ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే గొప్ప అనుకుంటాం. కానీ ఆ ఇంట్లో ఒకరిద్దరు కాదు, ఏకంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో, కన్నవాళ్లు పడే తపనను దగ్గరుండి గమనించి అహర్నిశలు కష్టపడి చదివారు. ఫలితంగా ముగ్గురూ విద్యావంతులయ్యారు.
ఒకరు డీఎస్పీగా.. మరొకరు ఆర్డీవోగా, మరో సోదరి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నత కొలువులు సాధించి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపారు. తల్లి పేరుకు తగ్గట్లే ‘సరస్వతీ’ పుత్రికలుగా ఖ్యాతి గడించారు. నందలూరు మండలం టంగుటూరుకు చెందిన సోదరీమణుల విజయగాథే ఈ రోజు ప్రత్యేక కథనం.
రాజంపేట: నందలూరు మండలంలోని చెయ్యేటి పరీవాహక గ్రామమైన టంగుటూరు గ్రామంలో కంభాలకుంట సుబ్బరాయుడు, కంభాలకుంట సరస్వతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి సుబ్బరాయుడు ఆర్టీసీలో కండక్టరుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తల్లి సరస్వతి ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. తమ ముగ్గురు బిడ్డలైన లావణ్యలక్ష్మీ, మాధవి, ప్రసన్నకుమారిని బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు.
ఆ దిశగా ముగ్గుర్ని చదివించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముగ్గురు కూడా కష్టపడి చదివారు. లావణ్యలక్ష్మీ, ప్రసన్నకుమారి ఏఐటీఎస్‌లో బీటెక్ విద్యను పూర్తి చేసిన అనంతరం సివిల్స్‌లో రాణించాలనే పట్టుదలతో పోటీపరీక్షలకు సిద్ధమయ్యారు. తొలి అడుగులో భాగంగా గ్రూప్స్‌లో విజేతలుగా నిలిచారు.
లావణ్యలక్ష్మీ.....డీఎస్పీగా తొలి పోస్టింగ్
టంగుటూరు జెడ్పీ హై స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేసిన ఈమె పద్మావతి యూని వర్సిటీ పాలి టెక్నిక్ ఆపై ఏఐటీఎస్‌లో బీటెక్ పూర్తి చేశా రు. 2009లో గ్రూప్–1 విజేత గా నిలిచి మచిలీపట్నంలో డీఎస్పీగా తొలి పోస్టింగ్ చేపట్టారు. విజయవాడలో సెంట్రల్ ఎసీపీగా పనిచేశారు. మార్కాపురం ఓఎస్డీగా పనిచేశారు. 14 యేళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌లో ఛీప్ విజిలెన్స్ ఆఫీసర్‌గా తిరుపతిలో చేస్తున్నారు. ఈమె భర్త డా.చంద్రశేఖర్ నెల్లూరు ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్టినేటర్‌గా పని చేస్తున్నారు.
మాధవి..
అక్క లావణ్యలక్ష్మీ బాటలోనే మాధవి కూడా గ్రూప్స్‌లో విజేతగా నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేటలోని వైష్ణవీ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం ఏపీటిడ్కోలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త కిరణకుమార్ కడపలో వ్యాపారిగా కొనసాగుతున్నారు.
అక్క చూపిన బాటలో..
అక్కను ఆదర్శంగా తీసుకున్న ప్రసన్నకుమారి గ్రూప్–1లో విజేతగా నిలిచింది. టంగుటూరు జెడ్పీహెచ్ స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేసిన ఈమె , ఇంటర్ తిరుపతిలోని శ్రీ చైతన్యలో, ఆపై ఏఐటీఎస్‌లో బీటెక్ పూర్తి చేశారు. తొలుత టంగుటూరు గ్రామ సమీప ప్రాంతమైన టీవీపురానికి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ప్రసన్నకుమారి గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యారు. ఆర్‌సీ రెడ్డి ఐఏ ఎస్ స్టడీ సర్కిల్‌లో కోచింగ్ తీసుకున్నారు. గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్ధాయిలో మూడవ ర్యాంక్ సాధించారు. ఆర్డీఓగా నియమితులయ్యారు. సివిల్స్‌లో విజేత కావడమే తన లక్ష్యమంటున్నారు. ఈమె భర్త చంద్రాజీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
నా కలలను బిడ్డలు నిజం చేశారు..
నేడు ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. నా భర్త ఆర్టీసీలో కండక్టరుగా పనిచేశారు. బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా కలను నా ముగ్గురు బిడ్డలు నిజం చేశారు. వారికి ఏనాడూ ఇంటిలో పనిచెప్పలేదు. చదువుకోవాలని పదేపదే చెబుతూవచ్చాను. కుమార్తెలను ఉన్నతంగా చూడాలనుకున్నారు. అదే జరిగింది. వారిని నిరంతరం చదువుకోవాలనే ప్రోత్సహించాం.
–తల్లి సరస్వతి
Comments
Please login to add a commentAdd a comment