కొనసాగుతున్న రిలే దీక్షలు | still going relay and strikes in seemandhra | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న రిలే దీక్షలు

Published Tue, Aug 20 2013 5:35 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM

still going relay and strikes in seemandhra

 సాక్షి, అనంతపురం : అందరిదీ ఒకే కోరిక ... తెలుగువారంతా తరతరాలుగా ఒక్కటిగానే ఉండాలని.. రాష్ట్రం ఎప్పటికీ సమైక్యంగానే ఉండాలని. అందుకే ప్రజలంతా ముక్తకంఠంతో ‘సమైక్య’ నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. 20వ రోజు సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగించారు. ప్రజలతో పాటు ఎన్‌జీఓలు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు  పాలుపంచుకుంటుండడంతో ఉద్యమం తారస్థాయిని అందుకుంది. అనంతపురం నగరంలో ఏపీ ఎన్‌జీవోలు పెద్దఎత్తున ప్రదర్శనలు చేశారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘ఎస్మా’కు భయపడేది లేదని, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే దాకా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు.
 
  ట్రాన్స్‌కో ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతో పాటు జాక్టో ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తెలుగుతల్లి కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి, డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం, ఆర్ట్స్ కళాశాల ఎదుట జాతీయరహదారులు సిబ్బంది,  వైద్య సిబ్బంది, సీఐటీయూ, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట జిల్లా అధికారుల అధ్యక్షుడు, డీఆర్‌ఓ హేమసాగర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఒక్క రోజు దీక్ష చేశారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. నగరంలో ప్రతి కాలనీకి చెందిన మహిళలు, వృద్ధులు, చిన్నారులు సైతం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలు హోరెత్తించారు. సప్తగిరి, టవర్‌క్లాక్, తెలుగుతల్లి కూడళ్లలో సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు.
 
  గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంజారాలు సంప్రదాయ వేషధారణతో చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో భాగంగా వారు ఆట పాటలతో హోరెత్తించారు. అనేక ఆటంకాల మధ్య సోమవారం నుంచి జేఎన్‌టీయూ, ఎస్కేయూలలో మొదలైన ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. చేసేది లేక అధికారులు కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. ఉన్నతాధికారులతో చర్చించి తరువాత తేదీ ప్రకటిస్తామని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. ఎస్కేయూలో విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థి, ఉద్యోగ, అధ్యాపక జేఏసీల ఆధ్వర్యంలో వర్సిటీ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు ఎన్‌జీఓలు, పలు ప్రభుత్వశాఖల ఉద్యోగులు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ, జాక్టో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు, కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాక్టో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో జాక్టో రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. నాయీ బ్రాహ్మణులు ప్రదర్శన చేశారు.
 
  హిందూపురంలో ఉప్పర, బెస్త సంఘాలు, ఏపీఆర్‌జేసీ, శ్రీవాల్మీకి రామమందిర బృందం, నేషనల్ మజ్దూర్ యూనియన్, విద్యాసంస్థల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరింపజేశారు. కదిరిలో జేఏసీ, జేసీబీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి దీక్షా శిబిరాలకు వచ్చి మద్దతు తెలిపారు. రెవెన్యూ, న్యాయశాఖ ఉద్యోగులు, గ్యాస్ ఏజెన్సీ, హోటళ్ల నిర్వాహకులు, స్వర్ణకారులు పట్టణంలో ర్యాలీ చేశారు. రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వినియోగదారుల రిలే దీక్షకు వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ, వంటా వార్పు నిర్వహించారు. మడకశిరలో ఉపాధ్యాయులు, మహిళా సంఘాల సభ్యులు, సమైక్యవాదులు ర్యాలీ చేశారు. గొరవయ్యలు నృత్యాలతో అలరించారు. సమైక్యవాదులు రోడ్డుపై వంటావార్పు చేపట్టారు.
 
  అమరాపురంలో కురబసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొత్తచెరువులో వైఎస్సార్‌సీపీ నేత సోమశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పుట్టపర్తిలో సమైక్యవాదులు ప్రదర్శనలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సమైక్య రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. జేఏసీ రిలే దీక్షలకు వైఎస్సార్‌సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. పెనుకొండలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బలిజ, కుమ్మర, వడ్డెర సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు ర్యాలీ చేశారు. రాయదుర్గంలో ట్రాక్టర్ యజమానుల అసోసియేషన్, ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
 
  జేఏసీ నాయకులు, ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రెడీమేడ్ గార్మెంట్స్ అసోసియేషన్, ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. కణేకల్లు, రాప్తాడు, బెళుగుప్ప, ఉరవకొండలో సమైక్యవాదులు ర్యాలీలు చేశారు. నార్పలలో ఎన్‌జీఓలు రిలే దీక్షలు చేపట్టారు. పుట్లూరులో జేఏసీ నాయకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. యాడికిలో సమైక్యవాదులు ఆమరణ దీక్షలు చేపట్టారు. కూడేరులో విద్యార్థులు రోడ్డుపై చదువుకుంటూ నిరసన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement