అర్ధరాత్రి గన్‌లతో బెదిరించి కారులో తీసుకెళ్లిన దుండగులు
కుటుంబాన్ని రక్షించిన పోలీసులు
రామకుప్పం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో గురువారం అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ నేత గోవిందప్ప కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కిడ్నాపర్ల నుంచి వారిని పోలీసులు రక్షించారు. ఆ సమయంలో కిడ్నాపర్లు పరారయ్యారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని పెద్దకురబలపల్లిలోని వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబాన్ని గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
మూడు లగ్జరీ కార్లలో వచ్చిన ఆగంతకులు గన్‌లతో బెదిరించి గోవిందప్ప కుటుంబసభ్యుల్ని కారుల్లో ఎక్కించుకున్నారు. గోవిందప్ప, గంగమ్మ, మాధవమ్మ, సుబ్బక్క, సిద్ధప్ప, సోమశేఖర్, పునీత్‌లను కారుల్లో ఎక్కించుకుని రామకుప్పం వైపు బయలుదేరారు. తాము ఆదాయపన్ను అధికారులమని, మీ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదు అందిందని గోవిందప్పకు చెప్పారు. మీవద్ద దాచిన నగదు ఇస్తే పంచుకుని వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారు.
విజలాపురం సమీపంలో గోవిందప్ప తమ్ముడు జయరఘురాం కోసం వాకబు చేశారు. తన తమ్ముడు ఇంటివద్దే ఉన్నట్లు గోవిందప్ప చెప్పడంతో మళ్లీ పెద్దకురబలపల్లి వెళ్లారు. అక్కడ జయరఘురాం లేకపోవడంతో కార్లను రామకుప్పం వైపు తీసుకెళ్లారు. రామకుప్పంలోని వైఎస్సార్ సర్కిల్‌లో బీట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లను గమనించిన ఆగంతకులు కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాలని బాధితులను బెదిరించారు. ముందు రెండు కార్లను ఆపిన పోలీసులకు బాధితులు ఆవిధంగానే చెప్పారు.
అయినా అనుమానించిన పోలీసులు అందరినీ కిందికి దించి ప్రశ్నించసాగారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్లలోని కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ సమయంలో వెనుక ఉన్న మూడోకారు వేగంగా ముందుకెళ్లిపోయింది. ఆ కారులో ఉన్న బాధితులు ఇద్దరిని రెండు కిలోమీటర్ల తరువాత కిడ్నాపర్లు వదిలేసి వెళ్లిపోయారు.
చేతులు మారిన నగదే కారణమా?
ప్రశాంతంగా ఉన్న రామకుప్పం మండలంలో కిడ్నాప్ అంశం ప్రజల్లో తీవ్రచర్చకు దారితీసింది. రైస్‌పుల్లింగ్ పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారాయని అందులో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగిందన్న చర్చలు సాగుతున్నాయి. దుండగులు కర్ణాటకకు చెందిన వారని తెలిసింది. పోలీసులు మాట్లాడుతుండగానే దుండగులు పరారవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంతటివారైనా వదిలిపెట్టం: కుప్పం సీఐ
మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబం కిడ్నాప్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగా గోవిందప్ప తమ్ముడు జయరఘురాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. నగదు లావాదేవీలు, నగదు మార్పిడి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment