ఎంపీ ఆశయానికి మోకాలడ్డు..
► కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ఎంపీ మిథున్‌రెడ్డి తపన
► భూ సేకరణ, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అడ్డంకులు
చిత్తూరు, సాక్షి: మదనపల్లె పరిసర ప్రాంతాల్లో నిరుపేదలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఆశయానికి రాష్ట్ర ప్రభుత్వం మోకా లొడ్డుతోంది. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయం నెలకొల్పాలనే ఎంపీ మిథున్‌రెడ్డి సంకల్పానికి ప్రభుత్వపెద్దలు, అధికారులు అడుగడుగునా అడ్డం పడుతున్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని అవలంబి స్తోంది. మదనపల్లె ప్రాంతంలో పెద్ద ఎత్తున కేంద్రప్రభుత్వ ఉద్యోగులున్నారు.
కరువు ప్రాంతం కావడంతో పిల్లల చదువుపై ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో పేదలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. పిల్లలు పెద్ద సంఖ్య లో కార్మికులుగా మారుతున్నారు. దీన్ని గుర్తించిన ఎంపీ మిథున్‌రెడ్డి ఈ ప్రాంతంలో కేంద్రీయ విద్యాయలం నెలకొల్పితే మంచి ప్రయోజనం ఉంటుందని ఆశించారు. ఇందు కోసం ఆయన ఎంపీ అయిన తొలినాళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. భూకేటాయింపులు జరి పితే వెంటనే కేంద్రీయ విద్యాలయం నెలకొల్పోందుకు నిధులు కూడా విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టరేట్‌కు 2014 డిసెంబర్‌లోనే ఉత్తర్వులు పంపింది.
సిద్ధార్థజైన్ నిర్లక్ష్యం..
భూకేటాయింపులు జరిపితే పేద పిల్లలకు మంచి విద్య అందే అవకాశం ఉన్నా.. బదిలీ అయిన జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ మోకాలడ్డారు. భూకేటాయింపులు, పాఠశాల నెలకొల్పడానికి ఇతర సౌకర్యాల వివరాలు కేం ద్రానికి పంపాలని ఎంపీ మిథున్‌రెడ్డి ఎన్నోసార్లు విన్నవిం చినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. దీనివల్ల అతి తక్కువ వ్యయంతో అత్యున్నత ప్రమాణాల విద్య చదువుకునే అవకాశం పేద పిల్లలు కోల్పోనున్నారు.
సిద్ధార్థజైన్ బదిలీ కావడంతో మరో సారి ఎంపీ మిథున్‌రెడ్డి కొత్త కలెక్టర్ ప్రద్యుమ్నకు లేఖ రాశారు. కేంద్రీయ విద్యాలయానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. భూకేటాయింపులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే కేంద్రీయ విద్యాలయం మదనపల్లెలో త్వరితగతిన నెలకొల్పేం దుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఎంపీ మిథున్‌రెడ్డి అంటున్నారు.