ఎంతో ప్రయాసపడి, దూరతీరాల నుంచి ఇల్లిల్లూ వెతుక్కుంటూ వచ్చి పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్లాక దాన్ని మనమేం చేస్తాం. అదెంత ఖరీదైనదైనా మహా అయితే పెళ్లి రోజు వరకూ ఉంచి ఆ తరువాత ఊడ్చి పారేస్తాం. అలా కాకుండా అందరూ భద్రంగా దాచుకునేలా తన కూతురి పెళ్లి పత్రికను తయారుచేయాలనుకున్నారు కేరళకు చెందిన ఓ ఎమ్మెల్యే. కేరళ తానూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్దుర్ రహ్మాన్ తన కుమార్తె రిజ్వానా షేరిన్ రిసెప్షన్‌కు వచ్చే అతిథులను ప్రత్యేకంగా ఆహ్వనించాలనుకున్నారు. తమ ఇంటి పెళ్లి పిలుపు వాళ్లింట్లో ఓ జ్ఞాపకంగా మిగిలిపోతే బావుంటుందని భావించారు. అందుకే స్క్రీన్ ప్రింటెడ్ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దారు.
అన్ని రంగులూ అద్దుకొని గుండెలనిండా ఆహ్వానించే నిండైన పెళ్లి పత్రికను తయారు చేశారు. కాకపోతే మీరు చదివాక లేదా పెళ్లి అయిపోయాక దాన్ని పూడ్చిపెట్టాలని రాసి మరీ ఇచ్చారు. ఎందుకంటే అందులోని రకరకాల పూల విత్తనాలు లేదా కూరగాయల విత్తనాలు ప్రేమతో మొలకెత్తాలంటే పత్రికను మట్టిలో పెట్టి సూర్యరశ్మి పడేలా కుండీలో ఉంచి నీళ్లు పోస్తే సరి. ఎమ్మెల్యేగారి పెళ్లి పత్రిక మీ ఇంట్లో ఏ గులాబీ మొక్కగానో లేక చామంతిగానో మొలుస్తుంది. క్యారెట్టో, పాలకూరగానో పెళ్లి జ్ఞాపకాన్ని పదే పదే గుర్తుచేస్తుంది. అది పూచిన ప్రతిసారీ ఆ జ్ఞాపకం మీ మదిలో ఆనందమై విరుస్తుంది. అయితే ఇది తయారు చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే.
రీసైకిల్ చేసేందుకు వీలైన అట్టలో పలు రకాల విత్తనాలు పొందుపరిచి మరీ ఈ పెళ్లి పత్రికను రూపొందించాలి మరి. అయితేనేం ఈ పత్రిక తయారీ కుటీర పరిశ్రమ ద్వారా పది మందికి అన్నంపెడుతున్నప్పుడు అంటారు ఎమ్మెల్యే సారు.
పూవై పూచే పెళ్లిపత్రిక!
Published Sun, Jul 22 2018 1:28 AM | Last Updated on Sun, Jul 22 2018 1:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment