kerala mla
-
Supreme Court: కులం పేరిట వేధిస్తేనే... ఎస్సీ, ఎస్టీ కేసు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజికవర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు‘ అని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజన్ స్కారియా అనే యూట్యూబర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళకు చెందిన ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. మరుణదాన్ మలయాళీ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్న షాజన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. షాజన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, ‘బెదిరింపులకు, లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం సెక్షన్ 3(1)(ఆర్) వర్తించబోదు. కులం పేరిట అవమానించినప్పుడు, వేధించినపుడు మాత్రమే వర్తిస్తుంది. సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు, అగ్ర కులస్తులు మైల, పవిత్రత అంటూ నిమ్నవర్ణాల వారిపట్ల కులం పేరిట దురహంకారపూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకే కఠినమైన సెక్షన్లు చేర్చారు. కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాల ముఖ్యం‘ అని స్పష్టం చేసింది. ‘షాజన్ కేసులో అదేమీ కని్పంచడం లేదు. సదరు వీడియో ద్వారా ఎస్సీ, ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శతృత్వ భావం, దురుద్దేశాల వంటివి వెళ్లగక్కినట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారు‘ అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. -
ఆభరణాల మోసం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
తిరువనంతపురం : ఆభరణాల పెట్టుబడి మోసం కేసులో ఐయుఎంఎల్ ఎమ్మెల్యే ఎంసి కమరుద్దీన్‌ను శనివారం కేరళ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. కాగా కమరుద్దీన్ కాసర్గోడ్ జిల్లాలోని మంజేశ్వర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కమరుద్దీన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఫ్యాషన్ గోల్డ్ జ్యువెల్లరీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ చాలామందిని ప్రభావితం చేసినట్లుగా తేలింది. కమరుద్దీన్‌పై ఉన్న నమ్మకంతో వందలాది మంది ఫ్యాషన్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టారు. అయితే గత జూలైలో వ్యాపారంలో ఆర్థికంగా నష్టంరావడంతో ఫ్యాషన్ గోల్డ్ బోర్డు తిప్పేసింది. కాగా కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి కనీసం తమ వాటా కూడా రాలేదు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఎమ్మెల్యే కమరుద్దీన్‌తో పాటు సిబ్బందిపై కేసు నమోదు చేశారు. కాగా కమరుద్దీన్‌పై 115 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదులపై దర్యాప్తు కోసం రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. దీనిలో భాగంగానే సెక్షన్ 420 కింద కమరుద్దీన్ అరెస్ట్ చేసిన సిట్ బృందం శనివారం దాదాపు 5గంటల పాటు విచారణ చేసింది. కాగా అరెస్టు తరువాత వైద్య పరీక్షల నిమిత్తం కమరుద్దీన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మీడియాతో మాట్లాడిన ఆయన తన అరెస్ట్ రాజకీయంగా ప్రేరేపించబడిందని అన్నారు. -
పూవై పూచే పెళ్లిపత్రిక!
ఎంతో ప్రయాసపడి, దూరతీరాల నుంచి ఇల్లిల్లూ వెతుక్కుంటూ వచ్చి పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్లాక దాన్ని మనమేం చేస్తాం. అదెంత ఖరీదైనదైనా మహా అయితే పెళ్లి రోజు వరకూ ఉంచి ఆ తరువాత ఊడ్చి పారేస్తాం. అలా కాకుండా అందరూ భద్రంగా దాచుకునేలా తన కూతురి పెళ్లి పత్రికను తయారుచేయాలనుకున్నారు కేరళకు చెందిన ఓ ఎమ్మెల్యే. కేరళ తానూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్దుర్ రహ్మాన్ తన కుమార్తె రిజ్వానా షేరిన్ రిసెప్షన్‌కు వచ్చే అతిథులను ప్రత్యేకంగా ఆహ్వనించాలనుకున్నారు. తమ ఇంటి పెళ్లి పిలుపు వాళ్లింట్లో ఓ జ్ఞాపకంగా మిగిలిపోతే బావుంటుందని భావించారు. అందుకే స్క్రీన్ ప్రింటెడ్ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దారు. అన్ని రంగులూ అద్దుకొని గుండెలనిండా ఆహ్వానించే నిండైన పెళ్లి పత్రికను తయారు చేశారు. కాకపోతే మీరు చదివాక లేదా పెళ్లి అయిపోయాక దాన్ని పూడ్చిపెట్టాలని రాసి మరీ ఇచ్చారు. ఎందుకంటే అందులోని రకరకాల పూల విత్తనాలు లేదా కూరగాయల విత్తనాలు ప్రేమతో మొలకెత్తాలంటే పత్రికను మట్టిలో పెట్టి సూర్యరశ్మి పడేలా కుండీలో ఉంచి నీళ్లు పోస్తే సరి. ఎమ్మెల్యేగారి పెళ్లి పత్రిక మీ ఇంట్లో ఏ గులాబీ మొక్కగానో లేక చామంతిగానో మొలుస్తుంది. క్యారెట్టో, పాలకూరగానో పెళ్లి జ్ఞాపకాన్ని పదే పదే గుర్తుచేస్తుంది. అది పూచిన ప్రతిసారీ ఆ జ్ఞాపకం మీ మదిలో ఆనందమై విరుస్తుంది. అయితే ఇది తయారు చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే. రీసైకిల్ చేసేందుకు వీలైన అట్టలో పలు రకాల విత్తనాలు పొందుపరిచి మరీ ఈ పెళ్లి పత్రికను రూపొందించాలి మరి. అయితేనేం ఈ పత్రిక తయారీ కుటీర పరిశ్రమ ద్వారా పది మందికి అన్నంపెడుతున్నప్పుడు అంటారు ఎమ్మెల్యే సారు. -
భోజనం లేటైందని.. కొట్టిన ఎమ్మెల్యే
తనకు భోజనం వడ్డించడం 20 నిమిషాలు ఆలస్యమైందని.. క్యాంటీన్లో పనిచేసే పార్ట్ టైం సర్వర్‌ను ఓ ఎమ్మెల్యే చెంపమీద కొట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పీసీ జార్జ్ తనను కొట్టారని ఆ కార్మికుడు స్థానిక మీడియా వద్ద వాపోయాడు. అయితే దీనిపై అతడు ఎవరికీ ఫిర్యాదు మాత్రం చేయలేదు. తాను ఎవరినీ కొట్టలేదని, అనవసరంగా తన పేరు ఇందులో ఇరికించినందుకు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే జార్జ్ అంటున్నారు. తాను ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లేసరికి ఆయన ఓ మహిళను తిడుతున్నారని, తనను చూసేసరికి తనను కూడా తిట్టారని మను అనే ఆ కార్మికుడు చెప్పాడు. తిట్టాల్సిన అవసరం ఏమీ లేదని తాను చెప్పగా చెంపమీద కొట్టారని ఆరోపించాడు. కొట్టాయం జిల్లాలోని పూంజర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జార్జ్ (65) ఈ ఆరోపణలను ఖండించారు. తాను మధ్యాహ్నం 1.30కి భోజనం కావాలని చెప్పానని, 2.05 అయినా అది రాలేదని జార్జ్ అన్నారు. మరీ ఆలస్యం అవుతుండటంతో క్యాంటీన్ సూపర్వైజర్గా పనిచేస్తున్న మహిళను పిలిచి అడగ్గా, అప్పటికే పంపానని ఆమె చెప్పారన్నారు. ఇలాంటి పనికిమాలిన వాళ్లను తీసుకోకూడదని ఆమెకు చెబుతుండగా ఈ కుర్రాడు వచ్చాడని, సూపర్వైజర్ను తిట్టడంతో అతడు కోపగించుకున్నాడని, తాను అతడిని తిట్టి బయటకు పంపేశాను తప్ప కొట్టలేదని జార్జ్ వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై తాను స్పీకర్ శ్రీరామకృష్ణన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.