Coronavirus: పోస్ట్‌ కరోనా డైట్ | Coronavirus: Post Corona Diet For Cured Patients | Sakshi
Sakshi News home page

Coronavirus: పోస్ట్‌ కరోనా డైట్

Published Sun, May 23 2021 12:45 PM | Last Updated on Sun, May 23 2021 12:45 PM

Coronavirus: Post Corona Diet For Cured Patients - Sakshi

కరోనా వైరస్‌తో ప్రభావితమైనవారి సంఖ్యపరంగా చూస్తే అది చాలా నిరపాయకరమైనది. దాదాపు 85 శాతం మంది ఎలాంటి లక్షణాలు గానీ కనిపించకుండానే, వారు చాలావరకు హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటారు. కానీ మరో 10 శాతం మంది మాత్రం హాస్పిటల్‌ లో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. అంటే దాదాపు 5% కంటే తక్కువ మందిలో మాత్రమే అది ప్రమాదకారి. వారిలోనూ దాదాపు 4% మంది కొంత ఎక్కువగా హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చినా కోలుకుంటారు. కేవలం ఒక శాతం మందిలో మాత్రమే అది ప్రాణాంతకమవుతుందని ప్రస్తుతపు గణాంకాలు చెబుతున్నాయి.

ఆ గణాంకాల మాట ఎలా ఉన్నా ఓ వ్యక్తి హాస్పిటల్‌ లో చేరాల్సిన పరిస్థితి వచ్చిందంటే కరోనా వైరస్‌ అతడి వ్యాధి నిరోధక శక్తిని లొంగదీసుకుందనే అర్థం కదా. అలాగే కొంతకాలం పాటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారంటే... ఆ చికిత్స ప్రక్రియల్లో ఉపయోగించే స్టెరాయిడ్స్, మందుల తర్వాత ఎంతోకొంత బలహీన పడటం తప్పనిసరి. అందుకే మామూలు వ్యక్తి నుంచి కోవిడ్‌ వచ్చి కోలుకున్నవారి వరకు మళ్లీ మునుపటి ఆరోగ్యాన్ని పొందేలా శక్తిని పుంజుకోవడం అవసరం. అంతేకాదు... అంతకుమించి ఇమ్యూనిటీ పెంచుకోవడం కూడా అవసరం. అందుకు ఉపయోగపడే ఆహారం ఎలా ఉండాలో చెప్పేదే ప్రస్తుత కథనం. 

కరోనా తర్వాత పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి ఒక రోగికి ఆరు నుంచి ఎనిమిది మాసాలు పడుతుందని అంచనా. ఎలాంటి దుష్ప్రభావాలూ, లక్షణాలూ లేకుండా కరోనా బారిన పడ్డవారి నుంచి మొదలుకుని... ఇటు హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్నవారు... భౌతికంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే  మంచి పోషకాహారాన్ని తీసుకోవాల్సిందే. పోస్ట్‌–కోవిడ్‌ రోగులు తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉండాలో చూద్దాం. 


కోలుకున్న రకరకాల వ్యక్తులు... మనం దృష్టి పెట్టాల్సిన అంశాలు... 
పోస్ట్‌ కోవిడ్‌ వారంతా ఒకేలా ఉండరు. కరోనా కారణంగా ఒకింత సంక్లిష్టదశకు వెళ్లేవాళ్లలో చాలామంది ఇతరత్రా మరికొన్ని వ్యాధులు / జబ్బులతో (కో–మార్బిడ్‌ కండిషన్స్‌తో) బాధపడేవారేనన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే కోలుకున్న తర్వాత కూడా వారిలో ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులు కనిపించే అవకాశం ఎక్కువ. (ఇన్‌ఫ్లమేటరీ అంటే ఆ అవయవం ఎర్రబారి, వాపు వచ్చేలాంటి కండిషన్‌). అందునా ఊపిరితిత్తులకు ఇలాంటి ప్రమాదం మరీ ఎక్కువ. కోమార్బిడ్‌ కండిషన్స్‌తో బాధపడేవారు కరోనా బారిన పడతారు కాబట్టి ఈ కింది రోగులు ఆహారపరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.
వారెవరంటే... 

  • హైపర్‌టెన్షన్‌ (హైబీబీ) ∙డయాబెటిస్‌  కిడ్నీ జబ్బులున్నవారు
  •  కాలేయ వ్యాధులు ఉన్నవారు (అక్యూట్‌ హెపాటిక్‌ ఇంజ్యూరీ)
  •  గుండెజబ్బులు ఉన్నవారు
  • జీర్ణసంబంధ వ్యాధులు ఉన్నవారు త్వరగా కోలుకోడానికి మంచి ఆహారం తీసుకోవాలి. 

వారితో పాటు కరోనా తర్వాత దాని దుష్పరిణామంగా... 

  • ‘మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌’కు గురైన వారు
  • కరోనా సమయంలో రుచి/వాసన ను కోల్పోయినవారు
  • కరోనా వైరస్‌ కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమైనవారు
  • మింగడం కష్టమైనవారు
  • గొంతులో పైప్‌ వేసిన వారు ఆహారపరంగా మరిన్ని అదనపు జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటివారు పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోకుండా... ఏదో ఓ ఆహారం తీసుకుంటే మళ్లీ మునపటి రోగనిరోధకశక్తిని పుంజుకోవడం కష్టం కావచ్చు. దాంతో పోస్ట్‌ కోవిడ్‌ దుష్పరిణామాల బారిన పడే అవకాశాలు పెరగవచ్చు. అందుకే అటు కోవిడ్‌ బారిన పడ్డవారే కాకుండా... ఇటు ఆరోగ్యవంతులు కూడా ఇమ్యూనిటీని పెంచే పోషకాహారంపై దృష్టిపెట్టడం అవసరం.  

ఎవరెవరు... ఎందుకు... ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే... 
కరోనా వైరస్‌ బారిన పడ్డవారిలో ఎవరెవరు, ఎందుకు, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో కొన్ని కేస్‌ స్టడీస్‌ చూద్దాం. కరోనా బారిన పడ్డ వ్యక్తులు అప్పటికే  స్థూలకాయంతో బాధపడేవారై ఉన్నారనుకోండి. వారు తమ ఫ్యాట్‌ మజిల్‌ నిష్పత్తి దెబ్బతినకుండా... తమలో మరింత కొవ్వు చేరనివ్వని ఆహారం తీసుకోవాలి. అంటే తమలో కొవ్వు పెరగకుండా... కేవలం తమ కండరాలకు శక్తినిచ్చేలాంటి ఆహారాన్ని ప్లాన్‌ చేసుకోవాలి. అలాగే... స్థూలకాయం ఉన్నవారికి శ్వాస సమస్య వచ్చిందనుకోండి... వారు మరింత బరువు పెరిగితే ఊపిరి తీసుకోవడం కష్టమై నిమోనియా బారిన పడే అవకాశంతోపాటు గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశమూ ఉంది.

అందుకే ఇలాంటివారు బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు గుండెను మరింత బలోపేతం చేసే ఆహారాలు తీసుకోవాలి. ఇక డయాబెటిస్‌ వంటివి ఉన్నవారైతే కోలుకోడానికి దోహదపడే ఆహారం తీసుకుంటూనే... అందులో చక్కెర మోతాదులను పెంచనివ్వని విధంగా ఆ ఆహారం ఉండేలా చూసుకోవాలి. ఇదే నియమం హైబీపీ ఉన్నవారికీ వర్తిస్తుంది. అంటే వాళ్లు తమ రక్తపోటు పెరిగేందుకు దోహదం చేసే ఆహారాన్ని తమ డైట్‌లో తీసుకుండా జాగ్రత్త పడాలి.


పోస్ట్‌–కోవిడ్‌ రోగులూ... తీసుకోవాల్సిన ఆహారం 
కార్బోహైడ్రేట్లను తగ్గించండి
మన తెలుగు రాష్ట్రాలలో మన ఆహారం ప్రధానంగా వరి. అయితే ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. ఈ పిండిపదార్థాలూ మన ఆహారంలో ఉండాల్సిందే. కాకపోతే అవి రోజుకు 100 – 150 గ్రాములకు మించకూడదు. దీనికి ఓ కారణం ఉంది. కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉత్పత్తి జరుగుతుంది. (ఇలా జరగడాన్ని రెస్పిరేటరీ కోషియెంట్‌ అంటారు). ఇలా జరిగినపుపడు వారి శ్వాసక్రియకు అవసరమైనంత ఎక్కువ ఆక్సిజన్‌ అందకపోవచ్చు. అందుకే ప్రోటీన్లతో పోల్చినప్పుడు కార్బోహైడ్రేట్లు తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అలాగే డయాబెటిస్‌ రోగుల్లోనూ కార్బోహైడ్రేట్లు చక్కెర మోతాదులను పెంచుతాయి. కాబట్టి వీటిని తక్కువగా తీసుకోవాలి. అయితే పూర్తిగా తీసుకోకపోవడమూ మంచిది కాదు. కాబట్టి... గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... కార్బోహైడ్రేట్లను వచ్చే వరి అన్నంతో పోలిస్తే పప్పులూ, ఆకుకూరలూ ఎక్కువగా కలుపుకుని తినడం మంచిదనే సూత్రాన్ని పాటిస్తే చాలు. ఈ జాగ్రత్తతో మన ఆహారంలో ప్రోటీన్లతో పోలిస్తే కార్బోహైడ్రేట్లు పరిమితంగానే ఉంటాయి. 

ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోండి
మన దేహంలో దెబ్బతిన్న కణజాలాన్ని రిపేర్‌ చేసి, మునపటిలా పునరుద్ధరించడంలో ప్రోటీన్ల భూమిక చాలా ఎక్కువ. అందుకే మన ఆహారంలో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఈ ప్రోటీన్లు మన దెబ్బతిన్న కణాలనూ, కణజాలాన్ని బాగు చేసే ‘బ్రాంచ్‌డ్‌ చైన్‌ అమైనో యాసిడ్స్‌ (బీసీఏఏ)’ను సప్లిమెంట్‌ చేస్తాయి. దాంతో మన కండరాలు బలం పుంజుకుంటాయి. అదే జరగకపోతే... మన జీవక్రియల అవసరాల కోసం... దేహం మన కండరాల నుంచి ప్రోటీన్‌ను లాగేసుకుంటుంది. అందుకే మనం ఆహారం ద్వారా ప్రోటీన్లను అందజేస్తే మన కండరాల బలం అలాగే ఉండటంతో పాటు... రిపేర్లకు కావాల్సిన బ్రాంచ్‌డ్‌ చైన్‌ అమైనో యాసిడ్స్‌ (బీసీఏఏ) అందడంతో పాటు.. మన కండరాలకు అదనపు శక్తి కూడా సమకూరుతుంది.

కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు తమ ఆరోగ్యకరమైన ప్రోటీన్‌ కోసం కొవ్వు తక్కువగా ఉండే పాలు, తాజా పెరుగు, పనీర్, కాటేజ్‌ చీజ్, బాగా ఉడికించిన గుడ్లపై ఎక్కువగా ఆధారపడవచ్చు. మాంసాహారంలో చికెన్, చేపల వంటి వైట్‌ మీట్‌ మేలు. మాంసాహారం ఒకింత ఖరీదైనదైనందున... ప్రోటీన్‌ అవసరాలకోసం రాజ్మా, శనగలు, కందులు, పెసర్ల వంటి రకరకాల పప్పుదినుసులపై ఆధారపడవచ్చు. శాకాహారులు సైతం వీటిపై ఆధారపడవచ్చు. 

ఆకుకూరలు, సీజనల్‌ పండ్లు
కీలకమైన మినరల్స్, విటమిన్స్‌ కోసం ఆకుకూరలు, పండ్ల కంటే మించిన వనరులు లేవు. ఈ మినరల్స్, మిటమిన్స్‌ మన ఇమ్యూనిటీని బాగా పెంచేందుకు దోహదపడతాయి. పైగా ఇందులోని పీచుపదార్థాలు చక్కెరనూ అదుపులో ఉంచుతాయి. డయాబెటిస్‌ వారు మినహాయించాల్సిన మామిడి, అరటి, సపోటా మినహా... మిగతా పండ్లను తినవచ్చు. అలాగే డయాబెటిస్‌ ఉన్నవారు తప్ప మిగతా అన్ని పండ్లనూ అందరూ నిస్సంకోచంగా తీసుకోవచ్చు. 

కొవ్వులు / నూనెలు
మన దేహానికి తగిన మోతాదులో కొవ్వులు / నూనెలు కూడా అవసరమే. అయితే అవి మరీ మోతాదు మించడం ఆరోగ్యనికి అంత మేలు చేయదు. అందుకే ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం నట్స్, ఆలివ్‌నూనె, సన్‌ఫ్లవర్‌నూనె, నువ్వుల నూనె, కనోలా ఆయిల్, కార్న్‌ ఆయిల్‌ పరిమితంగా తీసుకోవాలి. కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం, చీజ్, క్రీమ్, వెన్న, నెయ్యి వంటివి చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఇక ట్రాన్స్‌ఫ్యాట్స్, జంతుసంబంధిత కొవ్వులు, వేపుళ్లు, బేకరీ ఫుడ్స్‌ వంటివి పూర్తిగా మానేయాలి. 

తృణ ధాన్యాలు
మలబద్దకం వంటి సమస్య చాలా అనర్థాలను తెచ్చిపెడుతుంది. మరీ ముఖ్యంగా జబ్బు నుంచి కోలుకున్నవారిలో సాఫీగా మలవిసర్జన జరుగుతూ, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బాగుంటే... అన్ని పోషకాలు దేహానికి సక్రమంగా అందుతుండటం వల్ల వారి ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఇందుకోసం ఆహారంలో తగినంతగా పీచు అవసరం. పీచుపదార్థాలు... రక్తంలోని చక్కెరపాళ్లను  నియంత్రితంగా ఉంచడంతో పాటు మలబద్దకాన్ని నివారిస్తాయి. ఈ పీచుపదార్థాలు దేహానికి పుష్కలంగా అందడం కోసం మన ఆహారంలో రాగులు, సజ్జలు, జొన్నల వంటి తృణధాన్యాలను తీసుకోవాలి. 

ద్రవాహారాలు 
మన దేహంలో 70% పైగా నీరే ఉంటుంది. ఈ నీటిపాళ్లు తగినన్ని ఉన్నప్పుడే దేహంలోని జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి. అందుకే దేహాన్ని ఎప్పుడూ తగినంతగా హైడ్రేటెడ్‌గా ఉంచడం అవసరం. అంటే దేహంలో ఉండాల్సినన్ని నీళ్లు తగ్గకుండా చూసుకోవాలన్నమాట. ఈ ద్రవాలు పుష్కలంగా ఉన్నప్పుడే ఖనిజాలూ, లవణాలూ కండరాలకు అంది, అవి సక్రమంగా పనిచేస్తాయి.

అందుకే మనం రోజూ కనీసం 10 – 12 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక శరీరంలో ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పడు సైతం దేహంలో నీటి పాళు తగ్గుతాయి. అందుకే తప్పనిసరిగా నీళ్లు,  ద్రవాహారం తీసుకోవడం అవసరం. నీటితో పాటు రకరకాల సూప్స్, గ్రీన్‌ టీ వంటి హెర్బల్‌ టీలు తగినంతగా తీసుకోవాలి. అలాగే తాజా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు కూడా తీసుకోవచ్చు. కాకపోతే కాఫీలు, కార్బొనేటెడ్‌ కూల్‌డ్రింక్స్‌ వంటివి డీహైడ్రేషన్‌కు దోహదపడతాయి కాబట్టి వాటిని చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. 

అన్నిటికంటే ముఖ్యంగా ఉప్పు, చక్కెరలను చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా వేళకు ఆహారం తీసుకోవాలి. తక్కువ పరిమాణాల్లో ఎక్కువసార్లు తినాలి. రెండు ఆహారాలకు మధ్య కనీసం మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండాలి. నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) సంస్థ మన ఆరోగ్యం వేగంగా పుంజుకోడానికి మచింత శక్తిని ఇచ్చే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే అది వ్యాధినిరోధకశక్తిని ఇవ్వడంతో పాటు దేహానికి మంచి శక్తినీ, సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతోంది.

-సుజాతా స్టీఫెన్‌
సీనియర్‌ న్యూట్రీషనిస్ట్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement