 1993లో మేం ఈ రంగంలోకి అడుగు పెట్టాం. బందరు లడ్డూకు భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించాలన్న పట్టుదలతో సంఘం తరఫున కృషి చేశాం. బందరు వాసి, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎం గోనెల అవిశ్రాంత కృషి ఫలితంగానే బందరు లడ్డూకు జీఐ సర్టిఫికెట్ లభించింది. – గౌరా వెంకటేశ్వరరావు, బందరు లడ్డూల తయారీదారు -
వహ్వా.. హల్వా!
కాకినాడ కాజాకు, బందరు లడ్డూకు.. ఆత్రేయపురం పూతరేకులకు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో మధురమైన ప్రత్యేకత ఉంటుంది. ఈ వరుసలోనే విశాఖ జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే మాడుగుల హల్వా. పేరులోనే కాదు రుచిలో కూడా దీనికి సాటి మరొకటి లేదని చెప్పక తప్పదు. ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో 128ఏళ్ల క్రితం పుట్టిన ఈ హల్వా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. సాక్షి, మాడుగుల: విశాఖ జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన మిఠాయి వ్యాపారి దంగేటి ధర్మారావుకు 1890 ప్రాంతంలో కొత్తరకమైన మిఠాయి తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. అంతే.. బూడిద గుమ్మడి, కొబ్బరి కాయ రసంతో హల్వా తయారుచేశారు. దీని తయారీ ఎలాంటే.. ముందుగా మేలు రకం గోధుమలు 3 రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు తీయాలి. వాటిని ఒక రోజు పులియబెట్టాలి. ఆ తరువాత గోధుమ పాలు, నెయ్యి కలిపి దగ్గరకు మరిగే వరకు కలపాలి. ఆ పాకాన్ని దించి వాటిపై ఫ్లేవర్ కోసం జీడిపప్పు బాదం పప్పు వేయాలి. మాడుగుల హల్వా యవ్వన శక్తి పెంచడంతోపాటు శరీర స్థితిని నిలకడగా ఉంచుతుందని స్థానికుల నమ్మకం. పెరుగుతున్న షాపులు మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. దంగేటి కుటుంబంలో మాత్రమే హల్వా తయారీ జరిగేది. అయితే, తయారీ గుట్టు రట్టవ్వడంతో ప్రస్తుతం వ్యాపారం విస్తరించింది. ఇక్కడ తయారవుతున్న హల్వాను మొబైల్ వ్యాన్ల ద్వారా పార్శిళ్లు, కొరియర్ల ద్వారా ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాలకు పంపిస్తున్నారు. కాగా, ఇటీవల వరకు మేలు రకాన్ని కేజీ రూ.260 వరకు విక్రయించిన తయారీదారులు ముడిసరుకుల ధరలు పెరగడంతో దానిని రూ.400కు పెంచక తప్పలేదు. 1,500 కుటుంబాలకు ఆధారం మాడుగుల కేంద్రంగా తయారయ్యే హల్వా వ్యాపారంపై ప్రత్యక్షంగా పరోక్షంగా 1500 మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ నుండి విశాఖ, అనకాపల్లి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వరకు దళారులు తీసుకెళ్లి విక్రయిస్తారు. విదేశాల్లో ఉంటే స్థానికులు ఇక్కడకు వచ్చి వెళ్ళినపుడల్లా హల్వాను తీసుకెళ్లడం పరిపాటి. ఇలా దేశ విదేశాలకు మాడుగుల హల్వా పరిచయమైంది. అంతేకాక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు జరిగినా ఇది ఉండడం ఆనవాయితీ. ప్రముఖుల మెప్పు పొందిన హల్వా విశాఖ జిల్లా అరుకు షూటింగ్‌లకు వచ్చే సినీ ప్రముఖులు చాలామంది ఈ హల్వా రుచిచూసి వహ్వా అన్నవారే. దివంగిత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారు. అలాగే, ఇందిరాగాంధీ 40 ఏళ్ల కిందట ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హల్వా రుచి చూసిన వారేనని స్థానిక సీనియర్ వ్యాపారులు చెబుతున్నారు. ఇలా దంగేటి ధర్మారావు సృష్టించిన ఈ హల్వాను అతని కుమారుడు కొండలరావు, మనుమడు మూర్తి, ముని మనముడు మోహన్ వరకూ నాలుగు తరతరాలుగా మిఠాయి ప్రియుల మన్ననలు అందుకుంటున్నారు. మాడుగుల హల్వా రుచి అద్భుతం మాడుగుల వచ్చినపుడల్లా అమెరికాకు హల్వా తీసుకెళ్లి స్నేహితులుకు అందజేస్తుంటాను. పుట్టింది మాడుగుల మండలం సత్యవరం గ్రామం. కానీ, ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్నాను. ఫంక్షన్లకు, పండుగలకు కొరియర్ల ద్వారా అమెరికాకు తెప్పించుకుంటున్నాం. – గోకేడ వెంకటేశ్వర సత్యనారాయణ తరాలుగా ఒకటే రుచి తాతల నాటి క్వాలిటీని నేటికీ కొనసాగిస్తున్నాం. ఆవు నెయ్యి, గోధుమలకు, కూలీలకు ధరలు పెరిగినా పెద్దగా లాభాలు ఆశించకుండా సామాన్యులుకు అందుబాటులో «ధరలో ఉంచుతున్నాం. మా హల్వా రుచికరంగా ఉండడానికి ఇక్కడి నీరే కారణం. – దంగేటి మోహన్, హల్వా వ్యాపారి, మాడుగుల -
సారెలో బందరు లడ్డు ఉండాల్సిందే...
బందరు కోనేరు సెంటర్... ఈ పేరు చెప్పగానే ఎంతటివారికైనా నోరూరాల్సిందే...షుగర్ పేషెంట్లను కూడా ఆ వాసన విడిచిపెట్టదు...ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఆ రుచి చూసేద్దాంలే అనుకుంటారు...అదే బందరు లడ్డు సెంటరు.. ఒక స్వీటు ఆ ఊరి పేరుతో ప్రసిద్ధి కావడం విశేషమే కదా... బందరు లడ్డుగా ప్రసిద్ధి చెందిన ఆ లడ్డు అసలు పేరు తొక్కుడు లడ్డు. ఈ లడ్డూని శనగ పిండితో తయారు చేస్తారు. దీని తయారీకి చాలాసేపే పడుతుంది. తయారుచేసి నోట్లో వేసుకున్నాక శ్రమ అంతా మర్చిపోవలసిందే. అక్కడి తాతారావు స్వీట్ దుకాణంలో బందరు లడ్డు కొనడానికి జనం ఎగబడతారు. దుకాణానికి ముందు వైపు మోడరన్ గ్లాసుతో డిజైన్ చేసి ఉంటుంది. లోపల ఇంటీరియర్ చాలా విలక్షణంగా ఉంటుంది. ఎడమ పక్కన గోడ మీద డజన్ల కొద్దీ సర్విసెట్టి సత్యనారాయణ తాతారావు చిత్తరువులు ఉంటాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జగ్జీవన్‌రామ్... వంటి పెద్దలంతా ఆయన దుకాణంలోని బందరు లడ్డూ అభిమానులు. వారు నిత్య కస్టమర్లు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి బందరు లడ్డు మీద ఎనలేని ప్రేమ. ‘‘ఈ దుకాణాన్ని మా మామగారు 1951లో ప్రారంభించారు’’ అని చెప్పే తాతారావు బందరు లడ్డూ దుకాణాలను విస్తృత పరిచారు. విచిత్రమేమంటే ఈ లడ్డు తయారీ విధానాన్ని ఇక్కడకు తీసుకువచ్చినవారు ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినవారు. వాళ్లని సింఘ్స్ లేదా బొందిలీలు అంటారు. బందరులో స్థానికంగా ఉండేవారు వీరి దగ్గర తయారీ విధానం తెలుసుకున్నారు. వలస వచ్చిన ఉత్తర భారతీయులు ఈ లడ్డు తయారీని క్రమేపీ విడిచిపెట్టేశారు. స్థానికంగా ఉన్న బందరు వాస్తవ్యులు మాత్రం దీన్ని అందిపుచ్చుకున్నారు. ‘‘మా దగ్గర తయారయ్యే లడ్డూలు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్తున్నాయి. ఎక్కడ తెలుగు వారు ఉంటే అక్కడకు మా లడ్డూలు ప్రయాణిస్తాయి. బందరు లడ్డు తయారీ సామాన్యం కాదు. చాలా శ్రమతో కూడిన పని. అసలు సిసలైన ఘుమఘుమలాడే మధురమైన రుచి రావడానికి కనీసం ఆరేడు గంటల సమయం పడుతుంది’’ అంటూ వివరిస్తారు. మామూలు రుచి రావడానికి ఎక్కువ సమయం అవసరం లేదనే విషయాన్ని పరోక్షంగా చెబుతారు తాతారావు. తయారీ విధానంలో ఎటువంటి మార్పూ తీసుకు రాకపోవడమే తన విజయ రహస్యం అంటారు తాతారావు. ఏ విధంగా తయారుచేస్తారో చూడాలనుకునేవారిని ఆప్యాయంగా వంటగదిలోకి తీసుకువెళ్లి, అన్నీ వివరిస్తూ చూపుతారు. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు లేకుండా అయినా పెళ్లి అవుతుందేమోకాని, బందరు లడ్డు లేకుండా ఇక్కడ ఏ శుభకార్యమూ జరగదు అని చెబుతారు అక్కడి పనివారు. పెళ్లికి చిలకలపూడి వెళ్లాల్సిందే... బంగారం కొనాలంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి... మరి పెళ్లిళ్లకీ, పేరంటాలకీ నగలు లేకుండా వెళ్లడం ఎలా... మధ్యతరగతి వారికి నిరంతరం ఈ సమస్య వెంటాడుతూ ఉంటుంది...ఆ సమస్య నుంచి పుట్టినదే చిలకలపూడి బంగారం... బంగారుపూతతో తయారైన నగలకు చిలకలపూడి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సుమారు 200 వరకు యూనిట్లు ఉన్నాయి. 30,000 మంది దాకా ఇందులో పనిచేస్తున్నారు. ఇక్కడ బంగారుపూతతో తయారయ్యే నగలను చిలకలపూడి బంగారు నగలు అంటారు. ఇక్కడ గాజులు, గొలుసులు, నెక్లెస్‌లు, చెవి రింగులు, జుంకీలు, డ్యాన్స్ నగలు, అన్ని రకాల రాళ్లతో తయారయిన నగలు విస్తృతంగా అమ్ముతారు. కృష్ణాజిల్లా కేంద్రం బందరు కూడా రోల్డ్‌గోల్డ్ నగలకు పేరుపొందిన పట్టణమే. బందరులో అనేక చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. రోల్డ్ గోల్డ్ నగలు ఇక్కడ విస్తృతంగా తయారుచేస్తారు. 125 సంవత్సరాల క్రితం అప్పలాచారి అనే ఒక స్వర్ణకారుడు, బందరు నుంచి చిలకలపూడికి వలస వెళ్లి అక్కడ మొట్టమొదటగా బంగారుపూతతో నగలు తయారుచేయడం ప్రారంభించారు. బంగారు నగలు కొనే స్థోమత లేనివారి కోసం ఈ నగలు తయారుచేయడం ప్రారంభించారు. 1800 ప్రాంతంలో వ్యాపారం ప్రారంభించిన మొదట్లో వెండి మీద బంగారు పూత పూసిన నగ లు అమ్మేవారు. వాటిని ‘కట్టు నగలు’ అని పిలిచేవారు. ఆ తరువాత రాగి మీద బంగారుపూత పూసి తయారుచేసేవారు. 1940 ప్రాంతంలో తోట వెంకట సుబ్బయ్య ‘ఉమ గిల్ట్’ నగల తయారీ ప్రారంభించి దేశవ్యాప్తం చేశారు. ఆ నగలకు ‘ఉమా గోల్డ్ నగలు’ అనే గుర్తింపు తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా ఉమా నగల దుకాణాలు వెలిశాయి. ఈ ఇమిటేషన్ బంగారు నగల వ్యాపారం రూ. 500 కోట్ల టర్నోవర్ దాటింది. కానీ ప్రస్తుతం ఇవి వన్నె తగ్గుతున్నాయి. తమిళనాడు, గుజరాత్ల నుంచి ముడిసరుకు తెచ్చుకోవలసి రావడంతో లాభాలు తగ్గుతున్నాయి. ఇవే కాకుండా వీటి వన్నె తగ్గడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రపంచంలోనే మొట్టమొదటి ఇమిటేషన్ బంగారాన్ని కనిపెట్టిన ఘనత బందరుది, చిలకలపూడిది. డా.వైజయంతి వేదవ్యాసుడు రచించిన ‘స్కాందపురాణం’లోని ఆరు సంహితలలో మొదటిది సనత్కుమార సంహిత. ఇందులో మొదటి ఖండం... సహ్యాద్రి ఖండం. దీనిలో కృష్ణా నది మహాత్మ్యాన్ని అద్భుతంగా వివరించారు.