Coronavirus: మూడో వేవ్‌? ఎదుర్కొందాం ఇలా..! | Coronavirus: Covid Third Wave Precautions Of Children And Old Age People | Sakshi
Sakshi News home page

Coronavirus: మూడో వేవ్‌? ఎదుర్కొందాం ఇలా..!

Published Sun, Jul 4 2021 10:33 AM | Last Updated on Sun, Jul 4 2021 10:51 AM

Coronavirus: Covid Third Wave Precautions Of Children And Old Age People - Sakshi

అల తర్వాత అల... ఆటు తర్వాత పోటు... సముద్రంలో మామూలే.  కానీ ఇప్పుడు కరోనా సంక్షోభమూ ఓ కడలిలాగే అంతూపొంతూ లేకుండా కనిపిస్తోంది. కొత్త కొత్త వేరియెంట్లూ, స్ట్రెయిన్లూ అంటూ అలల్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న రెండో వేవ్‌ తర్వాత మూడో వేవ్‌ కూడా వస్తుందా?  అది మరింత శక్తిమంతంగా పెద్దలతో పాటు పిల్లలనూ ప్రమాదంలో ముంచెత్తుతుందా అన్నది చాలామంది ముందు  ఉన్న ప్రశ్న. ఒకవేళ అది అంత పెద్ద అలే అయితే... దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది మన ముందు ఉన్న ప్రశ్న.

అలల్లో కొట్టుకుపోవడం అందరికీ మామూలే. కానీ కొందరు సర్ఫర్లు మాత్రం పెద్ద పెద్ద అలలకు బెంబేలెత్తరు.... బెదిరిపోరు. వచ్చే అల ఉంటే ఎలాగూ వస్తుంది... వద్దని మనం అనుకున్నా ఆగదు. అయితే... ఒకవేళ అలాంటి రాకాసి అల వచ్చినప్పటికీ... మన ముందస్తు తయారీతో సర్ఫర్ల స్వారీలా దాన్ని నేర్పుగా అధిగమించే మార్గాలను తెలుసుకుందాం. కరోనా మూడో దశను కలిసికట్టుగా ఎదుర్కొందాం. 


అసలు కరోనా దశల వారీగా ఎందుకు వస్తుంటుందో చూద్దాం?  
కరోనా ఒక్కటే కాదు.. ఆ మాటకొస్తే చాలారకాల వైరల్‌ ఇన్ఫెక్షన్లు దశలవారీగా సంభవిస్తుంటాయి. ఇలా జరగడానికి కారణం ఉంది. ప్రపంచంలోని ప్రతి జీవీ తన పరిణామ దశలో అంతకంతకూ తనను తాను మెరుగుపరచుకుంటూ ఉంటుంది. మనుగడ కోసం కృషి చేస్తుంటుంది. కరోనా వైరస్‌ సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఒకసారి ఒక స్ట్రెయిన్‌తో ఇది వచ్చాక.. ఆ స్ట్రెయిన్‌కు చాలామందిలో ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. దాంతో ఆ ఇమ్యునిటీ ఉన్నవారిలో తాను మనుగడ సాగించలేదు. కాబట్టి మరింతగా మెరుగుపరచుకుని మరో కొత్త స్ట్రెయిన్‌ రూపంలో మరిన్ని (తన మనుగడ కోసం కావాల్సిన అనుకూల) మార్పులతో అది తనను తాను మళ్లీ మళ్లీ ఆవిష్కరించుకుంటూ ఉంటుంది. ఇలా తనను తాను కొత్త స్ట్రెయిన్లు సృష్టించుకుంటుంది కాబట్టి దశలు దశలుగా (ఫస్ట్, సెంకడ్, థర్డ్‌ ఇలా వేవ్స్‌) వస్తుంటుంది. అలా ప్రతి దశ అధిక సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి కారణమవుతుంది.  

వైరస్‌ ఇలా అనేక స్ట్రెయిన్లుగా, వేరియెంట్లుగా ఎందుకు మారుతుందో తెలుసుకుని, దాన్ని ఎదుర్కోవడం ఎలాగో తెలుసుకునే ముందుగా అసలు వైరస్‌ గురించి కాస్తంత అవగాహన పెంచుకుందాం. దాంతో మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశం చాలా తేలికవుతుంది. ప్రతిజీవిలోనూ ఎన్నో రకాల కణాలుంటాయి. ఉదాహరణకు గుండె కండర కణం, మెదడు కణం, ఊపిరితిత్తుల కణం.. ఇలా ఎన్నెన్నో. 

ప్రతి కణంలోనూ ఓ కేంద్రకం, అందులో క్రోమోజోములు ఉంటాయి. అవన్నీ డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలాంటి మూల పదార్థాలతో నిర్మితమై ఉంటాయి. వైరస్‌ అనేది కూడా కణంలోని మూల పదార్థమైన ఒక ఆర్‌ఎన్‌ఏ లేదా కొన్నిసార్లు డీఎన్‌ఏ మాత్రమే నిర్మితమై ఉండే చాలా చిన్న జీవాంశం. మనకు ఏదైనా పరాన్నజీవి సోకిందనుకోండి. అప్పుడు అది బ్యాక్టీరియానో, ఫంగసో లేదా ఏకకణజీవో అయితే.. మందులు వాడి దాన్ని ఒకింత తేలిగ్గానే చంపవచ్చు. కానీ వైరస్‌ అలా కాదు. అది ఆర్‌ఎన్‌ఏ కావడం వల్ల మన కణంలోకి చొరబడి మన ఆర్‌ఎన్‌ఏలతో కలిసిపోయి తన ప్రత్యుత్పత్తి నిర్వహించుకుంటూ ఉంటుంది. ఇలా ఒక కణంలోకి చొరబడిన ఓ వైరస్‌.. మూడొందలు మొదలుకొని 1000కి పైగా వైరస్‌లుగా పెరిగి ఆ కణాన్ని నాశనం చేసి, బయటకు వచ్చేస్తుంది. కొత్తగా పుట్టిన అవి మళ్లీ తమ ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తాయి.

అలా వైరస్‌లలో హానికరమైనవి వ్యాపించినప్పుడు మనం వాటి దుష్ఫలితాలను చూస్తాం. ఈ వైరస్‌లు ఎంత చిన్నవంటే.. ఒక సూది మొన మీద కోట్లాది వైరస్‌లు ఉంటాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా (ఈ కథనం రాస్తున్ననాటికి అంటే.. 26వ తేదీ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ బారిన పడిన వారు 18,12,57,890 మంది రోగులు ఉన్నట్లు  ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కట్టింది). ఉజ్జాయింపుగా ఇప్పటికి 20 కోట్ల మంది కోవిడ్‌ బారిన పడ్డట్లు అంచనా వేసి... ఈ అందరిలోనూ ఉన్న ఈ బిలియన్లూ, ట్రిలియన్లలో ఉన్న వైరస్‌లను సేకరించి... ఓ టీ–కప్పు లో వేశామనుకుందాం.. ఇంకా ఆ టీకప్పు నిండకుండా.. కాస్తంత వెలితిగానే ఉంటుంది. అంత చిన్నవన్నమాట ఈ వైరస్‌లు. 

కరోనా ఏమిటీ... వాటి కొత్త స్ట్రెయిన్‌ కథ ఏమిటి? 
ఈ లోకంలో కోటాను కోట్ల రకాల వైరస్‌లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో కేవలం మనకు జలుబు తెచ్చిపెట్టేవే దాదాపు 200 రకాల పైనే ఉంటాయి. వాటినీ వాటి సమలక్షణాల ఆధారంగా గ్రూపులుగా చేస్తే జలుబు తెచ్చే వైరస్‌లు ఆరు ప్రధాన రకాలు అవి.. 1) ఇన్‌ఫ్లుయెంజా, 2) పారా ఇన్‌ఫ్లుయెంజా, 3) రైనో వైరస్, 4) ఎడినో వైరస్, 5) హ్యూమన్‌ రెస్పిరేటరీ సిన్సీషియల్‌ వైరస్‌  (ఆర్‌ఎస్‌వీ) 6) కరోనా. ఇలా చూసినప్పుడు కరోనా అన్నది ఈ ప్రపంచానికి కొత్తదేమీ కాదు. ఎప్పట్నుంచో ఉన్నదే. ఈ కరోనాలోనూ మళ్లీ ప్రధానమైనవి ఏడు రకాల వైరస్‌లు ఉన్నాయి. ఇవన్నీ ఒక మనిషి నుంచి ఇంకొకరికి వ్యాపించేవే. ఇందులో నాలుగు రకాలు మాత్రం చాలా తేలికపాటి జలుబును తెచ్చి, ఓ వారం రోజుల్లో తగ్గిపోయేలా మాయమవుతాయి. కానీ మరో మూడు మాత్రమే ఒకింత ప్రమాదకరమైనవి.

ఆ మూడింటినీ నిర్దిష్టంగా చెప్పాలంటే 1) సార్స్‌ (సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌)ను తెచ్చే వైరస్, 2) మధ్యప్రాచ్య దేశాల్లో వచ్చిన వేరియెంట్‌ అయిన మెర్స్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌)తో పాటు తాజాగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న ‘కోవిడ్‌–19’ వైరస్‌. అంతెందుకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న కొత్తల్లోనూ పరిశోధకులు దాదాపు 103 రకాల శాంపుళ్లను పరిశీలించినప్పుడు అందులో కొన్ని ‘ఎల్‌’ అనే రకానికీ, మరికొన్ని ‘ఎస్‌’ అనే రకానికి చెందనవి ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లోనూ తొలుత ‘ఎస్‌’ వచ్చిందనీ.. అయితే అది కొందరికి మాత్రమే పరిమితం కాగా.. ఆ తర్వాత కనిపించిన ‘ఎల్‌’ రకం చాలామందిలో కనిపించినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. 

ప్రముఖమైన కొన్ని కొత్త వేరియెంట్లు ఇవే... 
► ఆల్ఫా (బి.1.1.7.):  గత ఏడాది చివర్లో  ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో కనిపించిన వేరియెంట్‌ ఇది. ఇది కరోనా వైరస్‌ల మీద ఉన్న కొమ్ములాంటి దానిపై (స్పైక్‌ ప్రోటీన్‌లో) వచ్చిన మార్పు కారణంగా ఉనికిలోకి వచ్చిన వేరియెంట్‌. ఇది అంతకుముందున్న వేరియెంట్ల కంటే 70% వేగంగా వ్యాపిస్తోందని ప్రతీతి పొందింది.  

► బీటా (బి.1.351): మిగతా అన్ని దేశాలతో పాటు ప్రత్యేకంగా ఇది సౌత్‌ ఆఫ్రికా, నైజీరియాలలో ఎక్కువగా వ్యాపించింది. సౌత్‌ ఆఫ్రికన్‌ వేరియెంట్‌ మిగతావాటికంటే ఒకింత ప్రమాదకారిగా పేరు పొందింది. 

►గామా (పీ.1): ఈ ఏడాది మొదట్లో అంటే.. జనవరి 2021లో ఇది బ్రెజిల్‌ నుంచి జపాన్‌కు ప్రయాణం చేసిన వ్యక్తుల వల్ల జపాన్‌లో ఎక్కువగా కనిపించిందని నిపుణులు పేర్కొన్నారు. జనవరి చివరినాటికి అమెరికా అంతటా వ్యాపించింది. అయితే మిగతా అన్ని వేరియెంట్ల కంటే ఇది చాలా వేగంగా అంటుకుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక అప్పటికే ఒకసారి కోవిడ్‌–19 వచ్చిన వారికీ రెండోసారి రావడానికి ఇదే కారణమని వారు తెలిపారు. ఈ సంగతి బ్రెజిల్‌లోని 29 ఏళ్ల మహిళకు చేసిన పరీక్షల్లో పరిశోధనల్లో నిర్ధారణ కూడా అయ్యింది. గతంలో ఆమెలో పుట్టిన యాంటీబాడీలను తట్టుకుని కూడా పెరిగేలా ఈ వేరియెంట్‌ మార్పులు చెందిందని తెలిసింది. 

► డెల్టా (బి.1.617.2): ఈ వేరియెంట్‌నే మన దేశపు వేరియెంట్‌గా పిలుస్తున్నారు. నిజానికి ఇది గత ఏడాది చివర్లో అంటే డిసెంబరులోనే మన దేశంలో కనుగొన్నా.. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి దేశమంతటా విజృంభించి, విలయతాండవంతో వేలాది మరణాలకు కారణమైందని చెబుతున్నారు. మన దేశంతో పాటు దీన్ని యూఎస్, యూకే, సింగపూర్‌ వంటి మరో 43 దేశాల్లోనూ చూశారు.  

►డెల్టా ప్లస్‌ (ఏవై.1): కరోనా డెల్టా వేరియెంట్‌ (బి.1.617.2) అనేది మార్పులకు గురై డెల్టా ప్లస్‌ (ఏవై.1)గా మారినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పు కారణంగా కరోనా వైరస్‌లో ఉండే స్పైక్‌లలో మార్పు వచ్చి... అవి మరింతగా కణంలోకి చొచ్చుకుపోయేలా మార్పులు జరిగిందని నిపుణుల మాట. ఈ మార్పులను ‘కే417ఎన్‌’గా చెబుతున్నారు. ఇప్పటివరకు రూపొందిన వ్యాక్సిన్లన్నీ గతంలోని వేరియెంట్లనూ, మామూలుగా ఉన్న స్పైక్‌లనూ సమర్థంగా ఎదుర్కొంటున్నవని తేలినప్పటికీ... ఇవి ఈ కొత్త మార్పులతో రూపొందిన వైరస్‌ వేరియెంట్లను ఎదుర్కోగలవా అన్నది నిపుణుల ముందు ఉన్న సందేహం. అందువల్లనే దీనిపై అన్ని వర్గాల ప్రజల్లోనూ భయాందోళలను పెరుగుతున్నాయి.  ఇది ఇప్పటికే మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాలలో మూడో వేవ్‌ని  తెచ్చినట్లుగా మరికొందరి అనుమానం. కాగా... ఇదే మూడో వేవ్‌కు కారణమవుతుందేమోనన్నది చాలామందిలో ఉన్న సంశయం.

మూడో వేవ్‌ తప్పదా? 
ఇప్పుడు ముఖ్యంగా మూడో వేవ్‌ గురించి మాట్లాడుకుందాం.  ఇప్పటివరకూ దాదాపు 7 నుంచి 8 వేల వరకు మ్యూటేషన్స్‌ జరిగాయంటూ మనం ఈ కథనంలోనే చెప్పుకున్నాం. కానీ ఈ ఏడెనిమిది వేలలో కేవలం అల్ఫా, బీటా, గామా, డెల్టాల గురించి ఎందుకు ప్రస్తావించాం? ఎందుకంటే... కేవలం ఆర్‌ఎన్‌ఏ మాత్రమే ఉండే కరోనా వైరస్‌లో దాదాపు పదివేల మార్పులు వచ్చి... పదివేల వేరియెంట్లుగా మారినప్పటికీ ఓ నాలుగైదు మాత్రమే ప్రమాదకారులుగా ఉండటం మనం చూశాం. అంటే... ఇప్పుడూ మళ్లీ మరో మూడు నాలుగు వేల మార్పులు జరిగినప్పటికీ వాటిల్లో ఏదైనా ఘోర ప్రమాదకారి అవుతుందేమో! అలా అయితే ఏం చేయాలి అనేదే సమస్యగాని... తప్పక మూడో వేవ్‌ వచ్చి తీరుతుందనీ... అది ప్రమాదకారిగా మారి విలయం సృష్టిస్తుందనీ కాదు. మనకు తెలుసు మనుగడ కోసం ప్రతి జీవీ మరింత ఎక్కువ మెరుగ్గా మారుతుందని.

జీవుల్లో ఓ వైరస్‌కు యాంటీబాడీస్‌ వల్ల నిరోధకత పెరుగుతున్న కొద్దీ... వాటిని అధిమించడానికి అది ఆ యాంటీబాడీస్‌ను తప్పించుకుని మరింత శక్తిమంతం అయ్యేలా రూపొందడానికి ప్రయత్నిస్తుంటుంది. దీన్నే ‘యాంటీబాడీ ఎస్కేప్‌ వేరియెంట్‌’ అని కూడా అంటుంటారు. (పెద్దగా ఫలితం లేకపోవడంతో పాటు ప్రమాదకరమైన కొత్త వేరియెంట్లకు కారణమవుతుందనే అంశాల వల్లనే ప్లాస్మాథెరపీని చికిత్స ప్రోటోకాల్‌ నుంచి తొలగించిన సంగతి మనకు తెలిసిందే). పై అంశాలన్నింటినీ పరిశీలించినప్పుడు ఈ ఏడాది చివరినాటికి 10,000 సార్లు మ్యూటేషన్‌ జరిగి కొత్త కొత్త వేరియెంట్లు వస్తే... అందులో ఏదైనా ఇప్పటి చికిత్సలకు లొంగనంత బలంగా కొత్త స్ట్రెయిన్‌ వస్తే... దాని వల్ల మూడో వేవ్‌ రావచ్చన్నది నిపుణుల అంచనా. అంతేతప్ప అది తప్పక వస్తుందనీ కాదు... రాదనే గ్యారంటీలేదు. కాకపోతే వస్తే ఏమిటి, ఎదుర్కోవడం ఎలా అన్న సన్నద్ధత మాత్రం తప్పక ఉండాల్సిందే. 

పిల్లలపైన తప్పక ప్రభావం చూపుతుందా? 
ఈసారి వచ్చే వేరియెంట్‌ ఈసారి పిల్లలపై ప్రభావం చూపుతుందనే వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం ఉంది... మొదటి వేవ్‌ వచ్చినప్పుడు ఎక్కువగా వయోవృద్ధులు, బాగా వయసు పైబడినవారు ప్రభావితం అయ్యారనీ, రెండో వేవ్‌లో యువకులు మొదలు మధ్యవయస్కులు ఈ వైరస్‌ బారిన పడ్డారనీ... అందువల్ల మూడోవేవ్‌ వస్తేగిస్తే అది తప్పక పిల్లల మీద ప్రభావ చూపుతుందనేది చాలామంది చెబుతున్న మాట. కానీ గణాంకాల మాట వేరేగా ఉంది. ఉదాహరణకు ఏడాది నుంచి పదేళ్ల పిల్లల విషయంలో చూస్తే మొదటి వేవ్‌లో 3.28% చిన్నారులు దీనిబారిన పడగా రెండో వేవ్‌లో వారి శాతం 3.05% మాత్రమే.

అంటే ఇంకా చెప్పాలంటే పిల్లల శాతం తగ్గింది. ఇక 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యవారిని చూస్తే.. మొదటి ఏడాదిలో వారి శాతం 8.03% కాగా రెండో వేవ్‌లో అది 8.57 శాతానికి పెరిగింది. అంటే పెరుగుదల కేవలం 0.54% మాత్రమే. అంటే.. కరోనాతో ప్రభావితమయ్యే పిల్లల శాతం మొదటి నుంచీ దాదాపుగా (అటు ఇటుగా) మూడు శాతానికి దగ్గరగానే ఉంది. వాళ్లలోనూ ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్లిన వారు చాలా చాలా తక్కువ. కాబట్టి గణాంకాల పరంగా చూసినా పిల్లలు ప్రభావితమవుతారనేందుకు ఎలాంటి దాఖలాలూ లేవు. ఇక మొదట్లో వయోవృద్ధులూ రెండో వేవ్‌లో మధ్య వయస్కులూ ప్రభావితమయ్యారని చెప్పడానికీ పెద్దగా ఆస్కారం లేదు.

ఉదాహరణకు మొదటి వేవ్‌లో 21 – 30 ఏళ్ల వారు 21.21% అయితే రెండోవేవ్‌ నాటికి ఈ సంఖ్య 22.49% మాత్రమే. అంటే పెరుగుదల 1.28% మాత్రమే. అలాగే 31–40 ఏళ్ల వారూ మొదటివేవ్‌లో 21.23% ఉండగా రెండోవేవ్‌లో వారి శాతం 22.70%. అంటే పెరుగుదల కేవలం శాతం 1.47% మాత్రమే. ఇలా చూసినప్పుడు మధ్యవయస్కులోనూ జబ్బుపడ్డవారి సంఖ్య పెరుగుదల గణనీయంగా ఏమీ లేదు. అయితే మొదటివేవ్‌లో వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యారనీ, రెండోవేవ్‌లో వారి శాతం అంతగా లేదని చెప్పడం ఒక రకంగా వాస్తవమే అయినా.. మొదటివేవ్‌తో పోల్చినప్పుడు ఆ ఏజ్‌ గ్రూపులపై కుటుంబ సభ్యుల శ్రద్ధ పెరగడం.. కరోనా వైరస్‌ అందుబాటులోకి రాగానే మొదట మనం టీకాలు వేసింది. 65 ఏళ్లకు పైబడినవారికి మాత్రమేనని గుర్తుపెట్టుకుంటే అందుకు కారణాలు మనకే తేలిగ్గా అర్థమవుతాయి. ఇదే టీకా కార్యక్రమం విస్తరించి అన్ని వయసుల వారికీ విస్తృతంగా వ్యాక్సిన్‌ అందేలా చేసినప్పుడు మూడో వేవ్‌ ప్రభావం అసలు పెద్దగా ఉండకపోవచ్చు.

ఉన్నా నామమాత్రం కావచ్చు కూడా. అందుకే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడితే మూడో వేవ్‌ అంత ప్రమాదకారి కాబోదనే మన ముందున్న గణాంకాలూ, అంచనాలు చెబుతున్నాయి. అంటే.. మూడోవేవ్‌ ప్రభావాన్ని తగ్గించేది టీకా అన్న విషయాన్ని అందరూ గుర్తెరిగితే చాలు. ఇక మరో విషయం ఏమిటంటే.. వైరస్‌ పిల్లల శరీరంలోకి చేరడానికి, పెద్దల్లోలాగా వాళ్లలో రిసెప్టార్‌లు అంతగా అభివృద్ధి చెంది ఉండవు. దాంతో పిల్లలు ఇప్పటివరకూ చాలా తక్కువ సంఖ్యలోనే వ్యాధి బారినపడ్డారు. ఇదే సానుకూలమైన అంశం మూడోవేవ్‌లోనూ కనిపించవచ్చు. అందుకే మూవోవేవ్‌లో పిల్లలు తప్పకుండా పడతారన్నది ఒక ఆధారం లేని అంచనాయే తప్ప అదే వాస్తవం కాదు. 

కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ పిల్లలో తీవ్రంగా ఉంటుందా?
పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కోవిడ్‌ న్యుమోనియా ఒకింత తక్కువే అయినా మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎమ్‌ఐఎస్‌–సి) వంటి కోవిడ్‌–19 అనంతర దుష్ప్రభావాలు పిల్లల్లో ఎక్కువగా కనిపించేందుకు అవకాశం ఉంది. అలాగే ఈ ఎమ్‌ఐఎస్‌–సిలోనూ కొన్ని సందర్భాలో లక్షణాలు ఏమీ లేకుండా లేదా కొన్ని  చాలా స్వల్ప లక్షణాలతో కరోనా సోకిన 2 – 6 వారాల తర్వాత కూడా కొందరిలో ‘ఇమ్యూన్‌ డిస్‌రెగ్యులేషన్‌’ ఉండవచ్చునని కొందరి ఆందోళన. ‘ఇమ్యూన్‌ డిస్‌రెగ్యులేషన్‌’ అంటే పిల్లల్లో ఉండే వ్యాధినిరోధకత తీవ్రంగా ప్రభావితమై వారు ఇతరత్రా ఇన్ఫెక్షన్లకు గురికావడం.

అయితే ఇలా జరగడానికి ఉన్న ఆస్కారం తక్కువ. ఒక పరిశీలన మేరకు ప్రస్తుతం లక్షమంది పిల్లల్లో కేవలం పన్నెండు కంటే తక్కువ కేసుల్లోనే ఇలాంటి పరిస్థితిని నిపుణులు చూశారు. త్వరగా గమనిస్తే ఇలాంటి కేసులకూ సమర్థమైన చికిత్స అందించవచ్చు. పైగా  ఒకవేళ పిల్లల్లో ‘ఎమ్‌ఐఎస్‌–సి’ వచ్చినా.. ఆ చిన్నారుల నుంచి ఈ సమస్య ఇతరులకు వ్యాపించడం లేదు. కాబట్టి ఎలా చూసినా పిల్లల్లో థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందనే వాదనలకు సరైన ఆధారాలు లేవు. 

అంతమాత్రాన నిర్లక్ష్యం కూడదు... 
అయితే తార్కాణాలేవీ కనిపించనప్పటికీ పిల్లల విషయంలో అప్రమత్తత మాత్రం అవసరం. ఎందుకంటే ఇప్పటికి మనం టీకా వేస్తున్నది కేవలం 18 ఏళ్లకు పైబడినవారికి మాత్రమే. వాళ్లందరికీ ఇమ్యూనిటీ వచ్చాక... అలాంటి రక్షణ వలయం లేనివారు పిల్లలే అవుతారు. కాబట్టి వారి విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. 

ఎలాంటి పిల్లలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు? 
►పెద్దల్లోలాగే దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలపై కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయ సంబంధిత సమస్యలు, థలసీమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. కాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న వారు, కీమోథెరపీ / రేడియేషన్‌ థెరపీ వంటివి తీసుకుంటున్న పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి పిల్లలకు ప్రాధాన్యక్రమంలో వ్యాక్సిన్‌ ముందుగా ఇచ్చే ఏర్పాట్లూ చేయాలి. ∙ఊబకాయం ఉన్న పిల్లల విషయంలో సాధారణ పిల్లల కంటే ఒకింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ∙పోషకాహారలోపం ఉన్న పిల్లలూ, రోగనిరోధక వ్యవస్థలో లోపం ఉన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల్లో హోమ్‌ ఐసోలేషన్‌ ఎలా?
► వైరస్‌ సోకిన పిల్లలు తల్లిదండ్రులతో ఉండవచ్చు. ఆ సమయంలో పెద్దల సపోర్ట్‌ పిల్లలకు చాలా అవసరం కాబట్టి వారి వెంట ఉండాల్సిందే. అయితే పేరెంట్స్‌ కోవిడ్‌ నిబంధలైన మాస్క్‌ ధరించడం, చేతులను మాటిమాటికీ కడుక్కోవడం వంటి జాగ్రత్తలను తప్పక పాటిస్తూ ఉండాలి. 
► కరోనా వైరస్‌కు గురైన పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాతలూ, నానమ్మ, అమ్మమ్మలూ, మామ్మలతో పాటు ఇంట్లో పెద్దవయసు వారి దగ్గర వదలకూడదు. మైల్డ్‌ నుంచి ఓ మోస్తరుగా లక్షణాలు కనిపించిన పిల్లలను 10రోజులు, తీవ్రమైన లక్షణాలు కనిపించినవారిని 20 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. 

అందరికీ వ్యాక్సిన్‌ వేశాక కరోనా కథ ముగిసిపోతుందా? 
ఈ విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. అందరికీ వ్యాక్సిన్‌ అందాక మనందరిలోనూ కరోనా వైరస్‌కు ఇమ్యూనిటీ వస్తే మున్ముందు అది మరిన్ని వేరియెంట్లుగా మారే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. దాంతో జలుబు  తెచ్చిపెట్టే అనేకానేక వైరస్‌లలో ఇదీ ఒకటిగానో లేదా ఫ్లూలా ప్రతి ఏడాదీ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన ఓ ప్రమాదరహితమైన (అంటే ఏ కొద్దిమందికో తప్ప మిగతా ప్రజలందరికీ ప్రమాదం చేకూర్చని) ఇన్ఫెక్షన్‌లా మిగిలిపోవచ్చు. గతంలోనూ ఎన్నో పాండమిక్‌లను ప్రపంచం చూసినట్లుగానే దీన్నీ సమర్థంగా ఎదుర్కొని మానవాళి ఎప్పటిలాగే తన మనుగడ కొనసాగించవచ్చు. 

వేరియెంట్లు లేదా కొత్త స్ట్రెయిన్లు ఎలా పుడతాయంటే...  
వైరస్‌లు తొలుత హైజాక్‌ చేసినట్లుగా తాము ప్రవేశించిన కణంలోకి దూరిపోతాయి కదా. అక్కడ తమను వృద్ధి చేసుకోవడం మొదలుపెడతాయి. తమను తాము వృద్ధి చేసుకునే ప్రక్రియలో తమ ‘కాపీ’ వైరస్‌ను సృష్టిస్తాయి. ఈ ప్రక్రియనే ‘కాపీయింగ్‌’ అంటారు. ఒక వైరస్‌ వేలాది వైరస్‌లను కాపీ చేసుకుంటుంది. ఇవన్నీ మళ్లీ అన్నన్ని కణాలను హైజాక్‌ చేసి.. మళ్లీ వేలాదిగా, లక్షలాదిగా పెరుగుతూ పోతాయి. ఇలా వేల కొద్దీ పుట్టే సమయంలో వాటి ఆర్‌ఎన్‌ఏలో ఏదైనా చిన్న పొరబాటు జరిగి.. ఆ ఆర్‌ఎన్‌ఏలోని పదార్థాల్లో కొత్త మార్పులు జరిగితే.. అది కొత్త స్ట్రెయిన్‌గా, కొత్త వేరియెంట్‌గా మారే అవకాశం ఉంది. కోటాను కోట్లుగా కాపియింగ్‌ జరిగే ప్రక్రియలో ఇలా కొత్త స్ట్రెయిన్లు, కొత్త వేరియెంట్లుగా మారే 
అవకాశాలు ఎక్కువ. 

పిల్లల విషయంలో మన సన్నద్ధత ఎలా ఉండాలంటే... 

► పిల్లలైనా పెద్దలైనా మొదట కనిపించే లక్షణం కేవలం జ్వరం మాత్రమే. కాబట్టి ఈ లక్షణాన్ని తేలిగ్గా ఎదుర్కొనేలా పారాసిటమాల్‌తో పాటు వారికి అవసరమైన మాత్రలను సంసిద్ధంగా ఉంచుకోవాలి.  

► పిల్లలకు అవసరమైన ఇన్‌పేషెంట్‌ వసతులతో హాస్పిటల్స్‌ను సైతం సిద్ధం చేయాలి. ఆసుపత్రి సిబ్బంది అందరినీ అప్రమత్తం చేయాలి. 

► పిల్లలకు వచ్చేందుకు అవకాశం ఉన్న మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎమ్‌ఎస్‌ఐఎస్‌)కి అవసరమైన ఔషధాలు, చికిత్స సదుపాయాలను ముందునుంచే తయారుగా పెట్టుకునేలా హాస్పిటళ్లను సంసిద్ధం చేయాలి. 

► పిల్లల కోసమే ప్రత్యేకంగా ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)తో కూడిన కోవిడ్‌ వార్డుల ఏర్పాటు జరగాలి. 

►  పిల్లలు కూడా పెద్దలు తీసుకుంటున్న జాగ్రత్తలను తప్పక పాటించాలి. అంటే...  మాస్క్‌ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం. భౌతిక దూరం వంటివి పాటించాలి. పిల్లలు ఈ మార్గదర్శకాలను పాటించేలా పెద్దలు వారికి అవగాహన కల్పించాలి. అలా చేయడానికి వారికి తోడ్పడాలి. 

► చివరగా... అమెరికాలాంటి దేశాల్లో ఇప్పటికే ఫైజర్‌ వంటి వ్యాక్సిన్లు పిల్లలకు సురక్షితమని తేలింది. ఇక మన దేశంలోనూ పిల్లలపై కోవాక్సిన్‌ వంటి వ్యాక్సిన్ల ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వీటి ఫలితాలు వస్తే... మొదట్లో వయోవృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రాధాన్యక్రమంలో తొలుత 65 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చినట్లే... మన ట్రయల్స్‌లోనూ పిల్లలకు వ్యాక్సిన్‌ సురక్షితమని తేలాక... ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ పిల్లలందరికీ వ్యాక్సిన్‌ అందేలా చూడాలి. పిల్లలతో మన అనుబంధం బలమైన భావోద్వేగపూరితమైన బంధం. వాళ్లు మన కంటి వెలుగులు. అందుకే గతంలో వ్యాక్సిన్‌ కొరత వంటి సంభవించిన అంశాలతో పాఠాలు నేర్చుకుని పిల్లల విషయంలో అలాంటి తప్పిదాలు జరగకకుండా... పిల్లలందరికీ వ్యాక్సిన్‌ అందేలా చూస్తే మూడో వేవ్‌ ప్రభావం వారి మీద లేకుండా జాగ్రత్తపడవచ్చు.  

పెద్దలూ... ఈ జాగ్రత్తలు తీసుకోండి...
పిల్లల విషయంలో పెద్దలూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అతి తీవ్రమైన జ్వరం వచ్చినా, గొంతునొప్పి, దగ్గు, నీరసం, నిస్సత్తువ, బలహీనత,  ఒళ్లునొప్పులూ, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, వాసన తెలియకపోవడం, తిండి సయించకపోవడం, చనుబాలు తాగే పిల్లలు పాలు తాగకపోవడం, ఒళ్ళంతా ఎర్రబడడం, కళ్లు, నాలుక ఎర్రబారడం, మగతగా ఉండటం, ఫిట్స్‌ రావడం, ఆయాసం రావడం, ఒళ్లు నీలంగా మారడం, అపస్మారక స్థితి, ఆక్సిజన్‌ లెవెల్‌ తగ్గడం వంటి తీవ్ర లక్షణాలను పిల్లల్లో గమనిస్తే తక్షణమే వారిని హాస్పిటల్‌కు తరలించాలి. 

-యాసీన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement