సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి యూనిట్ల లబ్ధిదారుల ఆవేదన అరోణ్యరోదన అయింది. రాయితీ రుణాల కోసం రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వంలో చలనంలేదు. నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి యూనిట్ల వైపు ప్రోత్సహించేందుకు ఎస్సీ కార్పొరేషన్ విరివిగా రాయితీ రుణాలిచ్చేలా కార్యాచరణ రూపొందించింది. పెద్దసంఖ్యలో లబ్ధి కలిగించాలని భారీ ప్రణాళికలు రచించింది. వీటిని ప్రభుత్వం ఆమోదించడంతో లబ్ధిదారులను ఎంపిక చేసింది.
2017–18 ఆర్థిక సంవత్సరంలో 33,607 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. వీరికి రాయితీ రూపంలో రూ.454.01 కోట్లు అవసరమని ఎస్సీ కార్పొరేషన్ ప్రతిపాదనలు సమర్పించగా ప్రభుత్వం ఆమోదించింది. కానీ 27,261 మంది లబ్ధిదారులకు మాత్రమే రాయితీ యూనిట్లు మంజూరు చేసింది. ఈ మేరకు లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు.
కార్పొరేషన్ నిర్దేశించిన మేరకు రూ.351.26 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ, సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు కార్పొరేషన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు 2016–17 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన రాయితీ రుణాల పంపిణీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దాదాపు 3610 మంది లబ్ధిదారులకు రూ.56 కోట్లు చెల్లించాల్సి ఉంది.
వార్షిక ప్రణాళికకేదీ ఆమోదం...
2018–19 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ రూ.వెయ్యి కోట్లతో వార్షిక ప్రణాళికను తయారు చేసి రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి సమర్పించింది. ఇంకా ఆమోదం లభించలేదు. 50 వేల మందికి లబ్ధి చేకూర్చేలా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అయోమయంలో పడ్డారు. ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొలి త్రైమాసిక ముగిసింది. ఇప్పటికిప్పుడు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టినా ప్రక్రియ పూర్తి కావడానికి కనిష్టంగా మూడు నెలలు పడుతుంది. బ్యాంకు నుంచి సమ్మతిపత్రాలు పొందడానికి,రుణాల మంజూరు పూర్తికావడానికి సమయం పడుతుంది. దీంతో రుణ ప్రణాళిక అమలు కష్టంగా మారే అవకాశముందని ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. వార్షిక ప్రణాళికకు ఆమోదం లభించిన వెంటనే చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment