ఎండవేడిమికి పగిలిన టమాట
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది టమాటరైతుల పరిస్థితి. నిన్నమొన్నటి వరకు పంటకు ధర లేక తీవ్రంగానష్టపోయారు. ఇప్పుడిప్పుడే కొంత మెరుగుపడుతుందిఅనుకుంటుండగా ఎండ రూపంలో వారిని మరోభూతంవెంటాడుతోంది. ఎండల కారణంగా కాయలు పగిలిపోవడం,పూతాపిందె రాలిపోతుండడంతో లబోదిబోమంటున్నారు.
చిత్తూరు, మదనపల్లె సిటీ: ఒకవైపు మండుతున్న ఎండలు, మరో వైపు అకాల వర్షం టమాట రైతును దెబ్బతీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల కారణంగా టమాట కాయలు రంగుమారి, పగిలిపోతున్నాయి. ఈ కారణంగా వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా రైతులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. మదనపల్లె డివిజన్‌లో ప్రస్తుతం సుమారు 12వేల హెక్టార్లలో టమాట సాగు చేస్తున్నారు. వర్షాభావంతో చెరువులు, కుంటలు ఎండిపోయినా అరకొర భూగర్భ జలాలపై ఆధారపడి రైతులు పంట సాగు చేస్తున్నారు.
సుమారు రూ.12 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. మార్చి నుంచి ఎండలు అధికమయ్యాయి. మదనపల్లెలో గతంలో ఎన్నడూ లేని విధంగా సగటును 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు వడగండ్ల వానకు పంటకు నష్టం వాటిల్లుతోంది. పూత, చెట్లలోని కాయలు రాలిపోవడంతో నష్టం జరుగుతోంది. దీనికితోడు ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. 30 కేజీల క్రేట్ సగటున రూ.100–150 వరకు పలుకుతున్నాయి. 10 క్రేట్‌లకు రెండు క్రేట్‌లు కాయలు దెబ్బతింటున్నాయి. సుమారు రూ.2 కోట్ల వరకు రైతులు నష్టపోయారు.
పంటపై ఉష్ణోగ్రతల ప్రభావం..
అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. కాయలు పగిలిపోవడం వల్ల తక్కువ ధర పలుకుతున్నాయి. చాలామంది వ్యాపారులు గోనె సంచులు నీటితో తడిపి కాయలపై ఆరబెడుతున్నారు. రైతులు పొలం చుట్టూ చీరలు కడుతున్నారు. సాధారణంగా టమాట మొక్కలు 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు తట్టుకోగలగుతాయి. ఆపైన అధిక ఉష్ణోగ్రతలు ఉంటే పంట దెబ్బతింటుంది. దీనికి అనుగుణంగా పంటకు నీరు అధికంగా పెట్టాలి. ఈ కారణంగా పంటకు తెగుళ్లు సోకుతున్నాయి. ప్రస్తుతం పూత, పిందె దశల్లో ఉన్నాయి. ఎండవేడిమి, తెగుళ్లు విజృంభిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment