మూగ, చెవుడు, అవయవలోపంతో బాధపడుతున్న పల్లవి, దేవేంద్ర, సంజయ్, తిప్పక్క
ఉమ్మడి కుటుంబం.. ఇంటినిండా జనం.. అనుబంధాల గుమ్మం..అనురాగాల కాపురం.. విధి వికృతం..మేనరికం శాపమో..పేదరికం పాపమో.. విధిపై యుద్ధం చేయాలనుంది.. వైకల్యం వెక్కిరిస్తోంది..గద్దించాలనుంది..గొంతు ఉన్నా పెగలడంలేదు. కష్టాలను ఎదురీదుతామని విన్నవించుకోవడం తప్పా..వినలేని దైన్యం వారిది. రాయదుర్గంలోని నేసేపేటలో నివాసముంటున్న దొడగట్ట గంగమ్మ కుటుంబాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. శ్రమను నమ్ముకున్న ఈ కుటుంబంలో ఏకంగా నలుగురు బధిరులు ఉన్నారు. జీవన పోరాటం సాగిస్తూ కుటీర పరిశ్రమ కోసం చేయూత కోరుకుంటున్నారు.
రాయదుర్గం: రాయదుర్గంలోని నేసేపేటలో నివాసముంటున్న దొడగట్ట గంగమ్మ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అందులో ఒక కుమారుడు దేవేంద్ర, కుమార్తె తిప్పక్క పుట్టుకతోనే మూగవారు. ఎదిగే కొద్దీ వినికిడి శక్తినీ కోల్పోయారు. దేవేంద్రకు సమీప బంధువైన నాగవేణితో వివాహమైంది. వీరికి రాధ, సంజయ్, పల్లవి సంతానం. వీరిలో సంజయ్‌కు మూగ, చెవుడు, అవయవలోపం ఉంది.
పల్లవి కూడా మూగ, చెవుడుతో బాధపడుతోంది. వీరు పదో తరగతి వరకు చదువుకున్నారు. తిప్పక్కకు వివాహమైనప్పటికీ భర్తతో మనస్పర్థల నేపథ్యంలో తల్లి వద్దే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. గంగమ్మ మరో కుమార్తె వివాహమై మెట్టినింటికి వెళ్లిపోయారు. మొత్తం మీద తొమ్మిది మంది సభ్యులు గల ఈ ఉమ్మడి కుటుంబంలో నలుగురు మూగ, చెవుడు, వైకల్యంతో బాధపడుతున్నారు.
సైగలతోనే సంభాషణ..
గంగమ్మ కుమారుడు దేవేంద్ర, కుమార్తె తిప్పక్క, మనవడు సంజయ్, మనవరాలు పల్లవి సైగలతోనే సంభాషిస్తుంటారు. అవతలి వారికి వీరి భాష అర్థం కాకపోతే కాగితంపై రాసి చూపుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు వేరేచోట ఉన్నపుడు వారితో అవసరం ఉంటే వాట్సాప్ వీడియో కాల్‌ను ఉపయోగించుకుంటున్నారు.
కుటీర పరిశ్రమ కోసం వినతి..
దేవేంద్ర తన భార్య నాగవేణితో కలిసి ఇంట్లోనే కుట్టుమిషన్ పెట్టుకుని పీస్ వర్క్‌పై జీన్స్‌ప్యాంట్లు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్యనే కుమార్తె పల్లవికి కూడా కుట్టుమిషన్‌లో శిక్షణ ఇస్తున్నాడు. కుమారుడు సంజయ్ తనకు చేతనైన మేరకు తల్లిదండ్రులకు సహకారం అందిస్తున్నాడు. తల్లికి వృద్ధాప్య పింఛన్, దేవేంద్రకు వికలాంగుల పింఛన్ అందుతోంది. దేవేంద్ర సోదరి తిప్పక్కకు సెపరేట్ రేషన్‌కార్డు ఉన్నందున ఆమెకు పింఛన్ వస్తోంది. దీనితోనే అందరూ బతుకుబండి లాగుతున్నారు. అరకొర సంపాదనతో అవసరాలు పూర్తిస్థాయిలో తీరడం లేదు. పీస్ వర్క్ కాకుండా సొంతంగా వర్క్ ఆర్డర్ తెచ్చుకుని కుట్టివ్వడం ద్వారా సంపాదనను మరింత పెంచుకోవడానికి కుటీర పరిశ్రమ ఏర్పాటు కోసం తమకు బ్యాంకు ద్వారా రుణం ఇప్పించాలని దేవేంద్ర దంపతులు కోరుతున్నారు.
ప్రతి క్షణం కుంగిపోతున్నాం
నాకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు మూగ వారిగా జన్మించారు. కుమారుడికి కూడా ఇద్దరు పిల్లలు మూగ, చెవుడు, వైకల్య లోపంతో జన్మించడం బాధేస్తోంది. ఆ దేవుడు మాకే ఎందుకు ఇలా చేశాడని ప్రతిక్షణం కుంగిపోతున్నాం. అయినా బతుకుపోరాటం కొనసాగిస్తున్నాం. ఇంటి నిండా జనం. అయినా నిశ్శబ్దం. సైగలతోనే సహజీవనం. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటాం.
– గంగమ్మ, కుటుంబ పెద్ద
(చదవండి: పులినే చంపగల శునకం.. ఖరీదులో కనకం...)
Comments
Please login to add a commentAdd a comment