మరకే మంచిదంటున్న చంద్రబాబు! | KSR Comment On Chandrababu Support Wrong Leaders | Sakshi
Sakshi News home page

మరకే మంచిదంటున్న చంద్రబాబు!

Published Tue, Sep 10 2024 4:12 PM | Last Updated on Tue, Sep 10 2024 4:58 PM

KSR Comment On Chandrababu Support Wrong Leaders

కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మంత్రుల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటోందని, తాను ఇటుక,ఇటుక పేర్చి ప్రభుత్వ పరువు పెంచుతుంటే.. వీరు బుల్ డోజర్ పెట్టి కూల్చుతున్నారని కూడా పేర్కొన్నారు. నిజంగా కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల వల్లే పరువు పోతోందా? లేదా? అన్నది పక్కన బెడితే..  ప్రస్తుత పరిస్థితి గమనిస్తే టీడీపీ దండులో ఒకరిద్దరేమైనా అరాచకాలకు పాల్పడకుండా ఉంటున్నారేమో అనే భావన కలిగేలా పరిస్థితి ఏర్పడినట్లుగా ఉంది.

ఏపీలో టీడీపీ, బీజేపీ,జనసేన కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన హింసాకాండ, విధ్వంసం ఇంతా అంతా కాదు. ఇసుక దోపిడీ వంటి దందాలకు అడ్డు ఆపూ లేకుండా పోయింది. కొన్నిసార్లు తెలుగుదేశం మీడియా అయిన  ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఎంతో కొంత అలాంటి వార్తలను కవర్ చేయక తప్పడం లేదు. కాకపోతే టీడీపీ మరీ డామేజ్ కాకుండా కాపాడేలా కథనాలు ఇస్తుంటారు.  అది వేరే కథ.

ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతోంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ మహిళా నేత మానభంగం ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం అయింది. సంబంధిత వీడియోలు కూడా వెలుగుచూడడంతో పార్టీ పరువు గంగలో కలిసినట్లయింది. ఆయన గతంలో వైఎస్సార్‌సీపీలో ఉన్నాడంటూ ఎదురు ఆరోపణ చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత.. చట్టపరంగా చర్యతీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం చూపలేదు. కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఉత్త ప్రకటన ఒకటి చేశారు. ఆ తర్వాత ఒత్తిడికి గురై కేసు పెట్టారు.

అదే వేరే పార్టీ వ్యక్తి అయి ఉంటే ఎంత హడావుడిగా అరెస్టు చేసి ఉండేవారో. ఇంత ఘోరమైన మానభంగం ఆరోపణ వచ్చినా అరెస్టు చేయకపోవడం వల్ల కేవలం ఎమ్మెల్యేకే చెడ్డపేరు వచ్చిందా ?లేక కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చిందా అనేది కూడా ఆలోచించుకోవాలి. గతంలో వైఎస్సార్‌సీపీలో ఉన్న ఆదిమూలం అంతకు ముందు టీడీపీలోనే పదవులు నిర్వహించారు మరి. అలాంటి వ్యక్తిని తిరిగి టీడీపీలోకి ఎందుకు చేర్చుకున్నట్లు?. ఆ విషయాన్ని కప్పిపుచ్చి టీడీపీ నేతలు..  దిక్కుమాలిన ప్రచారం చేస్తుంటారు. ఇక్కడ ఏ పార్టీలో ఎప్పుడు ఉన్నారన్నది కాదు. తప్పు చేశాడా?లేదా? అనేది ముఖ్యం.

ఎప్పుడో టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారంటూ వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేసి వచ్చిన పోలీసులు.. లైంగిక దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు.  

ఇక.. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తన దౌర్జన్యాలను ఆపడం లేదు. కొంతకాలం క్రితం వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ లీడర్‌కు చెందిన భవనాన్ని స్వయంగా బుల్ డోజర్ తీసుకువెళ్లి కూల్చేశారు.అది తప్పే అని టీడీపీ మీడియానే అప్పట్లో వార్తలు రాసింది. ఇప్పుడు కొందరు మహిళలను ఉద్దేశించి ఆయన బూతులు తిట్టారట. వారేదో సమస్యపై వస్తే దానిని చేయగలిగితే చేయాలి. లేదా కుదరదని చెప్పాలి. అలాకాకుండా ఫలానా గ్రామం నుంచి వచ్చారా? అని ప్రశ్నించి మరీ బూతులు తిట్టారని ఆ మహిళలు వాపోయారు. ఇది ఇక్కడితో ఆగలేదు. పోలీస్ ఎస్.ఐ.ని పిలిచి వారందరిని అరెస్టు చేయాలని ఆదేశించారట. విధేయుడైన ఆ పోలీసు అధికారి వారందరిని స్టేషన్ కు తరలించారట. ఇలా ఉంది ఏపీలో ప్రజాస్వామ్యపాలన.

ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరిస్తే టీడీపీ కార్యకర్తలు ఇంకెంతగా పెట్రోగిపోతుంటారో ఊహించుకోవచ్చు. తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి.. పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ తో దురుసుగా వ్యవహరించి క్షమాపణ చెప్పించడం కలకలం రేపింది. ఆయన తండ్రి,మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి దూషణల సంగతి సరేసరి. తన బస్ లను పట్టుకున్న అధికారుల పని పడతానంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. ఇక.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన స్వగృహానికి వస్తుంటే జెసి అనుచరులు దౌర్జన్యానికి దిగి అడ్డుకున్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నేత ఇంటిని ఏకంగా దగ్దం చేశారు. అయినా వీటిపై చంద్రబాబు కిమ్మనలేదు.

వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు  పెట్టడానికి అనుమతులు తీసుకోవాలన్న పోలీసులపై జేసీ మండిపడ్డారు. ఎవరూ పోలీసుల వద్దకు వెళ్లనక్కర్లేదని హుకుం జారీ చేశారు. ఒకపక్క హోం మంత్రి అనిత ఏమో విగ్రహాల పండాల్స్ ఏర్పాటు చేసేవారు నిర్దిష్ట రుసుము చెల్లించి అనుమతులు తీసుకోవాలని చెబుతుంటే.. తాడిపత్రి టీడీపీ నేతలు కుదరదు పొమ్మంటున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాను కూడా ఒక రెడ్ బుక్ పెట్టుకున్నానని, అందులో వందమంది పేర్లు ఉన్నాయని అధికారులను బెదిరించారు. వారిని ఇబ్బంది పెట్టి తీరుతానని చెబుతున్నారంటే..  ఏపీలో టీడీపీ అరాచకం ఎంతగా వర్ధిల్లుతోందో తెలుస్తోంది. అఖిలప్రియపై హైదరాబాద్ లో కూడా కొంతకాలం క్రితం కొన్ని సీరియస్ కేసులు నమోదు అయ్యాయి. అయినా చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. ఎదుటి పార్టీలో ఉంటే ఏమైనా అంటారు. తన పార్టీలోకి రాగానే వారు ప్రక్షాళన అయిపోయినట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తుంటారు.

సంబంధిత వార్త: ఆళ్లగడ్డలో వంద మంది నా టార్గెట్‌

చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు భార్య వెంకాయమ్మ కు పోలీసులు జన్మదినోత్సవం జరపడం వివాదాస్పదం అయింది. మంత్రి రామ్ ప్రసాదరెడ్డి సతీమణి ఒక పోలీస్ ఎస్.ఐ.పై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు విమర్శలకు దారి తీసింది. చంద్రబాబు కోడలు, మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణికి పోలీసులు వందన సమర్పించిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ నిమిత్తం రూ. 82 లక్షల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడంపై ఆక్షేపణ వచ్చింది.  ఇలా ఒకటి కాదు.. అనేకం ఉన్నాయి.

వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పచ్చబిళ్లతో వచ్చే టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వ అధికారులంతా విధేయులుగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. వీటిని కప్పిపుచ్చుకోవడానికి  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరిగాయని, అప్పుడేమి చర్య తీసుకున్నారని టీడీపీ వాళ్లు ప్రశ్నిస్తుంటారు. నిజానికి ఏ  ప్రభుత్వం ఉన్నా.. కొన్ని ఘటనలు జరగొచ్చు. వాటిపై ప్రభుత్వం స్పందిస్తే  తప్పు పట్టనక్కర్లేదు.

ఆనాటి ముఖ్యమంత్రి జగన్ పలు చర్యలు తీసుకున్నా.. చంద్రబాబు,పవన్‌లు మాత్రం అప్పట్లో ఘోరాలు జరిగిపోయినట్లు దుష్ప్రచారం చేశారు. తీరా అలా ఆరోపణలకు గురైనవారిలో కొందరిని టీడీపీలోకి చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చేశారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు.. చంద్రబాబు,లోకేష్ లు ఆయనపై చేయని ఆరోపణలు లేవు.  పేకాట శిబిరాలు నిర్వహిస్తారని, భూములు కబ్జా చేస్తారని ఇలా ఎన్నో చెప్పారు. ఎన్నికల సమయానికి ఆయనను సగౌరవంగా టిక్కెట్ ఇచ్చి టీడీపీ పక్షాన నిలబెట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఎం.పీ.డీ.వో.పై దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగా,ఆయన అరెస్టుకు జగన్ ఆదేశించారు. అప్పట్లో శ్రీధర్ రెడ్డిపై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసేది. ఆ తర్వాత కాలంలో ఆయన్ని టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. అంటే ఆ పార్టీలో చేరగానే శ్రీధర్ రెడ్డి పవిత్రుడు అయిపోయారా? అంటే ఏమి చెబుతాం.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన  సమీప బంధువులపై ఇసుక,మట్టి తవ్వకం తదితర ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత,మాజీ మంత్రి దేవినేని ఉమా పలు ఆందోళనలు చేపట్టారు. కానీ గత ఎన్నికలలో వసంతను టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చి, దేవినేని ఉమాకు మాత్రం మొండి చేయి చూపారు. దీనిని ఏమనాలి?. ఒంగోలు ఎంపీ  మాగుంట శ్రీనివాసులురెడ్డి డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఆ టైంలో ఈనాడు మీడియా ఎన్ని వ్యతిరేక కధనాలు ఇచ్చిందో చెప్పలేం. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు.  కానీ టీడీపీ ఆహ్వానించి మరీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో సంగతి కూడా చెప్పాలి.

టీడీపీ నేతలు ఎవరిపైన అయినా అభియోగాలు వచ్చి పోలీసులు అరెస్టు చేస్తే..  వైఎస్సార్‌సీపీ టైమ్ లో చంద్రబాబు నానా యాగీ చేసేవారు. హత్య కేసులో ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు అయితే.. ఇంకేముంది బీసీ నేతను అరెస్టు చేస్తారా? అని గోల చేశారు. ఇప్పుడేమో దళిత నేత నందిగం సురేష్‌ను మాత్రం కక్ష కట్టి చంద్రబాబు అరెస్టు చేయించారు. ఇవన్నీ చంద్రబాబు డైరెక్షన్ లో జరుగుతున్న అరాచకాలా? లేదంటే ఆయన కుమారుడు లోకేష్ నేతృత్వంలో సాగుతున్న రెడ్ బుక్ అరాచకాలా?. పరిశీలిస్తే.. ఎక్కువ శాతం లోకేష్ దుందుడుకు వ్యవహారాలు ఉండవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి.

సూపర్ సిక్స్ హామీలను పక్కనబెట్టి ఈ దందాలు, హింసాకాండ ద్వారా నియంతృత్వపాలన సాగించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ఎల్లకాలం సాగుతుందా?ప్రజాస్వామ్యాన్ని హరించివేయాలని అనుకున్న చాలామంది నేతలు గతంలో కాలగర్భంలో కలిసిపోయారు. ఆ సంగతి అధికారంలో ఉన్నవారు మర్చిపోకుండా ఉంటే మంచిది.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, 
సీనియర్‌ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement