ఆకు పెడుతున్న అన్నం | Palm Leaf Cottage Industry In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆకు పెడుతున్న అన్నం

Published Mon, Sep 21 2020 7:09 AM | Last Updated on Mon, Sep 21 2020 7:11 AM

Palm Leaf Cottage Industry In Andhra Pradesh - Sakshi

‘తాటి చెట్టు తల్లి కాదు’ అని సామెత. కానీ తల్లిలానే ఇల్లు నిలబెట్టడానికి తాటి చెట్టు ఇవ్వనిది ఏముంది? కప్పుకు ఆకు.. వంటకు కలపతో సహా. ఉత్తరాంధ్రలో ఆగస్టు నుంచి వ్యవసాయపనులు పెద్దగా ఉండవు. కాని తాటి ఆకుల సేకరణ, గ్రేడింగ్,  బొమ్మల తయారీ పని కల్పిస్తోంది.  అన్నమూ పెడుతోంది. ఆరునెలల పాటు దొరికే ఈ పనిని అక్కడి స్త్రీలు ఆడుతూ పాడుతూ చేసేస్తున్నారు.

తాటాకులకు నీడనిచ్చే లక్షణం ఉంది. అవి ఉత్తరాంధ్రలో చాలామందికి బతుకు నీడను కూడా ఇస్తున్నాయి కళాకృతుల కోసం తాటాకు సేకరణ ఈ సీజన్‌లో అక్కడ ప్రధాన ఉపాధి. అందుకే నాగమణి, రత్నం వంటి మహిళలు ‘ఆడుతూ పాడుతూ రోజుకు నూటేభై రెండొందల రూపాయలు సంపాదించుకుంటున్నాం. ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. ఆర్నెల్లపాటు ఈ పని ఉంటుంది.

నీడ పట్టున ఉంటూ కుటుంబాలను పోషించేందుకు అవసరమైన సంపాదన ఇది’ అంటారు. వీరిది విశాఖ జిల్లా చినదొడ్డిగల్లు. వీరనే ఏముంది విశాఖజిల్లాలోని నక్కపల్లి, వేపాడు, ఎస్‌.రాయవరం, చినగుమ్ములూరు, ఎలమంచిలి, చోడవరంలాంటి అనేకచోట్ల తాటాకుల సేకరణ, కళాకృతుల కోసం వాటి గ్రేడింగు, కత్తిరింపు చాలామందికి భృతిని కల్పిస్తున్నాయి.

కుటీర పరిశ్రమ
తాటాకు సేకరణ  విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో కుటీర పరిశ్రమగా మారింది. వందలాది మంది తాటాకు కళాకృతుల కోసం అవసరమయ్యే ముడిసరుకు తయారీలో పనిచేస్తున్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే సుమారు 600 మంది వరకు కూలీలు ఉపాధి పొందుతున్నారు. వీరిలో మహిళలే ఎక్కువ. తాటాకు బొమ్మలు వివిధ దశల్లో తయారవుతాయి. అంతిమరూపు కోల్‌కతాలో తీసుకుంటాయి.

ప్రాథమిక సేకరణ, గ్రేడింగు, కత్తిరింపు ఉత్తరాంధ్రలో జరుగుతోంది. ఇందుకోసం సేకరణ కేంద్రాలు ఉంటాయి. విశాఖలో నక్కపల్లి, నర్సీపట్నం, కోటవురట్ల, నాతవరం, ఎస్‌.రాయవరం, రాంబిల్లి అచ్చుతాపురం తదితర గ్రామాల్లో తాటిచెట్ల నుంచి ఆకు సేకరిస్తారు. ఇలా సేకరించిన ఆకును చినదొడ్డిగల్లు, గుమ్ములూరులలో ఉన్న సేకరణ కేంద్రాల వద్దకు తెస్తారు. ఇతర కులాల వారు కూడా తాటాకులను సేకరిస్తారు. ఇలా సేకరించిన 100 ఆకులను రూ.400లకు కొనుగోలు చేస్తారు.  

గ్రేడింగ్‌
సేకరించి అమ్ముకునేవారి పని అక్కడితో అయిపోయినట్టే. తర్వాత ఈ ఆకులను ఎండబెడతారు. రద్దు ఆకులను తీసి బాగా ఉన్న ఆకులను వేరు చేయడం కోసం ప్రత్యేకంగా కూలీలను నియమిస్తారు. వీరికి రోజుకు రూ.200 చెల్లిస్తారు. ఈ గ్రేడింగ్‌ తెలిసిన పనివాళ్లు అయిదొందల మంది వరకూ ఉన్నారు. వీరు సేకరించిన ఆకును ఎండటం కోసం మడదొక్కుతారు. వారు గ్రేడులుగా విభజిస్తారు. తర్వాత కత్తిరించేవారు రంగంలోకి దిగుతారు. వీరు తాటాకులను నునుపుగా చేసి కళాకృతులు తయారు చేసేందుకు గాను ఎనిమిది అంగుళాల సైజులో కత్తిరిస్తారు. ఇలా కత్తిరించి తయారు చేసే ఆకు ఒక్కంటికి 20 పైసల  చొప్పున పొందుతారు.

వీరు రోజుకు ఐదొందల నుంచి ఏడొందల వరకు సంపాదిస్తారు. ఇలా సైజు చేసిన ఆకులను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తరలిస్తారు. అక్కడ వాటికి మరిన్ని మెరుగులు దిద్ది కలకత్తా తరలిస్తారు. కలకత్తాలో   ఈ తాటాకులతో కళాకృతులు తయారు చేసి విక్రయిస్తారు. ఇళ్లల్లోను, షోకేసుల్లోను, కార్యాలయాలు, షాపులు, మ్యూజియంలు తదితర చోట్ల వీటిని ఉపయోగించుకునే విధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. రకరకాలుగా, విభిన్న రూపాల్లో చిన్నపాటి సైజుల్లో ఉండే బొమ్మలను తయారు చేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు.  

రంగుల తాటాకులు
విశాఖ జిల్లా  చినగుమ్ములూరులో తాటాకులతో తయారు చేసే కళాకృతులకు ముడి సరుకు సరఫరా చేసే కుటీర పరిశ్రమలు దాదాపు 10 వరకు ఉన్నాయి. ఇక్కడ శుద్ధి చేసిన ఆకును కోల్‌కత్తా, చెన్నై, టూటికారన్‌ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ కుటీర పరిశ్రమల్లో సుమారు వందమందికి పైగా మహిళలు పని చేస్తుంటారు. ఆకులను ఎండబెట్టి గ్రేడులుగా విభజించి ప్యాకింగ్‌ చేసే పని మొత్తం ఆడవాళ్లే చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసినందుకు రోజుకు రూ.200లు కూలి వస్తుంది. గ్రేడులుగా విభజించిన తాటాకులకు రంగులు ఇక్కడే వేస్తారు.

పింక్, ఎరుపు, ఆరెంజ్, గ్రీన్, వయోలెట్, ఎల్లో వంటి రంగులు వేసి  ఎగుమతి చేస్తారు. 25 కిలోల రంగు 1.30 లక్షల బొమ్మలకు సరిపోతుందని చెప్పారు. ఇలా రంగులు వేసిన బొమ్మలు (ముడిసరుకును) వారు నెలకు 6 లక్షల పీసులు ఎగుమతి చేస్తారు. బీసీ కార్పోరేషన్‌ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తే వ్యాపారాన్ని  అభివృద్ధి చేసుకుంటామని చెబుతున్నారు.

ఆరు మాసాలు పని
ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ పనులు పూర్తయి ఖాళీగా ఉన్నవారంతా తాటాకు సేకరణ, ఆకులు గ్రేడింగ్‌ చేయడం, రద్దు వేరుచేయడం వంటి పనులకు వెళ్తుంటారు. వర్షాకాలంలోనే తాటాకు ఎక్కువగా లభిస్తుందని, వేసవి కాలంలో అయితే ఎండలకు ఆకు రాలిపోవడం కాక వేసవి ధాటికి చెట్లు, పుట్లంట వెళ్లి తాటాకు సేకరణ కష్టమవుతుందని సేకరణ కూలీలు చెబుతున్నారు. అంటే వర్షాకాలం లో ఎటువంటి కష్టం లేకుండా ఒకచోట కూర్చొని చేతినిండా దొరికే పనికోసం గిట్టుబాటు అయ్యే వేతనం కోసం స్థానికంగా ఉండే కూలీలు ఆసక్తి చూపుతుంటారు.
– ఆచంట రామకృష్ణ,  సాక్షి ప్రతినిధి, నక్కపల్లి, విశాఖ జిల్లా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement