Biological Weapons Harmful To People And Types Potential Effects - Sakshi
Sakshi News home page

‘బయో’త్పాతం: చైనాపై అనుమానాలు ఎందుకంటే?

Published Sun, Jul 11 2021 11:40 AM | Last Updated on Sun, Jul 11 2021 2:22 PM

Biological Weapons Harmful To People And Types Potential Effects - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ మహమ్మారి ఉధృతి ఒకవైపు కొనసాగుతుండగానే, భవిష్యత్‌ ‘బయో’త్పాతాలపై అనుమానాలూ పెరుగుతున్నాయి. ‘కరోనా’ వైరస్‌ వ్యాప్తి వెనుక చైనా పాత్రపై అనుమానాలను బలపరచే కథనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అలాగని, జీవాయుధాలపై ప్రయోగాలు జరుపుతున్న దేశం చైనా ఒక్కటి మాత్రమే కాదు. అంతర్జాతీయ ఒడంబడికలను ఏమాత్రం లెక్కచేయకుండా దాదాపు పదహారు దేశాలు జీవాయుధ ప్రయోగాలను కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. భవిష్యత్తులో ఏవైనా దేశాలు గాని, ఉగ్రవాద సంస్థలు గాని జీవాయుధాలతో దాడులకు తెగబడితే, అప్పుడు వాటిల్లే నష్టం ఊహకందని పరిస్థితులు ఉన్నాయి. 

దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ‘కరోనా’ మహమ్మారి ఇప్పటికే పెద్దసంఖ్యలో ప్రాణనష్టం కలిగించింది. ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసింది. చైనాలోని వుహాన్‌ ప్రాంతంలో మొదలైన ‘కరోనా’ వైరస్‌ పుట్టుకపై తొలినాళ్లలోనే కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది చైనా సృష్టేనని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అప్పట్లో ట్రంప్‌ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇటీవల ఆధారాలతో సహా వెలుగులోకి వస్తున్న కథనాల కారణంగా ‘కరోనా’ సృష్టి వెనుక చైనా హస్తం ఉండవచ్చనే దానిపై అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. 

ప్రపంచంలో ‘బయో’త్పాతం సృష్టించే ఉద్దేశంతో చైనా తయారు చేసుకున్న జీవాయుధాల్లో ‘కరోనా’ వైరస్‌ ఒకటి కావచ్చని వివిధ దేశాలకు చెందిన శాస్త్రనిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో తుపాకులు, ఫిరంగులు, బాంబుల వంటి ఆయుధాలతో కాకుండా, మహమ్మారి రోగాలతో విజృంభించే జీవకణాలనే ఆయుధాలుగా ప్రయోగించే యుద్ధాలు జరగవచ్చని, అలాంటి పరిస్థితుల్లో శత్రువు ఎవరో గుర్తించడం కూడా కష్టమవుతుందని, శత్రువును గుర్తించేలోగానే జరగరాని నష్టం జరిగిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్తులో జరగబోయే యుద్ధాల్లో ధూర్త దేశాలు ఏవైనా జీవ రసాయనిక ఆయుధాలను ప్రయోగించే ప్రమాదం లేకపోలేదనే ఆలోచనతోనే, యుద్ధాల్లో జీవాయుధాలను ఉపయోగించరాదంటూ ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితిలో 1972లోనే ‘బయోలాజికల్‌ వెపన్స్‌ కన్వెన్షన్‌’ (బీడబ్ల్యూసీ) పేరిట ఒక ఒడంబడికను కుదుర్చుకున్నాయి. ఇది 1975 మార్చి 26 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఒడంబడికపై 2013 నాటికి తైవాన్‌ సహా 183 దేశాలు సంతకాలు చేశాయి. ఒకవైపు ఈ అంతర్జాతీయ ఒడంబడికపై సంతకాలు చేసినా, కొన్ని దేశాలు రహస్యంగా జీవాయుధాలను పోగు చేసుకుంటున్నాయి. తీవ్రస్థాయిలో ప్రాణనష్టం కలిగించగలిగే జీవకణాలను తమ లాబొరేటరీల్లో సిద్ధం చేసుకుంటున్నాయి. జీవాయుధ ప్రయోగ నిరోధక ఒడంబడికపై తొమ్మిదో సమీక్ష సమావేశం ఈ ఏడాది నవంబర్‌లో జరగనుంది. 

ఇటీవలి జీవాయుధ దాడులు
ఇరవయ్యేళ్ల కిందట అల్‌–కాయిదా ఉగ్రవాద సంస్థ 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట సౌధాలను కూల్చివేసిన కొద్ది రోజులకే, అమెరికాలోని ఇద్దరు సెనేటర్లకు, కొన్ని వార్తాసంస్థలకు ‘ఆంత్రాక్స్‌’ సూక్ష్మజీవులతో కూడిన లేఖలు అందాయి. వాటి ప్రభావానికి ఐదుగురు మరణించగా, మరో పదిహేడు మంది తీవ్ర అస్వస్థులై ఆస్పత్రుల పాలయ్యారు. ఆ తర్వాత చికిత్సతో కోలుకున్నారు. దాదాపు ముప్పయ్యేళ్ల కిందట జపాన్‌లోని ‘అవుమ్‌ షిన్నిక్యో’ అనే ముఠా ఆంత్రాక్స్, బోటులినమ్‌ క్రిములను ఆయుధాలుగా వాడి తీవ్ర ప్రాణనష్టం కలిగించింది. ఈ సంఘటనల తర్వాత ఉగ్రవాద సంస్థలు జీవాయుధాలను ప్రయోగించిన దాఖలాలు ఇప్పటికైతే లేవు గాని, భవిష్యత్తులో ప్రయోగించబోవనే భరోసా మాత్రం ఏదీ లేదు. ఎవరైనా జీవాయుధాలను ఉద్దేశపూర్వకంగా ప్రయోగించినా, భవిష్యత్తులో ప్రయోగించే ఉద్దేశంతో వాటిపై జరిపే ప్రయోగాలు వికటించినా, ‘కరోనా’ వంటి మహమ్మారి రోగాలు ప్రపంచాన్ని ముంచెత్తే అవకాశాలు లేకపోలేదు. 

చైనాపై అనుమానాలు ఎందుకంటే?
‘కరోనా’ వ్యాప్తికి సంబంధించి చైనాపై ప్రపంచ దేశాల్లో అనుమానాలు పెరుగుతుండటానికి బలమైన కారణాలే ఉన్నాయి. ‘కరోనా’ తొలి కేసు చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వుహాన్‌ నగరంలో ఈ వ్యాధి సోకిన వారు గుర్తుతెలియని కారణంతో న్యుమోనియా లక్షణాలతో బాధపడుతున్నట్లు 2019 డిసెంబర్‌ 31న చైనా అధికారుల నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూహెచ్‌వో) సమాచారం అందింది. ఈ వ్యాధికి కొత్త తరహా కరోనా వైరస్‌ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు చైనా అధికారులు 2020 జనవరి 7న గుర్తించారు. గబ్బిలాల కారణంగా జనసమ్మర్దం గల వుహాన్‌ చేపల మార్కెట్‌లో ఈ వ్యాధి మొదలైనట్లు చైనా మీడియా తొలుత కథనాలను ప్రసారం చేసింది. ప్రపంచమంతా అంతే కాబోలనుకుంది. ‘కరోనా’ మహమ్మారి తొలి విడత ఉధృతి సద్దుమణిగి, రెండో విడత ఉధృతి మొదలవుతున్న నాటికి చైనాపై అనుమానాలు రేకెత్తించే కథనాలు కొన్ని వెలువడ్డాయి.

‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి మొదలవడానికి కొన్ని నెలల ముందే, అంటే– 2019 నవంబరులో వుహాన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ వ్యాధి లక్షణాలతోనే ఆస్పత్రి పాౖలయ్యారని ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా తెలిసినట్లు‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ వెలుగులోకి తెచ్చిన కథనం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఇదిలా ఉంటే, వుహాన్‌ లాబ్‌లో గబ్బిలాలపై ప్రయోగాలు జరపడం లేదని, అసలు లాబ్‌లో గబ్బిలాలే లేవని చైనా అధికారులు తమపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. అయితే, వుహాన్‌ లాబ్‌లో పరిశోధనల కోసం గబ్బిలాలను బోనుల్లో బంధించి ఉన్న దృశ్యాల వీడియో ఇటీవల వెలుగులోకి రావడంతో ‘కరోనా’ వైరస్‌ వ్యాప్తి వెనుక చైనా హస్తంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.  జీవాయుధాల సృష్టిలో భాగంగానే వుహాన్‌ శాస్త్రవేత్తలు వైరస్‌లో కృత్రిమంగా ఉత్పరివర్తనలు తీసుకొచ్చే ప్రయోగాలు జరిపి ఉంటారని, పొరపాటున ఆ ప్రయోగాలు వికటించడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాపించి ఉంటుందని పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ కథనాన్ని చైనా అధికారులు కొట్టిపారేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ‘కరోనా’ వైరస్‌ పుట్టుకకు చైనాలో గల మూలాలపై దర్యాప్తు నిగ్గు తేల్చాలని అమెరికా డబ్ల్యూహెచ్‌వోపై ఒత్తిడి తెస్తోంది. ‘కరోనా’ వైరస్‌ జన్మరహస్యం తేలాల్సిందేనంటూ అమెరికా సహా జీ–7 దేశాలు పట్టుబడుతున్నాయి. ‘కరోనా’ మూలాలు తెలుసుకునే అంశంపై ఒకవైపు ప్రపంచదేశాలతో గొంతు కలుపుతూనే, మరోవైపు ‘కరోనా’ మూలాలను తెలుసుకోవడానికి అమెరికా తన సొంత ప్రయత్నాలనూ సాగిస్తోంది. దీనిపై నిశితంగా పరిశోధించి నివేదిక ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తమ ఇంటెలిజెన్స్‌ అధికారులకు తొంభై రోజుల గడువు విధించారు. అయితే, కంటికి కనిపించని ఒక వైరస్‌ పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి అట్టుగుట్టు ఆనవాళ్లు కనిపెట్టడం గడువు విధించినంత తేలికకాదు. ‘కరోనా’ జన్మరహస్యం ఎప్పటికి బయటపడుతుందో వేచిచూడాల్సిందే!

‘బయో’దాడుల చరిత్ర
శత్రువులపై ‘బయో’దాడులు జరిపే పాడు పద్ధతి ఇప్పటిది కాదు. చరిత్రలో తొలిసారిగా పద్నాలుగో శతాబ్దిలోనే ఇలాంటి దాడి ఒకటి జరిగింది. మంగోల్‌ బలగాలు 1347లో ప్లేగుతో మరణించిన వారి శవాలను నల్లసముద్ర తీరంలోని తమ శత్రువులు ఉండే కాఫా నగరంలో (ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని ఫియోడోసియా) పడవేశారు. ఫలితంగా నల్లసముద్ర తీరంలోని ఇటాలియన్‌ నౌకల్లో ఉండేవారికి ప్లేగు సోకింది. ఈ నౌకలు తిరిగి ఇటలీకి చేరుకున్నాక, యూరోప్‌ అంతటా ప్లేగు విజృంభణ మొదలైంది. అప్పటి ప్లేగు ధాటికి ఏకంగా రెండున్నర కోట్లకు పైగా– అంటే అప్పటి యూరోప్‌ జనాభాలో మూడోవంతు ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 

రష్యన్‌ సైన్యం కూడా 1710లో ఇదే పద్ధతి అమలు చేసింది. స్వీడిష్‌ దళాలతో యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యన్‌ బలగాలు ప్లేగుతో మరణించిన వారి శవాలను రేవల్‌ నగరం (ప్రస్తుతం ఎస్టోనియాలోని టాలిన్‌) గోడల మీదుగా పడవేశారు. పాంటియాక్‌ తిరుగుబాటు సమయంలో 1763లో ఫోర్ట్‌పిట్‌ను (ప్రస్తుతం పిట్స్‌బర్గ్‌) ముట్టడించిన బ్రిటిష్‌ సేనలు, ఆ తిరుగుబాటులో పాల్గొన్న భారతీయులకు మశూచి వైరస్‌ ఉన్న దుప్పట్లు అందేలా చేయడంతో అప్పట్లో తీవ్రస్థాయిలో మశూచి వ్యాపించి, భారీనష్టం వాటిల్లింది. 

మొదటి ప్రపంచయుద్ధంలో భారీనష్టం దరిమిలా, యుద్ధాలలో ‘బయో’త్పాతాలను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ 1925లో జెనీవాలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం యుద్ధాలలో జీవాయుధాలను, రసాయనిక ఆయుధాలను ఉపయోగించరాదు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలేవీ జీవ, రసాయనిక ఆయుధాల తయారీకి ప్రయోగాలు, పరిశోధనలు కూడా చేపట్టరాదు. అయితే, ఈ ఒప్పందంపై సంతకం చేసిన జపాన్, దీనిని ఉల్లంఘించి భారీస్థాయిలో జీవ, రసాయనిక ఆయుధాల తయారీ కోసం ప్రయోగాలు సాగించింది. అంతటితో ఆగకుండా, చైనాలో మోహరించిన మిత్రబలగాలపై 1937–45 మధ్యకాలంలో జీవాయుధాలను ప్రయోగించి, భారీ నష్టానికి కారణమైంది. తమకు పట్టుబడిన దాదాపు మూడువేల మందికి పైగా యుద్ధఖైదీలపై జీవాయుధాల ప్రయోగాలు జరిపి, వారిని హతమార్చింది. జపాన్‌ అప్పట్లో ప్రయోగించిన జీవాయుధాల్లో ప్లేగు, ఆంత్రాక్స్, యెల్లో ఫీవర్, హెపటైటిస్, కలరా, మశూచి వంటి మహమ్మారి వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులు ఉన్నాయి.

రెండో ప్రపంచ యుద్ధంలో జీవాయుధాలు ప్రయోగించారనేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా, యుద్ధసమయంలో వివిధ దేశాలు వీటి తయారీకి విస్తృతంగా పరిశోధనలు సాగించినట్లు దాఖలాలు ఉన్నాయి. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిన సమయంలో అమెరికా, సోవియట్‌ రష్యా, వాటి మిత్రదేశాల్లో కొన్ని అప్పట్లో జీవాయుధాలపై విస్తృతంగా పరిశోధనలు సాగించాయి. సోవియట్‌ యూనియన్‌ 1991లో పదిహేను దేశాలుగా విడిపోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు బోరిస్‌ యెల్త్సిన్‌ సోవియట్‌ యూనియన్‌ బయోలాజికల్‌ వార్‌ కన్వెన్షన్‌ను (బీడబ్ల్యూసీ) ఉల్లంఘించినట్లు బహిరంగంగా అంగీకరించారు.

అయితే, సోవియట్‌ హయాంలో జరిగిన ప్రయోగాల్లో ఉపయోగించిన జీవాయుధాలన్నింటినీ పూర్తిగా నాశనం చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఆ తర్వాత రష్యాలో చాలా మార్పులే జరిగాయి గాని, జీవాయుధాలను నాశనం చేసినట్లుగా అక్కడి నుంచి ఇన్నాళ్లలో ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. జీవాయుధ ప్రయోగాలు చేస్తున్నట్లుగా ఏ దేశమూ బహిరంగంగా చెప్పుకోకపోయినా, పదహారు దేశాలు ఈ ప్రయోగాలు సాగిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. జీవాయుధాలపై రహస్య ప్రయోగాలు సాగిస్తున్న దేశాల సంఖ్య మరింత ఎక్కువగా కూడా ఉండవచ్చని కొందరు పరిశీలకుల అంచనా. 

పసిగట్టడం కష్టమే!
తుపాకులు, బాంబులు వంటి ఆయుధాలను ప్రయోగించే వారిని, చివరకు అణ్వాయుధాలను ప్రయోగించే వారిని సైతం గుర్తించడం తేలికే గాని, జీవాయుధాలను ప్రయోగించే వారిని గుర్తించడం అంత తేలిక కాదు. జీవాయుధ ప్రయోగాల ఆనవాళ్లను పసిగట్టడం దుస్సాధ్యమైన పని. బీడబ్ల్యూసీని ఉల్లంఘించి ఇప్పటికీ కొన్ని దేశాలు జీవాయుధాలపై ప్రయోగాలు సాగిస్తున్నట్లుగా అంతర్జాతీయ నిఘా సంస్థలు చెబుతున్నా, ఆ ప్రయోగాలను నిర్ధారించే సాక్ష్యాధారాలను కనిపెట్టి, బయటపెట్టే పని మాత్రం చేయలేకపోతున్నాయి. వ్యాక్సిన్ల రూపకల్పన పేరిట, ఔషధాల తయారీ పేరిట కొన్ని సంస్థలు నిర్వహించే ప్రయోగశాలల్లో జీవాయుధాల ప్రయోగాలు గుట్టుగా సాగుతుంటాయి.

కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఇలాంటి ప్రయోగాలకు అండదండలు అందిస్తుంటాయి. మరోవైపు అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలు సైతం జీవాయుధాల తయారీ కోసం ప్రయోగాలు నిర్వహించే అవకాశాలు లేకపోలేదని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వక దాడుల వల్ల కాకపోయినా, ప్రయోగలశాలల్లో కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న జీవాయుధాల్లో ఏవైనా పొరపాటుగా వాతావరణంలోకి చేరితే జరగబోయే బీభత్సం మామూలుగా ఉండదు. పెద్దసంఖ్యలో ప్రాణనష్టం కలిగించే మహమ్మారి రోగాలుగా విరుచుకుపడే వీటిని వెంటనే అదుపు చేయడమూ కష్టమే.

ప్రయోగాలు కారుచౌక
అణ్వాయుధాలు, ఇతర రసాయనిక ఆయుధాల తయారీతో పోల్చుకుంటే జీవాయుధాల తయారీ ప్రక్రియ కారుచౌక అనే చెప్పుకోవచ్చు. ఒక లాబొరేటరీ, డజను మంది శాస్త్రవేత్తలు, కొద్దిపాటి పరికరాలు ఉంటే చాలు. ఏదో ఒక మారుమూల గుట్టుచప్పుడు కాకుండా వీటి తయారీ కొనసాగించవచ్చు. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవులను భద్రపరచడానికి విశాలమైన గిడ్డంగులేవీ అక్కర్లేదు, కొన్ని పరీక్షనాళికలు చాలు. కారుచౌకగా భారీ విధ్వంసాలను సృష్టించగల అవకాశాలు ఉండటం వల్లనే కొన్ని దేశాలు అంతర్జాతీయ ఒడంబడికలను ఉల్లంఘించి మరీ జీవాయుధ ప్రయోగాలకు తెగబడుతున్నాయి.

రక్షణ అంతంత మాత్రమే
జీవాయుధాల దాడుల నుంచి జనసామాన్యానికి రక్షణ అంతంతమాత్రమే. జీవాయుధాల బారిన పడకుండా తప్పించుకోవడం, ఒకవేళ వాటి బారిన పడినా ఆరోగ్యంగా బయటపడటం అంత తేలిక కాదు. జీవాయుధాలుగా పేరుపొందిన సూక్ష్మజీవుల్లో కొన్నింటికి ఇప్పటికే వ్యాక్సిన్లు ఉన్నాయి. వ్యాక్సిన్లు లేని వాటికి రకరకాల ఔషధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవి ఒకేసారి మహమ్మారిలా విరుచుకుపడితే, జనాలందరికీ తగిన స్థాయిలో వ్యాక్సిన్‌ డోసులు, మందులు అందుబాటులో లేవు. ఉదాహరణలు చెప్పుకోవాలంటే– జీవాయుధ దాడుల్లో అతి తేలికగా ఉపయోగించగలిగే ఆంత్రాక్స్, మశూచి సూక్ష్మజీవులు ప్రధానమైనవి. మశూచి నుంచి రక్షణ కోసం అమెరికా వద్ద తన పౌరులందరికీ తగినన్ని వ్యాక్సిన్‌ నిల్వలు ఉన్నాయి.

ఆంత్రాక్స్‌ విషయంలో అలా కాదు. కేవలం తన సైన్యానికి మాత్రమే తగినన్ని వ్యాక్సిన్‌ నిల్వలు అమెరికా వద్ద ఉన్నాయి. జీవాయుధ దాడిలో అమెరికా పౌరులకు కూడా ఆంత్రాక్స్‌ తీవ్రస్థాయిలో వ్యాపిస్తే పరిస్థితి అదుపు చేయడం కష్టమే. ఇంకా కొన్ని వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియలు ఇంకా వివిధ దశల పరీక్షల స్థాయిలోనే ఉన్నాయి. ‘ఇన్వెస్టిగేషనల్‌ న్యూ డ్రగ్‌’ కేటగిరీలోకి వచ్చే ఈ వ్యాక్సిన్లకు ఇంకా ఎఫ్‌డీఏ అనుమతులు లభించాల్సి ఉంది. వీటిలో ‘క్యూ’ఫీవర్, టులారెమియా, వెనిజువెలియన్‌ ఈక్విన్‌ ఎన్‌సెఫిలైటిస్, వైరల్‌ హెమరేజ్‌ ఫీవర్, బొటులిజమ్‌ వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్లు ఉన్నాయి. ఇక గ్లాండెర్స్, బ్రుసెల్లాసిస్, స్టాఫిలోకోక్సల్, ఎంటరోటాక్సిన్‌–బి, రైసిన్‌ వంటి వాటికి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్లూ అందుబాటులో లేవు. వ్యాక్సిన్లు లేని జీవాయుధాలను, జన్యు ఉత్పరివర్తనలు జరిపిన జీవాయుధాలను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రయోగిస్తే జరగబోయే బీభత్సం ఊహాతీతంగా ఉంటుంది.

జీవాయుధాలు కలిగించే నష్టాలు

  • జీవాయుధాలు మనుషులకు మాత్రమే కాదు, భూమ్మీద నివసించే పశుపక్ష్యాదులకు, వృక్షజాతులకు తీరని నష్టాన్ని కలిగించగలవు.
  • జీవాయుధ ప్రయోగం జరిగాక, అదేమిటో గుర్తించే లోగానే జరగరాని నష్టం జరిగిపోతుంది.
  • జీవాయుధ ప్రయోగాల వల్ల తీవ్రస్థాయిలో ప్రాణనష్టం జరగడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని రీతిలో దెబ్బతింటాయి.
  • జీవాయుధాల వల్ల సంభవించే పర్యావరణ నష్టాలు కరువుకాటకాలకు దారితీస్తాయి. శాస్త్ర పరిశోధనల సాయంతో వాటిని నిర్వీర్యం చేసినా, పర్యావరణానికి అప్పటికే వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయడానికి దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
  • మనుషులకు, పశుపక్ష్యాదులకు తీవ్రస్థాయిలో ప్రాణనష్టం కలిగించే ఉద్దేశంతో జీవాయుధాలతో జరిపే దాడులను ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ‘బయోటెర్రరిజం’గా నిర్వచించింది.
  • బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌ వంటి సూక్ష్మజీవులు, అవి కలిగించే రోగాలు మానవాళికి కొత్త కాదు. అయితే, ఆధునిక శాస్త్రపరిజ్ఞానాన్ని ఆసరా చేసుకుని, వీటికి కృత్రిమంగా జన్యుఉత్పరివర్తనలు జరిపే అవకాశాలు ఉండటం ఆందోళనకరం. మరింత నష్టాన్ని కలిగించేలా వీటికి జన్యు ఉత్పరివర్తనలు జరిపి ప్రయోగిస్తే, అప్పుడు జరగబోయే నష్టం అంచనాలకు అందదు.

జీవాయుధ దేశాలు
దాదాపు పదహారు దేశాలు జీవాయుధాలను పోగు చేసుకుంటున్నట్లు ‘న్యూక్లియర్‌ థ్రెట్‌ ఇనీషియేటివ్‌’ (ఎన్‌టీఐ) సహా పలు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఎన్‌టీఐ సమాచారం మేరకు జీవాయుధ ప్రయోగాలు సాగిస్తున్న దేశాలు ఇవీ: కెనడా, చైనా, క్యూబా, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జపాన్, లిబియా, ఉత్తర కొరియా, రష్యా, దక్షిణాఫ్రికా, సిరియా, యునైటెడ్‌ కింగ్‌డమ్, అమెరికా. ఒకవేశ యుద్ధం ముంచుకొస్తే వీటిలో ఒక దేశం మరో దేశంపై జీవాయుధాలను ప్రయోగించే అవకాశాలను కొట్టిపారేయలేం.

ఎన్‌టీఐ లెక్కల ప్రకారం ప్రపంచంలో అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశాల కంటే జీవాయుధాలను కలిగి ఉన్న దేశాల సంఖ్యే ఎక్కువ. దేశాల మధ్య జరిగే యుద్ధాల్లో జీవాయుధాల ప్రయోగాల సంగతి ఎలా ఉన్నా, ఇవి ఉగ్రవాద బృందాలకు చేరితే, అవి బాంబులకు బదులుగా వరుసగా జీవాయుధాలతో దాడులకు తెగబడితే పరిస్థితి ఏమిటనేదే ప్రశ్న! కొన్ని ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే జీవాయుధ దాడులు చేశాయి. అవి చాలా చిన్నస్థాయి దాడులు కావడంతో స్వల్పనష్టమే తప్ప పెను ప్రమాదమేమీ జరగలేదు.

జీవాయుధాల రకాలు
జీవాయుధాలుగా ప్రయోగించేవాటిలో ప్రధానంగా రోగకారక సూక్ష్మజీవులు, జంతువులు, కీటకాలు, మొక్కల నుంచి సేకరించే విషపదార్థాలు ఉంటాయి. ఇవి వివిధ స్థాయిల్లో ప్రాణనష్టానికి కారణమవుతాయి. జీవాయుధాల్లోని రకాలు ఇవీ:

బ్యాక్టీరియా
బ్యాక్టీరియా ఏకకణజీవి. ఉదాహరణకు ఆంత్రాక్స్, ప్లేగు వంటి మహమ్మారి రోగాలకు బ్యాక్టీరియా కణాలే కారణం. యాంటీబయోటిక్స్‌తో బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులకు సమర్థంగా చికిత్స చేయవచ్చు.

వైరస్‌ 
వైరస్‌ పూర్తికణం కాదు. ఇది కణంలోని సూక్ష్మభాగం. వైరస్‌ పరిమాణం బ్యాక్టీరియాలో నూరోవంతు ఉంటుంది. వైరస్‌లు కలిగించే వ్యాధులు యాంటీబయోటిక్స్‌కు లొంగేవి కావు. ఇప్పటి ‘కరోనా’, ఎయిడ్స్‌ సహా చాలా ప్రాణాంతక వ్యాధులు వైరస్‌ల వల్లనే కలుగుతాయి. 

రికెట్సీ
ఇది కూడా బ్యాక్టీరియాను తలపించే సూక్ష్మజీవి. రికెట్సీ తన కణాల లోపలే పునరుత్పత్తి చేసుకోగల అంతర్‌కణ పరాన్నజీవి. ‘క్యూ’ఫీవర్, టైఫస్‌ వంటి వ్యాధులు రికెట్సీ వల్లనే కలుగుతాయి.

ఫంగస్‌
ఫంగస్‌ జీవులు మనుషల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం కలిగించవు గాని, పర్యావరణానికి తీరని చేటు చేస్తాయి. వరి, గోధుమలు, బంగాళదుంపలు వంటి ఆహారపంటల మొక్కలను తీవ్రంగా నష్టపరుస్తాయి. 

బయో టాక్సిన్స్‌
మొక్కలు, జంతువులు, కీటకాల నుంచి సేకరించే విషపదార్థాలు కూడా జీవాయుధాలే. వీటితో ఒక్కొక్కసారి పెద్దసంఖ్యలో జనం అనారోగ్యం పాలవడం, ప్రాణాలు కోల్పోవడం జరగవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement