ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాలి
► ‘మన జిల్లా-మన ప్రణాళిక’పై అవగాహన
► మేనిఫెస్టో అమలే మా ఎజెండా
►ప్రణాళికలు పటిష్టంగా రూపొందించాలి
►అసంపూర్తి సాగు నీటి ప్రాజెక్టులపై దృష్టి
► పీహెచ్‌సీల స్థాయి పెంపు
►కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం
►డిప్యూటీ సీఎం రాజయ్య
సాక్షి, హన్మకొండ: గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా ప్రణాళికలు రూపొందిస్తే కుదరదు... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సాంకేతిక లోపాలు లేనివిధంగా పటిష్టంగా రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సూచించారు. హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘మన జిల్లా-మన ప్రణాళిక’పై అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మరో రెండు రోజులు సమయం తీసుకుని పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మన జిల్లా-మన ప్రణాళికలోని అంశాల ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని చెప్పారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆస్పత్రులను 30 పడకల స్థాయికి పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో అన్ని రకాల వైద్యసేవలు అం దుబాటులోకి తెస్తామన్నారు. వంద పడకల ఆస్పత్రుల్లో అన్ని రకాల ఆపరేషన్లు చేసేందుకు సరిపడా వసతులు కల్పిస్తామన్నారు. జిల్లాలో విషజ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మం జూరు చేసిన రూ.150 కోట్ల నిధులతో జిల్లా కేంద్రంలో నిమ్స్ స్థాయిలో వెద్యసదుపాయం కల్పిస్తామన్నారు.
హెల్త్ యూనివర్సిటీని వరంగల్‌లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటుందని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సూచనలు చేశారు. మామునూరు వద్ద అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో వెటర్నిటీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే... జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుతం వరి, కంది విత్తనాలపై జరుగుతున్న పరిశోధనలను మెట్ట పంటలకు విస్తరించాలని సూచించారు.
భూసేకరణ, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి
ఉపాధి కల్పనలో భాగంగా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమివ్వాలని మెజార్టీ ప్రజాప్రతినిధులు సూచించా రు. ఈ అంశంపై వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, వ్యాగన్ ఫ్యాక్టరీ, రైల్ కోచ్, టెక్స్‌టైల్స్ పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసే విధంగా వరంగల్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. కార్పొరేషన్ ఈ విషయంలో విఫలమమైతే మన దగ్గరకు వచ్చే పరిశ్రమలు వెనక్కి వెళ్లే అవకాశముందని హెచ్చరించారు. అంతకుముందు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మాట్లాడుతూ రైల్వే పరిశ్రమలతోపాటు విమానాశ్రయం, వెటర్నిటీ యూనివర్సిటీ, వరంగల్ చుట్టూ రింగురోడ్డు నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. మహబూబాబాద్‌లో ఉక్కు పరిశ్రమతోపాటు గిరిజన వర్సిటీని నెలకొల్పాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమిని గుర్తించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు కోరారు.
సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించాలి
అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచిం చారు. పెండింగ్ ప్రాజెక్టుల జాబితా రూపొందించి ప్రాధాన్యాన్ని అనుసరించి పనులన్నీ రెండేళ్ల లోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతి ప్రాథమిక సహకార సంఘం పరిధిలో మూడు గోదాంలు నిర్మించాలని డీసీసీబీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి కోరారు. 30 ఏళ్ల తర్వాత వరంగల్ డీసీసీబీకి రూ.3 కోట్ల లాభం వచ్చిందన్నారు.
తండాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయూలి
గిరిజన తండాల్లోని మహిళలు, యువకులకు బీడీ, సబ్బుల తయారీ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించడంతోపాటు తండాల్లో కుటీర పరిశ్రలు నెలకొల్పాలని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ సూచించారు. తాను తండాల నుంచే వచ్చానని... సరైన ఉపాధి వనరులు లేక కారణంగానే కొన్ని గిరిజన తండాలు గుడుంబా తయారీ కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద జిల్లాకు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరవుతాయని, వీటిని సద్విని యోగం చేసే దిశగా అభివృద్ధి, సంక్షేమ ప్రణాళికలు రూపొందించాలని కడియం శ్రీహరి సూచించారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వేళకు రావడం లేదని, వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండటం లేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమం ఎంతో గొప్పదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిర్మాణాత్మక రూపం ఇవ్వడంలో భాగమే మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం అని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అజ్మీరా చందూలాల్, శంకర్‌నాయక్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ జి.కిషన్, జేసీ పౌసుమిబసు, వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ సువర్ణదాస్‌పండా, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లుతోపాటు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. చివరి నిమిషం లో ఎంపీ గుండు సుధారాణి సమావేశానికి వచ్చారు.
మల్లన్న భూములపై దీక్షకు సిద్ధం
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సంబంధించిన చెరు వు భూములు అన్యాక్రాంతం కావడంపై ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఉదాసీనతపై ప్రశ్నించారు. రియల్ మాఫియా ధాటికి జిల్లాలో చాలా చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణకు గురైన మల్లన్న ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, అవసరమైన పక్షంలో అసెంబ్లీ ఎదుట మహాత్ముడి విగ్రహం వద్ద దీక్ష చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఒక నియోజకర్గం పరిధిలో ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలతో కమిటీ ఏర్పా టు చేసి ఆర్డీఓ అధ్యక్షతన సమావేశం నిర్వహించి ప్రణాళిక రూపొందిస్తే... అనుమానాలకు తావులేకుం డా ఉంటుందని ఆయన కలెక్టర్ కిషన్‌కు సూచించారు. కాగా, మల్లన్న జాగ మాయం, సమస్యలపై ‘సాక్షి’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది.
ప్రజాప్రతినిధుల సూచనలు
►పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అవసరాలు తీర్చేందుకు భూపాలపల్లి కేటీపీపీ ఉత్పత్తి
►సామర్థ్యాన్ని 2 వేల మెగావాట్లకు పెంచాలి.
►భూపాలపల్లిలో ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నెలకొల్పాలి.
►వరంగల్ గోపాలపురంలో శిల్పారామానికి కేటాయించిన 13 ఎకరాల స్థలం ఆక్రమణకు గురవుతోంది. దీన్ని అరికట్టడంతోపాటు వెంటనే శిల్పారామం పనులు ప్రారంభించాలి.
►ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములను సేకరించాలి.
►ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పత్తి అనుబంధ పరిశ్రమలు విస్తరించాలి.
►అభివృద్ధి పనుల్లో ‘నిట్’ సహకారం తీసుకోవాలి.