government job holders
-
ఒకే ఇంట్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే గొప్ప అనుకుంటాం. కానీ ఆ ఇంట్లో ఒకరిద్దరు కాదు, ఏకంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో, కన్నవాళ్లు పడే తపనను దగ్గరుండి గమనించి అహర్నిశలు కష్టపడి చదివారు. ఫలితంగా ముగ్గురూ విద్యావంతులయ్యారు. ఒకరు డీఎస్పీగా.. మరొకరు ఆర్డీవోగా, మరో సోదరి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నత కొలువులు సాధించి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపారు. తల్లి పేరుకు తగ్గట్లే ‘సరస్వతీ’ పుత్రికలుగా ఖ్యాతి గడించారు. నందలూరు మండలం టంగుటూరుకు చెందిన సోదరీమణుల విజయగాథే ఈ రోజు ప్రత్యేక కథనం. రాజంపేట: నందలూరు మండలంలోని చెయ్యేటి పరీవాహక గ్రామమైన టంగుటూరు గ్రామంలో కంభాలకుంట సుబ్బరాయుడు, కంభాలకుంట సరస్వతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి సుబ్బరాయుడు ఆర్టీసీలో కండక్టరుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తల్లి సరస్వతి ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. తమ ముగ్గురు బిడ్డలైన లావణ్యలక్ష్మీ, మాధవి, ప్రసన్నకుమారిని బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆ దిశగా ముగ్గుర్ని చదివించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముగ్గురు కూడా కష్టపడి చదివారు. లావణ్యలక్ష్మీ, ప్రసన్నకుమారి ఏఐటీఎస్‌లో బీటెక్ విద్యను పూర్తి చేసిన అనంతరం సివిల్స్‌లో రాణించాలనే పట్టుదలతో పోటీపరీక్షలకు సిద్ధమయ్యారు. తొలి అడుగులో భాగంగా గ్రూప్స్‌లో విజేతలుగా నిలిచారు. లావణ్యలక్ష్మీ.....డీఎస్పీగా తొలి పోస్టింగ్ టంగుటూరు జెడ్పీ హై స్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన ఈమె పద్మావతి యూని వర్సిటీ పాలి టెక్నిక్ ఆపై ఏఐటీఎస్‌లో బీటెక్ పూర్తి చేశా రు. 2009లో గ్రూప్–1 విజేత గా నిలిచి మచిలీపట్నంలో డీఎస్పీగా తొలి పోస్టింగ్ చేపట్టారు. విజయవాడలో సెంట్రల్ ఎసీపీగా పనిచేశారు. మార్కాపురం ఓఎస్డీగా పనిచేశారు. 14 యేళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌లో ఛీప్ విజిలెన్స్ ఆఫీసర్‌గా తిరుపతిలో చేస్తున్నారు. ఈమె భర్త డా.చంద్రశేఖర్ నెల్లూరు ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్టినేటర్‌గా పని చేస్తున్నారు. మాధవి.. అక్క లావణ్యలక్ష్మీ బాటలోనే మాధవి కూడా గ్రూప్స్‌లో విజేతగా నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేటలోని వైష్ణవీ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం ఏపీటిడ్కోలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త కిరణకుమార్ కడపలో వ్యాపారిగా కొనసాగుతున్నారు. అక్క చూపిన బాటలో.. అక్కను ఆదర్శంగా తీసుకున్న ప్రసన్నకుమారి గ్రూప్–1లో విజేతగా నిలిచింది. టంగుటూరు జెడ్పీహెచ్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన ఈమె , ఇంటర్ తిరుపతిలోని శ్రీ చైతన్యలో, ఆపై ఏఐటీఎస్‌లో బీటెక్ పూర్తి చేశారు. తొలుత టంగుటూరు గ్రామ సమీప ప్రాంతమైన టీవీపురానికి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ప్రసన్నకుమారి గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యారు. ఆర్సీ రెడ్డి ఐఏ ఎస్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నారు. గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్ధాయిలో మూడవ ర్యాంక్ సాధించారు. ఆర్డీఓగా నియమితులయ్యారు. సివిల్స్‌లో విజేత కావడమే తన లక్ష్యమంటున్నారు. ఈమె భర్త చంద్రాజీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నా కలలను బిడ్డలు నిజం చేశారు.. నేడు ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. నా భర్త ఆర్టీసీలో కండక్టరుగా పనిచేశారు. బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా కలను నా ముగ్గురు బిడ్డలు నిజం చేశారు. వారికి ఏనాడూ ఇంటిలో పనిచెప్పలేదు. చదువుకోవాలని పదేపదే చెబుతూవచ్చాను. కుమార్తెలను ఉన్నతంగా చూడాలనుకున్నారు. అదే జరిగింది. వారిని నిరంతరం చదువుకోవాలనే ప్రోత్సహించాం. –తల్లి సరస్వతి -
ఉద్యోగులూ.. జాగ్రత్త..!
సాక్షి, దహెగాం(సిర్పూర్): అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ఉద్యోగులు, అధికారులు ఎవరైనా అభ్యర్థి, ఏదైన పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఎన్నికల సంఘం వేటు వేస్తుంది. ఉద్యోగులు విధులకే పరిమితం కావాలే గానీ.. ఏ రాజకీయ పక్షానికి కొమ్ముకాయొద్దని ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు విధించింది. వాట్సాప్, ఫేస్బుక్ పోస్టుల్లోనూ అభ్యర్థులకు మద్దతుగా వ్యాఖ్యాలున్నా ప్రమాదమే.. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రాజకీయ పక్షానికి సానుకూలంగానో వ్యతిరేకంగానో ఉంటూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రచార మాధ్యమాల వీడియోల ద్వారా ఎవరైన చిత్రీకరించి ఎన్నికల సంఘానికి లేదా అందుబాటులో ఉన్న యంత్రాంగానికి పంపినా ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరుకావడం, ఇష్టారీతిగా మాట్లాడడం, పరనింద, ప్రభుత్వ పథకాలపై నిందలు మోపడం వంటి చర్యలకు దిగే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇటీవల బెజ్జూర్ మండలంలో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడ్డ విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల్లారా తస్మాత్.. జాగ్రత్త. -
27 శాతం ఐఆర్‌పై జీవో..1 నుంచి అమల్లోకి
సాక్షి, హైదరాబవాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో 27 శాతం ఐఆర్‌కు ప్రభుత్వం అంగీకరించడం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరిలో చేతికి అందే జనవరి జీతంతోపాటు ఐఆర్ ఉద్యోగులకు ఐఆర్ అందనుంది. ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
కొనసాగుతున్న రిలే దీక్షలు
సాక్షి, అనంతపురం : అందరిదీ ఒకే కోరిక ... తెలుగువారంతా తరతరాలుగా ఒక్కటిగానే ఉండాలని.. రాష్ట్రం ఎప్పటికీ సమైక్యంగానే ఉండాలని. అందుకే ప్రజలంతా ముక్తకంఠంతో ‘సమైక్య’ నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. 20వ రోజు సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగించారు. ప్రజలతో పాటు ఎన్జీఓలు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాలుపంచుకుంటుండడంతో ఉద్యమం తారస్థాయిని అందుకుంది. అనంతపురం నగరంలో ఏపీ ఎన్జీవోలు పెద్దఎత్తున ప్రదర్శనలు చేశారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘ఎస్మా’కు భయపడేది లేదని, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే దాకా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతో పాటు జాక్టో ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తెలుగుతల్లి కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి, డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం, ఆర్ట్స్ కళాశాల ఎదుట జాతీయరహదారులు సిబ్బంది, వైద్య సిబ్బంది, సీఐటీయూ, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట జిల్లా అధికారుల అధ్యక్షుడు, డీఆర్ఓ హేమసాగర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఒక్క రోజు దీక్ష చేశారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. నగరంలో ప్రతి కాలనీకి చెందిన మహిళలు, వృద్ధులు, చిన్నారులు సైతం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలు హోరెత్తించారు. సప్తగిరి, టవర్‌క్లాక్, తెలుగుతల్లి కూడళ్లలో సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు. గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంజారాలు సంప్రదాయ వేషధారణతో చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో భాగంగా వారు ఆట పాటలతో హోరెత్తించారు. అనేక ఆటంకాల మధ్య సోమవారం నుంచి జేఎన్టీయూ, ఎస్కేయూలలో మొదలైన ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. చేసేది లేక అధికారులు కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. ఉన్నతాధికారులతో చర్చించి తరువాత తేదీ ప్రకటిస్తామని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. ఎస్కేయూలో విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థి, ఉద్యోగ, అధ్యాపక జేఏసీల ఆధ్వర్యంలో వర్సిటీ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు ఎన్జీఓలు, పలు ప్రభుత్వశాఖల ఉద్యోగులు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ, జాక్టో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు, కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాక్టో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో జాక్టో రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. నాయీ బ్రాహ్మణులు ప్రదర్శన చేశారు. హిందూపురంలో ఉప్పర, బెస్త సంఘాలు, ఏపీఆర్జేసీ, శ్రీవాల్మీకి రామమందిర బృందం, నేషనల్ మజ్దూర్ యూనియన్, విద్యాసంస్థల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరింపజేశారు. కదిరిలో జేఏసీ, జేసీబీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి దీక్షా శిబిరాలకు వచ్చి మద్దతు తెలిపారు. రెవెన్యూ, న్యాయశాఖ ఉద్యోగులు, గ్యాస్ ఏజెన్సీ, హోటళ్ల నిర్వాహకులు, స్వర్ణకారులు పట్టణంలో ర్యాలీ చేశారు. రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వినియోగదారుల రిలే దీక్షకు వైఎస్సార్సీపీ నాయకుడు ఎల్ఎం మోహన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ, వంటా వార్పు నిర్వహించారు. మడకశిరలో ఉపాధ్యాయులు, మహిళా సంఘాల సభ్యులు, సమైక్యవాదులు ర్యాలీ చేశారు. గొరవయ్యలు నృత్యాలతో అలరించారు. సమైక్యవాదులు రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. అమరాపురంలో కురబసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొత్తచెరువులో వైఎస్సార్సీపీ నేత సోమశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పుట్టపర్తిలో సమైక్యవాదులు ప్రదర్శనలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సమైక్య రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. జేఏసీ రిలే దీక్షలకు వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. పెనుకొండలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బలిజ, కుమ్మర, వడ్డెర సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు ర్యాలీ చేశారు. రాయదుర్గంలో ట్రాక్టర్ యజమానుల అసోసియేషన్, ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు, ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రెడీమేడ్ గార్మెంట్స్ అసోసియేషన్, ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. కణేకల్లు, రాప్తాడు, బెళుగుప్ప, ఉరవకొండలో సమైక్యవాదులు ర్యాలీలు చేశారు. నార్పలలో ఎన్జీఓలు రిలే దీక్షలు చేపట్టారు. పుట్లూరులో జేఏసీ నాయకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. యాడికిలో సమైక్యవాదులు ఆమరణ దీక్షలు చేపట్టారు. కూడేరులో విద్యార్థులు రోడ్డుపై చదువుకుంటూ నిరసన తెలిపారు. -
సేవలు బంద్
సాక్షి, తిరుపతి: జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు సమైక్యవాద శంఖం పూరించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగ, కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1350 ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ముఖ్యంగా తిరుమలకు వెళ్లే 500 బస్సులు బస్టాండ్‌కే పరిమితం చేశా రు. ఆర్టీసీ బస్ డిపోలన్నీ బోసిపోయి కని పించాయి. ఆర్టీసీ కార్మికులతో పలు దఫాలు టీటీ డీ అధికారులు చేసిన చర్చలు ఫలించలేదు. ఫలి తంగా మంగళవారం తిరుమల ఘాట్‌రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఏ ఒక్క వాహనం కొం డెక్కకుండా ఆర్టీసీ, టీటీడీ ఉద్యోగులు అడ్డుకున్నా రు. భక్తులు కొండకు చేరుకోలేకపోయారు. బస్సుల్లేక పోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు నడకదారిలో తిరుమలకు చేరుకోవటం కనిపించింది. తిరుమలలో పనిచేసే అత్యవసర సేవలకు చెందిన ఉద్యోగ, కార్మికులను టీటీడీ ట్రాక్టర్లు, లారీ, టెంపోల్లో తరలించింది. శ్రీకాళహస్తీశ్వరాలయం, శ్రీవరసిద్ధి వినాయక ఆలయాలు బోసిపోయాయి. కలెక్టరేట్ ఖాళీ ఏపీ ఎన్జీవో పిలుపు మేరకు వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగులంతా మంగళవారం సమ్మెలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం,జేసీ, ఏజేసీ, పౌరసరఫరాలశాఖ కార్యాల యాలు బోసిపోయి కనిపించాయి. డీఆర్వో తప్ప ఏఒక్క అధికారి కార్యాలయానికి రాలే దు. ట్రెజరీ, సంక్షేమ శాఖ కార్యాలయాలు, డీఆర్డీఏ, డ్వామా, సమాచార శాఖ కార్యాలయాలన్ని ఖాళీగా కనిపించాయి. కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ తన క్యాంప్ కార్యాల యానికే పరిమితమయ్యారు. జిల్లాపరిషత్ ప్రాంగణానికి తాళాలు వేయటంతో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, పీఐయూ, సబ్ డివిజన్ కార్యాలయాలు, జెడ్పీ కార్యాల యాలు తెరుచుకోలేదు. విద్యాశాఖాధికారి కార్యాలయం ఖాళీగా కనిపించింది. హెచ్ఓడీలు మాత్రం హాజరై వెళ్లిపోయారు. పడకేసిన పాలన పల్లెల్లో పాలనా వ్యవహారాలను చూసే మండల పరిషత్ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. ఉద్యోగులెవ్వరూ రాలేదు. ముఖ్యంగా విద్యార్థులు కుల, ఆదాయ సర్టిఫికెట్స్ కోసం వచ్చేవారు కూడా 13 రోజులుగా ప్రభుత్వ కార్యాలయాలవైపు కన్నెత్తి చూడటం లేదు. పంచాయతీ కార్యాలయాలు, పశు వైద్యశాలలకు తాళాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 27వేల మంది పైచిలుకు ఉద్యోగులు బంద్‌లో పాల్గొన్నారు. ఎస్సీడీసీఎల్ పరిధిలోని ఆరు జిల్లాల పరిధిలోని 10 వేల మంది ఉద్యోగలు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. మున్సిపల్.. మీ సేవలు బంద్ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని సిబ్బంది మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో మొత్తం 29 సేవలకు సంబంధించిన 3,500 మంది ఉద్యోగులు ఆయా కార్యాలయాల ఎదుట బైఠాయించి సమైక్య గళం వినిపించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్ల నిర్వహణలో పనిచేసే కార్మికులు విధుల్లో ఉన్నప్పటికీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సమ్మె నుంచి ఈ మూడు సేవలను మినహాయించినట్టు ప్రకటించారు. ‘మీ సేవ’ ద్వారా అందించే 16 సేవలను స్తంభింపజేశారు.