సమావేశానికి హాజరైన రైతులు
శ్రీకాళహస్తి : పట్టణంలోని ఎన్‌జీఓ కార్యాలయంలో తిరుపతి ఆర్‌డీఓ నరసింహులు కోసం అన్నదాతలు గురువారం ఆరు గంటల పాటు పడిగాపులు కాశారు. చివరకు ఆయన రాకపోవడంతో నిరుత్సాహంగా వెళ్లిపోయారు. పూతలపట్టు–నాయుడుపేట ప్రధాన రహదారి విస్తరణ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రైతుల నుంచి భూములు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌డీఓ వారానికి ఓ సారి రెండు, మూడు గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించి..వారి భూములకు «ఎంత మేరకు ధర చెల్లిస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం శ్రీకాళహస్తి మండలంలోని చెర్లోపల్లె, కాపుగున్నేరి, ఇసుకగుంట గ్రామాలకు చెందిన రైతులు గురువారం ఉదయం 10 గంటలకు ఎన్‌జీఓ కార్యాలయంలో ఆర్డీఓ నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని తహసీల్దార్ సుబ్రమణ్యం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీచేశారు. రైతులు టెన్షన్‌తో గురువారం ఉదయం 9 గంటలకే ఎన్‌జీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలు అయింది. అయినా ఆయన రాలేదు. అప్పుడు ‘భోజనం చేసి రండి..ఆర్‌డీఓ మూడు గంటలకు వస్తారు...’ అంటూ తహసీల్దార్ సుబ్రమణ్యం అదేశాలు జారీచేశారు. అయినా రైతులు అక్కడే వేచి ఉన్నారు. చివరకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ‘ఆర్డీఓ రావడం లేదు...మరోసారి సమావేశం నిర్వహిస్తాం....సమావేశం ఎప్పుడు నిర్వహించే విషయం వీఆర్‌ఏలతో చెప్పి పంపుతాం’ అంటూ తహసీల్దార్ చల్లగా కబురు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు గంటలసేపు వేచివున్న రైతులకు కోపమొచ్చింది. తహసీల్దార్ అలా చెప్పడంపై తీవ్రంగా మండిపడ్డారు.
అడ్డదిడ్డంగా రోడ్డు అలైన్‌మెంట్
అధికార పక్షానికి చెందిన నేతల భూములు ఉంటే వాటిని తప్పించి పేదోడి భూములపైకి రోడ్డును తిప్పడం దారుణమంటూ రైతులు తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని గ్రామాలను వదిలిపెట్టి.. ఒక్క ఇల్లు పోకుండా పొలాల్లో అలైన్‌మెంట్ ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు ఇసుకగుంటలో మాత్రం ఇళ్లపై, గిడ్డంగులపై రోడ్డు అలైన్‌మెంట్ ఇవ్వడం దారుణమంటూ రైతు సిద్దాగుంట శంకర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘మీకు ఇష్టం వచ్చినట్లుగా రోడ్డును తిప్పుకోవడం న్యాయమేనా ?’ అంటూ నిలదీశారు. రోడ్డులో మలుపులు ఉన్న చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, మలుపులు తప్పించడానికి కొన్ని చోట్ల అలైన్‌మెంట్ మార్పు చేశారని...అంతేతప్ప నేతల ఒత్తిళ్లతో పక్కకు తిప్పాపని చెప్పడం సరికాదంటూ తహసీల్దార్ వివరణ ఇచ్చారు. జీవితమంతా ఈ ప్రభుత్వానికి భూములను నామమాత్రపు «ధరలకు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వాపోయారు. తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని...ఒకవేళ బలవంతంగా లాక్కుంటే గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారమే భూములు ఇవ్వడానికి అంగీకరిస్తామని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment