మహిళలు ఇల్లు విడిచి బయట అడుగు పెడితే వింతగా చూసే కాలంలో సాహసమే వెన్నెముకగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఎంతోమంది మహిళలు. వారి త్యాగాల వెలుగు చరిత్రకే పరిమితమైనది కాదు, వర్తమానంలోనూ స్ఫూర్తిని ఇస్తుంటుంది. ఎంతోమంది మహిళా స్వాతంత్య్ర సమరయో«ధుల పోస్టల్ స్టాంప్స్ విడుదల అయ్యాయి. ఈ చిన్న స్టాంప్‌లు వారి త్యాగాలు, పోరాట పటిమను ప్రతిఫలిస్తాయి. పోస్టల్ స్టాంప్స్‌పై మెరిసిన కొందరు మహిళా స్వాతంత్య్ర సమరయోధుల గురించి...
రుక్మిణీ లక్ష్మీపతి
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని మధురైలో పుట్టింది రుక్మిణీ. గాంధీజీ ‘హరిజన సంక్షేమ ని«ధి’ కోసం తన బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేసింది. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో చురుగ్గా పాల్గొంది. ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా అరెస్టయి జైలు శిక్ష అనుభవించిన తొలి మహిళగా చరిత్రలో నిలిచింది.
సుభద్రా జోషి
గాంధీజీ ఉపన్యాసాలతో ప్రభావితం అయిన సుభద్రా జోషి విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంది. ‘హమారా సంగ్రామ్’ పత్రికకు ఎడిటర్‌గా పనిచేసింది. సుభత్రను అరెస్ట్ చేసి లాహోర్ సెంట్రల్ జైల్‌కు తరలించారు. విడుదలయ్యాక మళ్లీ ఉద్యమంలో భాగం అయింది. సుభద్ర అంకితభావాన్ని నె్రçహూ ప్రశంసించారు.
రాణి మా గైడిన్లియు
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ‘హెరాక’ ఉద్యమంలో పదమూడు సంవత్సరాల వయసులోనే పాల్గొంది రాణి మా. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసి మహిళగా చరిత్రకెక్కింది. ‘హెరాక’ ఉద్యమంతో పాటు ఎదుగుతూ వచ్చిన రాణి మా ప్రముఖ రాజకీయ నాయకురాలిగా, ఆధ్యాత్మిక గురువుగా ప్రఖ్యాతి పొందింది.
బేగం హజ్రత్ మహల్
తొలి తరం మహిళా స్వాతంత్య్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్. బేగం హజ్రత్ ఇతర సంస్థానాధీశులతో కలిసి బ్రిటిష్ వారితో యుద్ధం చేసింది. లక్నో సమీపంలో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించింది. ఆ తరువాత కాలంలో మాత్రం ఓటమికి గురైంది. బ్రిటిష్ వారికి చిక్కకుండా అడవుల్లో తలదాచుకొని పోరాడేది.
కమలానెహ్రూ
జవహర్‌లాల్ నెహ్రు సతీమణి కమలా నెహ్రూ మహిళా సాధికారత కోసం గళం విప్పిన యోధురాలు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా అరెస్టై జైలుకు వెళ్లింది. ‘దేశ సేవిక’ సంఘాలను ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం అయ్యేలా చేసింది.
సుభద్రాకుమారి చౌహాన్
సుభద్రాకుమారి చౌహాన్ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరిన తరువాత నాగపూర్ నుంచి అరెస్ట్ అయిన మొట్టమొదటి మహిళా సత్యాగ్రహిగా చరిత్రలో నిలిచింది. మహిళలపై వివక్షతకు వ్యతిరేకంగా పోరాడింది. స్వాతత్య్ర పోరాటంలో భాగంగా ఎన్నో త్యాగాలు చేసింది.
అరుణా అసఫ్ అలి
భర్త అసఫ్ అలీతో పాటు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంది అరుణ. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయింది. కాంగ్రెస్‌పార్టీ క్విట్ ఇండియా తీర్మానం చేసిన తరువాత బ్రిటిష్ వారు విరుచుకుపడ్డారు. ప్రముఖ నాయకులను అరెస్ట్ చేశారు. ఆ క్లిష్ట సమయంలో అరుణా అసఫ్ అలి కార్యకర్తలకు అండగా ఉంది. బొంబాయి గొవాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ జెండాను ఎగరేసి క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకునేలా చేసింది.
దుర్గాబాయి దేశ్‌ముఖ్
దుర్గాబాయి దేశ్‌ముఖ్ సాహసవంతురాలైన సామాజిక కార్యకర్త, చిన్నతనం నుంచే మహిళల హక్కుల కోసం పోరాడింది. మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి పొంది స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంది. గాంధీజీ ప్రభావంతో దుర్గాబాయి మాత్రమే కాదు ఆమె కుటుంబం మొత్తం అన్ని రకాల పాశ్చాత్య దుస్తులను విడిచిపెట్టి, ఖాదీని మాత్రమే ధరించేవారు. మద్రాస్‌లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించింది.
రాజ్‌కుమారీ అమృత్ కౌర్
రాజ్‌కుమారీ అమృత్ కౌర్ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు. గాంధీజీ కార్యదర్శిగా పని చేసిన ఆమె దండి మార్చ్‌లాంటి ఎన్నో జాతీయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొంది. క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజ్‌కుమారి ఇరవై నెలల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. రాచరిక కుటుంబంలో పుట్టినప్పటికీ మహాత్ముడి ఆశ్రమంలో సాధారణ జీవితాన్ని గడిపింది.
Comments
Please login to add a commentAdd a comment