చాపలపై మామిడి గుజ్జును పూతగా పెడుతున్న కార్మికులు
సాక్షి, చాగల్లు (పశ్చిమగోదావరి) : మామిడి పండు అంటేనే నోరూరుతుంది. ఇక ఆ మామిడితో చేసే తాండ్రను తింటే మనం ఒక పట్టాన వదిలిపెట్టం. తాండ్రను పొరలు పొరలుగా తీసుకుంటూ తింటూ ఉంటే ఆ రుచే వేరు. పిల్లలు, పెద్దలు అనే తేడా అందరికీ ఇష్టమైన ఈ మామిడి తాండ్ర తయారీ కొంచెం కష్టమైనా రుచిలో మాత్రం అద్భుతం. ఇక ఆ మామిడితాండ్రకు ప్రసిద్ధి చెందిన చాగల్లు మండలం ఊనగట్ల గ్రామం వెళ్తే సీజన్‌లో ఎక్కడ చూసినా తాండ్ర తయారు చేస్తూ బిజీగా కనిపిస్తుంటారు. చాపలపై మామిడి రసం పాముతూ తాండ్ర ఎండబెట్టేందుకు శ్రమిస్తుంటారు. వేసవిలో దొరికే మామిడిపళ్ల రుచి అన్ని సీజన్లలోనూ ఆస్వాదించేలా తయారు చేసే మామిడి తాండ్ర సంగతులు తెలుసుకునేందుకు ఒకసారి ఊనగట్ల వెళ్లొద్దాం రండి.
ఊనగట్ల గ్రామంలో ఎప్పటి నుంచో ఈ మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. కాలం మారేకొద్దీ తయారీ విధానాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఏటా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాండ్ర తయారీ ముమ్మరంగా సాగుతుంది. మామిడి పండ్ల గుజ్జు నుంచి తాండ్రను తయారు చేస్తారు. గతంలో కాయలను రోళ్లలో వేసి గుజ్జు తీసేవారు. ఇప్పుడు అధునాతమైన యంత్రాల సాయంతో గుజ్జు తీస్తున్నారు. ఆ గుజ్జులో బెల్లం లేదా పంచదార కలిపి తాటాకు చాపలపై పూతగా పెడతారు. ఈ విధంగా ఎండాకాలంలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు చొప్పున వారం రోజులపాటు పూత పెడితే మామిడితాండ్ర తయారవుతుంది. తాండ్రను ఆరిన తరువాత ముక్కలుగా కోసి పెట్టెల్లో ప్యాక్ చేసి భద్రపరుస్తారు.
మామిడికాయల గుజ్జును తీస్తున్న దృశ్యం
ఇటీవల తగ్గిన తయారీ కేంద్రాలు
మామిడితాండ్రకు కలెక్టర్, రసాలు, బంగినపల్లి వంటి మామిడిపళ్ల రకాలు వినియోగిస్తారు. నిడదవోలు, కొవ్వూరుపాడు, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెం, నూజివీడు, కొరుకొండ, రాజమండ్రి మార్కెట్ల నుంచి మామిడికాయలను టన్నుల లెక్కన కొనుగోలు చేస్తారు. మామిడితాండ్ర కోసం ఒక్కొక్కరూ రోజూ టన్ను మామిడికాయల వరకు దిగుమతి చేసుకుంటారు. ఇటీవల వాతావరణం అనుకూలించక మామిడి కాపు తగ్గి రేట్లు గణనీయంగా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం మామిడితాండ్ర తయారీ కేంద్రాలు గతంలో 50 వరకు ఉండగా, ప్రస్తుతం 15 కేంద్రాలకు తగ్గిపోయాయి.
ఏటా వేసవిలో ఉపాధి
మామిడి తాండ్ర పెద్ద తయారీ కేంద్రాల్లో 25 నుంచి 30.. చిన్న కేంద్రాల్లో 15 నుంచి 20 మంది ఉపాధి పొందుతుంటారు. సీజన్‌లో గ్రామంలో సుమారు 500 మందికి పైగా ఉపాధి దొరుకుతుంది. మామిడితాండ్ర తయారీ సమయంలో వ్యవసాయ పనులు లేకపోకపోవడంతో ఈ పరిశ్రమ మహిళలకు ఆదాయ వనరు ఉంటోంది. ఈ ప్రాంత ప్రజలకు మామిడితాండ్ర తయారీ చక్కని ఉపాధి అవకాశాలు కలిగిస్తోంది. గత రెండేళ్లుగా సీజన్‌లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో తాండ్ర తయారీ నిర్వాహకులు భయపడ్డారు. భౌతిక దూరం, తగిన జాగ్రత్తలు పాటిస్తూ కూలీలతో పనులు చేసుకోవచ్చని ప్రభుత్వం భరోసా కల్పించడంతో తయారీ దారులు మామిడి కాయలను దిగుమతి చేసుకుని తాండ్ర తయారీ పనులు కొనసాగించారు.
హైద్రాబాద్, ముంబై, చెన్నైలకు ఎగుమతి
తాండ్రను తగిన సైజుల్లో ముక్కలుగా కోసి 50 కేజీలు చొప్పున పెట్టెలుగా పెట్టి 200 పెట్టెలను లారీకి ఎగుమతి చేస్తుంటారు. మామిడితాండ్ర ధర క్వింటాలు రూ.8 వేలు నుంచి రూ.9 వేల వరకు ఉంటుంది. సుమారు రూ.50 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. హైద్రాబాద్, ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు తాండ్ర ఎగుమతి చేస్తారు. మామిడితాండ్రను సైకిళ్లపై విక్రయిస్తూ మరో వంద మంది వరకు ఉపాధి పొందుతున్నారు.
ఏడాది పొడవునా అమ్మకాలు
ఎన్నో ఏళ్లుగా మామిడితాండ్ర తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నాం. తాండ్రను కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచి ఏడాది పొడవునా అమ్మకాలు చేస్తున్నాం. – బి. శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు
తయారీవ్యయంతో ఇబ్బందులు
పెరుగుతున్న మామిడి ధరలతో పాటు కూలీల కొరత అధికంగా ఉంటుంది. తాండ్రకు గిట్టుబాటు ధరలు అంతంత మాత్రంగా ఉండటంతో ఇటీవల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – కొండేపర్తి శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు
తాండ్ర తయారీతో మహిళలకు ఉపాధి
మామిడితాండ్ర కుటీర పరిశ్రమగా వేసవి కాలంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పనిని బట్టి రోజుకు రూ.200 నుంచి రూ.250 వరకు కూలీ లభిస్తుంది. ఈ ప్రాంత మహిళల అభివృద్ధి తాండ్ర పరిశ్రమ దోహదం చేస్తుంది. – కె. సీతామహాలక్ష్మి, మామిడితాండ్ర తయారీ కూలీ
Comments
Please login to add a commentAdd a comment