Sankranti 2022 Special: History And Significance In Telugu, Unknown Facts - Sakshi
Sakshi News home page

Sankranti 2022 Special Story: భోగ భాగ్యాల సంబురం

Published Sun, Jan 9 2022 9:17 AM | Last Updated on Sun, Jan 9 2022 10:03 AM

Sankranti 2022: History Significance In AP And Telangana - Sakshi

చిన్నారులకు సెలవుల సంబరం ముగ్గుల్లో ఒదిగిపోయే పల్లె పడచుల నాజూకుతనం ధాన్యరాశులతో పుష్యలక్ష్మీ కళ పిండివంటల ఘుమ ఘుమలు అల్లుళ్ల వైభోగం యువకుల కోలాహలం కళాకారుల ప్రదర్శనం హరిదాసుల సంకీర్తనం అంబరాన ఎగిరే పతంగం ఎనుముల కనుమ పల్లె‘టూరు’కు దిగిన పట్నం  తెలుగు వారి పెద్ద పండగ వెరసి సంక్రాంతి సంరంభం

సర్వసాధారణంగా మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో ఒక దైవానికి సంబంధించినవే.. అయితే సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ, రైతుల పండుగ, కళాకారుల పండుగ. కొండొకచో క్షణం విశ్రాంతి తీసుకోకుండా వెలుగు, వేడిని పంచే సూర్యుడికి సంబంధించిన పండగ. సంక్రాంతికి మూల పురుషుడు ‘రైతు’. ఆరుగాలం పంట పొలాలలో శ్రమించే రైతన్న చేసుకునే పండుగ ఇది. తన పంట కోతకొచ్చినప్పుడు ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు కళాకారులు అందరూ అండగా నిలబడతారు. ఆనందాన్ని, వినోదాన్ని పంచుతారు.

రైతు సంతోషంతో కొలిచిన ధాన్యాన్ని, ఇచ్చిన డబ్బును సంబరంతో స్వీకరించి ఆశీస్సులు అందించి మళ్లీ వచ్చే సంక్రాంతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కళ్లాపు చల్లిన వాకిళ్లలో అందంగా తీర్చిదిద్దిన ముగ్గులు, ఆ ముగ్గులలో వయ్యారంగా ఒదిగిపోయిన గొబ్బెమ్మలు, ఆ ముగ్గులను దిద్దే ముద్దుగుమ్మల కోసం ఏదో అర్జంటు పని ఉన్నట్టు గుమ్మాలలో నిలబడి ఉండే పురుష పుంగవులు... మధ్య మధ్యలో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల శ్రావ్యమైన సంకీర్తనలు... ఇవన్నీ సంక్రాంతికి ప్రతి పల్లెటూరిలోనూ కనిపించే సర్వ సాధారణ దృశ్యాలు. 

సంక్రాంతి పండుగ సమయానికి పంటలు ఇంటికి వచ్చి ఉంటాయి. రైతులు మాత్రమే కాక వ్యవసాయ కూలీలు ఇంకా  చెప్పాలంటే గ్రామంలో ఉన్న అందరూ పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా... కంటికి ఇంపుగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పొలం పనులు పూర్తి అయి కాస్తంత విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే సందళ్లకు, సంబరాలకు చిరునామాగా మారింది సంక్రాంతి. రైతులు తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమికి, తమ పొలంలో కష్టపడి పని చేసిన కూలీలకి, పాలేర్లకి, పశువులకి, పక్షులకి, మొత్తం ప్రకృతికి కృతజ్ఞతను తెలియ చేసుకోవడం, తమ సంపదను సాటివారితో, బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది.

సంక్రమణానికి ఈ ప్రత్యేకత ఎందుకు?
భారతీయులు సాధారణంగా పాటించేది చాంద్రమానాన్ని. కొన్ని సందర్భాలలో సౌరమానాన్ని కూడా అనుసరిస్తారు. ఈ రెండు మానాల సమన్వయం సంక్రాంతి పండుగ చేసుకోవటంలో కనపడుతుంది. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. దానిని సంక్రమణం అంటారు. మకరరాశిలో ప్రవేశించినప్పుడు అది మకరసంక్రమణం అవుతుంది. సంవత్సరంలో ఉండే పన్నెండు సంక్రమణాలలో మకరసంక్రమణం ప్రధానమైనది. ఎందుకంటే, మకర సంక్రమణంతో సూర్యుడి గమన దిశ మారుతుంది.

అప్పటి వరకు దక్షిణ దిశగా నడచిన నడక ఉత్తరదిక్కుగా మళ్లుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరు నెలలు ఉత్తరాయనం అంటారు. దక్షిణాయనాన్ని పితృయానం (పితృ దేవతలు భూలోక వాసులపై అనుగ్రహం కురిపించే కాలం) అని, ఉత్తరాయనాన్ని దేవయానం (దేవతలు అనుగ్రహాన్ని వర్షించే కాలం) అని చెపుతారు. అందుకనే ఈ రోజుని ఉత్తరాయన పుణ్యకాలం అంటారు. ఈ పుణ్య సమయంలో ఆచరించ వలసిన సంప్రదాయాలను సంక్రాంతి సంబరాల్లో మేళవించారు మన పెద్దలు. 

మూడురోజుల పండగ
ఇది భోగి, సంక్రాంతి, కనుమ, అనే మూడు రోజుల పండగ. భోగి అంటే  పండుగ ముందు రోజు వచ్చే రోజు అని అర్థం. వాడుకలో రైతులకు, ఇతర వర్గాల ప్రజలకు ఆనందించ డానికి అనువైన సమయం, ధనం  లభిస్తున్నాయి కనుక భోగి అని పేరొచ్చింది. పదేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు ఈ రోజున చెరకు ముక్కలు, బంతి పూలు, చిల్లర డబ్బులు, సూర్యుడికి ఇష్టమైన రేగు పండ్లు కలిపి భోగి పళ్ళు పోస్తారు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కనుక భోగి పళ్ళు పోయడం వలన పిల్లలకు మంచి ఆరోగ్యం, ఆయుష్షు లభిస్తాయి. చెరకు ముక్కలు–బంతి పూలు శీతకాలంలో పిల్లల తలలో చేరిన నెమ్మును పీల్చివేస్తాయి.

అంటే ఈ రెండు వస్తువులు ఎక్కువ వేడిని కలిగి ఉండటం వలన ఆరోగ్య హేతువులు. అదే విధంగా భోగి మంటల్లో గొబ్బెమ్మలను ఎండపెట్టగా వచ్చిన పిడకలు వేసి కాలుస్తారు.. అయితే కొందరు ఈ మంటలలో రకరకాల చెత్తాచెదారాన్ని సైతం తెచ్చి పడేస్తుంటారు. నిజానికి భోగి మంటల్లో కేవలం పిడకలను మాత్రమే వేయాలి తప్ప పాత టైర్‌లను, ఇతర వస్తువులను వేస్తే వాతావరణంలోని వేడి తగ్గక పోగా వాయు కాలుష్యం పెరిగి అనారోగ్యాలను కలిగిస్తుంది. పాతవస్తు వ్యామోహాన్ని వదులుకోవాలని భోగిమంటలు మనకు బోధిస్తున్నాయి

ముగ్గులు–కరోనా జాగ్రత్తలు
రంగవల్లులు లేక ముగ్గులు అనేవి నక్షత్ర మండలాలకు ప్రతిరూపాలని అంటారు. ఆకాశంలో మెరిసేచుక్కలు కదలక స్థిరంగా ఉంటాయి కానీ మన ఇంటి ఆడపడచులు నేల పైన పెట్టే చుక్కలు ఎంతో రమణీయంగా కదులుతూ చక్కటి కళారూపాలను సృష్టిస్తాయి. నిజానికి ఈ ముగ్గులు పెట్టడం అనేది చీమలు, పక్షులకు చలికాలంలో ముగ్గు పిండిని ఆహారంగా సమర్పించే ఒక  భూతదయా కార్యక్రమంలోని భాగమే.

ఇది పర్యావరణంలో మనతోపాటు  జీవిస్తున్న చిన్న జీవులకు మనం చేస్తున్న ముత్యమంత సాయం. ఇది కరోనా కష్ట కాలం కనుక స్త్రీలు ఆరు గంటలకే ఈ ముగ్గుల అలంకరణను ముగించడం, చలి వాతావరణంలో మాస్కులు ధరించి ముగ్గులను పెట్టడం, అదేవిధంగా ముగ్గులు పెట్టే ముందు, పెట్టిన తరువాత శానిటైజరుతో చేతులు శుభ్రం చేసుకోవడం ఆరోగ్య‘కరం’.

సంక్రాంతి పిండివంటలలోని ఆరోగ్యం...
సంక్రాంతి రోజున గుమ్మడి కాయ ముక్కలు వేసిన పులుసు, మినప గారెలు, నువ్వుల పొడి, చెరకు ముక్క తప్పని సరిగా తినాలని శాస్త్రం చెప్పింది. అలా ఎందుకు చెప్పిందంటే, ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన పదార్ధాలు కనుక. ఇందులో ఒక్క గుమ్మడికాయను మినహాయిస్తే మిగిలినవి మన దేహాన్ని వెచ్చబరచి జనవరిలోని చలి నుంచి మనలను రక్షించే పదార్థాలు.

ఇక గుమ్మడి కాయ స్త్రీ–పురుషుల్లోని వంధ్యత్వాన్ని నివారించి గర్భాశయ దోషాలను, వీర్య దోషాలను నివారించే గొప్ప ఔషధం. సంతాన  సమస్యలకి గుమ్మడికాయను మించిన మంచి మందు మరోటి లేదని పెద్దలు చెబుతారు. గొబ్బెమ్మలను అలంకరించడానికి ఉపయోగించే బంతి, చామంతి, డిసెంబరాలు, ముళ్ల గోరింట, గుమ్మడి పూలను స్పృశించడం కూడా ఆరోగ్యప్రదమే.    

సంక్రాంతికి అల్లుడి వైభోగం
ఏ పండగకైనా ఇంటి అల్లుడి రాక సర్వసాధారణమయితే ఈ సంక్రాంతి రోజున అల్లుడికి విశిçష్ఠమైన స్థానం ఉన్నది. అల్లుడు విష్ణు స్వరూపం అన్నారు. అదే విధంగా సూర్యుడిని సూర్యనారాయణమూర్తి అని కూడా సంబోధిస్తున్నాం. అంటే సూర్యుడి మకర రాశి  ప్రవేశంలో గొప్ప రహస్యం దాగి ఉంది. జ్యోతిర్మండలంలో మకర రాశి పదో రాశి. ఇది  అత్తగారిల్లు అంటే విశ్వానికి అల్లుడైన సూర్యుడు తన అత్తగారి ఇంటిలోకి అడుగు పెట్టాడని అర్థం. అందుకే సంక్రాంతికి ఇంటి అల్లుడిని తప్పనిసరిగా పిలవాలని సంప్రదాయం ఏర్పడింది. అల్లుడు లేని వారు ఈ రోజున పెరుగును బ్రాహ్మణుడికి దానం చేయాలని పరాశర సంహిత చెబుతోంది. 

కృతజ్ఞత తెలిపే కనుమ 
సంక్రాంతి మరునాడు జరిపేదే కనుమ. ఈ రోజున పశువులకు రెల్లు గడ్డితో దిష్టి తీసి వాటికి అలంకారాలు చేసి పూజిస్తారు. వ్యవసాయంలో రైతుకు నేస్తాలు పశువులే కనుక వాటి కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని మనం  పూజించడం జరుగుతోంది. పూజ తరువాత వీటికి నైవేద్యంగా పులగం లేదా పొంగలిని వండి సమర్పిస్తారు. ఇందులో భూత దయ అనేది అంతర్లీనంగా ఉన్న అంశం.

ఇది పశువుల పట్ల మనం చూపుతున్న కృతజ్ఞతాపూర్వపు పండగ. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పశువుల పూజతో పాటుగా ఇళ్ల ముందు ధాన్యపు కంకులను కట్టి పక్షుల పట్ల సైతం తమ కృతజ్ఞతను ప్రకటిస్తారు. ఎందుకంటే పంటలకి పట్టే అనేక చీడ పురుగులను పక్షులు తిని పంటను రక్షిస్తాయి కనుక. 

కోడి పందాలా? 
కనుమ రోజున సాగే కోడి పందాల తంతు మన శాస్త్రాలలో ఎక్కడా లేదు. పల్నాటి రాజుల పాలనలో ఇది ప్రవేశపెట్టబడింది. సంక్రాంతి పర్వదినాన అనేక జీవాలకు సేవ చేస్తున్న మనం కోడి పందాల పేరుతో వాటిని హింస పెట్టడం న్యాయం అనిపించుకోదు. ఒకవేళ కాదూ కూడదు కోడి పందాలు ఆడాలనిపిస్తే బయట కరోనా మహమ్మారి పొంచి ఉందని గుర్తించాలి.   

సంక్రాంతి అనేక విజ్ఞాన విషయాలతో కూడిన పెద్ద పండగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం అంటున్నాము. ఈ రోజు నుంచి సూర్యుడు క్రమక్రమంగా తన తేజస్సును పెంచుకుంటూ పోతూ చల్లదనంతో వణికే భూమాతకు వెచ్చదనాన్ని అందిస్తాడు. సంక్రమణ కాలం నాటికి రైతులకు పంట చేతికి వచ్చి చేతిలో డబ్బు ఆడుతుంటుంది. ఈ డబ్బుతో ధార్మిక కార్యక్రమాలు చేయమని సూర్యుడి మకర సంక్రమణం మనకి బోధిస్తుంది. రైతుకి డబ్బు వచ్చిందంటే వ్యాపారులకు, ఇతర వర్గాలకు కూడా ఆదాయం వచ్చినట్టే కదా. అందుకని కేవలం రైతులను మాత్రమే కాక ప్రతి ఒక్కరినీ కూడా ధర్మ కార్య నిర్వహణకు సన్నద్ధంగా ఉండమని సంక్రాంతి సంక్రమణం సందేశం ఇస్తోంది. అంతేకాదు, ఆధ్యాత్మికంగా చీకటి నుంచి వెలుగులోకి అడుగు పెట్టమని అంతర్లీనంగా చెబుతోంది.

ఎందుకు ప్రయాణం చేయకూడదు?
కనుమ రోజు అటు పెద్దలకి పెట్టుకునేందుకు, ఇటు ఇంట్లోవారు కడుపు నిండా తినేందుకు... మాంసాహారం తీసుకుంటారు. మాంసం తినని వారికి, దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములు. అందుకనే గారెలతో... ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి’ అనే సామెత మొదలైంది. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి. కనుమ రోజు పెద్దల కోసం విందుభోజనం తయారు చేయడమే కాదు... దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది.

అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. పొద్దున్నే పశువులని పూజించుకోవడం, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయడం... అంతా కలిసే చేస్తారు. కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్లు వండటం, బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు... భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన మూడు రోజుల పండుగ. కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి, ఆ రోజు కూడా ఆగి... పెద్దలను తల్చుకుని, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని... మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

గొబ్బెమ్మలు, హరి దాసులు
ధనుర్మాసంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ తేమకి రకరకాల పురుగులు, ఇతర జీవాలు  వాటి ఆవాసాల నుంచి బయటకు వచ్చి మన ఇళ్లలోకి రాకుండా ఉండేందుకే పేడతో చేసిన గొబ్బెమ్మలను ఇంటి ఆవరణలో ఉంచుతారు. పేడలో ఉండే ఓ రసాయనం.. క్రిమికీటకాలను ఇళ్లలోకి రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా జెర్రులు, తేళ్లు, తొండలు, కప్పలు, ఈగ–దోమ వంటి వాటికి ఈ రసాయనం అలెర్జీను కలిగిస్తుంది. అందువల్ల అవి ఇంటి లోనికి రాకుండా ఉంటాయి. ఈ గోబెరిన్‌ అనే రసాయనానికి గర్భ దోషాలను కూడా నివారించే గుణం ఉండటం మరో విశేషం. పేడలో 16 శాతం ఆమ్లజని ఉండటం వలన గొబ్బెమ్మలు చేసే స్త్రీల ఊపిరితిత్తులకు ఇవి టానిక్‌ లాంటివి.

గొబ్బెమ్మలు సంతాన ప్రతీకలు. ఇంటిలో పెళ్లి కాని వారికి వివాహం, పెళ్లి అయిన స్త్రీలకు సంతానం కలగడానికి పెద్దలు ఈ గొబ్బెమ్మల ఆచారాన్ని ఏర్పరచారు. ఈ కారణంగానే భోగి లేదా సంక్రాంతి నాడు ఒక పెద్ద గొబ్బెమ్మను, దానికి ఇరుపక్కలా రెండు పిల్లగొబ్బెమ్మలను పెట్టడం జరుగుతోంది. మాసాలలో మార్గశీర్షమాసాన్ని నేను అన్నాడు శ్రీ హరి.

ఈ నెల మొత్తం శ్రీ హరి హరిదాసుల రూపంలో ప్రతి ఇంటికి వస్తాడని, తన చక్రయుధాన్నే ధాన్యపు సజ్జగా మలచి నెత్తిన ధరిస్తాడని హరివంశం చెప్పింది. దీనిని దృష్టిలో ఉంచుకునే దైవం అయినా విష్ణువు సాధారణ హరిదాసునిలా మన చుట్టూ ఉండే మానుష రూపంలో మనకి దర్శనం ఇవ్వడానికి ఈ మాసాన్ని ఎంచుకున్నాడు. మానవ సేవే మాధవ సేవ అని గుర్తు చేయడానికే విష్ణువు హరిదాసు రూపంలో మన మధ్యకి వచ్చివెళుతున్నాడని గ్రహించాలి. 

సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. 

పతంగుల పండగ
సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు ఏటా జనవరి నెల ఆరంభంతోటే సర్వత్రా గాలిపటాల కోలాహలం మిన్నంటుతుంది. పాఠశాలలకు సంక్రాంతి సెలవులిచ్చేస్తే పిల్లలకు మొదట గుర్తుకొచ్చేది పతంగులే. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు హైదరాబాద్‌ వంటి దక్షిణాది నగరాల్లోనూ ఇప్పటికీ పతంగుల పోటీలు నిర్వహిస్తున్నారు. పతంగుల పండుగంటే ఆనందాల మేళవింపు.

ఆకాశమే హద్దుగా ఎగిరే పతంగులు తెలియని అనుభూతిని కల్గిస్తాయి. ఇంతకీ సంక్రాంతికి ఇలా పతంగులు ఎందుకు ఎగుర వేస్తారనేదానికి ఓ పౌరాణిక విశ్వాసం కారణం. అదేమంటే, సంక్రాంతితో ఉత్తరాయన పుణ్యకాలం మొదలవుతుంది. ఇది దేవతలకు పగలు అని పేరు. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేస్తుంటారు. 

ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం. గాలిపటం ఎగుర వెయ్యడంలోని ఆనందం ఆనిర్వచనీయం. వాటిని బ్యాలన్స్‌ చేయడం వచ్చిన వారు జీవితంలో వచ్చే కష్టసుఖాలను కూడా జాగ్రత్తగా బ్యాలన్స్‌ చేయగలరని మనోవైజ్ఞానికుల విశ్లేషణ. ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం కంటిచూపును మెరుగుపరుస్తుందని చైనీయుల విశ్వాసం. అలా తల బాగా పైకి ఎత్తి చూసేటపుడు నోరు కొద్దిగా తెరుచుకుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని వారు నమ్ముతారు. 

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనైతే సంక్రాంతి రోజున ఏకంగా అంతర్జాతీయ పతంగుల పండుగే జరుగుతుంది. దేశ విదేశాలకు చెందిన ఎంతోమంది ‘ఉత్తరాయన్‌’గా పిలిచే ఈ వేడుకలో పాల్గొంటారు. అహ్మదాబాద్‌ నడిబొడ్డున ఉండే ‘పతంగ్‌ బజార్‌’ పండుగకు వారం రోజుల ముందు నుంచీ గాలిపటాలు కొనేవాళ్లూ అమ్మేవాళ్లతో కిటకిటలాడిపోతుంది. 

పతంగులు.. జాగ్రత్తలు
గాలిపటాలకు వాడే నైలాన్‌ దారం పక్షుల ప్రాణాలను హరిస్తున్న సంఘటనలు కోకొల్లలు. వీటిని ఎగరేసే సమయంలో చిన్నారులు గాయాల బారిన పడుతున్నారు. చెట్ల కొమ్మలు, కరెంట్‌ స్తంభాలకు చిక్కుకున్న గాలిపటాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మాంజా, దారాలు పక్షుల కాళ్లకు చుట్టుకుని అవి ఎగరలేక చనిపోతున్నాయి. మిద్దెలపై పతంగులు ఎగురవేసే వారు ప్రమాదవశాత్తూ కింద పడిపోతున్నారు. తెగిపోయిన గాలి పటాలను పట్టుకునే యత్నంలో ఎందరో చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

ఒక్కోసారి పతంగులు తెగి విద్యుత్‌ తీగలకు తగులుకుంటుంటాయి. వాటిని తీసుకునేందుకు చిన్నారులు ప్రయత్నిస్తూ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. విద్యుత్‌ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు లేనిచోటా, ఉంటే వీటికి తగలకుండా పతంగులు ఎగురవేయాలి. విద్యుత్‌ తీగల మీద పడిన గాలిపటాలను తీసేందుకు భవనాల మీద నుంచి, సగం నిర్మించిన గోడల మీద నుంచి పతంగులు ఎగురవేసే ప్రయత్నం చేయరాదు.

పశువులకు పండుగ
కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్ష్యాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్న నేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు.

ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము. కానీ ఈ కనుమ రోజున మాత్రం రథం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement