Sankranti 2023 Special: Tasty And Traditional Sweet Recipes In Telugu - Sakshi
Sakshi News home page

Sankranti- Recipes: అరిశెలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి! ఇక పూతరేకులు..

Published Fri, Jan 6 2023 1:04 PM | Last Updated on Fri, Jan 6 2023 3:36 PM

Sankranti 2023 Special Tasty Traditional Recipes In Telugu - Sakshi

సంక్రాంతి దగ్గరకు వస్తోంది... పిల్లలకు పరీక్షలు వచ్చేశాయి. ఆ తర్వాత సెలవులు వస్తాయి. పండక్కి కొత్త దుస్తులు వస్తాయి. ఇంటికి రుచుల దినుసులు వస్తాయి.  వంటింట్లో రుచులు మొలకెత్తుతాయి. ఈ రుచులకు ఇప్పుడే బాణలి పెట్టండి. పండగ వరకు తాజాగా ఉంటాయి.

అరిశెలు 
కావలసినవి:
►బియ్యం – ఒకటింపావు కిలో
►బెల్లం – కిలో
►నువ్వులు– టేబుల్‌ స్పూన్‌
►గసగసాలు– టేబుల్‌ స్పూన్‌
►నెయ్యి లేదా నూనె – ముప్పావు కేజీ. 

తయారీ:
►బియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి.
►సన్నని రంధ్రాలున్న జల్లెడతో జల్లించి ఒక పాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి.
►బెల్లాన్ని పొడి చేయాలి.
►పెద్దపాత్రలో ఒక గ్లాసు నీరు, బెల్లం పొడిని వేసి పాకం వచ్చేదాకా మరగనిచ్చి బియ్యప్పిండి వేసి కలుపుకోవాలి.

►బాణలిలో నెయ్యి వేడి చేయాలి.
►పాకంపిండిని పెద్ద నిమ్మకాయంత తీసుకుని గసగసాలు, నువ్వులలో అద్ది పాలిథిన్‌ పేపర్‌ మీద పలుచగా తట్టి బాణలిలో వేయాలి.
►రెండువైపులా దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నెయ్యి కారిపోయేటట్లు వత్తాలి.
►అరిశెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్క గరిటెలు కూడా వాడవచ్చు.
►వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే వత్తి అదనపు నేతిని బాణలిలోకి జారేటట్లు వత్తవచ్చు.

గమనిక:
►అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి.
►గట్టిగా ఎక్కువ తీపితో కావాలనుకుంటే పాకాన్ని కాస్త ముదరనివ్వాలి.
►ఒక ప్లేటులో నీళ్లు  పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూనుతో కొద్దిగా తీసుకుని నీటిలో వేయాలి.
►దీనిని చేత్తో నొక్కి రౌండ్‌ చేయాలి. జారి పోకుండా రౌండ్‌ వచ్చిందంటే పాకం వస్తున్నట్లు.

►ఆ రౌండ్‌ను పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు.
►ముదురు పాకం కావాలనుకుంటే ఆ రౌండ్‌ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చే దాకా పాకం పట్టుకోవాలి.
►అరిశెలు పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి.
►తినే ముందు పెనం మీద వేడి చేస్తే అప్పుడు చేసిన అరిశెలాగా వేడిగా, మెత్తగా మారుతాయి. 

పూతరేకులు
కావలసినవి:
►చక్కెర – కేజీ
►సగ్గుబియ్య– ముప్పావు కేజీ
►జీడిపప్పు– పావుకేజీ
►ఏలకులు– 50గ్రా
►నెయ్యి– 100 గ్రా.

తయారీ:
►పూత రేకుల కోసం రేకులను తయారు చేసుకోవడం కొంచెం కష్టమే. ఇందుకు ప్రత్యేకమైన కుండ కావాలి. ∙
►సగ్గుబియ్యాన్ని చిక్కటి గంజి చేసుకోవాలి.
►ఒక గట్టి కాటన్‌ క్లాత్‌ను నలుచదరంగా కట్‌ చేయాలి.
►కుండను మంట మీద బోర్లించి వేడెక్కిన తరువాత క్లాత్‌ను సగ్గుబియ్యం గంజిలో ముంచి వేడెక్కిన కుండ మీద పరచాలి.

►గంజి కుండకు అంటుకుని వేడికి పలుచని  పొరలాగా వస్తుంది.
►ఆ పొర విరిగిపోకుండా అట్లకాడతో జాగ్రత్తగా తీయాలి.
►ఎన్ని రేకులు కావాలంటే అన్నింటికీ ఇదే పద్ధతి.
►రేకు ఏ సైజులో కావాలంటే క్లాత్‌ను ఆ సైజులో కట్‌ చేసుకోవాలి.

►చక్కెర, జీడిపప్పు, ఏలకులను పొడి చేసి కలుపుకోవాలి.
►ఇప్పుడు రెండు ఒక రేకు తీసుకుని నెయ్యిరాసి చక్కెర, జీడిపప్పు మిశ్రమాన్ని పలుచగా చల్లి పైన మరొక రేకు వేసి మడత వేయాలి.
►తెల్లగా నోరూరించే పూతరేకు రెడీ.
►ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి.
►ఎక్కువ మోతాదులో రేకులను తయారు చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కెర మిశ్రమాన్ని వేసి పూతరేకులను చేసుకోవచ్చు.
►అలాగే చక్కెర బదులు బెల్లం పొడి, ఖర్జూరాల పొడితో కూడా పూతరేకులు చేసుకోవచ్చు.
►జీడిపప్పుతో పాటు బాదం పలుకులు కూడా వాడవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement