ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, పోలీసులు ఎంత ఘోరంగా పని చేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదేమో! మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై పెట్టిన దుర్మార్గపు కేసు ఒక ఉదాహరణైతే, ప్రముఖ సినీ దర్శకుడు వర్మకు సంబంధించి పోలీసులు ప్రవర్తించిన తీరు మరొకటి. ఇంకోపక్క తెలుగుదేశం సోషల్ మీడియా సీనియర్ ఐఎఎస్ అధికారులను కూడా వదలకుండా ఇష్టారీతిలో బురదవేసి అవమానిస్తున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు.
చిత్తూరు జిల్లాలో ఎర్రావారిపాలెం అనే గ్రామం వద్ద ఒక బాలిక పై అఘాయిత్యం జరిగింది.ఆ బాలిక తండ్రి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెవిరెడ్డికి వివరిస్తే, ఆయన ఆ కుటుంబానికి సాయపడడానికి ఆ గ్రామానికి వెళ్లారు.ఆ క్రమంలో ఆ బాలిక తండ్రి రమణను పరామర్శించి బాలికకు ధైర్యం చెప్పారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదంతం ఏలికలకు కోపం తెప్పించింది. ఎలాగైనా చెవిరెడ్డిపై కేసు పెట్టాలని పోలీసులు భావించినట్లు ఉన్నారు. ఇలాంటి కేసులలో బాలికల ఐడెంటిటిని ఎవరూ బయటపెట్టకూడదు. చెవిరెడ్డి కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో కాని ఘటన జరిగిన కొద్ది రోజులకు చెవిరెడ్డిపై పోక్సో కేసుతోపాటు మరికొన్ని పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆశ్చర్యపోవడం లాయర్ కూడా అయిన చెవిరెడ్డి వంతైంది. బాలిక తండ్రిని బెదిరించి ఫిర్యాదు తీసుకున్నారా అన్న అనుమానం అప్పట్లో వచ్చింది.
చెవిరెడ్డి ఈ కేసును ఎదుర్కోవడానికి సిద్ధపడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత తండ్రి మీడియా సమావేశం పెట్టి తానసలు చెవిరెడ్డిపై కేసు పెట్టలేదని, తమకు సాయపడడానికి వచ్చిన వారిపై కేసు ఎలా పెడతామని ప్రశ్నించారు. పోలీసులు కేసును తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డిని పిలిచామని ఆయన చెప్పారు. తాను చదువుకోలేదని, పోలీసులు సంతకం చేయమంటే చేశానని ,దానిని వాడుకుని చెవిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆయన స్పష్టం చేశారు. దీనిపై పోలీసులు స్పందించలేకపోయారు. ఇది కేవలం చిత్తూరు పోలీసులకే కాదు..రాష్ట్ర పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట తెచ్చిందని చెప్పాలి. రాష్ట్రంలో వైసిపివారిపై జరుగుతున్న దాడులు, హింసాకాండకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చినా పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఇష్టారీతిన కేసులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా, అసభ్య పోస్టులు ప్రచారం చేసినా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు. వీటికి తోడు ఇప్పుడు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న తీరు ఎపిలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఖూనీ అవుతుందో చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు అక్కడకు వెళ్లారు. బాధిత కుటుంబం పిలవకపోయినా ఆయన వెళ్లారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఆనాడు ఎంత వారించినా వినలేదు.
చంద్రబాబు వెళ్లి పరామర్శ చేస్తే రైటు, చెవిరెడ్డి వెళితే తప్పా అన్నదానికి బదులు దొరకదు. అప్పట్లో చంద్రబాబు పై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కేసు పెట్టలేదు. మహిళా కమిషన్ చంద్రబాబుకు నోటీసు పంపించినా, ఆయన పట్టించుకోలేదు. చెవిరెడ్డి విషయంలో మాత్రం తప్పుడు ఫిర్యాదు తీసుకుని మరీ దారుణమైన చట్టాన్ని ప్రయోగించారు. పోక్సో కేసు అంటే మైనర్లపై అత్యాచారం వంటి నేరాలకు పాల్పడ్డ వారి మీద పెట్టే కేసు అన్నమాట. చెవిరెడ్డిపై అలాంటి కేసు పెట్టడం పోలీసులు ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెబుతోంది. ప్రమఖ దర్శకుడు వర్మపై టీడీపీ వారితో సోషల్ మీడియా కేసులు పెట్టించి, ఆయనను అరెస్టు చేయడానికి జరిగిన ప్రయత్నాలు శోచనీయం. ఆయన ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు కూడా సంధించారు. తాను ఎప్పుడో పెట్టిన పోస్టింగ్‌లకు తాను ఎవరిపైన కార్టూన్లు పోస్టు చేశానో వారికి కాకుండా ఇంతకాలం తర్వాత ఎవరివో మనో భావాలు దెబ్బతినడం ఏమిటని ఆయన అడిగారు. తొమ్మిది మందికి ఏడాది తర్వాత ఒకేసారి మనోభావాలు దెబ్బ తిన్నాయా అని అన్నారు. తాను పారిపోయినట్లు ఎల్లో మీడియా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని, తన ఆఫీస్‌లోకి పోలీసులు రాకుండానే వెళ్లిపోయారని ఆయన చెప్పారు. ఇలాంటి పోస్టింగులు లక్షల కొద్ది వస్తున్నాయని, వాటి సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. చట్టంలో దీనికి సంబంధించి ఉన్న అంశాలకు, తనపై పెట్టిన సెక్షన‍్లలకు లింకు కనిపించడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏ ఏ సందర్భాలలో సోషల్ మీడియా కేసులు పెట్టవచ్చో కూడా వివరించారు.
ఆయన వేసిన ప్రశ్నలకు పోలీసుల నుంచి జవాబు వచ్చినట్లు లేదు. నిజానికి వర్మ తరహాలో అనేక మంది పోస్టులు పెడుతుంటారు. ఆ మాటకు వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఈనాడు వంటి ఎల్లో మీడియా ఎంత నీచమైన కార్టూన్లు వేసిందో గుర్తు చేసుకుంటేనే భయానకంగా ఉంటుందని, వాటిపై ఎన్నడూ కేసులు పెట్టకపోవడం తప్పు అయినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు ఎన్.టి.రామారావుకు దుస్తులు లేకుండా వేసిన కార్టూన్లను వారు ప్రస్తావిస్తున్నారు. ఎవరైనా బూతులు పెడితే చర్య తీసుకోవచ్చు. అలాగే కుల, మతాల మధ్య విద్వేషాలు నింపేలా వ్యవహరిస్తే కేసు పెట్టవచ్చు. విచిత్రం ఏమిటంటే రోజుల తరబడి ఎల్లో మీడియా టివి ఛానళ్లలో కూర్చుని కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తిపై అప్పటి ప్రభుత్వం కేసు పెడితే దానిని వేరే విధంగా డైవర్ట్ చేశారు. పైగా ఆయనకు మంచి పదవిని కూడా చంద్రబాబు ఇచ్చారు.
తాజాగా ఐటీడీపీకి చెందిన విజయ్ సీనియర్ ఐఎఎస్ అధికారి కృష్ణబాబుపై పెట్టిన పోస్టింగ్ మాటేమిటి? కృష్ణబాబుకు ఏ ప్రభుత్వం ఉన్నా మంచి పేరు ఉంది.ఇప్పటికి ప్రధాన శాఖలలోనే పని చేస్తున్నారు. కానీ ఆయనపై నిందలు మోపుతూ, వైసీపీ కోసమే పనిచేస్తున్నారని, పులివెందులకు చెందిన ఒక కంపెనీకి బిల్లులు చెల్లించారని ఆరోపిస్తూ పోస్టు పెట్టారు. దీనిపై కృష్ణబాబు ఆవేదన చెందిన ముఖ్యమంత్రికి పిర్యాదు చేశారట. అసలు తాను కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవరికి బిల్లులు చెల్లించ లేదని ఆయన చెబుతున్నారు.
అయినా చట్టప్రకారం బిల్లులు ఒక అధికారి చెల్లిస్తే అది ఎలా తప్పు అవుతుంది? విజయ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు. అయ్యన్న కూడా విపక్షంలో ఉండగా, ఆ తర్వాత కూడా కొందరు అధికారులను తూలనాడుతూ మాట్లాడిన వీడియోలు వచ్చాయి. ఆయన మహిళ అధికారులను కూడా దూషించినట్లు వార్తలు వచ్చాయి. మరో వైపు వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలు కొందరిపై అనేక కేసులు పెట్టి ఊరూరా తిప్పుతూ దారుణంగా వేధిస్తున్నారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదలివేసిన చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత ఇదే అనుకోవాలి.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment