టమాట రైతులతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి
మదనపల్లె రూరల్: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీతోనే రైతు సంక్షేమం సాధ్యమవుతుందని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. మంగళవారం మదనపల్లె రూరల్ మండలంలోని కాశీరావుపేటలో వైఎస్సార్‌సీపీ రూరల్ మండల కన్వీనర్ మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ విద్యుత్ అంశా ల గురించి వివరాలు అడిగారు. టమాట పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని, విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, మోటర్లకు లోఓల్టేజి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మిథున్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రైతుసంక్షేమానికి పెద్దపీట వేసేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంకణబద్దులై ఉన్నారని తెలిపారు.
నేరుగా రైతులు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారన్నారు. ఎండనక, వాననక రాత్రింబవళ్లు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ సమస్యలు తెలుసుకుం టున్నారని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల్లో రైతు శ్రేయస్సు కోసం రైతు భరోసా కింద పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకు రూ. 50 వేలు ఇస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వించడం, హంద్రీ–నీవా ద్వారా సాగు, తాగునీరు ఇవ్వడం, రైతుల ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సు రద్దుచేయడం, 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాలు అమలు చేస్తారన్నారు. ఎమ్మెల్యే తిప్పారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేస్తే రైతుల సమస్యలన్నీ పూర్తిగా తీరిపోతాయన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు బాబ్‌జాన్, ఉదయ్‌కుమార్, షమీమ్ అస్లామ్, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, బాలగంగాధర్‌రెడ్డి, మస్తాన్‌రెడ్డి, ఖాజా, సుగుణాంజినేయులు, నీరుగట్టు వెంకటరమణారెడ్డి, వేమనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment