కమ్మగా నోరూరించే.. వెజ్‌ నాన్‌వెజ్‌ వంటకాల తయారీ ఎలాగో తెలుసా! | Do You Know How To Prepare Veg Non-Veg Dishes | Sakshi
Sakshi News home page

కమ్మగా నోరూరించే.. వెజ్‌ నాన్‌వెజ్‌ వంటకాల తయారీ ఎలాగో తెలుసా!

Published Sun, Jun 23 2024 3:29 AM | Last Updated on Sun, Jun 23 2024 3:29 AM

Do You Know How To Prepare Veg Non-Veg Dishes

వెరైటీ వంటకాలు.. కొంచెం కారంగా, కొంచె తీయగా.. అటు వెజిటేరియన్‌, ఇటు నాన్‌ వెజిటేరియన్‌లను మిక్స్‌ చేస్తూ సరికొత్తగా వంటకాలను తయారుచేయండిలా...

యాపిల్‌ ప్రాన్స్‌..
కావలసినవి..
పెద్ద రొయ్యలు – అర కిలో (శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి)
మిరియాల పొడి – పావు టీ స్పూన్‌,
కార్న్‌పౌడర్‌ – అరకప్పు
మైదా పిండి – ఒకటిన్నర కప్పులు,
గుడ్డు – 1,
కొత్తిమీర తురుము – కొద్దిగా
నీళ్లు – కావాల్సినన్ని,
నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా,
కెచప్‌ – పావు కప్పు, ఉప్పు – తగినంత,
యాపిల్స్‌ – 3 (గింజలు తొలగించి.. సగం పేస్ట్‌లా చేసుకుని.. మిగిలిన సగం నచ్చిన షేప్‌లో ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి, గ్రీన్‌ ఆపిల్‌ లేదా అవకాడో లేదా మామిడికాయనూ తీసుకోవచ్చు గార్నిష్‌ కోసం!)
కారం, మిరియాల పొడి, ధనియాల పొడి – కొద్దికొద్దిగా (అన్నీ బాగా కలుపుకోవాలి)

తయారీ..

  • ముందుగా ఒక బౌల్‌లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, కార్న్‌ పౌడర్, మైదా పిండి, గుడ్డు వేసుకుని హ్యాండ్‌ బ్లెండర్‌తో బాగా కలపాలి.

  • కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. బ్లెండర్‌ సాయంతో కాస్త జారుగా కలుపుకుని.. అందులో రొయ్యలువేసి, కలుపుకొని ఆ బౌల్‌కి పైన ఓ కవర్‌ చుట్టబెట్టి, 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

  • అనంతరం నూనెలో వాటిని డీప్‌ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో యాపిల్‌ గుజ్జు, కెచప్‌ బాగా కలుపుకుని పెట్టుకోవాలి.

  • సర్వ్‌ చేసుకునే సమయంలో కొన్ని రొయ్యలను ఒక బౌల్‌లోకి తీసుకుని.. దానిపైన కొద్దిగా యాపిల్‌–కెచప్‌ల మిశ్రమాన్ని వేసుకుని.. దానిపైన కారం మిశ్రమాన్ని జల్లుకుని.. అవకాడో లేదా మామిడి కాయ ముక్కలతో గార్నిష్‌ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి ఈ రొయ్యలు.

అవకాడో–పొటాటో కట్లెట్‌..
కావలసినవి..
బంగాళాదుంపలు – 2 మీడియం (మెత్తగా ఉడికించుకోవాలి),
అవకాడో – 1 పెద్దది (పండినది)
ఓట్స్‌ – అరకప్పు (పౌడర్‌లా చేసుకోవాలి)
మెంతికూర – అర కప్పు (తురుముకుని పేస్ట్‌లా చేసుకోవాలి),
పచ్చిమిర్చి ముక్కలు – 2 లేదా 3 (చిన్నగా తరగాలి),
వెల్లుల్లి తురుము – కొద్దిగా
లవంగాల పొడి  – కొద్దిగా
నిమ్మరసం – 1–2 టేబుల్‌ స్పూన్లు
ఉప్పు – రుచికి, నూనె – సరిపడా

తయారీ..

  • ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. బంగాళదుంప ముక్కలు, అవకాడో ముక్కలు వేసుకుని పప్పుగుత్తితో మెత్తగా చేసుకోవాలి.

  • ఓట్స్‌ పౌడర్, మెంతికూర పేస్ట్, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, లవంగాల పొడి, ఉప్పు, నిమ్మరసం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలపాలి.

  • ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

  • అనంతరం పాన్‌  లేదా కళాయిలో నూనె వేడి చేసుకుని.. ఫ్రిజ్‌లోని మిశ్రమాన్ని తీసుకుని.. చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ.. కట్లెట్స్‌లా చేసుకుని దోరగా వేయించుకోవాలి.

  • పచ్చి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌ ముక్కలతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

అవకాడో–పొటాటో కట్లెట్‌, బీట్‌రూట్‌ స్వీట్‌ పొంగనాలు

బీట్‌రూట్‌ స్వీట్‌ పొంగనాలు..
కావలసినవి..
బీట్‌రూట్‌ – 2 కప్పులు,
బెల్లం పాకం – ముప్పావు కప్పు (వడకట్టినది),
కొబ్బరి కోరు,
గోధుమ పిండి,
బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున,
ఏలకుల పొడి – పావు టీ స్పూన్‌ 
బేకింగ్‌ సోడా – చిటికెడు,
నూనె,
ఉప్పు – సరిపడా

తయారీ..

  • ముందుగా ఒక బౌల్‌లో బీట్‌రూట్‌ గుజ్జు, బియ్యప్పిండి, కొబ్బరి కోరు, గోధుమ పిండి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ ఉండాలి. 

  • అనంతరం అందులో ఏలకుల పొడి, బేకింగ్‌ సోడా, ఉప్పు, బెల్లం పాకం వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి.

  • తర్వాత పొంగనాల పాన్‌ కు బ్రష్‌తో నూనె రాసి.. అందులో ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుని.. ఉడికించుకోవాలి.

  • వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement