భావాన్ని వ్యక్తపరచడానికి భాషే అవసరం లేదు, సంజ్ఞ చాలు! కళలో ప్రావీణ్యం ఉంటే గనుక అదొక అద్భుతమే! ఆ అద్భుతం పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేట గిరిజనుల సొంతం! ఆదిమానవుడు తన బతుకు చిత్రాన్ని బొమ్మలతోనే చూపించాడు. అదే భావితరాలకు చరిత్రగా నిలిచింది. ఆ కళ నేటికీ ఉనికిలో ఉంది..
ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో! పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలోని సవర తెగకు చెందిన గిరిజనులు తమ జీవన విధానాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను గీతల బొమ్మలతోనే అభివర్ణిస్తారు. అదే సవర చిత్రకళ! ప్రకృతిని దైవంగా కొలిచే గిరిజనులు అటవీ ఉత్పత్తుల దగ్గర్నుంచి పంట చేతికందే వరకు ప్రతిదశనూ పండుగలా జరుపుకుంటారు.
ఆ క్రమంలో టెంక పండుగ, విత్తనాల పండుగ, పుష్పి పండుగ, గాటి వారాలు, పులి పండుగ, ఆగం పండుగ, అమ్మవారి పండుగ, సంబరాలు (ఇంటి పండుగ), కొత్త అమావాస్య, గొడ్డాలమ్మ (కంది పండుగ), కొర్ర కొత్త పండుగ, కొండెం కొత్త పండుగ, ఉజ్జీడమ్మ తల్లి పండుగ వంటి పర్వదినాల్లో ఇళ్లు, ముంగిళ్లు, చెట్లు, తోటలు, ఆలయాలను సవర చిత్రకళతో అద్భుతంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ చిత్రాలకు ఉపయోగించే ప్రతీది సహజసిద్ధమైందే. వరి, బొగ్గు, మట్టి, ఇటుక బెడ్డ రాయి, పసుపు, చెట్టు బెరడును ఉపయోగించి బొమ్మలు వేస్తారు. ఈ చిత్రకళ సుమారు మూడువేల ఏళ్ల కిందటిది. మధ్యప్రదేశ్‌లోని భీమ్ భేట్కా గుహల్లో గుర్తించిన ఆదీవాసీ చిత్రాలను ఈ కళకు తొలి ఉదాహరణలుగా చెబుతున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. భాష లేని ఆ కాలంలో భావాలను వ్యక్తపరచడానికి ఆనాటి మానవుడు తనలోని సృజనకు పదునుపెట్టి ఆ చిత్రాలను గీసినట్టు తేల్చారు. సవర చిత్రకళను కాపాడుకోవడానికి ఉత్సాహవంతులకు శిక్షణనూ అందిస్తున్నారు.
కార్డులను అందజేస్తున్నాం..
ఈ కళను సవర తెగకు చెందిన గిరిజనులు కాలానుగుణంగా అభివృద్ధిచేస్తూ బతికిస్తున్నారు. దాదాపు 500 మంది కళాకారులకు ఇదే జీవనోపాధి. రెండేళ్లుగా నేను, గౌరీశ్ మాష్టారు గిరిజన ప్రాంతాలన్నీ తిరుగుతూ సవర చిత్రకళాకారులను గుర్తిస్తూ, వారికి లేపాక్షి అధికారుల సాయంతో హస్తకళ(డీసీహెచ్) కార్డులను అందజేస్తున్నాం.
బేతాళ అనిల్‌కుమార్, హస్తకళల రిసోర్స్‌పర్సన్, పాలకొండ
వస్తువుల మీదా బొమ్మలు..
మా నాన్నకు సవర చిత్రకళలో మంచి నైపుణ్యం ఉంది. ఆయన మా ఇంటి గోడలపై బొమ్మలు వేస్తుండటం చూసి నాకూ దానిపట్ల ఆసక్తి పెరిగింది. సవర ఆదివాసీ డ్రాయింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. గోడలు, కాగితాల మీదే కాదు వస్తువుల మీదా బొమ్మలు వేస్తాను. లేపాక్షి ద్వారా మాలాంటి యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం జరగాలి.
గేదెల శంకర్, సవర చిత్రకళాకారుడు
అదొక వరం
కేవలం గీతలతోనే సందర్భానికి తగిన సన్నివేశాన్ని గీయడం గొప్ప నైపుణ్యం. ఆదొక వరం. డిగ్రీ చదివిన నాకు సరైన ఉద్యోగం లేకపోడంతో చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న ఈ కళే కొంతవరకు ఉపాధినిస్తోంది.
సవర నరేష్, జగత్‌పల్లి గ్రామం, సీతంపేటం మండల
యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి
(చదవండి: పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..)
Comments
Please login to add a commentAdd a comment